సాహితీవనం - వనం వెంకట వర ప్రసాదరావు

sahitivanam

ఆముక్తమాల్యద
గోదాదేవి విరహబాధతో తన మనోనాథుడిని నిందిస్తున్నది. నందగోకులంలో, బృందావనములో తననే వలచి వచ్చినవారిని ఆయన ఎలా వేధించాడో చెబుతున్నది.

తనకు నందఋఁ   గూర్ప బృందావనమున
నొకతె రతిఁ  దేల్చి కాఁక నొండొకతెఁ బ్రేల్చి
యంత రాధకు మేలువాఁడై మురారి
యెల్ల సతుఁలకు నెద నుడుకే యిడండె

గోపికలు అందరూ తనకై కూడివస్తే, ఒకామెను రతిలో తేల్చి మరొకామెను కాకలో, మదన తాపంలో పేల్చాడు, పక్షపాతి. రాధమీద ప్రేమతో, పక్షపాతంతో ఆమెను దగ్గరికి తీసి, మిగిలినవారి గుండెల్లో మంటలను రేపాడు. అదీ ఆయనగారి నిర్వాకం, యిలా ఎన్ని ఉదాహరణలు ఆయన స్త్రీలను ఎలా వేపుకుతిన్నాడో చెప్పడానికి అన్నది. ఆవిడ స్నేహితురాళ్ళు నవ్వి, యిలా అన్నారు.

ఎవ్వరు నట్లుపో నెరసు లెన్నకమానరు ప్రాణభర్తలన్
దవ్వుల నున్నఁ  గాఁక కతనన్మఱి వారలు వశ్యులైనఁ దా
నెవ్వరి నొల్ల కొక్కటయి యింద్రుఁడు చంద్రుఁడుడటండ్రు బోటి తా
నివ్వలఁ దేరకత్తె యగు నిట్టివి నీతలవేగెనే చెలీ.

ఎవరైనా అంతేనమ్మా, తమ ప్రాణేశ్వరులు తమకు దూరంగా ఉన్నపుడు కోపంతో, విరహతాపంతో వంకలు పెట్టకుండా ఉండరు. అదే వాళ్ళు చేరివచ్చినప్పుడు, తమకు వశులు ఐనప్పుడు వారినే 'ఇంద్రుడు' 'చంద్రుడు' అని పొగుడుతారు. చివరికి వారూ వారూ ఒక్కటైపోతారు. అంతవరకూ చేదోడు వాదోడుగా ఉన్న చెలికత్తెలు పరాయివాళ్ళు ఐపోతారు. ఇలాంటి తలపులే నీకు వచ్చాయిలే ఇప్పుడు అన్నారు. ప్రేయసీ ప్రియులమధ్యన భార్యా భర్తల మధ్యన తల దూరిస్తే తల వాచిపోక తప్పదు, నిజమైన అనురాగము వారి మధ్యన ఉంటె, అన్న లోకోక్తిని చెప్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. స్త్రీల మనస్తత్వాన్ని తేటతెల్లం చేస్తున్నాడు.

అనుటయు నెలనగ వడఁచుచుఁ
గన లించుక తెచ్చి యౌడుగఱచుచు నయ్యం
గనలన్ కందుకనికరముఁ
గొని వ్రేయుచుఁ గెలను చూచుకొనుచుం బలికెన్

ఎంతైనా చివరికి మీరూ మీరూ ఒక్కటేనమ్మా, చివరికి మేమే పిచ్చివాళ్లము ఐపోతాము అంటున్న చెలికత్తెలను చూస్తూ, మొలకెత్తుతున్న చిరునవ్వులను అణిచిపెట్టుకుంటూ, తెచ్చిపెట్టుకున్న చిరుకోపముతో, బంతులను తీసుకుని వారి మీద విసిరి వేస్తూ, కొనగంటి చూపులతో చూస్తూ యిలా అన్నది.

విడువక మీ గానము సొగ
సిడుటయు, మఱి పాడుఁడనుట యెగ్గే! పాసెం
బడిగిన వారే పేదలె?
కొడిమెలు గట్టకుఁడి యతనిఁ గొని పని యేలా

మీరు ఆయనను(శ్రీ హరిని) వదలకుండా భజనలు చేస్తూ పొగుడుతుంటే, ఆతని కథా కమామిషూ చెప్పడం కూడా తప్పేనా? పాసెం పెట్టుమని అడిగిన వాళ్ళే పేదలు, తిండికి లేని వాళ్ళూ ఐపోతారా? రుచికి మెచ్చుకుని తీయని పదార్థాన్ని పెట్టుమని అడిగినంత మాత్రాన తిండికి లేనివాళ్ళు ఐపోతారా, అడిగినవాళ్ళు? చిలవలు పలవలు చేర్చి ఆయనతో ఏదో అనుబంధం ఉంది అని కల్పించకండి, అసలు ఆయనతో పనేమిటి?(నాకూ- మీకూ) పోనియ్యండి అన్నది.

పోనిండన్న వయస్య లిట్లని రగుం బోనిక్క మింకిప్పుడే
గాని మ్మిం కొక కొంతసేపునకునే గానీ సఖీ యెల్లి యే
గానీ నీనుడిఁ దన్మనోజ్ఞగుణముల్గానీ తదన్యాయము
ల్గానీ డిందినఁ జింత నీకతనిపై గా కెవ్వరిం దేల్చెదే?

పోనియ్యండి అనగానే, పోనియ్యక యిప్పుడు చేస్తున్నది ఏమున్నదని? యిప్పుడో, ఇంకొంత సేపటికో, రేపో, మాపో ఆయన సుగుణాలు కానీ లోపాలు కానీ, ఆయనగారి అన్యాయాలు దుర్మార్గాలు కానీ, ఆయన మీద తప్ప నీకు ఎవరిమీద ఆలోచన, ఇంకెవరిని పలవరిస్తావు, చురకలేస్తావు, కానియ్ అన్నారు.

(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు.