తిరుమలలో సామాన్యుడు - మద్దూరి నరసింహమూర్తి

Tirumala lo samanyudu

శ్రీరామ

తిరుమలలో సామాన్యుడు

తొలి పలుకులు : ఈ వ్యాసంలో ఎవరినీ విమర్శించాలన్న కించిత్ ఆలోచన కూడా లేక, ప్రస్తుత పరిస్థితిని ఎత్తి చూపే ప్రయత్నం

మాత్రమే అని సహృదయులైన పాఠకులకు వినయపూర్వమైన మనవి. విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగే ధనం/

ఎదురు లేని అధికారం/పరిధి లేని పరపతి – లేని వారందరినీ ఈ వ్యాసానికి సంబంధించినంత వరకూ

'సామాన్యులే' గానే పరిగణించమని వేడుకోలు.

 

సుమారు అయిదు దశాబ్దాల పైబడిన రోజులలో "ఏడుకొండల శ్రీనివాసా మూడు మూర్తుల తిరుమలేశా" అన్న ఘంటసాలగారు గానం చేసిన పాట, అందులోని ఒక పంక్తి –

"కోటికీ పడగెత్తిన ధనవంతుడూ నీ గుడి ముంగిట సామాన్యుడూ,

కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడూ నీ కృపకెప్పుడూ సమపాత్రుడూ"

అప్పటి పరిస్థితికి అద్దం పట్టిందేమో కానీ, ఇప్పుడు వింటూంటే –

ప్రస్తుత పరిస్థితులలో ఆ పంక్తి ఎంత అసమంజసమో అన్న ఆవేదన కలుగుతూంది.

 

ఈమధ్యన పదివేల రూపాయలు విరాళంతో పాటూ మరొక అయిదు వందల రూపాయలు జమచేసిన దాతకు ‘అతి ముఖ్య వ్యక్తులకు’ లభ్యమయే ప్రత్యేక దర్శనానికి అనుమతితో శ్రీవారిని నేరుగా మొదటి గడప / కులశేఖరపడి నుండి దర్శించుకునే సౌలభ్యం కలగచేస్తున్నారు.

 

సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధనము వంటి ఆర్జిత సేవలకు తమ పేర్లు నమోదు చేసుకున్న భక్త సమూహంలో లాటరీ పద్ధతిలో అవకాశం దొరికి తగిన రుసుం జమచేసిన భక్తులకు కూడా శ్రీవారిని నేరుగా మొదటి గడప / కులశేఖరపడి నుండి దర్శించుకునే సౌలభ్యం కలగచేస్తున్నారు.

 

విచ్చల విడిగా ఖర్చు పెట్టగలిగే వారికి, పరపతి/పదవీ/అధికారం/రాజకీయ పార్టీల అండతో పైసా ఖర్చు కూడా అవసరం లేని వారికి (వారితో బాటూ వచ్చే వారి కుటుంబానికి, పరివారానికి) –

స్వాగత సత్కారలతో, నేరుగా మొదటి గడప / కులశేఖరపడి నుండి శ్రీవారిని దర్శించుకునే సౌలభ్యం కలుగుతోంది.

 

ఈ దర్శనాలు తప్పితే - తదితర ఏ దర్శనానికైనా నిర్ధారించబడిన రుసుము జమ చేసిన సామాన్య భక్తునికి -

తిరుమలేశుని దర్శనం దొరికేది బహు దూరంగా లీలామాత్రంగా మాత్రమే - అదీ ఒక సెకను సమయం మాత్రమే.

-2-

ప్రముఖులు స్వామివారి దర్శనంకై వస్తే. వారు ఆలయం బయటకు వెళ్లేవరకూ ముందుకి వెళ్లేందుకు అనుమతి లేక వేచి ఉండవలసిన పరిస్థితి తరచూ సామాన్య భక్తుల అనుభవంలోకి వస్తూనే ఉంది.

 

ఘంటసాలగారు పాడిన పై పాటలో కనిపించే ‘కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడు’ కి మిగిలింది దొరికేది ధర్మదర్శనం మాత్రమే.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలియచేస్తున్న సమాచారం బట్టి రోజుకి సుమారు డబ్బైవేల సామాన్య భక్తులు స్వామిని ధరించుకుంటున్నారు. అంటే, అటువంటి వారికి స్వామిని దర్శించుకునే సమయం 'ఒక్క సెకను' మాత్రమే అని స్పష్టమౌతోంది.

బహు దూరంగానే స్వామిని చూసేందుకు వీలవుతుందని తెలిసికూడా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చిన ఆ సామాన్య భక్తులు - గంటలు గంటలు వేచియుండి, చివరకు స్వామిని ఒక్క సెకను మాత్రమే చూసి వెనుకకు వెళ్ళవలసి రావడం బహు శోచనీయం.

 

వార్తా పత్రికలలో వచ్చే వార్తల ప్రకారం, ధర్మదర్శనానికి పట్టే సమయం - తక్కువలో పన్నెండు గంటలు అయితే ఒక్కొక్కప్పుడు నలభై గంటలు వరకూ పట్టే దాఖలాలు లేకపోలేదు.

ఆ విధంగా శ్రీవారి దర్శనం దొరికేవరకూ, భక్తులు వేచి ఉండే గదులలో ఉన్నవారి పరిస్థితి కొంతలో కొంత నయం. ఎందుకంటే అక్కడ సౌచాలయం దొరికే అవకాశం ఉంది. కానీ, క్యూలో వేచి ఉండే వారి పరిస్థితి దయనీయం - క్యూ ముందుకు కదిలితే తప్ప ముందుకు వెళ్ళలేరు, తదితర ఏ అవసరానికి వెనుకకు వెళ్ళలేరు.

 

ఇక్కడ గమనించవలినదేమిటంటే – భక్తులు వేచి ఉండే గదులలో మునుపు పెద్ద పెద్ద బల్లలు గది నిండా ఉండేవి.

ఇప్పుడు కొన్నాళ్ళై, ఏ కారణానానికో ఆ బల్లలు సగం పైన తీసేసేరు.

దాంతో, చాలామంది భక్తులు ఆ గదులలో నేల మీదనే కూర్చోవాలి. మోకాళ్ళు నొప్పులు తదితర సమస్యలతో నేల మీద కూర్చోలేని వారు స్వామివారి దర్శనానికి కదిలేవరకూ నిలబడేఉండాలి.

 

ఇటువంటి పరిస్థితులలో - ఘంటసాలగారు గానంచేసిన పైన పేర్కొన్న పాటలోని ఆ పంక్తి –

"కోటికీ పడగెత్తిన ధనవంతుడూ నీ గుడి ముంగిట సామాన్యుడూ,

కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడూ నీ కృపకెప్పుడూ సమపాత్రుడూ"

ఏవిధంగా సమంజసం ?

-3-

ఇక సామాన్యుడికి తెలిసిన / తెలియని శ్రీవారి ప్రసాదాల విషయానికి వస్తే ---

శ్రీవారికి -

ఏకాంత సేవా సమయంలో - వివిధ ఫలాలు, మేవా, 'పంచకజ్జాయం', చక్కెర కలిపిన వేడిపాలు – నివేదిస్తారు.

వివిధ వారపు సేవల్లో - పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, క్షీరాన్నం, పులిహోర, జిలేబీలు, పెద్దమురుకులు, పోళీలు (పూర్ణం భక్ష్యాలు), ఉండ్రాళ్ళు, చలిమిడి – నివేదిస్తారు.

పర్వ దినాల్లో - దోసెలు, బెల్లపు దోసెలు, గుగ్గిళ్ళు, పెసరపప్పు పన్నారం, పానకం – నివేదిస్తారు.

ఇవే కాక – సుఖియం, అప్పం, కేసరిబాత్, సీరా కూడా మంచి రుచితో నాణ్యతతో తయారుచేసి శ్రీవారికి నివేదిస్తారు.

తిరుపతి లడ్డూ ప్రసాదం మూడు రకాలుగా తయారుచేస్తారు --

(1) ప్రత్యేక ఉత్సవాల్లో, పర్వదినాల్లో, అతి ముఖ్యమైన వ్యక్తులు స్వామిని దర్శించుకునే సందర్భాల్లో నిర్ధారించబడిన పరిమాణం కంటే ఎక్కువగా నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి 750 గ్రాముల బరువుతో 'ఆస్థానం లడ్డూ ' అన్న పేరుతో ప్రత్యేక శ్రద్ధతో తయారుచేస్తారు. ఈ రకమైన లడ్డూ అందేది గౌరవ అతిథులకు మాత్రమే.

(2) స్వామివారి నిత్యకళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులకు ప్రత్యేకంగా తయారుచేసిన కల్యాణోత్సవం లడ్డూని ప్రసాదంగా అందచేస్తారు.

(3) ఇక సామాన్యుడికి అందేది 175 గ్రాముల ‘ప్రోక్తం లడ్డూ’. (ఈ లడ్డూ విషయంలో నిర్ధారించబడిన పరిమాణం కంటే తక్కువ పరిమాణం ఉన్న లడ్డూలు లభిస్తున్నాయి అని అప్పుడప్పుడు చాలా మంది సామాన్య భక్తులు తెలియచేస్తున్నారు. అంతేకాదు, సామాన్య భక్తులు చేసే ఆ ఫిర్యాదులను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి).

 

దర్శనం తరువాత వెండివాకిలి దాటి వెలుపలకు వచ్చే సామాన్య భక్తులకు ‘వితరణ’ గా –

మరీ పెద్దది కాని అలా అని మరీ చిన్నది కాని ఉసిరికాయ పరిమాణంలో చిన్న లడ్డూ ప్రసాదం ఎప్పుడూ లభ్యం కాగా - అప్పుడప్పుడు పులిహోర, దద్దోజనం - ఎప్పుడో చక్రపొంగలి ప్రసాదం లభ్యమవుతుంటాయి.

 

దేవాలయాలలో దైవప్రసాదం అమ్మకం శాస్త్ర విరుద్ధం అని పెద్దలు అంటూ ఉంటారు. కానీ, తిరుమలలో సామాన్య భక్తుడికి ‘ప్రోక్తం లడ్డూ’ ప్రసాదం కావాలంటే లడ్డూ ఒక్కింటికి ప్రస్తుతం అక్షరాలా ఏభై రూపాయలు సమర్పించి కొనుక్కోవలసిందే. అప్పుడప్పుడు వడ ప్రసాదం లభిస్తుంది - అదీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవలసినదే.

-4-

సామాన్య భక్తులు అలా కొనుక్కున్న ‘ప్రోక్తం లడ్డూ’ / ‘వడ’ ప్రసాదం తీసుకొని వెళ్లేందుకు తిరుమలలో సంచీలు దొరుకుతాయి. కానీ, ఆ సంచీ పది రూపాయలు సమర్పించి కొనుక్కోవలసిందే.

(దిగువ తిరపతిలో అలిమేలుమంగ అమ్మవారి ఆలయంలో ఆ సంచీ ధర ఐదు రూపాయలు).

 

వితరణగా దొరికే ప్రసాదాలు, కొనుక్కునేందుకు దొరికే ‘ప్రోక్తం లడ్డూ’ / ‘వడ’ ప్రసాదాలు తప్పితే –

మిగతా ప్రసాదాలు -- సామాన్యుడుకి ఎండమావులే.

 

పైన చెప్పిన స్వామివారి దర్శనం మరియు ప్రసాదాల సమస్యలు తీరే దారి లేకపోలేదు.

అదెలాగంటే --

వీరు వారు అన్న భేదభావం చూపకుండా రోజుకి పరిమితమైన భక్తులకు సమాన దృష్టితో -- మొదటి గడప / కులశేఖరపడి నుండి ఐదు సెకన్ల పాటు శ్రీవారిని దర్శించుకునే సౌలభ్యం కలగచేయవచ్చు. రోజుకి మూడుకోట్ల పైన ఆదాయం పొందుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంవారు -- సామాన్య భక్తులకు వందగ్రాముల లడ్డూ ఒకటి ఉచితంగా లభించే ఏర్పాటు చేయడం ఆర్ధికంగా పెద్ద సమస్య కానే కాదు. (సంచీలు తయారీ వాటి అమ్మకం మానివేసి, ఎవరి సదుపాయం వారు చూసుకునేందుకు వదిలేస్తే సరి). లడ్డూ వడ ప్రసాదాలతో పాటూ తక్కిన ప్రసాదాలను కూడా అమ్మకానికి పెట్టవచ్చు.

 

ఆవిధంగా ఆచరిస్తే -

శ్రీవారిని దర్శించుకున్న ఆనందాన్ని సామాన్య భక్తులు కూడా సంపూర్ణంగా అనుభవించి తరిస్తారు. దేవస్థానంవారు కూడా భక్తులందరికీ సమాన సదుపాయం కలగచేసిన కీర్తిని పొందుతారు.

 

కానీ, అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అటువంటి సంకల్పం, సంకల్పబలం సంపూర్ణమైన చిత్తశుద్ధి అత్యవసరం.

***ఓం నమో వెంకటేశాయ***

---మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు, Mob: 9164543253, e-mail: [email protected]