నేనుతప్పు చేశాను - బొందల నాగేశ్వరరావు

I made a mistake

నేను తప్పు చేశాను -బొందల నాగేశ్వరరావు అలవాటు ప్రకారం ఉదయం ఆరుగంటలకల్లా ఇంటికి దగ్గరలో వున్న పార్కులో వాక్ చేయటానికి నేను, నా స్నేహితుడితో వెళ్ళాను. ముందే చాల మంది నడుస్తున్నారు.మేము వాళ్ళతో కలిసిపోయాము. దాదాపు నలభై నిముషాలు నడిచిన తరువాత ఇద్దరం పార్కులో వున్న బల్లమీద కూర్చొన్నాము. కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాక బయటికి వచ్చాము. అలవాటు ప్రకారం లెమన్ 'టీ' తాగటానికి పార్కు దాపులో వున్న టీ స్టాల్ వద్దకు వెళ్ళాము.టీ తాగి కదలబోతుండగా ప్రతి రోజులా ఆ రోజు కూడా అక్కడే ప్లాట్ ఫాం మ్మీద కాపురముంటున్న అతను నా వేపు చూసి తనకో 'టీ' చెప్పమని సైగ చేశాడు.అతను పరమ సోమరి.ఈ మధ్యే రెండు నెలల క్రితం అక్కడికొచ్చి ప్లాట్ ఫాం మ్మీద నివాసం ఏర్పరచుకున్నాడు.అతనంటే నాకు కోపం.చూడ్డానికి జుగుప్సు కలిగించే విధంగా వుంటాడు. అతను పరమ సోమరన్న భావం నాలో బాగా నాటుకు పోయింది కనుక కుదరదని వెంటనే చెప్పి అవతలికి నడిచాను.నేను తెలుసుకున్న అతని దినచర్య ఏమిటంటే తను కష్టపడకుండా సులువుగా ఆ ప్లాట్ ఫాంమ్మీద కూర్చొని ఎవరి చేతనైనా టీ ఇప్పించుకు తాగుతాడట. తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంకెవరినైనా టిఫన్ పెట్టించమని ఫోర్సు చేసి టిఫన్ తింటాడట.నోరు విప్పడట. అన్నిటినీ సైగలతోనే సాధించుకొంటాడు. తరువాత కాస్సేపు దారిన పోయే వాళ్ళను చూస్తూ తలను గోక్కొంటూ దిక్కు తోచని స్ఠితిలో అలాగే దుప్పటిని కప్పుకొని నిద్రపోతాడట. ఎండ నడి నెత్తికి వచ్చే సరికి పాతిక మీటర్లకు ఆవల వున్న చెట్టు క్రిందకు చేరుకొని తన బట్టలున్న మూటను తల క్రింద పెట్టుకొని పాలకడలిలోని మహా విష్టువులా పోజిచ్చి హాయిగా పడుకుంటాయట.మరి మధ్యాహ్నాం,రాత్రి భోజనాలకు ఏం చేస్తాడో?మొత్తంలో అతని గూర్చి ఆ వివరాలు తెలుసుకున్నాక అతనిపై నాలో హేహ్య భావం మరీ ఎక్కువైయ్యింది.అందుకే సమయం చూసుకొని అతనికో పాఠం నేర్పాలను కొన్నాను. మరుసటి రోజు.....వాకింగ్ ముగిసిన తరువాత బయటికొచ్చి స్నేహితుడితో కలసి లెమన్ టీ తాగుతుంటే తనకో టీ చెప్పమని కూర్చున్న చోటనుంచే సైగ చేశాడతను.కుదరదని వెళ్ళిపోతుంటే నా వేపు కోపంగా చూశాడట. నా స్నేహితుడు నాతో చెప్పాడు.అప్పుడే వెనుదిరిగి వెళ్ళి చెడామడా నాలుగు తిట్లు తిట్టి అతన్ని తన సోమరితనం నుంచి బయట పడేలా చేయాలను కున్నాను.కాని ఆఫీసుకు వెళ్ళాల్సి వుండి,సమయం లేని కారణంతో ఖచ్చితంగా మరుసటి రోజొచ్చి అతని అంతు తేల్చాలనుకొంటూ త్వరత్వరగా ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజు వాకింగ్ ముగించుకొన్న నేనూ,నా స్నేహితుడు టీ కొట్టు వద్దకొచ్చాము. టీ చెప్పి కాకతాళీయంగా అటు తిరిగి చూశాము.ప్లాట్ ఫాం మ్మీద వున్నతను చిన్నపాటి నవ్వుతో షరా మామూలేనన్న చందాన తనకో టీ చెప్పమని సైగ చేశాడు.అడిగిన అతని తీరు నాకు వ్యంగ్యంగా తోచింది.కోపం నసాళాని కెక్కింది.ఇటు తిరిగి టీ తాగుతూ అతణ్ణి అస్సలు పట్టించుకోలేదు. అప్పుడు వున్నట్టుండి ఒకతను మా వద్దకొచ్చి నా భుజం తట్టాడు. ఏమిటీ అన్నట్టు చూశాను.అందుకతను 'అదిగో ఆ ప్లాట్ ఫాంమ్మీద వున్నతను మిమ్మల్నితనకో టీ చెప్పమన్నాడు' అంటూ వెళ్ళిపోయాడు. నాకు కోపం శ్రుతి మించింది. వెళ్ళి నాలుగు మాటల్ను అడ్డదుడ్డంగా అడిగేయాలని అటు తిరిగాను.అది గ్రహించిన నా స్నేహితుడు"ఆగరా! అతనికి టీ ఇప్పించగలిగితే ఇప్పించు లేక పోతే వూరుకో తప్ప కోప్పడతావెందుకూ? నేను కూల్గా లేనూ? పద...ఇంటికెళదాం"అన్నాడు.వాడే డబ్బులిచ్చి నన్ను ఇంటి వేపుకు నడిపిస్తున్నాడు.స్నేహితుడితో పదడుగులు నడిచిన నేను టక్కున ఆగి"లేదురా!అతణ్ణి నాలుగు మాటలడిగి ఇంకెప్పటికీ మన వేపు కళ్ళెత్తి చూడకుండా చేస్తాను పద" అంటూ స్నేహితుని తీసుకొని వెనుదిరిగి అతని వద్దకు వెళ్ళాను. అతను దైన్యం నిండుకున్న కళ్ళతో మమ్మల్ని చూశాడు. "ఏమిటి... టీ తీసిమ్మని మాకు ఆర్డరు వేస్తున్నావా!కాళ్ళుచేతులు బాగానే వున్నాయిగా! కష్టపడి సంపాదించుకు తింటూ బ్రతగ్గూడదూ?ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకోబోయే వరకూ భిక్షాటనేనా?అలా అడుక్కు తినటం సిగ్గుగా లేదూ?రేపటినుంచి నన్ను టీ తీసిమ్మన్నావంటే... కాదు కనీసం మా వేపు చూసినా సరే... వూరుకోను.న్యూసెన్సు కేసులో నిన్ను పోలీసుకు పట్టిస్తాను తెలుసా.అసలు గాడెద్దులా వున్నావ్ !ఏదేని పని చేసుకొని సంపా యించుకు తినటానికి ప్రయత్నించవయ్యా..."అని నేను అంటుంటే అతనేమి మాట్లాడలేదు. కాని అతని రెండు కళ్ళనుంచి కన్నీళ్ళు మాత్రం కారిపోతున్నై. "ఒరేయ్ ! నీ కోపంతో కూడికొన్న హితబోధనాపి పదరా"అంటూ నా చెయ్య పట్టుకులాగాడు నా స్నేహితుడు. నేనూ అతణ్ణి అడగాల్సిన నాలుగు మాటల్ను అడిగినందుకు తృప్తి పడుతూ, మరో వేపు అసహ్యించుకొంటూ అక్కడినుంచి నడుస్తుండగా ఓ కుర్రాడు నా కళ్ళముందే ఓ పొట్లం, నీళ్ళ బాటిల్ తెచ్చి అతని ముందుంచాడు.బహుశా అతనికది ఉదయం టిఫనేమో! ఇలాగే మధ్యహ్నాం,రాత్రి ఎవరైనా భోజనం కూడా తెచ్చి పెడతారేమోననుకొంటూ నడుస్తున్నాను. అంతలో నా స్నేహితుడు. "అవునూ!నువ్వు రేపేగా నార్త్ ఇండియా టూర్ వెళ్ళేది?"అడిగాడు నా కోపాన్ని కాస్త దారి మళ్ళిస్తూ. "అవున్రా!ఓ ఇరవై రోజులు నీకు కనబడను.వచ్చిన తరువాత మళ్ళీ వాకింగ్ లో కలుద్దాం. వెళ్ళు" అంటూ ఇద్దరం ప్రతిరోజూ కలుసుకునే కూడలి వద్ద విడిపోయాం. ©©©©©© ©©©©©© ©©©©©© ఉత్తర భారతదేశ యాత్రను ముగించుకొని కుటుంబ సమేతంగా ఇంటికి చేరు కున్నాను. యాత్రను ముగించుకొని ఇంటికి వచ్చానని ,రేపటి నుంచే మార్నింగ్ వాక్కు వస్తున్నానని, మామూలుగా మేము కలుసుకునే కూడలిలో నాకోసం వుండమని స్నేహితుడికి ఫోన్లో చెప్పాను. మరుసటి రోజు ఇద్దరం కూడలిలో కలుసుకున్నాం.పార్కుకు వెళ్ళి నడుస్తున్నాం. నడుస్తున్నంతసేపు నా స్నేహితుడు నాతో ఏమీ మాట్లాడలేదు.మౌనంగా వున్నాడు.నేనే యాత్రలో జరిగిన కొన్ని సంఘటనలు వాడికి చెప్పుకున్నాను.నలభై నిముషాలు నడిచిన తరువాత ఇద్దరం బయటికి వచ్చాము. తిన్నగా లెమన్ టీ తాగటానికి టీ కొట్టు వద్దకు వెళ్ళాము.టీ తాగుతున్న నాకు ఆ సోమరి గుర్తుకు రాగా అతణ్ణి చూడాలనిపించి గ్లాసును ప్రక్కన పెట్టి అటు ప్లాట్ ఫాం వేపుకు చూశాను. అక్కడ అతను,అతనికి సంబంధించిన బట్టల సంచి లేదు.వెంటనే నాకు అతను ఎటో వెళ్ళి పోయి వుంటాడన్న భావన కలిగింది .ఆ విషయం ఋజువు చేసుకునే నిమిత్తం స్నేహితుడితో "ఏరా!మన ప్లాట్ ఫాం పార్టీ కనబడలేదే! నాడు నేనన్న మాటలకు నొచ్చుకొని, బాధతో ఎటో వెళ్ళిపోయి నట్టున్నాడే!"అన్నాను. నా స్నేహితుడి ముఖకవలికలు మారిపోయాయి. వాడు మౌనంగా వున్నాడు. "ఏంట్రా!మౌనంగా వున్నావ్ .చెప్పవేం?" అడిగాన్నేను. అప్పుడు వాడు"నువ్వనుకొన్నట్టు అతను ఎటో వెళ్ళిపోలేదు!గత ఆదివారం నాడు చని పోయాడు" అన్నాడు ఒక్కసారిగా బాధను వ్యక్తం చేస్తూ. "చనిపోయాడా!?" షాక్కు గురైయ్యాను నేను. "అవున్రా!ఈ చుట్టూ వున్న కొట్ల యజమానులు విషయాన్ని పోలీసులకు తెలియజేసి అతణ్ణి అనాధ శవంగా ధృవీకరించి అందరూ కలసి చందాలు వేసుకొని దహన క్రియలను జరిపించారు. అందులో నేనూ పాలు పంచు కున్నాను."అన్నాడు నా స్నేహితుడు. నాకేమీ అర్థం కాలేదు. ఆరోగ్యంగానే కనబడ్డ అతను చనిపోయా డంటే నేను నమ్మలేక పోయాను. "అతనికి ఏమైందిరా... బాగానే వున్నాడుగా!"అన్నాను. "నిజమే!అందరికి అతను అలాగే కనబడ్డాడు.కాని అతని గూర్చి అసలు విషయం తెలుసు కుంటే...ఆ కథను పూర్తిగా వింటే నువ్వు కూడా బాధకు లోనౌక తప్పదురా!" "అసలు విషయమేమిటో చెప్పరా"మళ్ళీ అడిగాను. "విను.నువ్వు మొదటి నుంచి అతడికి సోమరి అన్న ముద్రవేసి కోపంతో, హేహ్య భావంతో చూస్తూ వచ్చావు.అసలు అతనెవరు?ఎక్కడ్నుంచి వచ్చాడు?ఎందుకిక్కడే సెటిలైపోయాడన్న సంగతి తెలుసుకోవటానికి అస్సలు ప్రయత్నించలేదు గా!?"అని నా కళ్ళలోకి చూశాడు.నేను మౌనంగా వుండిపోయాను.వాడు చెప్పను ప్రారంభించాడు. "అతనో అనాధ.నార్తు ఇండియన్.మూగవాడు.అందుకే ఏ విషయాన్ని తెలియ చేయాలన్నా సైగలతోనే!కిడ్ని,లివర్ సంబంధిత వ్యాధులను మోసుకొంటూ అలా అలా గాలి వాటాన రెండు నెల్ల క్రితం మన రాష్ట్రంలో కాలు మోపాడు.మన ప్రజలు చాలా మంచి వారని, దయార్థ హృదయులని,ఆకలంటే అన్నం పెట్టేవారని తెలుసుకున్నాడేమో అన్ని మతాలు సమ్మతమేనన్న చందాన అటు మసీదు,ఇటు చర్చి,ఎదరే రామాలయమని మూడు మతాలకు సంబంధించిన గుడులుండి అన్ని రకాల జనాలను కలుపుతూ వెళ్ళే ఈ కూడలే తనకు అనువైన చోటని ఎంచుకొని ఇక్కడ సెటిలై పోయాడు.పాపం!గత ఆదివారం నాడు తనువు చాలించాడు" అని చెప్పి ముగించాడు నా స్నేహితుడు తన కనుకొలకల్లోని కన్నీటిని తుడుచుకొంటూ. అంతే! నా కళ్ళలోనూ కన్నీళ్ళు తిరిగాయి.ఏదో తప్పు చేసినవాడిలా ఫీలయ్యాను. అవును. నేను తప్పు చేశాను.అతన్ని గూర్చి ఎలాంటి వివరాలు తెలుసుకోకుండ ఎద్దని, సోమరని, భిక్షాటనతో బ్రతకటం నేరమని మొదటినుంచే అతనిపై ఏహ్య భావంతో,కోపంతో దూరంగా వుంచాను. కాని ఇక్కడున్న పదిమంది కొట్ల వాళ్ళు మాత్రం ముందే అతణ్ణి గూర్చి వివరాలు తెలుసుకొని దగ్గరకు చేర్చుకొని పాప భీతితో పోషిస్తూ వస్తున్నారని తెలుసుకోలేక పోయాను. చనిపోతే అంత్యక్రియలు సైతం ఇక్కడివాళ్ళే చేసి పుణ్యం కట్టుకున్నారు.కాని నేను అతని మీద సవాలక్ష సందేహలతో,నాలోని అర్థం కాని అవసర బుధ్ధితో దూరంగా వుండిపోయాను. అందరితో కలసి పయనించలేని అసమర్థతతో కూడికొన్న అవగాహన రాహిత్యమే నన్ను అతనికి దూరం చేసింది"అని కంటతడితో అనుకొంటుండగా అది గ్రహించిన నా స్నేహితుడు "ఏమిట్రా....ఆ కన్నీలేమిటి?అయినా ఇందులో నీ తప్పేముంది? సహజంగా ఇలాంటి వాళ్ళను చూస్తే కొందరు నీలాగే అనుకొంటూ దూరంగా తొలిగి పోతారు.ఆ పనే నువ్వూ చేశావు. పోనీ... ఇకనైనా అందరిని ఒకే గాటిన కట్టేయక పాసిటీవ్ దృక్ఫధంతో మనిషికి దగ్గరై వాడిలోని మంచి చెడులను చదువు.పరిస్థితులను అవగాహనతో అర్ధంచేసుకో! జాలి,దయలన్న వాటిని మనసులో వుంచుకొని ముందుకు సాగు.పద"అంటూ నా వీపును తన చేత్తో తడుతూ ముందుకు నడిపించాడు. 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు