మానవులలో దైవత్వం - సి.హెచ్.ప్రతాప్

Manavulalo daivatwam

ప్రతి మనిషి దైవత్వం ద్వారానే పరిపూర్ణమైన జీవనం సాగిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ చరాచర ప్రకృతి అంతా భగవత్స్వరూపమే. అందులో భాగమైన మానవుడు కూడా మాధవుడు కాగలడని నిరూపింపజేసేదే హిందూ ధర్మం.పలు రూపాల్లో, పలు నామాలతో దైవత్వాన్ని కాంచి, పూజించి తృప్తి చెందుతున్న భక్తులను - కళ్ళు మూస్తే ధ్యానం లోనూ, తెరిస్తే ప్రకృతి లోనూ "దైవాన్ని" చూడగలిగే స్థాయికి చేరగలగడమే మనందరి ఆకాంక్ష కావాలి. సద్గుణ శీలత్వమే దైవత్వం. అందుకే సాధకులు దేవుడి కంటే దైవత్వం మీదకు దృష్టి మరల్చి, తమలో దైవత్వాన్ని పెంపొందించుకునే దిశగా సాధన చేయాలని ఋషులు చెప్తారు. అప్పుడే సాధన సరళంగా, మానవత్వం నుంచి దైవత్వం దిశగా సాగుతుంది. దైవమే మానవులని, మానవుడే దైవం అని సమస్త వేదాల సారాంశం గా వుంది. అన్ని ప్రాణులలోనూ దివ్యత్వం ఆత్మజ్యోతిగా వెలుగుతోందని ఆత్మోపనిషత్తు చెబుతోంది. సకల చరాచర సృష్టిలోని సమస్త జీవాత్మల ప్రాణాధారం మరి ప్రాణశక్తి ఈ దైవత్వం .గడ్డిపోచలోను, రాళ్ళలోను, పర్వతాలలోను, సముద్రాల్లోను, గ్రహంలోను మరి సమస్త నక్షత్ర మండల వ్యవస్థల్లోను ఈ దైవత్వం ఇమిడివుంది. దైవత్వం వర్ణించలేనిది, ఆపరిమితమైనది, అప్రమేయమైనది, అనన్య సామాన్యమైనది. సకల చరాచర సృష్టి యొక్క కర్మలను, చైతన్య పరిణామాన్ని నడిపించేది ఈ దైవత్వమే.అయితే భగవంతుడు లేదా ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువులకు , మానవులకు మధ్య ముఖ్య బేధం ఒకటే. మానవులు తమలో అంతర్లీనంగా వున్న దివ్యత్వాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎన్నో జన్మలలో చేసిన దోషాల ఫలితంగా మానవులకు ఈ ఎరుక లేకపోవడమే కాకుండా కోరికలు, ఆందోళనలు, అశాంతులు అనే కారాగారంలో బందీగా అయిపోయారు. అయితే స్వచ్చమైన సంకల్పం ద్వారా కఠోర సాధన చేస్తే తమలో దాగి వున్న దైవత్వాన్ని గ్రహింపుకు తీసుకురావడం సాధ్యమే. ఉదాహరణకు ప్రతీ బియ్యపు గింజ కూడా ఊకతో కప్పబడి వుంటుంది. ఊకను తొలగిస్తే గాని బియ్యపు గింజ బయటపడదు. బియ్యపు గింజ మనలో వున్న దైవత్వం వంటిది. ఊక మనలో పుట్టుకొచ్చే కోరికల వంటివి. కోరికలనే ఊకను వైరాగ్యం ద్వారా తొలగిస్తే కాని దివ్యత్వం బయటపడదు. మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం, దానగుణాల్ని మనుషులకు సహజగుణాలుగా ఉండాలి. ఇవన్నీ ఉండి సాటి మానవులకు అవసరమైనప్పుడు సాయం చేస్తుంటే చాలు అదే దైవత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నపుడు వారి కన్నీళ్లను తుడిచి వారికి అవసరమైన సాయం చేస్తే వారిని దేవుడు అనే కదా అంటారు. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని అంటారు.దైవత్వం అంటే మానవత్వంతో మెలగడమే. వేదం కూడా ప్రతీ మానవుడు తమ హృదయాలలో వున్న దైవత్వాన్ని జాగృతం చేసుకునే దిశగా సాధన చేయాలని చెబుతోంది. దేవుడు మనిషిలోనే ఉన్నాడనే సత్యమే ఆత్మజ్ఞానం.సాధన ద్వారా మాత్రమే ఈ జ్ఞానం పొందడం సాధ్యం. రాళ్లలో, చెట్లలో, పుట్టల్లో, గుడి గోపురాల్లోని విగ్రహాల్లో కనిపించే దేవుడు తోటి మనిషిలో ఎందుకు కనిపించడు? ఆ లోపం దృష్టిలో ఉందే తప్ప, సృష్టిలో లేదు. దయ, జాలి, కరుణ, ప్రేమ- దైవీ సంపద అనేవి దైవత్వం వున్న వారి లక్షణాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహంకారం, మమకారాలు అనేవి సామాన్య మానవుల లక్షణాలు. సహజ స్వభావాలను మరిచి దైవీ సంపదను అలవరచుకునే మనిషి దేవుడిగా మన్ననలందుకుంటాడు.తోటివారిలో దైవాంశను గుర్తించి భక్త్భివాల్ని అలవరచుకొని.. సంప్రదాయ విలువల్ని పాటిస్తూ మానవీయతతో మెలిగితే ఈ భూతలమే స్వర్గతుల్యం అవుతుంది.

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు