చమత్కారం - - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనాల్సొచ్చినప్పుడు , ఒకే కొట్లో కాకుండా, మరో రెండు మూడు దుకాణాల్లో కూడా చూసి, ఎక్కడ చవకగా ఉంటే అక్కడ కొనుక్కోవడం,  చూస్తూంటాము… ఉదాహరణకి ఎక్కడో దూరంగా ఉన్న చోట, ఏదో తక్కువధరకి వస్తోందని తెలిసి, అక్కడికే వెళ్ళడం. తేడా మహా అయితే, ఓ పాతిక రూపాయలుండొచ్చు… అంతదూరం వెళ్ళడానికి రానూపోనూ ఖర్చు ఎంతవుతుందో కూడా ఆలోచించం… చివరకి తెలిసిందేమిటంటే,  ఇవన్నీ కలిపితే, చివరకి తేలేదేమిటంటే, దగ్గరలో ఉన్న దుకాణంలోనే , చవక అని… అయినా సరే మనం చేసినదానినే సమర్ధించుకోవడం.సరుకుల విషయమే కాకుండా, ఇతర సందర్భాల్లో కూడా, ఓ ఇద్దరుముగ్గురిని సంప్రదించకుండా ఉండలేరు కొందరు.

ఉదాహరణకి ఇంట్లో ఉండే పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించడం లాటివి కూడా మరొకరిని సలహా అడగడం చూస్తూంటాము… అన్నిటిలోకీ ముఖ్యమైనది , ఓ డాక్టరు దగ్గరకు వెళ్ళి, , మరో ఇద్దరు డాక్టర్ల అభిప్రాయం తీసుకోవడం.. ఈ ప్రక్రియని అదేదో   Second Opinion  అంటారుట. మిగిలిన విషయాలు సరే, కానీ డాక్టర్ల విషయానికివస్తే , మనం గమనించేదేమిటంటే, ఓ డాక్టరు చెప్పినది మరో డాక్టర్ సమర్ధించకపోవడం. మళ్ళీ వేలకు వేలు ఖర్చుపెట్టి, “ రెడ్డొచ్చె మొదలు ..” అన్నట్టు, ఇంకో దస్తా మెడికల్ రిపోర్టులు తయారుచేసికోవడం… అసలు రోగం ఏదో తెలుసుకోవడానికేమో. నాకైతే ఒక విషయం అర్ధమవదు.. ఈ డాక్టర్లందరూ చదివినది ఒకే చదువు కదా, మరి ఈ తేడాలెందుకు వస్తాయో తెలియదు. ఈ మధ్యన మా స్నేహితుడొకరు ఓ పేద్ద పేరున్న లాబొరాటరీ కి రక్త పరీక్షకి వెళ్ళారు. అక్కడవాళ్ళిచ్చిన రిపోర్టు లో అదేదో రిజల్ట్ వచ్చింది.. ఈయనకేమో కంగారొచ్చింది… అయినా అధైర్యపడకుండా, మరో లాబొరేటరీ కి వెళ్ళి చేయించుకుంటే, మొదటి రిజల్ట్ కీ, ఇక్కడి రిజల్టుకీ , అస్సలు సంబంధమే లేదూ.. మొదటి  వాళ్ళది తప్పా, లేక రెండో వారిది తప్పా అన్న విషయం తెలియలేదు.. కానీ ఈ రెండింటికీ డబ్బులు మాత్రం వదిలాయి…

వంట్లో ఏదో అనారోగ్యం చేస్తే, ఎవరికి వారే ఏదో చిట్కా చెప్తారు. ఆ చెప్పినవాడి శరీర తత్వానికి సరిపోయుండొచ్చు, అందరికీ సరిపోతుందని చెప్పలేముగా… ఇంక ఆ రోగానికి, ఏమేం తినొచ్చో, ఏది తినకూడదో, ఎవరికివారు మనకి జ్ఞానబోధ చేసేస్తారు..  ఏవిషయం చెప్పినా దానికో నివారణా మార్గం కూడా బోనస్ …

అలాగే ఓ ఇల్లు కొందామనుకుని ఇతరుల సలహాలు  తీసుకోవడమంత చిరాకు ఇంకోటి లేదు. ఎవరికివారే  తాము కొనుక్కున్న సొసైటీ గురించే చెప్తారు..   ఏవిషయమైనా సరే, ఏ ఇద్దరిదీ ఏకాభిప్రాయం ఛస్తే ఉండదు. మధ్యలోనలిగిపోయేది మనమే. అలాగే డబ్బులు ఏ ఫిక్సెడ్ డిపాజిట్టో వేయాలన్నా, తమ బ్యాంకంటే తమ బ్యాంకని ఊదరగొట్టేస్తారు.. .టీవీ ల్లో వ్యాపార ప్రకటనలు , అదీ నాలుగైదు రకాల ప్రకటనలు చూపిస్తారు ఒకే విషయానికి, అది ఏదో మందవొచ్చు, ఎపార్ట్మెంటవొచ్చు, .. దేనికైనా సరే, చివరకి ఏది ఎంచుకోవాలన్నది ఎప్పుడూ గందరగోళమే.

చెప్పేవాడికి, వినేవాడు ఎప్పుడూ లోకువే..ఎవరికివారే మన శ్రేయోభిలాషిగానే ప్రవర్తిస్తూంటారు.. అలాగని ఒంటిపిల్లిరాకాశిలా ఉండడమూ కుదరదు.. తరవాత ఏదైనా జరిగితే, కనిపించిన ప్రతీవాడూ, ముక్తకంఠం తో “ అదేవిటండీ మాచెవిన ఒక్కమాట వేస్తే ఏదో ఒక సలహా ఇచ్చుండేవాళ్ళం కదా ..” అని చెప్పేవాడే.

పూర్వపు రోజుల్లో పెళ్ళిసంబంధాలకోసం ఊళ్ళో ఉండే స్నేహితులతో ఒక్కసారి ప్రస్తావించారా.. అంతే సంగతులు. నిశ్చయ తాంబూలాల వరకూ పరవాలేదు, ఆ తరవాత దురదృష్టం కొద్దీ ఏమైనా జరిగితే , ఈ సలహాలుచ్చినవాడొక్కడూ మనకి కనిపించడు.

ఈ  Second Opinion  ధర్మమా అని, ఎవరికి తోచింది వారు చెప్తే కష్టం కదూ…పోనీ అలాగని మానేస్తే కూడా కుదరదాయె… ఆతావేతా చెప్పేదేమిటంటే, ప్రతీదానికీ ఈ Second Opinion  కి వెళ్తే , జీవితం దుర్భరమైపోతుందేమో…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు