అఫ్సర్ కవిత్వం - సిరాశ్రీ

Afsar Kavithvam - Book Review

కవిత్వం అంటే ఇది అని ఒక్క ముక్కలో నిర్వచనం చెప్పడం కష్టం. అలా నిర్వచనం అనే చట్రంలో ఇరికిస్తే కవిత్వం కొత్త పుంతలు తొక్కదు. ఎవరు వ్రాసినా ఆ చట్రంలో ఇమిడి రాయాల్సొస్తుంది. ఛందస్సు అనే చట్రం నుంచి బయటకు వచ్చి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నదే వచనకవిత్వం. "కాదేదీ కవితకనర్హం" అని కవితావస్తువుని ఎంచుకునే విషయంలో చెప్పాడు శ్రీశ్రీ. "కాదేదీ కవితాశైలికి అనర్హం.." అని ఆధునిక వచన కవులు ఎందరో చెబుతున్నారు. కొన్ని కవితలు నేరుగా గుండెలోకి దూసుకుపోతాయి. కొన్ని మెదడుతో చెడుగుడు ఆడతాయి. కొన్ని కవి ఏదో చెప్తున్నాడు అది అందుకోవాలి అనే ప్రయత్నాన్ని చేయిస్తాయి. అయితే పాఠకుడి మానసిక స్థితి, పఠనశక్తి, కవితాసక్తి అన్నీ పరిగణనలోకి వస్తాయిక్కడ.

ఈ మధ్యన "అఫ్సర్ కవిత్వం" చదువుతున్నాను. అవును ఇంకా ప్రెసెంట్ కంటిన్యువస్సే. ఏకంగా 660 పేజీల వచన కవిత్వం...అఫ్సర్ అనే కవితాకర్షకుడు నాలుగు దశాబ్దాల పాటు పండించిన పంట. పైన చెప్పినట్టు కొన్ని దూసుకుపోతున్నాయి, కొన్ని మెదడుకి పని పెడుతూ...ఈ కవి భావనాసముద్రపు లోతుల్ని చూసేలా స్కూబా డైవింగ్ చేయిస్తున్నాయి.
పుస్తకం అందుకున్నాక నోట్లు లెక్కపెట్టే టెల్లర్ మేషీన్ లాగ పేజీలని వేగంగా తిప్పి ఒక చోట ఆపాను. నా కంట పడిన పంక్తులు:

"నా కవిత్వపాదానికి విగ్రహం లేదు
నిగ్రహం లేదు
ఆగ్రహం తప్ప...
నా కవిత్వపాదానికి మరణం లేదు
జీవితం తప్ప...
మరణం కడుపులోంచి పుట్టిన యుద్ధం నా కవిత్వం
మరణించలేకపోవడమే కవిత్వం".

సూటిగా ఉన్న ఈ పంక్తులు చైతన్యాన్ని, స్ఫూర్తిని సూచిస్తున్నాయి. మళ్లీ పేజీలు సర్రున తిప్పి ఆపాను. ఇది కనపడింది:

"అందరూ మాట్లాడుతున్నారు
అయినా అందరూ మౌనాన్ని చర్చిస్తున్నారు.
అందరూ తగవులాడుతున్నారు
అయినా అందరూ నిశ్శబ్దాన్ని స్వప్నిస్తున్నారు.
నరనరాల్లో అనుక్షిపణులు తయారవుతున్నాయి
అయినా అందరూ శాంతిని ఘోషిస్తున్నారు"

వర్తమాన చింతన, అధిక్షేపం కలగలిసిన ఈ పంక్తులు ఒక తపస్వినుంచి రాలిపడ్డట్టు అనిపించింది.
ఇక పేజీలని ఒబ్బిడిగా తిప్పుతూ, తీరుబడిగా కూర్చుని చదవడం మొదలుపెట్టాను. ఇంకా కాస్త కాస్తగా చదువుతూనే ఉన్నాను.
ఒక చోట ప్రతి మానవుడికి ఎదురయ్యే నిజమైన మరణాన్ని గురించి ప్రస్తావన ఉంది.

అఫ్సర్ మాటల్లో..

" హత్యలో
ఆత్మహత్యలో
భ్రూణహత్యలో
కాదు మరణమంటే..
వెంటవచ్చిన విశ్వాసం నిర్దాక్షణ్యంగా
హృదయాన్ని కొరికి పుండు చేసినప్పుడు,
ఒక పరిచిత హస్తం
మృత్యు ఖడగంగా రూపెత్తినప్పుడూ
నిజంగా మరణం".

ఇలా వివరణ అవసరంలేని ఎన్నో కవితాపంక్తులు మనసుకి చలనం తీసుకొస్తాయి.

అలాగే ఒకటికి పదిసార్లు చదివించి, చదివిన ప్రతిసారి ఒక్కో సన్నివేశాన్ని ఊహించుకునేలాంటివీ ఉన్నాయిందులో ...
ఇదొక్కసారి చూడండి:

"పద్యం రాద్దామనుకున్నాను
...
ఎన్నో దారుల చీకట్లని తవ్వి తలకెత్తాను
ఎన్నో పరిమళాల మట్టి వాసనల్ని
తడిమి మొలకెత్తాను..

రాని వుత్తరాల నిరీక్షణోద్వేగాన్ని
గుండె మీద భారంగా ఒంపుకున్నాను
మాట మరచిన స్నేహితుడి
నిర్లక్ష్య నేత్రాన్ని ఒక్కసారి తలచుకున్నాను
సంకేత బిందువు దాటిన
ఆమె నిగ్రహాన్ని వూహించుకున్నాను

ఇక రాయడానికి అక్షరం మిగల్లేదు".

ఇక్కడ కవి చెప్పేది విషాదమా? విరహమా? ఆ రెండూ అయితే రాయడానికి అక్షరం మిగలకపోవడం ఏమిటి? ఆ రెండూ కవిత్వంలో పండిచడం తేలికే కదా అనుకున్నాను.
మళ్లీ చదివాను..ఈ సారి కవి చెప్తున్నది నిర్లిప్తత ఏమో అనిపించింది. అవును అది అయితేనే ఏమీ రాయబుద్ధికాదు. అందుకే ఆయనకి అక్షరాలు మిగల్లేదు.
అదీ..అలా ఉంటాయి అఫ్సర్ ప్రయోగాలు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.

ధారగా పడుతున్న వర్షం శబ్దం బాగుంటుంది. మధ్య మధ్యలో ఉరుములు వినిపిస్తుంటాయి. అఫ్సర్ కవిత్వమూ అంతే...ప్రతి కవిత ధారగా కురుస్తున్న వర్షం అయితే మధ్యలో ఇలాంటి ఉరుములు...మచ్చుకి ఈ రెండూ చూడండి:

"...వెళ్తున్నా నేను
శబ్దానికి
నిశ్శబ్దానికీ మధ్య
నిట్టూర్పుని వూది".

"తరగతి గదుల గోడల మధ్య
ఇంకిపోతున్న చరిత్ర కంఠశోష".

వీటికి వివరణలు అక్కర్లేదు. ఉరుముల్లాంటి ఈ పదాలు పాఠకుల మెదళ్లలో మెరుపులు మెరిపిస్తాయి.

అయితే ఇందులో కొన్ని వచనాలు మరీ భావగర్భితంగా ఉన్నవి ఉన్నాయి. ఏదో తగిలీ తగలనట్టు ఉంటూ రెండు మూడు సార్లు చదివినా లోతు అంతుబట్టదు. ఇలాంటి వాటి మీద బహుశా డాక్టరేట్ పరిశోధనలు జరగవచ్చు. . రక్తస్పర్శ, ఇవాళ, వలస, ఊరిచివర, ఇంటివైపు అనే నాలుగు సంపుటాల్ని "అఫ్సర్ కవిత్వం- అప్పటి నుంచి ఇప్పటి దాకా" అని ఒక కవితాగ్రంథంగా వచనాకవితాభిమానుల ముందుకొచ్చింది. తోడుకునేవాళ్లకి తోడుకున్నంత అన్నంత ఊటగా ఉంది. ఈదగలిగేవాళ్లకి ఈదగలిగినంత అన్నంత విస్తారంగా ఉంది. ఎమెస్కో, అన్వీక్షికి, అమెజాన్ లు ఈ పుస్తకాన్ని పాఠకలులకి అందజేస్తున్నాయి.

ముక్తాయింపుగా ఒక మాట-
ఆయనపేరు అఫ్సర్
ఆయన కవిత్వం అత్తర్

స్వస్తి.

-సిరాశ్రీ

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు