'సరస్వతీ పుత్ర' శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు - టీవీయస్. శాస్త్రి

Sri Puttaparthi Narayanacharyulu garu biography

(ఇది వారి శతజయంతి సంవత్సరం)

ఒక మనిషి ఒక భాషలో పరిపూర్ణుడు కావటానికే ఒక జీవితకాలం సరిపోదు. అలాంటిది ఒక వ్యక్తి 15 భాషలను నేర్చుకోవటమే కాకుండా వాటన్నిటిలో పాండిత్యాన్ని పొందటం చాలా అరుదైన, అసాధ్యమైన విషయం. అట్టి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, మహామనీషి, బహుభాషాకోవిదుడు, 'సరస్వతీ పుత్రుడు' శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల గారిని గురించి నాకు తెలిసిన, నేను సేకరించిన విషయాలను మీకు సగర్వంగా తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఆయనకు ఛాందస భావాలు గిట్టవు. దైవంతో పాటు మానవుడు కూడా కావాలనే మానవతావాది ఆయన. నూట యాభై గ్రంథాలు రచించినా, నిత్య విద్యార్థిలాగే ప్రవర్తించే నిగర్వి ఆయన.

శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అనంతపురంజిల్లాలోని, చియ్యేడు అనే గ్రామంలో 28-03-1914న శ్రీనివాసాచార్యులు, లక్ష్మీదేవి అనే పుణ్య దంపతులకు జన్మించారు. వారి ఇంటి పేరు తిరుమల. శ్రీ కృష్ణదేవరాయల గారి గురువైన శ్రీ తిరుమల తాతాచార్యులగారి వంశం వీరిది.అటుపైన వీరి వంశీయులు పుట్టపర్తిలో స్థిరనివాసం ఏర్పరుచుకోవటం వల్ల వీరి ఇంటిపేరు 'పుట్టపర్తి' అయ్యింది. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వాళ్లది విద్వత్వంశం. ఆచార్యులు గారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించింది. తండ్రికి ఉద్యోగ ఒత్తిడి. పైగా భార్య మరణించిన దు:ఖంలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఆచార్యులు గారు దేనికీ పనికిరాని పరిస్థితిలో ఉండగా, ఆ కుటుంబ సన్నిహితుడొకడు ఆచార్యులుగారిని తన వెంట పెనుగొండకు తీసుకొని వెళ్లి  పిట్ దొరసానికి పరిచయం చేసాడు. ఆమె పెనుగొండ సబ్ కలెక్టర్ గారి భార్య. ఆమె గొప్ప ఆంగ్ల విద్వాంసురాలు. ఆమె నారాయణాచార్యుల గారిని ఆంగ్లభాషలో గొప్ప ప్రవీణునిగా చేసింది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఈయనకు స్వయానా మేనమామ. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు బాల్యంలోనే భారత, భాగవతాది గ్రంధాలను అభ్యసించటంతో పాటుగా సంగీత, నాట్య శాస్త్రాలలో కూడా శిక్షణ తీసుకున్నారు. అలా ఆయన సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాలతో సమలన్క్రుతు లయ్యారు. సుప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షుమ్మ గారి వద్ద వీరు సంగీత, నృత్యాలను అభ్యసించారు. ఇవే కాకుండా నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. రంగస్థలంపై నాట్యప్రదర్శనలిచ్చారు. ఎన్నో ప్రదేశాలను తిరిగారు. చివరకు కడపలో స్థిరపడ్డారు. అక్కడే చాలాకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తన ఇంటిని సాహితీ మాగాణంగా మార్చుకున్నారు.

12 యేండ్ల అతి చిన్న వయసులోనే 'పెనుగొండ లక్ష్మి' అనే కావ్యాన్ని వ్రాసారు. చాలా విచిత్రమైన సంఘటన ఏమంటే, ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తను బాల్యంలో వ్రాసిన ఈ కావ్యామే వారికి పాఠ్యగ్రంధంగా ఉండటం! మరీ ఆశ్చర్యకర విషయమేమంటే, ఆ పరీక్షలో ఆ కావ్యానికి సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబు వ్రాయటానికి ఆయనకు సమయం సరిపోలేదు. ఆ ఒక్క ప్రశ్నకే రమారమి 40 పేజీల జవాబు వ్రాయటంతో ఆయన ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయారు. ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియలేదు. కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రఖ్యాత నవల' ఏకవీర'ను వీరు మళయాళంలోకి అనువదించారు. మరాఠీ నుంచి ధర్మానంద కోశాంబి, వినాయక సావర్కర్ వంటి రచయితల రచనలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్ల భాష నుండి మెరుపులు- తలుపులు, అరవిందులు, గీతోపన్యాసములు తెలుగులోకి అనువదించారు . సంస్కృతంలో శివకర్ణామృతం, అగస్తేశ్వర సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం తదితర గ్రంథాలను వ్రాసారు.

బాల్యంలోనే వీరికి వివాహం జరిగింది. పెళ్లిరోజే అత్తగారు మరణించారు. రెండవ రోజునే భార్య గతించింది. పునర్వివాహం చేసుకున్నారు. రెండవభార్య విదుషీమణి. ఆమె పేరు కనకమ్మ గారు. భార్యాభర్తలిద్దరూ సాహిత్యగోష్టులను నిర్వహించేవారు. ఆవిడ ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దింది. భార్యతో కలసి ఆయన వ్రాసిన కావ్యం 'స్వర్ణగేయార్చనం' పండితలోకాన్నిపరవశింపచేసింది. అష్టాక్షరీ మంత్రాన్ని పరమనిష్టతో సాధనచేసారు. తంత్ర శాస్త్రంలో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఆంగ్ల భాషపైన కూడా మంచి పట్టును సాధించారు. దాదాపుగా 150 గ్రంధాలను వివిధ భాషలలో వ్రాసారు.

'శివ తాండవం'
ఇవన్నీ ఒక ఎత్తైతే వారు వ్రాసిన 'శివ తాండవం' ఒక ఎత్తు. వైష్ణవ వంశంలో పుట్టి, వైష్ణవ సంప్రదాయంలో పెరిగి, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల నాట్యహేలను, లాస్యాన్ని గురించి కమనీయంగా  వ్రాసిన కావ్యమే 'శివ తాండవం'. ఇంతకన్నా అద్వైతమూర్తులు మరెవ్వరు ఉంటారు? ఒక సారి విజయవాడలో శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి సమక్షంలో శ్రీ పుట్టపర్తి వారు శివతాండవ కావ్యాన్ని ఆలపిస్తూ నాట్యం చేసారు. ఆ అద్భుత దృశ్యానికి పరవశించి ఆ కవిసామ్రాట్ ఈ సరస్వతీ పుత్రుని తన భుజాలమీద ఎక్కించుకొని ఆనందపడి పోయారట! రాజకీయ, సామాజిక అంశాలను కూడా సృజించారు. వామపక్ష భావజాలంగల శ్రీ హరీంద్రనాధ ఛట్టోపాధ్యాయాకు వీరు అత్యంత అభిమానులు. కమ్యూనిష్టులు కూడా వీరిని సన్మానించిన సంఘటనలున్నాయి.

హృషీకేశ్ లో శ్రీ పుట్టపర్తి వారి పాండిత్యాన్ని పరీక్షించి స్వామీ శివానంద సరస్వతి 'సరస్వతీ పుత్ర ' అనే బిరుదును ప్రసాదించారు. భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ సత్కారంతో గౌరవించింది. జ్ఞానపీఠ సత్కారానికి వీరు పూర్తి అర్హులైనప్పటికీ, వారిని ఆ అవార్డు వరించలేదు. దానికి వారు కొంత కలత చెందారు. వారికి ఆ అవార్డు రాకపోవటం తెలుగువారి దురదృష్టం. ఎన్నో విశ్వ విద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. వీరు తెలుగులో వ్రాసిన కొన్ని ముఖ్యమైన గ్రంధాలు--పెనుగొండ లక్ష్మి, మేఘదూతం, షాజీ, గాంధీ ప్రస్థానం, క్రాంతి సందేశం మొదలైనవి. సంస్కృతంలో వీరు వ్రాసిన 'త్యాగరాజస్వామి సుప్రభాతం' చాలా ప్రసిద్ధి చెందింది.

ఆంగ్లంలో--లీవ్స్ ఇన్ ది విండ్, ది హీరో మొదలైనవి ప్రఖ్యాతి చెందినవి. పర్షియన్ భాషలో కూడా వీరికి చక్కని ప్రావీణ్యముంది. నారాయణా చార్యులుగారు  విశ్వనాధవారి లాగానే స్వాతిశయపరుడు. ఒకసారి అనంతపురంలో జరిగిన ఒక సభలో వారు మాట్లాడుతూ, "నేను 14 భాషలలో పండితుడను. నన్ను మించిన పండితుడు మరెవ్వరులేరు. నాకు అహంకారముంది. అందులో న్యాయముంది." అని సగర్వంగా ప్రకటించుకున్న దైర్యశాలి! ఈ సరస్వతీపుత్రుని నందమూరి తారకరాముడు మనసారా సత్కరించి ఆనందభరితుడయ్యాడు. ప్రతిభకు తగిన గుర్తింపు లభించని ఈ సరస్వతీ పుత్రుడు 01-09-1990, శనివారం, ఏకాదశి నాడు తెలవారుతుండగా భాగవత సారాన్ని వివరిస్తూ మృత్యువు కౌగిట్లోకి జారిపోతూ చెప్పిన మాటలివి, "భక్తుడు, భగవంతుడు ఒకటేరా!" అంతే, 'శ్రీనివాసా!' అంటూ గుండె పట్టుకొని ఒక పక్కకు ఒరిగిపోయారు. శివైక్యం చెందారు. అంతకు మునుపే నిర్వాణషట్కాన్ని తెప్పించుకొని చదివారు.

'కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు ఈ మహనీయుడు ' అని శ్రీ  నారాయణరెడ్డి  గారన్నది అక్షర సత్యం.


పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!!


శ్రీ నారాయణరెడ్డి గారు సరస్వతీపుత్రునికి సమర్పించిన పై కవితా నీరాజంతో ఆ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుకుందాం!