అతిధి - M chitti venkata subba Rao

atithi

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ అతిధికి కూడా తల్లి తండ్రి గురువు తర్వాత స్థానం కల్పించి దేవుడితో సమానం అని చెప్పింది వేదం. అతిధి అంటే ఎవరు? ఆకస్మికంగా మన ఇంటికి వచ్చే బంధువు లేదా స్నేహితుడు ఎవరైనా సరే అతిధి అంటారు. తన రాకకు నియమితమైన తిధి లేనివాడు అతిధి. ఒక రాత్రి మాత్రం ఉండిపోవువాడు అని చెప్పింది గూగుల్ తల్లి. పాపం ఎంతో దూరం నుంచి మన మీద ప్రేమతో మనల్ని చూడ్డానికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్లు అందిస్తాం. ఇది ఎవరు నేర్పారు మనకి. ఎవరు నేర్పలేదు. మన పెద్ద వాళ్ళు చేసిన దాన్ని మనం అనుకరించిన విధానం. అంటే నిత్యకృత్యంలో మన పెద్దలు జీవించిన విధానం మనకు ఆదర్శం అన్నమాట. మనం అనుసరించవలసిన విధానం. అంటే మన ఇల్లే మనకి ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు నేర్పేది కాదు. సంఘంలో ఒక గౌరవమైన జీవితం గడపడానికి కావలసిన సహాయం అందించే ఆలయం. మన ఇల్లు. మన ఇంటిలోని ఆ తరం మనుషులు. ఒకసారి మనం కూడా అతిథిగా ఆ కాలానికి వెళ్ళిపోదాం పదండి. ఆ కాలంలో వేళ కాని వేళలో వచ్చిన చుట్టాన్ని కానీ స్నేహితులను కానీ ఎంతో సాదరంగా ఆహ్వానించే వారు. గుమ్మం దగ్గర చె oబుతో నీళ్లు రెడీగా ఉంచి కాళ్లు కడుక్కుని లోపలికి రమ్మని చెప్పకనే చెప్పేవారు. ఇది ఆరోగ్య సూత్రం. భుజం మీద తుండు గుడ్డ చేతికి అందించి కుర్చీ వేపు చెయ్యి చూపించే వారు. నవ్వుతూ మంచినీళ్ల గ్లాసు చెయ్యి కందించి కుశల ప్రశ్నలు వేసి మాట్లాడుతూ ఉండండి అంటూ వంటింట్లోకి వెళ్లి తిరిగివచ్చి కాఫీ తీసుకోండి లేదా మజ్జిగ తీసుకోండి లేదా కూల్ డ్రింక్ తాగండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటూ మర్యాదగా కాలాన్ని బట్టి సమయాన్నిబట్టి గ్లాస్ అందించేవారు. ఇంకా పాత రోజుల్లోకి వెళ్తే చెంబుతో మజ్జిగ లేదా చెoబుడు కాఫీ ఇచ్చే వాళ్ళు కూడా ఉండేవారు. అతిధి అక్కడ ఉన్నంత సేపు ఇంటిలోని పెద్దలు అందరూ వారి చుట్టూ చేరి మాటలో మాట కలుపుతూ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ బంధుత్వాలు నెమరు వేసుకుంటూ ఊరి కబుర్లు చెప్పుకుంటూ చిన్ననాటి స్నేహితులు గురించి వాకబు చేసుకుంటూ ఆనందంగా నవ్వులతో కేరింతలతో జోకులతో వెటకారాలు అడుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆ సంభాషణలో ఎక్కడ ఆస్తులు అంతస్తులు బేధం గాని తప్పులు ఒప్పులు ప్రసక్తిగాని ఎత్తిపొడుపులు గాని ఉండేవు కాదు. కొంత సమయం కబుర్లతో గడిచిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు వంటింట్లో దూరి అష్ట కష్టాలు పడి అతిధిని సంతృప్తి పరచడానికి తమ ఇంటి మర్యాదను కాపాడుకోవడానికి రోజు కన్నా రెండు రకాలు ఎక్కువ చేసి వంటింట్లోంచి కాళ్ల కడుక్కుని రండి భోజనం చేద్దామంటూ ఆప్యాయంగా పిలిచే ఆ ఇంటి ఇల్లాలు పిలుపుతో సగం ఆకలి తీరిపోయేది. అలా కాళ్లు కడుగుకొని పట్టుపంచె కట్టుకొని వచ్చేసరికి టేకు పీ ట ఎదురుగా ఆకుపచ్చటి అరిటాకు నిండుగా పదార్థాలతో ఆహ్వానించేది. ఆకుపక్కనే మర చెంబుతో మంచి నీళ్లు. ఆంధ్రుల ఆతిధ్యా నికి ట్రేడ్ మార్క్ అరిటాకు భోజనం. విందు భోజనానికి ముఖ్యఅతిథి అరిటాకు. ఆకు నిండా పదార్థాలతో ఆకాశంలోని హరివిల్లు వలే మెరిసిపోయేది అరిటాకు. మూలగా ఉన్న ముద్దపప్పుతో విందు భోజనం ఆరంభం. చేతిలో పోసిన కమ్మటి నె య్యితో ముద్దపప్పు మరింత రుచికరo. ఆ కొత్తఆవకాయ కాస్త రుచి చూడండి. ఈ ఏడాదే కాసింది మా దొడ్లోని చెట్టు అంటూ ప్రతిపదార్ధానికి వివరణ ఇస్తూ కొసరి కొసరి వడ్డించేవారు. ఈ కాలం లో పనసకాయ ఎక్కడ దొరికింది అబ్బా అనుకుంటూ ఆ పచ్చగా ఉన్న పనసపొట్టు కూరని కలుపుకుని తింటూ అబ్బా ఎప్పటికీ వీళ్ళ అతిథిగానే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనుకునేవాడు ఆ స్నేహితుడు లేదా బంధువు. మా ఊరి విందు భోజనంలో కంద బచ్చలి కూర లేకపోతే అందరూ తప్పుగా అనుకుంటారు అంటూ కూర లోకి నూనె వేస్తాను బాగుంటుందంటూ పప్పు నూనె గిన్నెలోంచి ఆకులోకి వంపేసేవారు. అన్నం గుంటగా చేసుకోండి ముక్కల పులుసు వడ్డిస్తాను అంటూ మంచి కొత్తిమీర వాసనతో ఘుమఘుమలాడిపోతున్న దప్పళం ఆకులో ఆప్యాయంగా వడ్డించేవారు. అతిధి మర్యాద కోసం ప్రత్యేకంగా చేసిన బూర్లు పులిహార కొసరి కొసరి వడ్డించేవారు. మజ్జిగలోకి అన్నం అంటూ అన్నం వడ్డించి గడ్డం పెరుగు రెండు గరిటలు పోసి అంకం పూర్తయింది అనిపించేవారు. బ్రేవుమని త్రే నుపు తెప్పించేవారు. ఎంగిలి చేయి కడుక్కుని మడి బట్ట విప్పి వచ్చేసరికి చేతిలో తాంబూలం పెట్టి అరుగు మీద మడత మంచం వేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూమంచం పక్కనే మర చెంబుతో నీళ్లు తాటాకు విసిన కర్ర పెట్టి పిల్లల్ని అల్లరి చేయకండి అంటూ హెచ్చరించి వెళ్లిపోయేవారు. ఆ కొబ్బరి చెట్ల మీద నుంచి వచ్చే చల్లటి గాలి కడుపు లోని విందు భోజనం కంటి మీదికి నిద్ర తెప్పించేసేది.అలా రెండు మూడు గంటల సేపు నిద్రా దేవి ఒడిలో చేరిపోయిన అతిధి లేచి మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని బస్సుకు టైం అయిపోతుంది అనుకుంటూ చేతిలో సంచి పట్టుకునేటప్పటికి పొగలు కక్కుతున్న కప్పుతో కాఫీ ప్లేట్లో చెగోడీలు తో ఆ ఇల్లాలు రెడీగా ఉండి రేపు ఉదయం బస్సు కి వెళ్లొచ్చు కదా అంటూ అభ్యర్థించేది. మంచి అనుభూతితో ఆ ఇంటి ఇల్లాలికి కృతజ్ఞత చెప్పి ఆనందంగా బయలుదేరే వాడు అతిధి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకు అతిధి ఆనందంగానే ఉండేవాడు. పొట్ట చేత పట్టుకుని కుటుంబంలోని వాళ్లు నగరం లోని బహుళ అంతస్థుల భవనంలోని భాగాల్లోకి మారిపోయి లేచిన వెంటనే క్యారేజీ పట్టుకుని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి మెట్రో రైల్ ఎక్కి లేదంటే ద్విచక్ర వాహనం మీద లేదా నాలుగు చక్రాలు వాహనం మీద ట్రాఫిక్ లో చిక్కుకుని నీరసంగా ఇంటికి వచ్చే గృహస్థుకు ఎవరైనా వస్తున్నారంటే భయం పట్టుకుంది. పైగా భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులాయే. వారం అంతా ఆఫీసు పనుల్లో తలమునకలైపోయి ఇంటి పనులతో విసిగిపోయి ఆ సెలవు రోజు కాస్త ఊపిరి పీల్చుకుందామని బయటకు అలా వెళ్లి కాస్త మనసుకు నచ్చినది తిని ఏ సినిమాకో పార్కు కో విహార స్థలానికో వెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకునే నేటి తరం వారికి నగర వాసులకి అతిధి వస్తున్నాడంటే ఒకరకంగా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు పాపం. వాళ్ల జీవన విధానం అటువంటిది. పైగా వచ్చే అతిథి కి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇదివరలో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింటికైనా వెళ్లిపోయే వారు. ఇప్పుడు అలా కాదు ముందుగా పలాన రోజున మీ ఇంటికి వస్తున్నాము మీరు ఇంట్లోనే ఉంటారా అంటూ ఫోన్ చేసి అనుమతి తీసుకుంటారు. ఎందుకంటే సెలవు రోజుల్లో పిల్లలు ఊరుకోరు బయటకు తీసుకెళ్లకపోతే. ఇది నగరంలో ఉండే ట్రెండు. పెద్దల ఆలోచన కూడా అదేనండి. వచ్చే సమయం కూడా తెలపాలి. ఉదయం వెళ్దాం అంటే నగరంలో ఎవరూ ఉదయం లేవరు. పైగా సెలవు రోజు. భోజనానికి రండి అంటూ పిలవకపోతే ఆ అతిధి అసలు రాడు. ఎవరైనా అంతే. మధ్యాహ్నం వెడదామంటే రెస్ట్ తీసుకుంటారేమో అని సందేహం. ఇన్ని సందేహాలతో సాయంకాలమే బెస్ట్ అందరికీ అనుకుంటూ సాయంకాలం ఒక గంట వెళ్లి చూసి వచ్చేస్తున్నాడు అతిధి. చెప్పా పెట్టకుండా వెళ్తే పాపం ఆ ఇల్లాలు ఎంత ఇబ్బంది పడుతుందో. నగర జీవనం అటువంటిది. సరే మొత్తానికి ఆ అతిథి గూగుల్ మ్యాప్ పట్టుకుని ఏదో వాహనం ఎక్కి ఆ ప్లాట్ లోకి దూరిపోతాడు. పెద్దలు నేర్పిన సంస్కారంతో ఆనందంగా ఆహ్వానించి ఖరీదైన కుర్చీల్లో కూర్చోబెడతారు ఆ గృహస్తులు. అక్కడినుంచి మర్యాదలు మామూలే. అయితే కబుర్లు నాలుక మీదనుంచి వస్తాయి గుండెలోంచి కాదు. ఉద్యోగం హోదా పిల్లల చదువు ఆస్తి అంతస్తు అనుకోకుండానే చోటు చేసుకుంటాయి. పొయ్యి వెలిగించి కడుపు నింపే ఆతిథ్యం నగరంలో ఎక్కడా కనబడదు. రిఫ్రిజిరేటర్ లో దాచి ఉంచిన బజారు సరుకులతో తప్పితే. ఒకవేళ ఖర్మకాలి రాత్రికి ఉండవలసి వస్తే జేబులకు చిల్లు పెట్టుకుని హోటల్ వాడి చేత ఆతిథ్యం ఇప్పించడం తప్పితే ఎవరు నాలుకకి నాలుగు రుచులు చేయగలిగిన ఇల్లాలు నగరంలో ఎక్కడా కనబడరు ఆ తరం వారు తప్పితే. ఏంటో మాయా నగర జీవనం. తెచ్చి పెట్టుకున్న నవ్వు. నోట్లోంచి మనస్ఫూర్తిగా రాని మాట . మాటలో తీయదనo లేదు. మనస్ఫూర్తిగా పలకరింపు లేదు. అందరూ బిజీ బిజీ. పల్లెటూరు నుంచి ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన అతిధికి ఇది కొత్తగా ఉంటుంది. నగరంలో స్థిరపడిపోయిన వాళ్లకి ఇది రొటీన్ వ్యవహారం. అసలు అతిథికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలా వద్దా అనే విషయం పరిశీలిద్దాం. భారతీయ సంస్కృతిలో అతిధి మర్యాద అనేది ఒక భాగం. అది కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. మర్యాదను సూచిస్తుంది. పురాణాలను పరిశీలిస్తే మనకు అతిధి మర్యాద గురించి బాగా తెలుస్తుంది. గుమ్మoల్లోకి వచ్చిన మనిషితో మనం వ్యవహరించిన తీరుతెన్నులు ప్రపంచానికి మన గురించి తెలియజేస్తుంది. అలాగే వ్యాపారం కోసం పెట్టిన హోటల్స్ కి వచ్చే కస్టమర్లు కూడా ఆ యజమాన్యానికి వచ్చినవారు అతిథులతోసమానం.ఆధునిక కాలంలో ఐదు నక్షత్రాల హోటళ్లు చేసే అతిథి మర్యాదలు చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది.నిజంగా మనం అద్దె చెల్లించిన వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం మనసుకు హాయి అనిపిస్తుంది. గుమ్మంలోనే సెల్యూట్ కొట్టి తలుపు తీసే సెక్యూరిటీ వారు మన సామాన్లు గదిలోకి మోసుకొని పోయే అబ్బాయిలు అందమైన గది ఒక మెత్తటి పరుపు వేసి తెల్లటి దుప్పటి పరిచి న మంచం రెండు కుర్చీలు ఒక టేబుల్ రూమ్ సర్వీస్ ఆర్డర్ చేయడానికి ఒక ఇంటర్ కమ్ ఒకటేమిటి సకల సౌకర్యాలు చిన్న గదిలో. వచ్చిన అతిధి ఆనందంగా ఉంటే అదే మాకు ఎడ్వర్టైజ్మెంట్ అంటారు యాజమాన్యం వారు. ఒకప్పుడు నోటిమాట ,ఇప్పుడు గూగుల్ రివ్యూలు. అలాగే పెద్ద తాజ్ లాంటి పెద్ద హోటల్స్ తమ కస్టమర్ల గురించి కల్పించే సౌకర్యాలు చూస్తే మతిపోతుంది. ఆతిథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైన ది అందమైన మాట తీరు. అతిధి కోరుకున్న పనిని క్షణాల్లో అందించడం, చేయలేని పనిని అతిధి నొచ్చుకోకుండా తిరస్కరించడం లాంటివి ఆతిథ్యం కోసం ప్రత్యేకంగా చదువుకున్న చదువు లు నేర్పే సంస్కారం. అలాగే మన దేశానికి విదేశీ నుండి వచ్చే ప్రత్యేక అతిధులను కూడా ప్రభుత్వం వారు ఎంత గౌరవంగా స్వాగతిస్తారో మనము వార్తల్లో చూస్తుంటాం. ప్రత్యేక వంటకాలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు సభలు సమావేశాలు ఒకటేమిటి అన్నీ అతిధి మనసు దోచుకునేలాగే ఏర్పాట్లు చేస్తారు. ఏమైనా మనకి భారతీయ సంస్కృతి ప్రకారం అతిధి కూడా దైవంతో సమానమే. పిల్లల అతిధి మర్యాద పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంటారు. ప్రత్యేకమైన చదువులు చదివిన వారిని ఉద్యోగస్తులుగా పెట్టుకుని ఐదు నక్షత్రాల హోటల్స్ అతిధి మర్యాదలు చేస్తాయి. వ్యక్తులు మారుతుంటారు కానీ ప్రభుత్వం వారి నిర్దేశించిన విధి విధానాలు ప్రకారము విదేశీ అతిధులకు మర్యాద జరుగుతుంది. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం.