 
                                        భీమఏకాదశి'..!
పాండవులలో ద్వితీయుడు భీముడు, అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏ మాత్రమూ ఆగలేనివాడు. బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు, ఏకాదశీ వ్రతము చేయవలయునని, కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో, బెంగతోయుండెను. అదేమిటంటే.."ఏకాదశీనాడు, భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా!" అని విచారించి, తన పురోహితునిదగ్గరకు  పోయి, ఓయీ పురోహితుడా! అన్ని దినములకంటే, ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా! దాని విశిష్టత యేమి", అని భీముడు అడిగెను.
అందుకు పాండవ పురోహితుడు, ధౌమ్యుడు, "అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను, ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును, ఏకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని, "విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి, జగధ్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ, నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు, ఉపవాసముండుట ఎటులా?, అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే, ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున, ఏకాదశి వ్రతఫలము, దక్కులాగున, నాకు సలహానీయుము", అని భీముడు పలికెను.
భీమసేనుని, పలుకులకు, ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, "రాజా! ఏకాదశి వ్రతమునకు, దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసినను, కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో, ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా, మాఘశుద్ద ఏకాదశి, మహాశ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో, మాఘ ఏకాదశిరోజు, పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది, మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు యిరువదినాలుగు ఏకాదశులలో, మాఘశుద్ద ఏకాదశి మహా పర్వదినముగాన, ఆ దినము, ఏకాదశీ వ్రతము చేసిన, గొప్ప ఫలితము కలుగును. ఇందులో మాత్రమును, సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల, ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు" అని వివరించెను.|
ధౌమ్యుని వలన, తన సంశయము తీరినట్లగుటలో, భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు, అతినిష్టతో వ్రతము చేసి, ఉపవాసముండెను. అందులకే, మాఘశుద్ధ ఏకాదశిని, "భీమ ఏకాదశి" అని కూడా అంటారు.









