నవ్వుల జల్లు - జయదేవ్

చెలికత్తె : ఈ రోజు అంట్లు తోమడానికి రానని, పనిమనిషి శెలవు చీటీ పంపించిందమ్మా!
మహారాణి : రాజుగారికి ఫిర్యాదు చెయ్... పో!
చెలికత్తె : రాజు గారు కూడా శెలవు చీటీ పెట్టి, మంత్రి గార్ని కొలువు తీరమన్నారట, మహారాణీ!!


ఊరికి కొత్త కవి : మహారాజా... ఆహా! ఏమని కొనియాడుదును... మీ రాజ్యపాలనా వైభవమును... మూడు పువ్వులు, ఆరు కాయలు, ఎచ్చట చూచిననూ... ఆహా!
మహారాజు : ఆపు! ఒరేయ్... ఈ కవిగాడ్ని సున్నం పాతరలో దించి శిక్షించండి.
భటుడు : (కవిని పట్టి ఈడ్చుకుని పోతూ, కవి చెవి వైపుకి వంగి), ఎవడయ్యా నువ్వు, రాజుగారికి, మూడు, ఆరు సంఖ్యలు అదృష్ట సంఖ్యలు కావని, నీకు తెలియదా??

హిమాలయ ఋషి : స్వామీ! నాకు మృత సంజీవని మూలిక ప్రసాదించు! నాకు మృత్యువును జయించే శక్తి కావాలి!
దేవేంద్రుడు : శుభ్రంగా నాతో రా... దేవలోకానికి తీసుకు వెళతాను! అక్కడ మృత్యువు గురించిన సమస్యే వుండదు!!
హిమాలయ ఋషి : అక్కడికొచ్చి నేనేం చెయ్యను? ఇక్కడైతే ఆ మూలికని అమ్మి సొమ్ము చేసుకోగలను!!


భటుడు : మహారాజా, తమర్ని చదరంగంలో ఓడించగల ధీరుడెవరైనా వుంటే రమ్మని, దండోరా వేయించారు! ఒకాయన వచ్చారు, పేరు విశ్వనాథన్ ఆనంద్ అట!!
మహారాజు : ఆయనకి కర్రసాము, కత్తి సాము వొచ్చా అని అడుగు!!
భటుడు : అలాంటి వేమీ ఆయనకి తెలియవనుకుంటాను ప్రభూ!!
మహారాజు : ఐతే, అవి నేర్చుకు రమ్మని చెప్పి పంపించేయ్!! (మనసులో... బ్రతికానురా భగవంతుడా!!)


మంత్రి వర్గంలో ఒకడు : రాజ్యంలో లంచగొండితనం మితిమీరిపోయింది. అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి!
చిన్న మంత్రి : ఔను రాజు గారికి అదను చూసి చెప్పాలి! ఇది పెద్దమంత్రి వల్లే సాధ్యం!!
పెద్ద మంత్రి : చెబుతాను! నా కేమిస్తారు... ఎంతిస్తారు?


చెలికత్తె - 1 : రాణిగారికి విడాకులిస్తూ, పూర్తి రాజ్యం రాసిచ్చేశారు రాజుగారు!
చెలికత్తె - 2 : ఐతే రాజుగారు, రాజ్యం విడిచే వెళ్ళిపోయారా?
చెలికత్తె - 1 : లేదు! ఇక్కడే ఒక చిన్న ఉద్యోగంలో కుదురుకున్నారు!! ఉద్యానవనంలో మొక్కలకి నీళ్ళు పోస్తున్న, కొత్త తోటమాలిని నువ్వు గమనించలేదా?


రాజ భటుడు - 1 : రాజుగారు తమ దేవేరులను భూగర్భ రహస్య మందిరాల్లో వేర్వేరు గా వుంచారు, ఒకర్నొకరు కలుసుకోడానికి వీల్లేకుండా!!
రాజ భటుడు - 2 : కలిస్తే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారని భయమా?
రాజ భటుడు - 1 : కలిసి కూడగట్టుకుని పారిపోతారని భయం!!


రాజుగారి అంతరంగ పరిచారకుడు : శత్రురాజ్య చెరసాలలో బందితుడైన మన రాజుగార్ని వెలికి తీసుకొచ్చే మార్గం ఆలోచిస్తున్నాను!
ముసిలి భటుడు : అనవసరంగా బుర్ర బద్దలు గొట్టుకోక, శత్రురాజు కొలువులో ఏదైనా ఉద్యోగంలో చేరి, స్థిరపడే మార్గం, ఆలోచించరా శొంఠి నాగన్నా!!


రాణి : అంత గట్టిగా గురక పెట్టేదెవరు నాథా!
రాజు : నా రక్షక భటుడు రాణీ! మంచం కింద నిద్రపోతున్నాడు!


రక్షక భటుడు - 1 : రాజుగారు షికారుకు ఒక పందిని వెంట తీసుకు బయల్దేరారే?
రక్షక భటుడు - 2 : లేకపోతే పాకీ పని నువ్వో నేనో చెయ్యాల్సి వస్తుంది! నోర్మూసుకుని నడువ్!!