నా ఆశ-ఆకాంక్ష - రాపాక కామేశ్వర రావు

Naa asha aakanksha

"అర్జున్, మా తాత గారు వచ్చారు, బై... " అంటు వాడి ఫ్రండ్ కి చెయ్యి ఊపి వచ్చి నా కారు ఎక్కాడు మా మనవడు. వైజాగ్ లో టింపనీ స్కూల్ లో ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు.

"తాత గారు మన కేస్ట్ ఏమిటి?" స్పీడుగా ఇంటికి వెళ్తున్న నేను వాడి ప్రశ్నకు ఖంగు తిని సడన్ బ్రేక్ వేసాను.

"ఎందుకురా, ఎవరైనా అడిగారా?"

"అవును, అర్జున్ అడిగాడు, వాళ్ళ మమ్మీ కేస్ట్ ఒకటి, డాడీ కేస్ట్ ఇంకొకటి, అందుకే వాడిదే కేస్టో తెలియదట. నన్ను అడిగాడు నీ కేస్ట్ ఏమిటి? అని. నాకు తెలియదన్నాను"

"మీ డాడీని అడిగి రేపు చెప్పు" అన్నాడు.

"అలాగే" అన్నాను.

నాకు మతిపోయింది. ఈ రోజుల్లో పిల్లల మనసుల్లో ఇలాంటి సంకుచిత భావాలు కలుగుతున్నాయంటె కచ్చితముగా పెద్దవాళ్ళ ప్రభావమే. ఎటుపోతుందీ సమాజం!

మా మనవడు ఇంకా కొన సాగించాడు "అర్జున్, వాళ్ళ అమ్మమ్మ గారింటికి ఎప్పుడు వెళ్ళలేదట. వాళ్ళు కూడ వీరింటికి రారట".

"సరే, ఇంకా కొద్దిగ పెద్దవాడివయ్యాక నీకు అన్నీ తెలుస్తాయిలే, ఇప్పుడు అవి ఏమీ ఆలోచించకు" అని అప్పటికి సర్ది చెప్పాను.

విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలలో పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు ఈ కులాల గురించి తెలియదు గాని నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇలాంటివి పుట్టుకతోనే తెలిసిపోతాయి, ఎందుకంటె అక్కడ ఒక్కొక్క కులము వారు ఒక్కొక్క సమూహముగా ఏర్పడి ఒక్కొక్క వీధిలో ఉంటారు. ప్రతి వీధి పేరు ఆ కులము పేరుతో ఉంటుంది. ఒక మనిషి పలానా వీధికి చెందిన వాడు అంటె ఆయన కులమేమిటో సులభముగా చెప్పవచ్చు. అయినా కూడ మనుషుల మధ్య వైషమ్యాలుండేవి కావు అనురాగం ఆప్యాయతలే వెల్లి విరిసేవి. కొంత మందైతే అవతలి వారి కులముతో సంబంధం లేకుండా “అన్న అక్క బావ” అంటు వరుసలు కలుపుకుంటూ మాటలాడే వారు.

అలా నా గుండెలో గూడు కట్టుకున్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.

-----/////-----

ఆంధ్రా యూనివర్సిటీ లో ఎం ఎస్ సి చదువు ముగించుకుని వైజాగు విడిచి వెళ్ళే రోజు వచ్చింది. నా ఫ్రండ్స్ రాజు, హుస్సేన్ ల సహాయముతో నాకున్న లగేజిని పేక్ చేసుకుని తెల్లవారి ఆరు గంటలకు మా ఊరిలో ఆగే ఏకైక రైలు జనతా ఎక్స్ ప్రెస్ ని అందుకున్నాను. “కాలే కడుపుకే కష్టం తెలుస్తుంది” అన్నట్టు సాధారణ బోగీలో రైలు ప్రయాణం చేస్తే ఎంత కష్టమో అందులో ప్రయాణించే వారికే తెలుస్తుంది. రైలు బండిలో సీట్ రిజర్వ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉన్నా అంత రద్దీని ఊహించలేదు.

సాధారణ బోగీలో ఎక్కాను. పూర్తిగా క్రిక్కిరిసి ఉంది. ఎలాగైతేనేం మా స్నేహితుల సాయంతో నా లగేజిని సీట్ల కింద సర్ది ఊపిరి పీల్చుకున్నాను.

"బై"... రాజు, హుస్సేన్ లిద్దరు చెయ్యి ఊపారు ప్లాట్ ఫాం మీద నిల్చొని కిటికీ నుండి చూస్తూ.

"బై" అంటు బదులుగా చెయ్యి ఊపాను.

"వెళ్ళగానే ఉత్తరం రాయిరా, మా అడ్రస్ లు ఉన్నాయి కదా" అన్నాడు రాజు.

"అలాగే రా, మీరు కూడ తరచు ఉత్తరాలు రాస్తుండండి, మన స్నేహం ఇలాగే కొన సాగాలి." అన్నాను.

రైలు బండి కదిలింది. ఆ బోగీ లో కూర్చున్న వారికన్నా నిలుచున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సింగిల్ సీట్ లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన పక్కనే నిల్చున్నాను. కొంత సేపటి తరువాత ఆ వ్యక్తి నాతో మాటలు కలిపాడు.

మీ పేరేమిటి సార్?

"ఆనందరావు"

"మీదే ఊరు?" అని అడిగాడు

"సోంపేట పక్కన బూరగాం"

"మాది అంబుగాం" అడక్కుండానే చెప్పాడు

"మీరు పలాసలో దిగుతారా? “ అన్నాను

"ఆ..... అవును"

కొంతసేపు నిశ్శబ్దం తరువాత "మీదే కేస్ట్?" అడిగాడు.

నేను చెప్పాను.

"ఆ!!! ..... మా కేస్టే .... కూర్చొండి" అంటూ సగం సీట్ నాకిచ్చి మిగిలిన సగం సీట్ లో తాను కూర్చున్నాడు.

"సేం కేస్ట్" అంటు అభిమానం ఎక్కడినుండో తన్నుకొచ్చింది.

"మన వాళ్ళు బూరగాం లో కూడ ఉన్నారన్నమాట, మనందరం ఒక మాట మీద ఉంటే మనకు మించినోళ్ళెవరుండరండి" అన్నాడు. ఇంకా ఏవేవో చెప్పాడు. “మనం వీరులం శూరులం” అన్నాడు.

సరే సీట్ ఇచ్చాడు కదాని, ఆయన చెప్పినవన్నిటికి "ఊ" కొట్టాను.

"మీ ఫ్రండ్స్ వచ్చారు కదా, వాళ్ళు కూడ మనవాళ్ళేనా?"

"నాకు తెలియదు" అన్నాను.

"తెలుసుకోవాలి, మన వాళ్ళు ఎంత మంది ఉన్నారు, ఏ ఏ పొజిషన్స్ లో ఉన్నారో తెలుసుకోవాలి" అన్నాడు.

నిజానికి "హుస్సేన్ " పేరు వినగానే ముస్లిం అని తెలుస్తుంది. రాజు కేస్ట్ ఏమిటో నాకు తెలియదు. నేను అడగలేదు. వాడు చెప్పలేదు.

శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలలో నేను బి ఎస్ సి చదువుతున్నప్పుడు, " మనమంతా మానవులం మనదంతా ఒకే కులం" అని ఒక గేయం రాసాను. దానిని కాలేజి మేగజిన్ లో కూడ ప్రచురించారు. చాల మంది మెచ్చుకుని నన్ను ప్రశంసించారు. అలాంటి అభ్యుదయ భావాలు నాలో వెల్లివిరిసినందుకు నాలో నేనే ఎంతో గర్వపడ్డాను.

"కులం కూడు పెట్టదు మతం మంచి నీళ్ళివ్వదు, సంస్కారమే సాయం చేస్తుంది. కులమతాలు కూడు గుడ్డలు పెట్టవు గాని అడ్డు గోడలు కడతాయి" అని మా నాన్నమ్మ అనేది.

"కాని ఈ రోజు 'కులం' నాకు రైలు ప్రయాణములో కూర్చోవడానికి చోటిచ్చింది. కులాభిమానమంటె ఏమిటో మొదటి సారి చవి చూసాను. కులం అంటె ఎందుకింతలా అభిమానిస్తారో అర్థం కాలేదు. ఇది మనుషుల మధ్య అభిమానాలే కాకుండా విద్వేషాలు కూడ కలిగిస్తుంది కదా. మరి ఇలాంటి కులాన్ని కూకటి వేళ్ళతో పెకటించాల్సిందే"

"కులమే దేశములోని అసమానతల విష వృక్షానికి తల్లి వేరు. దేశాభివృద్ధికి పెద్ద అడ్డంకి." అనుకున్నాను. నా యువ రక్తపు ఆలోచనా స్రవంతి అక్కడితో ఆగలేదు. కులాంతర వివాహం చేసుకోవాలని కూడ నిర్ణయం తీసుకుంది.

-----///-----

మనమొకటి తలిస్తే దైవం వేరే తలచునన్నట్లు, ఆ సంవత్సరమే మా అమ్మ గారు కాలం చేయడముతో ఇంట్లో వంటకు ఇబ్బందిగా ఉందని చెప్పి, మా నాన్న గారు ఒక సంబంధం చూసి నా పెళ్ళి చేసేసారు. తరువాత సోంపేట లోనే బేంక్ ఉద్యోగం రావడముతో నేను జీవితం లో స్థిరపడ్డానని మా బంధువులంతా సంతోషంతో అభినందించారు. ఉద్యోగం వలన నేను సోంపేటకు మకాం మార్చాను.

నా అభ్యుదయ భావాలు అటకెక్కాయి. నా ఆశయాలని ఆచరణలో పెట్టలేక పోయాను. సమాజములో ఒకడిగా బ్రతికేస్తు సంసారంలో తల మునకలైపోయాను. భార్య, పిల్లలు ఇదే నా ప్రపంచం.

నా ఆశయాలు నా కొడుకు ద్వారా సాధ్యమైతే బాగుండునని ఆశ పడ్డాను కాని మా అబ్బాయికి వాళ్ళ అన్నయ్య కూతురితో పెళ్ళి జరిపించాలని మా ఆవిడ కోరిక. దాన్ని కాదనడానికి నా దగ్గర అభ్యంతరాలేమీ లేవు. ఊరుకున్నాను.

నన్ను నేనే సంస్కరించుకోలేని వాడిని ఈ సంఘాన్ని ఏమి ఉద్ధరిస్తాను.

మా అబ్బాయి పెళ్ళి తిరుమలలో జరిపించడానికి ట్రైన్ లో వెళ్తుండగా నా ఎదురుగా కూర్చున్న ఒకాయన "మీరేమిట్లు సార్" అన్నాడు. నా సమాధానం కోసం వేచి చూడకుండా మీరు పలానా కదా అని అన్నాడు. చిరునవ్వే నా సమాధానం. ఆయన ముఖం వెలిగిపోయింది.

"నాకెందుకో అనిపించింది మీరు కూడా మా వాళ్ళేనని" అన్నాడు

మళ్ళీ నవ్వాను

ఆయన కళ్ళల్లో ప్రతిఫలించిన ఆనందాన్ని గమనించాను.

"మనుషులంతా ఒకే కులం అయితే ఎంత బాగుండునో, ఈ లోకం నందన వనం అయిపోతుంది" అనుకున్నాను.

-----///-----

ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో తిరిగి రిటైరయ్యాక విశాఖపట్నం లో స్థిరపడ్డాను.

మా అబ్బాయి, కోడలు ఇద్దరివి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు. పూనే లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి ప్రబలిన నుండి ఇంటి నుండే పని చేస్తున్నారు. మనవడిని విశాఖపట్నం లోనే చదివిద్దామని నిర్ణయించి టింపనీ స్కూల్ లో చేర్పించాము.

మా మనవడు అడిగిన ప్రశ్నతో నేను వైజాగులో మహారాణిపేట శాఖలో పని చేస్తున్నప్పుడు నాకు ఎదురైన ఒక అనుభవం గుర్తుకొచ్చింది.

-----///-----

"ఈ బేంకులో నీలకంఠం గారని మా ఊరాయనే ఉంటారు మీకు తెలుసండీ?" ఒక పెద్దాయన సెక్యూరిటీ గార్డ్ ని అడుగుతున్నారు.

"ఈ రోజు రాలేదండి, సెలవు పెట్టారనుకుంటా"

"పోనీ ఆనందరావు గారు ఉన్నారండీ?"

"ఆ ఉన్నారండి రండి" అంటు మా సెక్యూరిటీ గార్డ్ నారాయణ ఆ పెద్ద మనిషిని నా వద్దకు తీసుకొచ్చాడు.

"నమస్కారమండి, నా పేరు భానుమూర్తి, నేను సోంపేట బాలికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయున్ని." ఆ పెద్దాయన తనని తాను పరిచయం చేసుకున్నారు.

"అయ్యో మీలాంటి వారు నాకు నమస్కారం పెట్టడమేమిటండి, రండి కూర్చొండి" అని నా ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాను.

"మన ఊరి బేంకులో ఉన్న మీ స్నేహితుడు మహిమారావు మీ అడ్రసు చెప్పి మీరు సహాయం చేస్తారని చెప్పారండి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటు వచ్చాను."

"చెప్పండి నన్నేం చెయ్యమంటారో" అన్నాను.

"ఇక్కడ మీ బేంకులో నీలకంఠం గారని ఉన్నారు కదండి"

"ఆ.... అవును, ఆయనతో ఏమైనా పని ఉందా?"

"మాకు దూరపు బంధువవుతారు. మా అమ్మాయికి వివాహ సంబంధాలు చూస్తున్నాను. మొన్న మా స్వంత ఊరికెల్తే, ఆయనకో కొడుకున్నాడని తెలిసింది." అతనితో పెళ్ళి విషయాలు మాటలాడదామని.

"ఆయన ఈ రోజు రాలేదండి" అన్నాను.

"అవునండి మీ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. ఆయన ఇల్లెక్కడో మీకు తెలిస్తే చెబుతారని".

"సరే పదండి", అని మా మేనేజర్ గారి పెర్మిషన్ తీసుకుని ఆయనతో కలిసి నీలకంఠం గారింటికి వెళ్ళాను.

నీలకంఠం, నాకు సీనియర్ కొలీగ్. ఆయనది ప్రేమ వివాహమే కాకుండా కులాంతర వివాహం కూడా. చాల మంది యువకులకు ఆయన ఆదర్శం. కాలేజి లో చదువుతున్నప్పుడే ఒకమ్మాయిని ప్రేమించాడు. ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకున్నాడు. ఇది అందరికి తెలుసు గాని ఈ పెద్దాయనకి తెలుసో లేదో.

-----///-----

"గుడ్ ఈవెనింగ్ సార్ " అన్నాను.

"ఆ రావోయ్ ఆనందం, ఏమిటిలా వచ్చావ్" అన్నారు నీలకంఠం గారు.

హాల్ లో ఉన్న సోఫాలో కూర్చుంటు, భానుమూర్తి గారిని ఆయనకు పరిచయం చేసాను.

"నాది మీ ఊరేనండి" అంటు తనతో నీలకంఠం కున్న బంధుత్వాన్ని గుర్తు చేసారు భానుమూర్తి గారు.

"మీ అబ్బాయికి వివాహ సంబంధాలు చూస్తున్నారని తెలిసింది, మీకు ఇష్టమైతే మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తారని".

"ఆ.. అంటె, ఇంకా ఏమనుకోలేదండి." నీలకంఠం గారు నీళ్ళు నములుతున్నారు.

"ఏమండీ" లోపలినుండి వచ్చిన గర్జింపు లాంటి పిలుపుకి నీలకంఠం గారు సోఫా నుండి ఒక్క ఉదుటున లేచి, "మీతో తరువాత మాటలాడతానండి" అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు.

భానుమూర్తి గారు నేను ఒకరినొకరు బిత్తర చూపులు చూస్తు నిలబడ్డాం, కొంతసేపు ఏం జరుగుతుందో అర్థం కాక. తరువాత అక్కడినుండి నిష్క్రమించాం.

-----///-----

మరుసటి రోజు నీలకంఠం గారు బేంకు లో అడుగుపెడుతూనే నా దగ్గరికొచ్చారు. వాళ్ళ అబ్బాయి పెళ్ళి విషయం లో నీలకంఠం గారికి ఆయన భార్యకు భేదాభిప్రాయాలున్నాయని చెప్పారు. చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయికి "మీ కేస్ట్ ఏమిటని" ఒక ఫ్రండ్ అడిగితే వాడు ఇంటికొచ్చి నీలకంఠం గారిని అడిగాడట. ఆయనచెప్పే లోపే ఆయన భార్య తన కేస్ట్ పేరు చెప్పిందట. నీలకంఠం గారు అది తప్పని తన కేస్ట్ పేరు చెప్పాడట. అప్పటినుండి ఆ పిల్ల వాడు తన కేస్ట్ ఏమిటో తెలియక ఇబ్బంది పడుతున్నాడట.

ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్ళీడుకొచ్చాక మరో సమస్య. ఏ కుల స్త్రీని వివాహమాడాలి?

తండ్రి కులపు అమ్మాయిని చేసుకోవడానికి తల్లి ఒప్పుకోవడము లేదు. అందుకే నేను భానుమూర్తి గారితో నీలకంఠం గారింటికి వెళ్ళి మాటలాడుతున్నప్పుడు ఆమె గర్జించింది. తల్లి కులపు వారిని తండ్రి ఒప్పుకోవడం లేదు.

ఎన్నో అభ్యుదయ భావాలతో ఆశయాలతో కులాంతర వివాహము చేసుకుని ఒక్కటైన ఆ తలిదండ్రులను గర్హించాలా? లేక ఈ సమాజాన్నా?

“చాతుర్వర్ణం మయాసృష్టం గుణ కర్మ విభాగశః” జనుల గుణములు కార్యకలాపాల ఆధారముగా నాలుగు రకముల వృత్తి ధర్మాలు నాచేత సృష్టించ బడ్డాయి అని భగవంతుడు గీతలో బోధించినా కూడ మూడు వేల కులాల్ని ఇంకా అందులో ఉప కులాల్ని సృష్టించి మనిషి పుట్టుకతో వచ్చిన వారసత్వముగా దానిని ఆపాదించి తనను తాను అపహాస్యం చేసుకుంటుంది ఈ నా సమాజం.

ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థను రూపు మాపి సమ సమాజం దిశగా భావి తరాలు అడుగులెయ్యాలని నా ఆశ, దురాశ కాదు గదా!

“సమ సమాజ నిర్మాణమె మన ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమె మన లక్ష్యం” అన్న మాటలు పాటలుగా పాడుకునే నా దేశ ప్రజలు నిజంగా సమ సమాజం దిశగా కదలాలన్నది నా ఆకాంక్ష.

మరిన్ని కథలు

Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్
Manasika vaikalyam
మానసిక వైకల్యం
- సి.హెచ్.ప్రతాప్
Pedanaanna
పెదనాన్న
- ఏ. కృష్ణమోహన్
Mrugaraju manasu
మృగరాజు మనసు
- - బోగా పురుషోత్తం
Amma Koyila
అమ్మ కోయిల
- విజయ వాణి. జన్నాభట్ల
Kanuvippu
“కనువిప్పు”
- ప్రభావతి పూసపాటి
Aasha Peraasha
ఆశా -పేరాశా .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు