స్పందించే గుణం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

spandinche gunam

మనిషిలో స్పందించే గుణం ఉంటుంది. జంతువుల్లో అది ఉండదు(కొన్ని మచ్చికైన వాటిలో ఉంటుందనుకోండి, అది వేరే విషయం). చెడును గర్హిస్తాం. మంచిని శ్లాఘిస్తాం. ఎక్కడన్నా అన్యాయం జరిగినా, అనుకోని సంఘటన జరిగినా ’అయ్యో అనుకుంటాం. దొంగతనాలు, దోపిడీలు, హత్యలులాంటివి పేపర్లలో చదివితే మన పెదవులపై బాధతో ’ప్చ్’అన్న పదం చేర్చి, వేడి నిట్టూర్పు విడుస్తాం. రోడ్డుమీద వెళుతుంటే, ఎవరికన్నా యాక్సిడెంట్ అయితే వేగంగా వెళ్లి చూస్తాం. లేపి కూర్చో బెడతాం. నీళ్లు తాగిస్తాం. ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ఆంబులెన్స్ మన ముందు నుంచి వేగంగా హార్న్ వేసుకుంటూ వెళుతుంటే అందులో ఉన్న పేషెంట్ త్వరగా కోలుకోవాలని సంతోషంగా ఇంటికి వెళ్లాలనీ కోరుకుంటాం.

మనలో చాలామందికి దైవభక్తి, పాపభీతీ ఉంటుంది. లేదంటే ఆత్మసాక్షినన్నా నమ్ముతారు. మంచిమార్గంలో నడుస్తారు. దానం, ధర్మం చేస్తారు. భూకంపాలకి, వరదలకి ధన/ వస్తు సహాయం చేస్తారు.

ఇంతలా మానవత్వం పరిమళించే మనుషుల మనసు కొన్నిచోట్ల కుంచించుకు పోతుంది. ఇరుకైపోతుంది. ఎక్కడో చెప్పనా?

బస్సుల్లో, రైళ్లలో మనం ఎక్కినప్పుడు కూర్చునే స్థలం ఉన్నా, అప్పటికే కూర్చున్న వాళ్లు సీట్ల మీద కాళ్లు బారజాపుకుని సీటివ్వరు. ‘కాస్త సర్దుకోండీ’ అంటే ”మా వాళ్లు పక్క కూపేలో ఉన్న చుట్టాలతో మాట్లాడడానికి వెళ్లారు’ ’బాత్రూమ్ కి వెళ్లారు’ అంటారు. మనం ఎంత సేపు నుంచున్నా వాళ్లు అలాగే కూర్చుని ఉంటారు. పోనీ అదేమన్నా రిజర్వ్ డ్ కంపార్ట్ మెంటా అంటే అదీ కాదు, జనరల్. అదేం జీవితాకాలపు ప్రయాణం కాదు. మన గమ్యం చేరేదాకా, కొద్దిసేపే. అయినా కొద్దిగా జరిగి సీటివ్వరు.

‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ గొప్పగా రాసుకుంటాం, చెప్పుకుంటాం. కానీ బస్సులో లేడీస్ సీట్లు ఫిల్ అయి ఉంటే, ఒక పక్కకి వాలిపోయి, ఉదుకుష్టపడుతూ నుంచున్న ఆడవాళ్లకు పొరబాట్నకూడా లేచి సీటివ్వం. వాళ్ల సీట్ల వరకే వాళ్లను గౌరవించాలా? ఏమో మరి.

పసి పిల్లలను విసుక్కుంటాం, తిడతాం, కొడతాం అదీ దేవుళ్ల పేర్లేట్టి. పిల్లలు దేవుడితో సమానం అంటాంగా. అది అబద్ధమా? ఏమో, ఏవిటో ఈ ద్వంద్వ ప్రమాణాలు.

మీరు గమనించారో లేదోగాని గుళ్లలో దైవదర్శనం కోసం లైన్లో నుంచున్నా అసహనం, అరుపులూ, కేకలే. ఇలాంటప్పుడు దైవ దర్శనాలు అవసరమా?

బాధ పడే వాళ్లను ఓదార్చాలి. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకోవాలి. నష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవాలి. దానం చేసి ఆపన్నులను ఆదుకోవాలి ఇవన్నీ మనసు స్పందించే గుణాలే! ఈ స్పందనలు లేకపోతే మనిషి మరమనిషే! పెదాలపై నుంచి ప్రవహించే మాటల వల్ల ఏం ప్రయోజనం? మనసుతో ముందుండాలి.

కొంతమంది సేవ చేసే భాగ్యం కోసం ఎదురుచూస్తారు. దేవాలయాల్లోనూ, శరణాలయాల్లోనూ సేవ చేస్తారు. అయితే మనకు చేతనైనంతలో, చేరువలో ఉన్నవాళ్లకు చేసే చిన్న చిన్న సహాయాలూ సేవలే. ఎక్కడన్నా మనకు తారసపడే వికలాంగులకి సహాయ సహకారాలు అందించడం, కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఫారాలు నింపడంలో ఇబ్బంది పడుతున్నవాళ్లకు సహాయం చేస్తే, వాళ్ల ముఖంలో వెలుగును చూస్తే, మన సేవ విలువ తెలుస్తుంది. పెన్ను తెచ్చుకోని వాళ్లకు పెన్నివ్వడమూ సేవే. మానవ సేవలో మాధవుడు అలాంటిచోటే కనిపిస్తాడు. చూడగలగాలంతే!

మన అవసరం ఉన్న చోట విసుగు ప్రదర్శించకూడదు. కోపం రాకూడదు. కసురుకోకూడదు. స్పందించి ఒకరికి సహాయం చేసే అవకాశం రావడం అదృష్టం, దాన్ని సద్వినియోగం చేసుకోడానికి అందరం ఉవ్విళ్లూరాలి. ఇది తెలుసుకోవడమే మానవతావాదం. మన జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి.