“కలగూర గంప”- వెంకట్ నాగం గారి పుస్తక సమీక్ష
డా. బుడమగుంట మధుసూదన, M.Phil., Ph.D.
జీవ రసాయన శాస్త్రవేత్త, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం - డేవిస్, USA
సంపాదకులు - సిరిమల్లె అంతర్జాల మాస పత్రిక (sirimalle.com)
పుస్తకం పేరు: “కలగూర గంప” వ్యాస సంపుటి
రచయిత పేరు: వెంకట్ నాగం
ప్రచురణకర్త: వంగూరి ఫౌండేషన్ - అమెరికా
ధర: రూ. 100/-
పుస్తక ఉద్దేశ్యం: సమాజంలోని విభిన్న అంశాలపై పాఠకుల్లో ఆలోచనాత్మక దృక్పథాన్ని పెంపొందించడం, వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ వ్యాస సంపుటి ప్రధాన ఉద్దేశ్యం. సామాజిక బాధ్యత, దేశభక్తి, సాహిత్యాభిరుచి, మానవీయ విలువల పట్ల అవగాహన కల్పించడం రచయిత లక్ష్యం.
సమీక్షకుడు: డా. బుడమగుంట మధుసూదన (అమెరికా)
పుస్తకం లభ్యత: వెంకట్ నాగం గారు రచించిన “కలగూర గంప” వ్యాస సంపుటి పుస్తకం ‘అచ్చంగా తెలుగు’ మరియు ‘నవోదయ’ వెబ్సైట్లలో సాహితీ ప్రియులకు అందుబాటులో ఉంది.
1.https://www.telugubooks.in/products/kalagoora-gampa?_pos=3&_sid=f7d33e68e&_ss=r
2.https://books.acchamgatelugu.com/products/kalagoora-gampa
పుస్తక సమీక్ష:
నేటి సమాజంలో కృత్రిమ బంధాల ఒరవడి ఊపందుకున్నది. స్వార్థాన్ని ప్రాతిపదికగా చేసుకొని స్వీయాభివృద్ధికి మనుషులు మక్కువ చూపుతున్నారు. సమాజ అభ్యున్నతికి నిరంతరం కష్టపడుతున్నట్లు మాటలు మాత్రం ఉంటూ చేతలు శూన్యం అవుతున్నాయి. అయితే, పరచింతన వదిలేయాలనే సరికొత్త ఆలోచనలు ఇప్పుడు మనుషులలో కలుగుతున్నాయి. స్వార్థచింతనను వదిలేయాలి కానీ పరచింతన మాత్రం ఉండాలి; ఎందుకంటే మనం సభ్యసమాజంలో ఉంటూ నిజ జీవితంలో కొనసాగాలంటే పరులతో పాటు నడవాలి. పరచింతన లేకుండా గదిలో ముక్కు మూసుకుని కూర్చోలేము కదా. కాకుంటే ఆ పరచింతన ఎప్పుడూ కూడా పరదూషణగా మారకూడదు. సమాజ హితాన్ని కోరే ఆరోగ్యకరమైన ఆలోచనే ఉత్తమ మానవ సంబంధాలకు బలమైన పునాది అవుతుంది. ఇటువంటి ఆలోచనలతో కూడిన లోతైన విశ్లేషణలు మనకు ఈ పుస్తకంలో పుష్కలంగా కనిపిస్తాయి.
వెంకట్ నాగం గారితో నాకు పుష్కరకాలంగా పరిచయం ఉంది, ప్రస్తుతం ఆయన నా అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరు. అందుకు కారణం, ఇద్దరం తెలుగు భాషాభిమానులం, సాహిత్యాభిలాషులం. మాతృభాష ప్రాశస్త్యాన్ని పదికాలాలపాటు పదిలపరచి భావితరాలకు అందించాలనే తపనతో శాక్రమెంటో నగర వేదికగా ఇరువురం కృషి చేస్తున్నాము. భాషపై ప్రేమతో వికసించే ఇటువంటి సాహితీ సాన్నిహిత్యాలు సమాజంలో సృజనాత్మకతకు, సంస్కారానికి చిరస్థాయి ప్రేరణను అందిస్తాయని నా ప్రగాఢ విశ్వాసం.
వెంకట్ గారు సమకాలీన అంశాలపై నిరంతరం స్పందించే సాహిత్య విమర్శకుడు. నేటి సమాజంలో జరుగుతున్న అనేకానేక విషయాలకు, మంచి అయినా చెడు అయినా తనకెందుకులే అని తప్పుకోకుండా నిర్భయంగా ఆ విషయాలను లోతుగా అధ్యయనం చేసి, తన ఆలోచనల వాహినిలోంచి పుట్టిన అక్షర పనిముట్లతో ఒక పాత్రికేయునిగా వ్యాసాలు వ్రాసి వాటిని పత్రికలకు ప్రచురణార్థం పంపించేవారు. సమకాలీన అంశాలపై ఆయన రాసిన వ్యాసాలు అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురితమై, పాఠకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు సమాజంలో విస్తృత చర్చకు, ఆలోచనకు కూడా దారితీశాయి. నిర్భయంగా స్పందించే కలం గళమైతే, సమాజంలో చైతన్య దీపాలు వెలుగుతూనే ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ.
నిబద్ధతతో ఆయన చేస్తున్న ఈ సాహితీ సేవ ద్వారా అందరూ తనను గుర్తించాలనే తపన కన్నా తన మస్తిష్కంలో జనించిన ఆలోచనలకు అక్షర రూపం కల్పించి తాను చేసిన రచనలను పదిమంది చదివి, వాటిలో నిక్షిప్తమైన సాహితీ విలువలను అందరూ గ్రహించాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఆయన ఆలోచన సక్రమమైనదే కదా! భావప్రసారమే ముఖ్యమనే తత్వం ఆయన నిస్వార్థ సాహితీ సేవకు నిదర్శనం.
ప్రవాసాంధ్రుడైనప్పటికీ, తెలుగు భాష పట్ల మక్కువతో, సంస్కృతీ సంప్రదాయాల మూలాలను మరచిపోకుండా భాషా సేవకుడిగా తెలుగు భాష ఉనికిని అమెరికా దేశంలో ఇనుమడింపజేస్తూ, మాతృదేశంతో పాటు ప్రపంచంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నింటినీ స్పృశిస్తూ, ఆ విషయాలన్నింటినీ నిర్భయంగా, నిజాయితీగా విమర్శిస్తూ తన వ్యాసాలను వ్రాసి అనేక తెలుగు దినపత్రికలలో నిరంతరం ప్రచురణకు పంపించి తద్వారా ఆ పత్రికల సంపాదకుల అభిమానాన్ని చూరగొన్నారు. అంతేగాక, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, నిర్విరామంగా కృషి చేస్తూ, తెలుగు భాషను చైతన్యవంతంగా ఉంచుతూ, నిరంతరం ఇతర దేశాలలోని తెలుగు భాషాప్రియులందరినీ పలకరిస్తూ, వారిని రచనలు చేసేందుకు ప్రోత్సహిస్తూ, తెలుగు భాష వ్యాప్తికై అహర్నిశలు శ్రమించారు, శ్రమిస్తున్నారు. వారి నిబద్ధతకు నా జోహార్లు. సముద్రాలు దాటినా తెలుగు తల్లి రుణం తీర్చుకుంటున్న వెంకట్ గారి అంకితభావం ఎన్నటికీ అభినందనీయం.
తన గురువుగారైన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి అద్భుత సాహిత్యానికి సమీక్షలు వ్రాసే అవకాశం కలిగినప్పుడు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఆ రచనలలోని ఆత్మను గ్రహించి, విషయ పరిజ్ఞానం సంపాదించి పిమ్మట విశ్లేషణలు వ్రాశారు. కనుకనే వారి సాహిత్య విమర్శలకు అంత ప్రాచుర్యం లభించింది. పలు అంతర్జాతీయ సదస్సుల వేదికలపై విశేష ఆదరణను చూరగొన్న వీరి సమీక్షా ప్రసంగాలు, ఇప్పుడు ఈ పుస్తకంలో అక్షరరూపంలో పాఠకుల ముందుకు వచ్చాయి. గురువు చూపిన బాటలో నడుస్తూ, విశ్లేషణలో సంయమనాన్ని పాటించడమే ఆ సాహిత్య పరిమళాల రహస్యం అని నా అభిప్రాయం.
ఈ విధంగా తనకు ఎంతో ప్రీతిపాత్రమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగించి, దాదాపు 28 వ్యాసాలు, సమీక్షలు, విశ్లేషణలను సంకలనం చేసి ‘కలగూర గంప’ పేరుతో వ్యాససంపుటిని పుస్తక రూపంలో ప్రచురించారు. అటు హైదరాబాదు, విజయవాడలోనే కాకుండా, తానా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాల కార్యక్రమంలో, ఇటు సిలికాన్ వాలీ, శాక్రమెంటోతో పాటు, చైనా షాంఘై నగరంలో జరిగిన పలు తెలుగు సదస్సుల్లోనూ ఎంతోమంది సాహితీ దిగ్గజాల ఆశీస్సులతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహిత్య ప్రియులందరికీ దీనిని అందుబాటులో ఉంచడం వెంకట్ గారి సాహిత్య అభిరుచికి సరైన తార్కాణం అని చెప్పవచ్చు. అక్షర రూపంలో ఒక గ్రంథంగా భద్రపరిచిన ఈ ఆలోచనల భాండాగారం తరతరాలకు ఒక చక్కటి సాహిత్య కానుక.
ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత విషయ పరిజ్ఞానం, ఆలోచనాత్మక పరిపక్వత కలుగుతుందని, ఈ పుస్తకంలో ఉన్న 28 వ్యాసాలను ఆసాంతం చదివినవాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం. తెలుగు సాహితీ ప్రపంచానికి ఈ "కలగూర గంప" ఒక చక్కటి చైతన్య సౌరభాన్ని పంచుతుందని నమ్ముతూ, రచయితకు నా హృదయపూర్వక అభినందనలు.
నమస్కారాలతో
డా. బుడమగుంట మధుసూదన

