ఇన్నర్ చైల్డ్ - రాజు యెదుగిరి

Inner child

సాయంత్రం నాలుగు అయింది. ఆఫీస్ నుండి బయటకి వచ్చి బస్ స్టాప్ వైపు నడిచాను. బ్యాగ్ భుజానికి వేసుకొని. ముందుకు నడుస్తున్నాను. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఒకేసారి ఉన్నపాటుగా పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది. పరుగులు తీస్తూ బస్ స్టాప్ కి చేరిపోయాను. అందరు ఎవరి ఫోన్లలో వాళ్లు బిజీ గా ఉన్నారు. ఫోన్లలో మొహం పెట్టి రీల్స్ చూస్తూ నవ్వుకుంటున్న కొందరు. ఆర్టిఫీషియల్ పలకరింపులతో మాట్లాడుతున్న ఇంకొందరు. సులువుగా అబద్ధాలు చెప్తున్న మరికొందరు. ఇలా వారి - వారి స్వేచ్ఛ ను వదిలి పెట్టి బ్రతుకుతున్నారు అందరూ. మర మనుషుల్లాంటి మానవులను చూస్తే జాలి, నవ్వేస్తుంది. పది నిమిషాల తరువాత. నేను ఎక్కాల్సిన బస్సు వచ్చింది. వెంటనే బస్ ఎక్కి టికెట్ తీసుకొని కిటికీ పక్క సీట్లో కూర్చున్నాను. బస్సు ముందుకు వెళ్తుంటే ఆ చల్ల గాలి, వర్షపు చినుకులు మొహానికి తాకుతుంటే బలే హాయిగా అనిపించింది. నేను దిగాల్సిన స్టాప్ రావడంతో, బస్సు దిగి ఆ వర్షం లో రూముకి పరిగెత్తాను. తాళం తీసి, లోపలికి వెళ్ళి బ్యాగు కుర్చీలో పడేశాను. బట్టలన్నీ తడిచిపోయాయి. స్నానం చేసి. కిచెన్ లోకెళ్ళి కాఫీ పెట్టుకున్నాను. కాఫీ పట్టుకుని బాల్కనీ లో చైర్ వేసుకొని కూర్చున్నాను.

ఆ వాతావరణం, చల్లటి గాలి. వర్షంలో ఆకాశాన్ని చూస్తూ కాఫీ తాగుతుంటే మనసు పులకరించిపోతుంది. అలా ఆ ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ కాఫీ తాగుతున్నాను. నేనుండే ఎదురు ఫ్లాట్ లో టెర్రస్ పై ఒక నలుగురు - ఐదుగురు చిన్న పిల్లలు – ఆ వర్షంలో ఎగురుతూ, గంతులు వేస్తూ పేపర్ బోట్లు చేసి నీళ్లలో వేస్తూ మురిసిపోతున్నారు. వాళ్ళ ఆనందం అంతా – ఇంతా కాదు. వాళ్ళని చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాను. లీలగా నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నా కళ్ళముందు మెదిలాయి. అవి నేను ఆరవ తరగతి చదువుతున్న రోజులు. పొద్దునే లేచి అమ్మ పెట్టిన రాగి జావతో కడుపు నింపుకొని బడి సంచి పట్టుకొని బడికి వెళ్ళేవాడిని. నేను పదవ తరగతి వరకు మా ఊర్లోనే ఉన్న ప్రభుత్వ పాఠశాల లో చదివాను. బళ్ళో చాలా సంతోషంగా ఉండేది. సాయంత్రం బడి అయిపోగానే నేను, రమేషూ, రాముడు. మేం ముగ్గురం కలిసి పొలం గట్ల మీద ఆడుతు పడుతూ ఇంటి దారి పట్టేవాళ్ళం. ఇంటికెళ్ళి బడి సంచి పడేసి మళ్లీ ముగ్గురం ఒకే చోట చేరేవాళ్ళం. అలా ఆ వాన లో ఎగురుతూ, ఆ బురుదలో ఆడుకునేవాళ్ళం. కాగితాలతో చేసిన పడవలను నీళ్ళ కాలువ లో వేసి తెగ మురిసిపోయేవాళ్ళం. ఆడుతూ పాడుతూ ఉంటే అసలు టైమే తెలిసేది కాదు. హద్దులు దాటి ఎవరి మాట వినకుండా మనసుకు సంతోషం కలిగేవరకు అల్లరి చేసేవాళ్ళం. చెట్లెక్కి సీతాఫలం పండ్లు, జామపండ్లు తెంపుకుని తినేవాళ్ళం. చీకటి పడగానే భయపడుతూ ఇంటికి వచ్చేవాడిని. అమ్మ నాలుగు కొట్టి, తిడుతూ ఆ మాసిపొయి బురుదతో నిండిన బట్టలు తీసి స్నానం చేయించేది. చక్కగా తల దువ్వేది. ఇలా రోజు మొత్తం దాదాపు బయటే ఉండేవాళ్ళం.

ఇక ఆదివారం వేస్తే చాలు. మాకు పండగే. పొద్దంతా ఆకలి లేదు – నీళ్ళు లేవు. ఇష్టమొచ్చినట్లు గెంతులు వేసేవాళ్ళం. ఊరు మొత్తం వాడ – వాడ కలియ తిరుగుతూ ఉండే వాళ్ళం. ఆ పొలాల మధ్య ఆడుతూ, దొరికిన పండ్లు అన్ని తింటూ, సాయంకాలం అందరం కలిసి కర్ర బిళ్ళ, నెల బండ, కోతి కొమ్మచ్చి ఆడుకునేవాళ్ళం. టైరుతో ఆ బురద దారిలో పరుగెట్టాడాలు. మా ఊరి ఏటి కాలువ లో ఈత కొట్టడం. ఇలా ఎన్నెన్నో చేశాం. మాకు ఊర్లో పొలం ఉండేది. మా నాన్న వ్యవసాయం చేసేవాడు. పొలం దగ్గరికి వెళ్ళి నాన్న కు సహాయం అని చెప్పి, నాకు వచ్చి రాని పనులు చేస్తూ ఉండేవాడిని. మొక్క జొన్న కంకులు కాల్చుకొని తింటూ కొన్ని తీసుకెళ్ళి అమ్మకి, చెల్లికి ఇచ్చేవాడిని. వేసవి లో మా అమ్మ అవకాయ పచ్చడి పెట్టేది. వేడి - వేడి అన్నం లో ఆ ఆవకాయ పచ్చడి వేసుకుని తింటుంటే "అహా....!" అనిపించేది. ఆ రుచి ఇప్పుడు ఏ రెస్టారెంట్లలో, పెద్ద పెద్ద హోటల్లో కూడా దొరకదు. మా ఊరు, పెంకుటిళ్లులు. ఇళ్ల ముందు అరటి చెట్లు, వాటికి విరగ కాసిన అరటి గెలలు. పచ్చని పొలాలు, నిండుగా పువ్వులతో చెట్ల కొమ్మలు. మా ఊరి పెద్ద చెరువు. ఎంత బావుండేవో అవన్నీ... మా తాత ఎనకటి ముచ్చట్లు చెప్పేటోడు ఎప్పుడూ. ఇవన్ని ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలు. చిన్నపుడు ఆ వర్షం లో ఆడిన ఆటలు, చెప్పుకున్న కబుర్లు... అప్పటి ఆనందం మళ్ళీ కావాలి అనుకున్నా దొరకదు. తరువాత చదువు, ఉద్యోగం అంటూ హైదరాబాద్ వచ్చి, డబ్బుల మోజులో పడిపోయి, వున్న కాస్త సంతోషాన్ని కూడా ఆ డబ్బు కట్టలలో చూసుకొని మురిసిపోతున్న నాకు... నేను పోగొట్టుకున్న నన్ను, మళ్ళీ ఆ పిల్లలో చూసుకోగలిగాను. మళ్లీ ఆ రోజులు రావు అని తెలుసు. కానీ వస్తే బావుణ్ణు! అని మనసులోనే అనుకున్నాను. వర్షం తగ్గింది. చిన్నప్పటి జ్ఞాపకాల లోంచి తేరుకుని, కుర్చీలోంచి లేచి లోపలికి నడిచాను. ఏది ఏమైనా నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ ను వదులుకోకూడదు అని ఆ క్షణమే అనుకున్నాను.

మరిన్ని కథలు

Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్
Manasika vaikalyam
మానసిక వైకల్యం
- సి.హెచ్.ప్రతాప్
Pedanaanna
పెదనాన్న
- ఏ. కృష్ణమోహన్
Mrugaraju manasu
మృగరాజు మనసు
- - బోగా పురుషోత్తం
Amma Koyila
అమ్మ కోయిల
- విజయ వాణి. జన్నాభట్ల
Kanuvippu
“కనువిప్పు”
- ప్రభావతి పూసపాటి
Aasha Peraasha
ఆశా -పేరాశా .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Bheemarao Tindi
భీమారావు తిండి
- మద్దూరి నరసింహమూర్తి