ఆదర్శం (చిన్నపిల్లల కథ) - యనమండ్ర సత్య సాధన

role model

అడవికి సమీపంలో సరైన ప్రయాణ సౌకర్యాలు లేని 'రామనగరం' అనే గ్రామంలో నివసించే నరసింహమూర్తిగారు ఆ గ్రామస్థులందరికీ ఆదర్శప్రాయులు.  ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత తన స్వంత ఊరైన రామనగరంలో ఈ మధ్యనే స్థిరపడ్డారు.  ఆ ఊరిప్రజలందరికీ అతని మాటంటే చాలా గురి. 

ఆ ఊరినుంచి పట్టణానికి వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు లేకపోవడానికి ప్రధాన కారణం ఆ ఊరి పొలిమేరలో పారుతున్న సెలయేరు.  దాని మీద వంతెన లేకపోవడంతో వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, వర్షాకాలంలో మాత్రం అందరూ చాలా ఇబ్బందికి గురయ్యేవారు.  ముఖ్యంగా ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే పట్టణంలో గల ఆస్పత్రికి రోగిని తీసుకెళ్ళాలంటే చాలా కష్టపడవలసి వచ్చింది.  తెప్పల్లో ఏరు దాటాలంటే ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయం కూడా ఉంది.  అసలే రాబోయేది వర్షాకాలం.  ప్రభుత్వ అధికారులకుగాని, ప్రజాప్రతినిధులకుగానీ మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం.  ఎన్నికలముందు ఇచ్చిన శుష్కవాగ్దానాలు మాత్రమే మిగిలాయి.  ఈ విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్న నరసింహమూర్తిగారికి ఒక ఆలోచన తట్టగా ఆ రోజు ఊరివారందరినీ రామలయంలో సమావేశపరిచారు.

ఆ ఊరివాళ్ళందరూ నరసింహమూర్తిగారి మాటమీద గౌరవం ఉంచి ఆ సాయంకాలం రామాలయంలో సమావేశమయ్యారు.

వాళ్ళందర్నీ చూస్తూ, "మన ఊరి ప్రధాన సమస్య ప్రయాణ సౌకర్యం.  ఈ వేసవిలో మనకేమీ ఇబ్బందిలేదు కాని, రాబోయే వానాకాలంలో ఏరుదాటడం మనకి ఎల్లప్పుడూ ఓ ప్రధాన సమస్య అయి కూర్చుంది.  తమతమ పనుల మీద పట్టణం పోయేవాళ్ళకి, ఆస్పత్రికి వెళ్ళే రోగులకి, పై ఊళ్ళో చదివే పిల్లలకి ఇది చాలా కష్టకాలం.  ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కూడా ఎవరూ స్పందించటం లేదు.  అందుకే మనమే ఇందుకేదో మార్గం కనుగొనాలి." అన్నాడు.

"అలాగే బాబూ!...మీరేం చెప్పినా చెయ్యడానికి మేం సిద్ధం, చెప్పండి బాబు!"  అన్నాడు వృద్ధుడైన రాములయ్య గ్రామ ప్రజలందరి తరఫునా.

"చూడండి, మనమందరమూ శ్రమదానంచేసి స్వంతంగా వంతెన నిర్మించుకోవటం ఒక్కటే మార్గం.  ఒక్క శ్రమదానమొక్కటే సరిపోదు కాబట్టి మనమందరమూ తలో కొంత డబ్బులు చందా వేసి పోగుచేసుకోవాలి.  అందరూ ఒక్కతాటిమీద నిలబడితే ఎంతటి అసాధ్యమైన కార్యమైనా సుసాధ్యం కాక తప్పదుకదా!  యువకులంతా నడుం బిగించి ముందుకి రావాలి శ్రమదానానికి.  మహిళలు కూడా తమ చేతనైన సహాయం చేయాలి.  అప్పుడే మనమందరమూ ఈ కార్యం సాధించగలం."  అన్నారు నరసింహమూర్తిగారు.

అందరూ సంతోషంగా అతని మాటలకి తమ సమ్మతి తెలిపారు.  ఆ తర్వాత చకచకా పనులు జరిగిపోయాయి.  గ్రామంలోని ప్రతీఒక్కరూ ఈ పనిలో పాలుపంచుకున్నారు.  అందరి సహకారంతో వేసవికాలం పూర్తవకుండానే ఆ సెలయేటిమీద వంతెన పూర్తైంది.  గ్రామప్రజలందరి ప్రోద్బలంతో నరసింహమూర్తిగారే ఓ శుభముహూర్తాన ఆ వంతెన ప్రారంభోత్సవం చేసారు.  ఆ రోజునుండే ఆ గ్రామ ప్రజల కష్టాలు గట్టెక్కాయి.  తమందర్నీ కార్యోన్ముఖుల్ని చేసి ఈ విజయం సాధించిన నరసింహమూర్తిగారి ఆదర్శాన్ని అందరూ కొనియాడారు.  అంతేకాకుండా అతని ఆదర్శం పక్క ఊళ్ళకి కూడా పాకింది.  ఈ తరహాలోనే ఆ పక్క గ్రామాలవాళ్ళు కూడా శ్రమదానం చేసి వాళ్ళ కోరుకున్నవి సాధించగలిగారు.