కుర్రాళ్లూ.. మీకు ఈ సంగతి తెలుసా.? - ..

Do you know this

లవర్స్‌ డే, మదర్స్‌ డే, విమెన్స్‌డే, ఫాదర్స్‌ డే అని రకరకాల స్పెషల్‌ డేస్‌ జరుపుకుంటున్నాం. 'మెన్స్‌ డే' అనేది కూడా ఉందన్న సంగతి తెలుసా.? ఇప్పటికే మెన్స్‌ డేని జరుపుకుంటున్న దేశాలు 44 ఉన్నాయి కూడా. అసలు మెన్స్‌ డే ఎందుకు జరుపుకోవాలి. ఫలానా ఆడపిల్లపై అత్యాచారం, హత్య.. అంటూ రోజూ అనేక వార్తలు వింటూ వస్తున్నాం. అంటే అత్యాచార బాధితులు కేవలం అమ్మాయిలేనా.? నో వే. అబ్బాయిలు కూడా ఉన్నారంటే నమ్ముతారా.? నమ్మి తీరాల్సిందే. తనపై పలానా 'మృగాడు' అత్యాచారం చేశాడు.. అంటూ అందరూ కాకపోయినా పది మందిలో ఐదుగురు అమ్మాయిలైనా ధైర్యంగా బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, మగాడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆ తరహా ఫిర్యాదులు మగవారి నుండి ఊహించలేము. ఆ ముసుగులో ఎందరో మగ పిల్లల బతుకులు చితికిపోతున్నాయంటూ తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

ఆకాశంలో సగం, అన్నింటా సగం అనే నినాదం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు నినదించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికే అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ఇదే అబ్బాయిల పాలిట శాపంగా మారింది. అదిగో ఆ అమ్మాయి నీకన్నా బెటర్‌.. అంటూ తల్లి తండ్రులూ, సన్నిహితులూ పోల్చి చూస్తుంటే, సదరు అబ్బాయిల్లో ఆత్మ న్యూనతా భావం ఏర్పడుతోంది. తద్వారా అబ్బాయిలు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా తిరిగే రోజులు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అన్నారు గాంధీజీ. కానీ, అర్ధరాత్రి అబ్బాయి స్వాతంత్య్రంగా తిరిగగలిగే రోజులు లేవంటే, అతిశయోక్తి కాదేమో.

అందుకే నిర్భయ చట్టం లాంటివి అమ్మాయిలకే కాదు, అబ్బాయిల కోసం కూడా పుట్టుకు రావాలి. అబ్బాయిలకు కూడా ఈ సమాజంలో భద్రత కరువైందని గుర్తించాలి. అంతేకాదు, అబ్బాయిలు తమపై జరుగుతున్న అకృత్యాల్ని సిగ్గుపడకుండా బయటికి వచ్చి చెప్పగలగాలి. ఇక్కడ దుర్మార్గమేంటంటే, అబ్బాయిలకు అమ్మాయిలే కాదు, అబ్బాయిలే శత్రువులుగా పరిణమిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. సో అబ్బాయిలూ తస్మాత్‌ జాగ్రత్త.