సత్యభామ: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

'satyabhama' book review

రచన: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
వెల: 50/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో

ఉపోద్ఘాతం లేకుండా విద్యుద్ఘాతంలా మొదలయ్యే పుస్తకమిది. విషయ సూచిక లేకుండా విశేషాల్లోకి లాక్కుపోయే పౌరాణిక నవల ఇది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ చదవమంటే ఆ మధ్య కన్నడ రచయిత భైరప్ప వ్రాసిన "పర్వ" చదివాను. ఐదారొందల పేజీల సుదీర్ఘ నవల అది. కానీ మొదలెడితే పూర్తయ్యే దాకా పుస్తకం మూసే పని, వేరే పని పెట్టుకోలేదు. మహాభారతం పై నాకున్న మక్కువ కొంత, రచయిత తన ఊహని నిజమనిపించేలా కథనాన్ని నడిపించడం కొంత అందుకు కారణాలు కావొచ్చు. మళ్ళీ అటువంటి అనుభూతి కలిగింది ఈ నవలిక చదువుతుంటే.

ఇందులో మహాభారత పాత్రలు ఏవీ నింగి నుంచి ఊడిపడ్డట్టు కనపడవు. శ్రీకృష్ణుడితో సహా అందరూ మన మధ్య నడిచే మనుషుల్లాగే ఉంటారు. వారి భయాలు, అనుమానాలు అన్నీ మామూలే. పేరుకు పురాణ కథే అయినా పౌరాణిక పురుషులు, స్త్రీలు మనం ఇన్నాళ్ళూ ఊహించుకున్న తీరులో కనపడరు. ఎవరికీ మాయలు, మంత్రాలు రావు. బలమైన భావోద్వేగాలే వారిని నడిపిస్తుంటాయి. తద్వారా పాఠకులని పరుగెత్తిస్తాయి.

కురుక్షేత్ర యుధ్ధం తర్వాత యాదవ కుల నాశనం జరిగే క్రమంతో మొదలయ్యే నవల ఇది. అర్జునుడు యాదవ కాంతలను రధాల మీద సురక్షిత ప్రాంతానికి తరలించే సన్నివేశంతో శ్రీకారం చుడుతుంది ఈ నవలిక. క్రమంగా సత్యభామ మనసు నుంచి దర్శనమిస్తుంది. అసలు యాదవ కాంతలను సురక్షిత ప్రాంతానికి ఎందుకు తరలించాలసి వచ్చింది? అది కూడా అర్జునుడు ఏమిటి? కృష్ణుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నలే పాఠకులని ఆపకుండా చదివిస్తాయి.

144 పేజీలకు మించని ఈ నవల చదివే ఓపిక పెద్దగా లేని పాఠకులను కూడా ఒకసారి చదివించేలా చేస్తుంది. మహాభారత కథపై కాస్తంత ఆసక్తి ఉంటే మరింత ఆస్వాదించవచ్చు. ఎంత భారతం తెలిసిన వాళ్ళకైనా ఎన్నో పాత్రలు కొత్తగా పరిచయమైనట్టు ఉంటాయి ఈ నవల ద్వారా.

వెల కూడా అతి తక్కువగా ఉంచడం ఈ నవల అత్యధిక పాఠకులకు చేరాలన్న రచయిత సదుద్దేశమే అనిపిస్తుంది.

నిండైన భాష, కావలసిన చోట శబ్ద ప్రౌఢత్వం, పద లాలిత్యం... ఒక గద్య కావ్యాన్ని చదువుతున్న అనుభూతి కూడా కలుగుతుంది. ఇంతకుమించి ఏమీ చెప్పను. ఇక మీ ఇష్టం.

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం