పుస్తక సమీక్ష: ఉపన్యాస కళ - సిరాశ్రీ.

upanyasa kala book review
పుస్తకం: ఉపన్యాస కళ
రచన : జీ వీ ఎన్ రాజు
వెల: 125/-
ప్రతులకు: 9246527207, iconhrd@gmaiil.com

ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎక్కువ భయానికి లోనయ్యే సందర్భాలు మూడట. అందులో  మొదటిది చావు, రెండవది ఎత్తైన ప్రదేశాలనుంచి కిందకు చూడడం, మూడోది వేదిక మీద నుంచి మాట్లాడడం. 1954లో ఒక పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చారు.

వేదిక మీదనుంచి మాట్లాడడానికి భయపడే పరిస్థితినుంచి బయటకు రావడానికి సహజంగా పాఠశాల వయసునుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొందరు దానిని అధిగమిస్తే, కొందరికి వీలు కాదు. అటువంటి వారు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాల ద్వారానో, పలు వక్తల ఉపన్యాసాల ద్వారా ప్రభావితమయ్యో, జీవితంలో కొన్ని విజయాల వల్ల పొందిన ఆత్మ విశ్వాసం చేతనో, వయసుతో పాటు పెరిగే అవగాహన కారణంగానో అధిగమిస్తూ ఉంటారు. భయాన్ని అధిగమించినా ఆసక్తిగా ఉపన్యసించగలడం అనేది మాత్రం నూటికి ఏ ఒక్కరికో ఇద్దరికో పరిమితమౌతోంది. కానీ అదికూడా నూటికి నూరు పాళ్లూ అందరికీ చేరువలో ఉన్న విద్యే...కాస్త ఆసక్తి, ఇంకాస్త సాధన తోడైతే పెద్ద కష్టం కాదు...అనిపించేలా చేస్తుంది ఈ జీ వీ ఎస్ రాజు గారి "ఉపన్యాస కళ" అనే పుస్తకం.

ఉపన్యసించడం అనేది ఒక కళ. విద్య, విజ్ఞానం తోడైతే అది మరింతగా రాణిస్తుంది. లేకపోతే హైరానిస్తుంది-వక్తకి, వినేవారికి కూడా. ఉపన్యాసం అనగానే తెలుగు వారందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఎంటీయార్, ఆ తర్వాత సినారె. ఎంటీయార్ ఉపన్యాసాల్లో నాటకీయత, భాషాప్రౌఢి, గాంభీర్యం ఉంటే...సినారె ఉపన్యాసాల్లో చమత్కారం, లాలిత్యం, విషయం, విశేషం ఇలా ఎన్నో ఉంటాయి. నిజానికి మంచి వక్తగా పేరు తెచ్చుకోవాలని తపన ఉన్న చాలా మంది ఉపన్యాసకులు సినారె ఉపన్యాసాలను అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది వాస్తవం. సాంస్కృతిక కార్యక్రమాలకు తరచూ వెళ్ళే వాళ్లకి ఇది అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. విద్య, విజ్ఞానం, సమయస్ఫూర్తి, చమత్కారం, ధైర్యం, గళం, స్ఫురద్రూపం..ఇలా అన్నీ సినారెకి కలిసొచ్చాయి. మంచి వక్తకి ఇవన్నీ అవసరమే. అయితే ఈ అంశాల్లో ఎన్ని మనలో ఉన్నాయి, ఉన్న వాటిని ఎలా ప్రకటించుకోవాలి, లేని వాటిని ఎలా కప్పిపుచ్చాలి వంటి నేర్పరితనం ఈ పుస్తకం నేర్పుతుంది. సభను రంజింపజేయడానికి ప్రాధమిక సామగ్రి ఈ పుస్తకం అందిస్తుంది. ఎన్నో మెళకువలు చెప్తుంది.

ఇక్కడ సినారె ప్రస్తావన ఎక్కువగా తీసుకురావడానికి మరో కారణం కూడా ఉంది. ఈ పుస్తక రచనకి స్ఫూర్తి ఆయనే అని రచయిత జీవీస్ రాజు ముందు పేజీల్లో పేర్కొన్నారు.

ఎంత గొప్ప రచయిత అయినా..వక్త అయిన వారినే సమాజం గుర్తుంచుకునే రోజులివి. ఎందుకంటే సినారె చెప్పినట్టు "బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందిపుడు". ఏదైనా ప్రసంగాన్ని చదవడం కన్నా యూట్యూబ్ వీడియోలో చూడడం సులభంగా ఫీల్ అవుతున్నాం కదా. కనుక మంచి వక్తగా రాణించాల్సిన అవసరం చాలా మందికి ఉంది. ఒక్క సాంసృతిక ఉపన్యాసకులకే కాదు...వివిధ రంగాల్లో ఉండి ఆఫీసు మీటింగ్స్ లో మాట్లాడేవారికి, కళాశాల లెక్చరెర్లకి, సినిమా వేదికలపై మాట్లాడెవారికి..ఇలా ఎందరికో ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

ఇంతకీ ఈ పుస్తకకర్త జీవీయెస్ రాజు గత 3 దశాబ్దాలుగా వేలాది ఉపన్యాసాలు చేసిన దిట్ట. ఉపన్యాస శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తుంటారు. ధ్వన్యనుకరణ కళాకారులుగా కూడా వీరు ఎందరికో సుపరిచితులు. 70 చిరు వ్యాసాలతో 84 పేజీల్లో ఉన్న ఈ పుస్తకం విద్యార్థులకి, ఔత్సాహిక వక్తలకి కరదీపిక. తీరిక చేసుకుని, ఓపిక తెచ్చుకుని చదివి ఆకళింపుచేసుకుని ఆచరణలో పెట్టాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో.

ఈ పుస్తకం ఆసాంతం చదివాక నాకు అనిపించిందేంటంటే.. ఎంత గొప్ప ఉపన్యాసకులకైనా తమకు తెలియని, తమకు పనికొచ్చే విషయం కనీసం ఒక్కటన్నా దొరుకుతుంది ఈ పుస్తకంలో. 

మరిన్ని వ్యాసాలు

రామసక్కని బాలల కథలు
రామసక్కని బాలల కథలు
- దుర్గమ్ భైతి
రాష్ట్ర కూటులు .
రాష్ట్ర కూటులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
విష్ణుకుండీనులు శాసనాలు.
విష్ణుకుండీనులు శాసనాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పింగళి వెంకయ్య.
పింగళి వెంకయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Second World War - 7
రెండవ ప్రపంచ యుద్ధం -7
- శ్యామకుమార్ చాగల్