సెల్లు చిల్లు(కవిత) - శ్రీనివాస్ ఈడురి

cellu chillu

ఇదేమి సెల్లండీ బాబూ
జీవితాలు చేస్తూంది ఖరాబు
టెలికాం కంపెనీలు కోకొల్లలు
ప్రకటనలేమో రసగుల్లలు

మనచుట్టూ తిరిగే బొచ్చు కుక్క ఒకటి
జీవితాన్ని మార్చేసే ఐడియా ఇంకొకటి
ప్రతి ఫ్రెండూ కావాలంటుంది ఒక కంపెనీ
మనని అడ్డంగా దోచేస్తున్నాయి ఇదేం పని?

సినిమాలు, పేపర్లు, జ్యొతిష్యం, క్రికెట్టు
సెల్లులోనె చూడొచ్చు ఇదెక్కడి కనికట్టు
బడుగైనా, బుడుగైనా, ఏ వయసువారైనా
వుండాల్సిందే ఈ సెల్లు సంపాదన ఎంతైనా

పాలవాడు, కూరలోడు, ఆటోవాడు, పూలవాడు
ఉదయం నించి రాత్రిదాకా ఒక్కడేంటి ప్రతివాడూ
కాల్ చేస్తే వచ్చేస్తారు, సర్వీసులు ఇచ్చేస్తారు
రింగుటోను  మార్చలేదని మొగుడిని మార్చేసిందొకావిడ
తనకు సెల్లు కొనలేదని గొదాట్లోకి తోసింది మరొకావిడ
జాతకాలు మార్చేసే శక్తి వుందిరా మన సెల్లుకి
నెమ్మదిగా చేర్చుతుంది తీహారు జైలు సెల్లుకి

అందినంత దోచుకోవాలని తెచ్చారు టు జీ (2G)
దెబ్బతోటి రాజావారయిపొయారు మాజీ
మీ ఇంటిమీద వుందంటే మొబైలు టవరు
మగవారికి తగ్గుతుందట బాడీలోన పవరు
ఒకప్పుడు అడిగేవారు మీకెంత మంది పిల్లలు
ఇప్పుడదే ప్రశ్న అయ్యింది మీకెన్నున్నై సెల్లులు

తాతయ్యకి వచ్చిందంటే మూడు
ముందుగా తన సెల్లే వెతుకుతాడు
నెమ్మదిగా ఇస్తాడు మిస్సుడు కాలు
ఇంక పరిగెత్తుకు వస్తారు బామ్మ గారు
మొబైలుతో పెరుగుతోంది కుర్రకారు హుషారు
బిల్లు చేతికందగానె తగ్గుతుంది మరి జోరు

ఒక్క మాట పెట్టుకోండి పదిలంగా మదిలో
ప్రమాదాలు తెచ్చుకోకండి పడిపోయి సోదిలో
టెక్నాలజీ వున్నది మన సుఖం కోసమే
అతిగా వాడితే ఏదైనా మొదటికి మోసమే