కానుక - శింగరాజు శ్రీనివాసరావు

the gift

జమ్ము-కాశ్మీర్ సైనికదళం మీద జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహమ్మద్ భాషాకు సంతాప సూచకంగా సభను ఏర్పాటు చేశారు. పాతికసంవత్సరాల వయసు నిండకుండానే దేశం కొరకు ప్రాణాలర్పించిన అతని దేశభక్తిని వేనోళ్ళ కొనియాడారు వేదిక మీద ఉన్న మంత్రులు, అధికారులు. మరికొందరైతే ఇది పాకిస్తాన్ దుశ్చర్య యని, ప్రతీకారం తీర్చుకోవాలని అందుకు సైన్యం సంసిద్ధం కావాలని, ఆవేశంగా మాట్లాడారు. ఆ మాటలకు సభకు వచ్చిన వారి చప్పట్లతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. " అవును. ప్రతీకారం తీర్చుకోవాలి " అంటూ ఆ జనసమూహంలో నుంచి కొందరు వంతపాడారు కూడా. అందరి ఉపన్యాసాలు ముగిసిన తరువాత మహమ్మద్ భాషా తండ్రి మౌలాలిని వేదిక మీదకు ఆహ్వానించారు మంత్రివర్యులు. వేదిక పైకి మౌనంగా నడచివచ్చారు మౌలాలి. "మౌలాలి గారు మనదేశం గర్వించదగ్గ వీరుడు. తనుకూడ మిలటరిలో పనిచేస్తూ, యుద్ధంలో ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు. అయినాసరే తన కొడుకును మరల అదే మిలటరికి పంపి తాను నిజమైన దేశభక్తుడుగా నిరూపించుకున్నాడు. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ముప్పది లక్షల రూపాయలను అతనికి చెక్కు రూపంలో అందజేస్తున్నాను" అని ప్రశంసిస్తూ మౌలాలికి చెక్కును అందజేశారు మంత్రిగారు. చెక్కును చేతిలోకి తీసుకుని నమస్కరించాడు మంత్రికి మౌలాలి. " ఇప్పుడు మౌలాలి గారు తన మనసులోని మాటలను మనందరికీ తెలియజేస్తారు" అని తన సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు మంత్రిగారు. "వేదిక మీద కూర్చున్న పెద్దలకు, సభకు విచ్చేసిన సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మా నాన్నగారు చిన్నతనంలో మిలటరిలో చేరాలని చాలా ప్రయత్నం చేశారు. కాని మా తాతగారు అందుకు ఒప్పుకోలేదు. అతనిలోవున్న ఆ కోరికను నన్ను మిలటరిలో చేర్పించి తీర్చుకున్నారు మా నాన్న. నేను చేరిన పది సంవత్సరాలకు చైనా సరిహద్దులో జరిగిన దాడులలో నా చేతిని పోగొట్టుకున్నాను. అప్పుడు నాకు ప్రభుత్వం వారు అయిదు లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. కాని నిజానికి నా చేతికి అందినది మూడు లక్షలు మాత్రమే. దానికి కారణమేమిటో ఆనాటి మంత్రులకు, అధికారులకు తెలుసు. కాని నేనేది పట్టించుకోలేదు. మనలను కన్న భూమాతను రక్షించుకోవడం కోసం నాకు చేతనయినది చేశాననే తృప్తి చాలనిపించింది నాకు. తరువాత నా పెద్దకొడుకు మిలటరిలో చేరుతానని అడిగాడు. ఆరోజు నాకు చాలా సంతోషమేసింది. కాని నా పరిస్థితి చూసి ఎక్కడ నా భార్య అంగీకరించదోనని భయపడ్డాను. విచిత్రంగా తనే నాకంటే ముందుగా తన అంగీకారాన్ని తెలిపి ప్రోత్సహించింది. అప్పుడు తను అన్న మాటలు ఇప్పటికీ నా చెవులలో మారుమ్రోగిపోతున్నాయి. ' ఒక సైనికుడికి భార్యనై నేను ఎంత ఆనందపడ్డానో మీకు తెలియదు. ఇప్పుడు మరో సైనికుడికి తల్లిని అవబోతున్నానని గొప్ప ఆనందంగా ఉంది. మనం ఏ మతం వారమైనా కావచ్చు. మనం పుట్టింది భారతదేశంలో. మనలను కన్నతల్లి భరతమాత. అమ్మ ఋణం ఎవరైనా తీర్చుకోగలరు. కానీ భూమితల్లి ఋణం తీర్చుకునే భాగ్యం అందరికీ రాదు. అది మన కుటుంబానికి వచ్చింది. వద్దనకుండా బేటాను ఆర్మీలో చేర్చండి' అన్నది అంతటి నిస్వార్థ దేశభక్తురాలాని కట్టుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. నా దేశం కోసం నా బిడ్డ ప్రాణాలర్పించాడు. అందుకు నాకు బాధగా లేదు. కాని గత డెబ్భై సంవత్సరాలుగా అన్ని దేశాల రాజకీయపార్టీలు కలసి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల దాడిలో నా బిడ్డ కన్నుమూసినందుకు ఒకింత సిగ్గుగా, బాధగా వుంది. మతాన్ని ఆధారం చేసుకుని రగులుతున్న ఈ ఉగ్రవాదాన్ని, అన్ని దేశాలు ఒక్కటై, ఐకమత్యంతో కలసి దాన్ని తుదముట్టించలేరా..పగ, ప్రతీకారాలు ఏ సమస్యకూ పరిష్కారాలు కాదు. ఇన్ని సంవత్సరాలుగా సరిహద్దులలో రగులుతున్న సమస్యలకు మూలకారణాలు తెలుసుకోండి. అక్కడి ప్రజానీకానికి, పెడతోవ పడుతున్న యువతరానికి అసలేమి కావాలో చర్చల ద్వారా కనుక్కోండి. సరియైన పరిష్కారం దిశగా అడుగులు వేయండి. కత్తికి కత్తి, ప్రాణానికి ప్రాణం కాదు సమాధానం. డబ్బుకోసం రహస్యాలను చేరవేస్తున్నారని, కమీషన్ ల కోసం కాలంతీరిన యుద్ధసామగ్రిని కొనుగోలు చేస్తున్నారనే అపవాదులు రోజూ పత్రికలలో చూస్తున్నాము. అవి నిజం కాకూడదనే నా ఆశ. ఇలాటివి నిజమైతే జవాను చేసే నిజమైన త్యాగం వృథాపోతుంది. రాజకీయ వారసత్వం కోసం పోటీపడడమే తప్ప, మీ వారసుడిని ఒక్కడినైనా దేశసేవ కోసం పంపారా? ఘోరం జరిగిపోయిన తరువాత కార్చే మొసలి కన్నీరు, విదిలించే భిక్ష మాకొద్దు. మాకు కావలసినది మా దేశం క్షేమం. అందుకోసం వారసత్వంగా మా బిడ్డలను ఆ తల్లి సేవకు కానుకగా ఇస్తూనే ఉంటాం. నా మొదటిబిడ్డను పోగొట్టుకున్నా సరే, నా రెండవబిడ్డను అదే తల్లి సేవకు కానుకగా అందిస్తున్నాను. ఇది మాకు వారసత్వం కావాలి. మా కుటుంబ వారసులలో ఎవరో ఒకరు సైనికుడిగానో, సైనికురాలిగానో కొనసాగుతూనే ఉంటారు. ఇది మా నిర్ణయం. అందరిలో చైతన్యం రగిలి ఇంటికొక్క సిపాయి నెలకొన్న రోజున మన దేశానికి సుభిక్ష. మంత్రిగారు ఇచ్చిన ఈ చెక్కును వారికే తిరిగి ఇస్తున్నాను. ఈ డబ్బును మిలటరీ సంక్షేమనిధికి అందించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను" అంటూ అందరికీ నమస్కరించి చెక్కును మంత్రిగారికి అందించారు మౌలాలి. అతని మాటలలో నిజాయితీని, తమలోని స్వార్ధాన్ని బేరీజు వేసుకుని తలదించుకుని చెక్కును అందుకున్నారు మంత్రిగారు.