పుస్తకసమీక్ష - -సిరాశ్రీ

book review
"తెగింపు": ఒక అసాధారణ వాస్తవిక కథ   

చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథ గుర్తొస్తోంది. అందరికీ తెలిసిన పాపులర్ కథే. అడివిలో పులి బారిన పడ్డ ఆవు ఆకలితో ఉన్న తన దూడకు పాలిచ్చి తిరిగి వచ్చి తనను తాను ఆహారంగా అర్పించుకుంటానని, అప్పటివరకు వేచి ఉండమని అడుగుతుంది. పులి చాన్స్ తీసుకుంటుంది. ఆవు దూడకు పాలిచ్చి తిరిగి వస్తుంది. ఆవు త్యాగబుధ్ధికి, ధైర్యానికి, సత్యశీలతకి షాక్ తిన్న పులి చెమర్చిన కళ్లతో దణ్ణం పెట్టి వెళ్ళిపోతుంది. ఈ కథలో ఆవులోని తల్లితనంలోని గొప్పతనాన్ని చెప్పడంతో పాటు ప్రాణం మీదకొచ్చినా ఆడినమాట తప్పకూడదు అనేది నీతి. నీతి పక్కనపెడితే అసలు ప్రాణం పోతుందన్నప్పుడు, ప్రమాదం పొంచి ఉందన్నప్పుడు మనిషితో పాటు ఏ ఇతర జంతువులైనా టెన్షన్ కి గురవ్వడం అతి సహజం. అంతేగానీ చావుని ఒక నిత్యకృత్యమన్నంత ఉదాసీనంగా తీసుకోవడం జరుగదు. అందుకే ఆ కథలోని ఆవు పులి దగ్గరికి ఏ భయం, బాధ లేకుండా రావడం అసహజం అనిపించేది. ఏజ్ పెరిగేకొద్దీ కథే కదా అని సీరియస్ గా తీసుకోలేదు.

కానీ ఈ మధ్య చదివిన ఒక వాస్తవం నా అభిప్రాయాన్ని మార్చేసింది. అది కన్నడ రచయిత అగ్ని శ్రీధర్ రాసిన ఒక అనుభవం. కర్టూనిస్ట్ మరియు రచయిత సృజన్ దీనిని తెలుగులోకి అనువదించారు. తెలుగు టైటిల్ "తెగింపు". కన్నడ టైటిల్ "ఎదగారికె". ఇది కన్నడలో సినిమాగా కూడా వచ్చింది. మహిళా దర్శకురాలు సుమన కిత్తూర్ దర్శకత్వం వహించిగా అవార్డుల వర్షం కురిసింది.

అసలు అగ్ని శ్రీధర్ నేపధ్యమే గగుర్పొడుస్తుంది. ఆయనొకప్పుడు కాంట్రాక్ట్ కిల్లర్. కర్ణాటక చీకటి ప్రపంచంలోని వ్యక్తి. క్రైం ఒకప్పటి తన వృత్తి. కొన్నేళ్ల క్రితం గన్ వదిలిపెట్టి పెన్ పట్టారు. తన నేరజీవితంలో తారసపడ్డ ఒక వ్యక్తితో ప్రయాణం ఈ "తెగింపు". ఎవరా వ్యక్తి? ఒక యువకుడు. ఒక ట్రాప్ లో ఇరుక్కుంటాడు. తన ప్రాణం ఒకటి రెండు రోజుల్లో పోతోందని తనకి తెల్సు. ప్రాణం తీసేది కూడా తన పక్కనున్నవారే అని తెలుసు. అయినా బెదరడు, పారిపోయే ప్రయత్నం చేయడు, బాధ పడడు, సుఖంగా నిద్రపోతాడు, వేళకు తింటాడు. అతన్ని చంపాలంటే కరడు కట్టిన వారికి కూడా మనసు రాని పరిస్థితి వస్తుంది. అంతటి ఉద్వేగ పరిస్థితుల్లో కూడా అతనిలో రెండు విషయాలపట్ల గిల్ట్ ఫీలింగ్. జీవితాన్ని నెమరేసుకునే తీరు, ప్రతిక్షణం విశ్వరూపంలా కనిపించే స్థితప్రజ్ఞత, భగవద్గీత సారాన్నంతా నరనరాల్లో నింపేసుకున్నాడా అనిపించే వ్యక్తిత్వం. అతడిని చావు కబళించిందా? ఆవు కథలోలాగే ఇక్కడ కూడా చావుపులి వదిలేసిందా?

70 పేజీల ఈ పుస్తకం ఊపిరి బిగపెట్టించి సింగిల్ సిట్టింగ్ లో చదివిస్తుంది. ఎక్కడా అనువాదం చదువుతున్న ఫీలింగ్ కలుగదు. కారణం సృజన్ సవ్యసాచి లాంటి రచయిత. కన్నడనుంచి తెలుగుక్కి, తెలుగు నుంచి కన్నడకి నేటివిటీ మిస్ కాకుండా రాయగలిగే దిట్ట.

హీరోలు సినిమాల్లోనో, పురాణాల్లోనో, ఇతిహాసాల్లోనో, కథల్లోనో కాదు...నిజజీవితంలో కలియుగంలో ఇలాంటి వ్యక్తి ఉంటాడా అనిపించే వాస్తవిక సంఘటన ఇది. అందుకే మాఫియా మనస్తత్వాన్ని ఔపోసన పట్టిన రాంగోపాల్ వర్మ సైతం ఈ పుస్తకం చదివి షాక్ అయ్యి ముందుమాట కూడా రాసారు.

ఇది నేను ఈ పుస్తకానికి వ్రాస్తున్న ప్రచారవ్యాసం కాదు. ధైర్యం మానవరూపం ధరిస్తే ఎలా ఉంటుందో పరిచయం చేయాలన్న ఒక ఆకాంక్షతో మాత్రమే.

-సిరాశ్రీ 

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్