కాశీ ప్రయాణ కథలు - కొమ్ముబూర - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - kommuboora

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరంకొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకుతిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

తమ్ముళ్ళు ఈరోజు మీకు కొమ్ముబూర అనే కథ చెపుతాను వినండి అని బ్రహ్మయ్య కథ చెప్పడం ప్రారంభించాడు...

అవంతీ రాజ్యాన్ని వీరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు . అతని మంత్రి పేరు సుబుద్ధి.

అతని సైనికులలో గొప్పయోధులైన యువకులు ఉండేవారు.ఇరుగు పొరుగు రాజులు తనపై దండెత్తినప్పుడు, తన సైన్యంతో వారిని ఎదు ర్కొని విజయం సాధించేవాడు.యుధ్ధ సమయంలో ప్రజలు తమంతట తామే రాజు గారికి విరాళాలు అందజేసేవారు.యుధ్ధ కర్చులు పోనూ మిగిలిన ధనాన్ని ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగించేవాడు రాజు.

అదేరాజ్యంలో శివయ్య అనేయువకుడు ,అడవిలోని ఎండిన చెట్లను కట్టెలుగా చేసి అవంతి రాజ్యంలో అమ్ముతూ తన తల్లిని పోషించుకునేవాడు. ఒకరోజు శివయ్య అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా

' రక్షించండి,కాపాడండి 'అని పురుషుని అరుపులు వినిపించాయి, ఆదిశగా పరుగుతీసిన శివయ్యకు అక్కడ ఓ మునిపైన దాడి చేస్తున్న పెద్దపులి కనిపించింది.చేతిలోని గొడ్డలితో పెద్దపులిపై దాడిచేసాడు శివయ్య, గాయపడిన పులి అడవిలోనికి పారిపోయింది.

అప్పటికే తీవ్రంగా గాయపడిన మునికి మంచినీళ్ళు తాగించాడు శివయ్య .

' నాయనానేను ఎంతోసేపు బ్రతకను నామరణానంతరం దహన సంస్కారం చేయి ప్రతిఫలంగా ఇది ఉంచుకో 'అని ఒక కొమ్ముబూరను శివయ్యకు అందించి ' దీన్ని ఊదినవారుతప్ప దీనిధ్వని విన్న సమస్తప్రాణులు స్ధంబించిపోతారు. పులి నన్ను దొంగచాటుగా దెబ్బతీసింది అందుకేనేను దీన్ని ఊదలేకపోయాను ' అని మునిప్రాణాలు వదిలాడు.

మరుదినం తమ గ్రామంలో జరిగిన తిరునాళ్ళలో తమ గ్రమస్తులు రెండువర్గలుగా విడిపోయి ఘర్షణ పడబోతున్న వారిని చూసిన శివయ్య తనవద్దనున్న కొమ్ముబూరను ఊదాడు, అంతే అక్కడఉన్నవారంతా కొద్దిసేపు కొయ్యబొమ్మల్లా నిలబడిపోయారు. విషయం తెలుసుకున్న ఆగ్రామ ప్రజలు శివయ్యను అభినందించి ఘనంగా తిరునాళ్ళ జరుపుకున్నారు.

శివయ్య ఇల్లు చేరగానే జరిగినవిషయం తెలుసుకున్న అతని తల్లి 'నాయనా మనవంటి వారివద్ద ఈకొమ్ముబూరఉండటం ప్రమాదం తెల్లవారుతూనేవెళ్ళి మన రాజుగారికి అందజేయి రాజుగారే నీకుతగిన పని ఇస్తారు 'అన్నది.

మరుదినం రాజసభలో ప్రవేసించి కొమ్ముబూర రాజుగారికి అందించచి అది తనకు ఎలా లభించిందో తెలియజేసాడు శివయ్య. కొమ్ముబూర పనిని పరిక్షించినరాజు సంతృప్తిచెందాడు,ఇంతలో వార్తా వాహకుడు రాజసభలో ప్రవేసించి 'జయము జయము మహరాజుల వారికి మనపొరుగు రాజ్యమైన మగధ పాలకుడు దుష్టకేతులవారు రేపటిరోజున మనరాజ్యంపై యుధ్ధానికి వస్తున్నారు 'అని తెలియజేసాడు. వెంటనే మంత్రి సుబుధ్ధి రాజు,సేనాపతి,శివయ్యలతో సమావేశమై రేపటియుధ్ధం ఎలా జరగాలి అని చర్చించాడు.

మరుదినం యుధ్ధరంగంలోసైన్యం ముందుభాగాన గుర్రంపైఉన్న శివయ్య తనవద్దనున్న కొమ్ముబూరను బలంగా ఊదాడు ఇరువర్గలవారు బొమ్మల్లా కొద్దిసేపు ఉండిపోయారు. దుష్టకేతు సైనికులలో కదలిక వచ్చినప్పుడు పలుమార్లు శివయ్య కొమ్ముబూర ఊదాడు, విషయం అర్ధమైన దుష్టకేతు తన సేనలతో వెనుతిరిగాడు. ప్రజలు శివయ్యకు బ్రహ్మరధంపట్టారు.

ఈవిషయం తెలుసుకున్న ఇరుగు,పొరుగు రాజులు ఎవ్వరు అవంతి రాజ్యం పై ఎప్పుడూ యుధ్ధానికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారు.

యుధ్ధాలు లేకపోవడంతో ప్రజలు విరాళాలు ఆపివేసారు ,విరాళాలు లేకపోవడంతో ప్రజాహిత కార్యక్రమాలు ఆగిపోయాయి. అందువలన రాజుగారికి ప్రజలు నిరసనలు తెలియజేయసాగారు. సైనికుల బొజ్జలు నీళ్ళకుండల్లా పెరిగిపోయి ,సోమరులుగా తయారయ్యారు.

శివయ్య తెచ్చిన కొమ్ముబూరవలన లాభం కంటే నష్టమే అధికం జరుగుతుంది అని గ్రహించిన రాజు ,మరుదినం మంత్రి,సేనాపతి శివయ్యలతో సమావేశమై కొమ్ముబూర పైన చర్చించి ,కొమ్ముబూరను దూరంగా సముద్రంలో వేయించాడు.

తమ్ముళ్ళు కథ విన్నారుగా అవంతిరాజు కొమ్ముబూర సముద్రంలో ఎందుకువేసినట్లు మీలో ఎవరైనా చెప్పగలరా? 'అన్నాడు బ్రహ్మయ్య.

శ్రీహరి,శివయ్యలు మౌనం వహించారు. అప్పటివరకు పూమాలకడుతూ అక్కడే ఉన్న సరస్వతమ్మ " మనం ఎప్పుడూ మనకాళ్ళపైనే నిలబడాలి, మన ఆహరం మనమే తీసుకుంటునట్లు,మన కష్ట,సుఖాలను మనమే అనుభవించాలి .ఏదైనా పోరాడి సాధించుకున్న విజయాలే మనకు మధురానుభూతులు కలిగిస్తాయి, అటువంటి విజయాలు మన ఉన్నతికి దోహదపడతాయి.పరబలంతో సాధించిన విజయాలు పెలవంతంగా కనిపిస్తాయి ప్రజలు అలాంటి విజయాలను హర్షించరు లోకరీత్యి అటువంటి విజయాలు ఆమొదయోగ్యం కాదు. పైగా ఆకొమ్ముబూర దుష్టబుద్దిగలవారికి లభిస్తే మరింత ప్రమాదం ,అందుకే అవంతిరాజు మంచినిర్ణయం తీసుకున్నాడు ,మనం జీవితంలో ఎప్పుడు స్వబలాన్నే నమ్ముకోవాలి,పరబలంపై ఆధారపడకూడదు అని ఈకథ తెలియజేస్తుంది 'అన్నది.

అందరు నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు