మూల కణాల భద్రత - డా ॥ సుభద్ర ద్రావిడ

Stem Cell Bank

వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందినా అంతకంటే వేగంగా కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి వ్యాధి నిర్ధారణ జరిగి, చికిత్స ప్రారంభించే లోగానే పరిస్థితి చేయిదాటి ప్రాణాపాయం సంభవించే ప్రమాదమూ ఉంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే లేదా? అన్ని రకాల పరీక్షలు చేసి కానీ వ్యాధి ఏమిటో గుర్తించలేమా? అంటే సాధ్యమేనంటుంది ఆధునిక వైద్యశాస్త్రం. రాబోయే తరాలను గుండె జబ్బులు, కాలేయ, మూత్రపిండాల వ్యాధులు, బోన్, బ్లడ్ కేన్సర్ల నుండి అప్రమత్తం చేసే ఆవిష్కరణే "ట్రాన్స్ సెల్".

శిశువు పుట్టిన వెంటనే బొడ్డు తాడు తీసి భద్రపరిస్తే చాలంటున్నారు వైద్యులు. అదే ఆజన్మాంతం కాపాడే 'మూల' కారణమవుతుందంటున్నారు. ఎందుకంటే 70 రకాల జబ్బులనుండి కాపాడే మూలపదార్ధం బొడ్డు తాడులోనే ఉంది. శిశువు బొడ్డు తాడు సేకరించి భద్రపరిచే, స్టెమ్ సెల్ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా కొత్తకాకపోయినా హైదరాబాద్ లో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు సామాన్యులు అందుకోలేనంత చార్జీలు ఉండడం, చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల సంపన్న వర్గాలకే పరిమితమైనా, విస్తృతమైన ప్రచారంతో మూలకణాల ఉపయోగంపై జనంలో అవగాహన పెరగటం వల్ల మధ్య తరగతి ప్రజలు సైతం స్టెమ్ సెల్ బ్యాంకుల్లో తమబిడ్డల మూలకణాలను భద్రపరిచేందుకు ముందుకొస్తున్నారు. హైద్రాబాద్ లోని ట్రాన్స్ సెల్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడేళ్ళుగా శిశువుల బొడ్డు తాడు మూలకణాలను భద్రపరుస్తోంది. ఇందులో 2011లో 800 మంది తమ శిశువుల మూల కణాలను భద్రపరచుకోగా, 2012 కు ఆ సంఖ్య 1500 లకు చేరింది. ఆ తర్వాత 4,500 లకు చేరింది. వారిలో ఇప్పటివరకు 320 మంది ఆ మూలకణాలను వివిధ చికిత్సల కోసం వినియోగించుకున్నారు.

ఈ విషయంపై స్టెమ్ సెల్ బయోలాజిక్స్ ఎండీ డాక్టర్ సుభద్ర ద్రావిడ "రాష్ట్ర వ్యాప్తంగా మేం 35 ప్రసూతి ఆస్పత్రుల నుండి కణాలను సేకరిస్తున్నాం. డిల్లీ, కోల్ కత్తా, బెంగళూర్, చెన్నై, చండీఘర్ నుంచి వచ్చిన దంపతులు సైతం ఇక్కడి బ్యాంకులనే ఆశ్రయిస్తున్నారు. పిల్లలకు 21ఏళ్ళు వచ్చే వరకు కణాలను భద్రపరుస్తాం వారి కోరిక మేరకు 100 ఏళ్ళ వరకూ నిల్వ చేసుకోవచ్చు" అంటున్నారు.

"పాడైపోయిన అవయవాలను మూలకణాల ద్వారా బాగుచేయడం కొత్త అవయవాలను ఉత్పత్తి చేసే అంశంపై అనేక పరిశోధనలు ఊపందుకున్నాయి. ఈ తరహా వైద్య విధానం అందుబాటులోకి వస్తే శస్త్ర చికిత్సలూ, అవయవ మార్పిడలూ తేలికవుతాయి. ఖర్చు కూడా తగ్గిపోతుంది" అంటున్నారు డాక్టర్ మూరిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి న్యూరో ఫిజీషియన్.

శిశువు జన్మించగానే కత్తిరించి పక్కన పడేసే బొడ్డు తాడులో 200 మిల్లీ లీటర్ల రక్తం వుంటుంది. బిడ్డనుంచి వేరు చేసిన రెండు నిమిషాల్లోనే అందులోని రక్తాన్ని సేకరించి, ఆ శాంపిల్ ను ప్రోసెసింగ్ సెంటర్ కు పంపిస్తారు. అక్కడ హెచ్ ఐ వీ ఇతర పరీక్షల అనంతరం మూలకణాలను రోబోటిక్ మెషీన్ లో శుద్ధిచేసి ప్రత్యేక బాటిల్ లో - 196 డిగ్రీల వద్ద భద్రపరుస్తారు. కణాలు పాడైపోకుండా డైమిధైల్ సల్ఫాక్సైడ్ ను కలుపుతారు. సీసాపై బార్ కోడింగ్, డోనర్ పేరు వివరాలను నమోదు చేస్తారు. ఇది సుమారు వంద సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి.
బొడ్డుతాడు రక్తం నుంచి సేకరించిన కణాలను హెమటో పాయిటిక్ స్టెం సెల్స్ అంటారు. కణజాలం నుంచి సేకరించే వాటిని మీసన్ ధైమస్ స్టెంసెల్స్ అంటారు. ఎముకలో మజ్జ నుంచి సేకరించే వాటిని బోన్ మారో  స్టెం సెల్స్ అంటారు.  పంటి నుంచి మూల కణాలను కూడా సేకరించి, వీటిని జన్యు సంబంధమైన వ్యాధుల చికిత్సలకు ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం మూల కణాలతో అన్ని రకాల వ్యాధుల చికిత్సలు సాధ్యం కాకపోయినా, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విస్తృత పరిశోధనల ఫలాలు రేపటి తరం భద్రతకు భరోసానిస్తాయని ఆశిద్దాం..

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు