కెప్టెన్ - ఆకెపతి కృఇష్ణమోహన్

captain

 

అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలునేను బస్టాండ్ సెంటర్ లో రిక్షా ఎక్కి సంధులు, గొందులు లోంచి రైల్వే స్టేషన్ కి చేరుకునేటప్పటికి బొంబాయి మెయిల్ కోసం గంట కొట్టడం వినిపించింది. గంట కొట్టినాబండి రావడానికి ఇరవై నిముషాలు పైన పడుతుందని చెప్పారు. బెంచీ మీద కూర్చోని స్టేషను చూస్తూ ఉన్నాను. మిట్ట మధ్యాహ్నం ఎండ దెబ్బకి స్టేషన్లో పెద్దగా జనసంచారం లేదు . రెండు కుక్కలు బెంచీ మీద జేరి పడుకొని ఉన్నాయి .ఈ టైంలో వచ్చే పోయే బండ్లు లేవేమో, ప్రయాణికులు కూడా పెద్దగా లేరు. ఈ ఊరి నుంచి బొంబాయికి పొయ్యే వాళ్ళెవ్వరు ఉంటారు? నాకు తప్పదు కదా, మిలటరీ వారెంట్ మీద నా కోసమే ఆ రోజు అక్కడ ఆపుతున్నారు.  స్టేషను బయట నల్లటి రైల్వే నీళ్ల టాంకు లోంచి నీళ్ళు పట్టుకునేదానికి యిద్దరు పిల్లోళ్ళు తిరుగుతూ  ఉన్నారు. ఈ బండికి నన్ను ఎక్కించి ఇంటికి పొయ్యి తినేసి వద్దామని స్టేషను మాస్టారు ఎదురు చూస్తూ  ఉన్నాడు.

       

ఇంటి దగ్గర వీడ్కోలు చెప్పేటప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళందరూ బయటికి రావడం గుర్తుకొచ్చింది. అమ్మ ఏడుపు ఆపుకోలేక పోయింది. నాయన మాత్రం ఏం మాట్లాడలేదు. చేరిన తరువాత ఉత్తరం రాయడం మర్చిపోవద్దని మాత్రం చెప్పాడు. అక్క వీధిలోకి రావడానికి సిగ్గుపడుతున్నట్లు తలుపు వెనకాలనుంచి చూస్తూ నిలబడింది. తమ్ముడు మాత్రం బస్సెక్కించేదానికి సూట్ కేసు మోసుకుంటూ నా వెనకాలే వచ్చాడు. ఒకరిద్దరు నా ఈడువాళ్ళు మళ్ళీ ఆర్మీ సెలెక్షన్స్ జరిగినప్పుడు మాకు చెప్పన్నా అని అడ్రస్సు రాసిచ్చారు.

 

రెండో లైన్లో గూడ్స్ ఇంజను షంటింగ్ జరిగిందన్నట్లు వెనక్కి ముందుకి రైలు పెద్ద శబ్దంతో కదిలింది. సెలవుల మీద ఊరికొస్తే యుద్ధం మొదలయ్యే సూచనలున్నాయని వెంటనేవచ్చెయ్యమని కల్నల్ నుంచి టెలిగ్రాం రావడంతో బయల్దేరాల్సి వచ్చింది. స్టేషన్ అసిస్టెంట్ వచ్చి నిమ్మకాయ షోడా తెచ్చినాడు. మెయిల్ వచ్చేస్తోందని చెప్పి ఫ్లాట్ ఫారం పైన నిలబడ్డాడు. నా కోసమే ప్రత్యేకమైనస్టాప్ కాబట్టి సామాను తీసుకొని సిద్దంగా నిలబడ్డాను.

 

డీజిలు ఇంజను లాక్కుంటూ వచ్చిబొంబాయి మెయిల్ ని ఆపింది. మొదటి తరగతి పెట్టెలోకి ఎక్కి సామాను అందుకున్నాను. స్టేషన్ మాస్టారుకి, అసిస్టెంట్ కివీడ్కోలు చెప్పి పోయి నాసీట్లో కూర్చున్నాను. రైలు వేగం అందుకుని ఊరు దాటేసింది. రైలు కిటికీ లోంచి వేడి గాలి దూసుకొస్తోంది. ఇల్లు, ఊరు వదిలిపోతున్నందుకు ఏదో భాధ. రైలు వేగానికి తాటిచెట్ల తోపులు వెనక్కెనక్కి దాటుకుని పోతున్నాయి. రాత్రి భోజనానికి అమ్మ కట్టిచ్చిన అన్నం పాకెట్టు ప్రక్కన పెట్టి కిటికీ మీదకి ఆనుకుని పడుకున్నాను. కెప్టెన్,కెప్టెన్, అని ఊళ్ళో వాళ్ళు పిలుస్తుంటే ఒక ఆనందం ఇంకో పక్క ఊరి వదలి దూరం పోతున్నందుకు భాధ. ఈ రెండు భావాల మధ్య ఊరికొచ్చిన ప్రతీసారి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. కాలేజీ రోజుల్లో ఎప్పుడూ మిలిటరీలో చేరాలని అనుకోలేదు. అమ్మ వాళ్ళకి మిలిట్రీఅంటేనే భయం. ఆ ఉద్యోగాలు వద్దు లేయ్యా, ఊళ్లోనేఏ గుమస్తానో, టీచరుఉద్యోగమో చూసుకుందాం లేయ్యా అనేది. నాయన కూడా మిలిట్రీ గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఇంజనీరు గాని, డాక్టరుగాని చదివి పెద్ద ఉద్యోగం చేయాలనీ ఆయన ఆశ.

 

        మిలిట్రీ వాడికి పిల్ల నియ్యరని ఇంట్లో ఇంకో భయం. అసలు నేనెందుకు మిలిట్రీకి పోవాల్సి వచ్చిందంటే బలరామ్ గురించి చెప్పాల్సిందే.

 

కెప్టెన్ బలరామ్ పొడవైన విగ్రహం, దేహ ధారుడ్యం, చురుకైన మేధస్సు, ధైర్యం అన్నీ కలిసిన వ్యక్తిత్వంబలరాంది.

 

కాలేజీ రోజుల్లో బలరామ్ గురించి అందరూ గొప్పగా అనుకునేవాళ్లు. బాగా చదువుతాడని, బాగా తెలివిగల వాడని, మనసు పెట్టి చదివితే IAS ఆఫీసర్   అవుతాడని అనుకొనేవాళ్ళు. కాని బలరామ్ ఆలోచనలు వేరేగా ఉండేవి. యూనిఫారం ధరించి దేశానికి సేవ చేయాలనీ అనుకునేవాడు. ముఖ్యంగా గగన తలంలో విన్యాసాలు చేసే వాయుసేన అంటే అతడికి చాలా యిష్టంగా ఉండేది.

 

కాలేజీ చదువు పూర్తయిన తరువాత రెండు సంవత్సరాలు ఎవరికీ అతని ఆచూకీ తెలియలేదు. ఒకరోజు మా స్నేహితుడు భాషాకు ఒక ఉత్తరం వచ్చింది, అందులో “నేను ట్రైనింగ్ పూర్తి చేసికొని ఎల్లుండి బొంబాయికి వెళుతున్నాను. మిమ్మల్నందరిని చూడాలని ఉంది. మధ్యాహ్నం మెయిల్ లో వస్తున్నాను. నువ్వు, వెంకటేశ్వర్లు, సుబ్బరాం అందరూ స్టేషన్ కి రాగలరు” ఇట్లు బలరామ్ .

 

భాషా ద్వారా తెలిసికొని నేనూ, వెంకటేశ్వర్లు మా మిత్ర బృందం అంతా రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము. ఒకరిద్దరు దండలు పట్టుకొచ్చారు. అందరూ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు.బలరామ్ కిబంధువులు పెద్దగా లేరు. తోబుట్టువులు కూడా లేరు. అమ్మ మాత్రం ఊళ్ళో ఉండి పాడి వ్యాపారంతో కుటుంబం లాక్కొస్తూ ఉండేది.

 

బొంబాయి మెయిల్ రాగానే అందరం గబగబా బోగి లోకి ఎక్కాము. ఎదురుగా నిండైన Air force  యూనిఫారంలో కెప్టెన్ బలరామ్.  “మామ ఉండు ఉండు” అని గట్టిగా ఊపుతూ, టోపి తీసేసి ఆలింగనం చేసుకున్నాడు. హుందాగా నవ్వుతు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించాడు. బోగిలో వాళ్ళు, బయటి జనం అందరూ మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెంట తీసుకొచ్చిన పండ్లు ఇచ్చేసి ఆటోగ్రాఫ్, అడ్రస్ తీసుకున్నాము. బండి బయల్దేరే సమయం అవుతున్నట్టు గార్డ్ పచ్చ జెండా ఊపాడు. మేము త్వరగా బోగి దిగి ప్లాట్ ఫారం నుంచి చేతులు ఊపాము. బలరామ్ మా అందరితో గేటు నుంచి మాట్లాడుతూ నిలబడ్డాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అని అడిగాము. ”When Duty permits” బలరామ్ మాతో అన్న చివరి మాటలు, వేగం పుంజుకుని రైలు కనుచూపు దాటి పోయింది. బలరామ్ రూపం అదృశ్య మయ్యింది.

 

రోజులు గడిచిపోయాయి. మూడు సంవత్సరాలలో మేము కాలేజీ చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చాము. బలరామ్ గురించి ఏమీతెలియలేదు. సరిహద్దుల్లో వైమానిక దళంలో పోస్టింగ్ పడిందని మాత్రం తెలిసింది. అదే సమయంలో భారత్ సరిహద్దుల్లో యుద్ద ప్రకంపనలు మొదలయ్యాయి. మేమందరం రోజూ పేపర్ల ద్వారా, రేడియో ద్వారా తెలుసుకొని యుద్ధం గురించి చర్చించుకునే వాళ్ళం. మా కందరికీ బలరామ్గురించి ఆందోళనగా ఉండేది.

 

ఒకరోజు పిడుగు లాంటి వార్త “సరిహద్దుల్లో జరిగిన భీకర వైమానిక యుద్దంలో భారత వాయుసేన బృందంలోని నలుగురు మృతి చెందినట్లు ‘సైన్యం ధృవీకరించింది. అందులో వీర మరణం పొందిన కెప్టెన్ బలరామ్ కూడా ఒకడు. మిగతా ముగ్గురి మృత దేహాలు దొరికినట్లు, కాని కెప్టెన్ బలరామ్ విమాన శకలాలు ఇతర దేశం భూభాగంలోపడిపోవడం వల్లఅతని మృతదేహం లభ్యం కాలేదని టెలిగ్రాం పంపించారు.స్థానికంగా అధికారులు, నాయకులు అందరూ బలరామ్ వాళ్ళ అమ్మను పరామర్శించారు. చిరునవ్వుతో వీర మరణాన్ని పొందిన కెప్టెన్బలరామ్ రూపం నాలో చెరగని ముద్ర వేసింది.

 

ఎలాగైనా నేను కూడా కష్టపడి  Armed Forces లో ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాను. ఆలోచనల్లోంచి బైట పడేటప్పటికి చీకటి పడుతూ ఉంది. రైలు అద్దాల్లోంచి చలిగాలి లోపలికి చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తూ ఉంది. రైలు ఉత్తర భారత దేశంలోకి అడుగు పెడుతోంది అనేందుకు సూచనగా చలి తీవ్రత ఎక్కువయ్యింది. రాత్రి అయ్యింది.  ఇంటి నుంచి   తెచ్చుకున్న భోజనం తిని బెర్త్ పైకి ఎక్కి పడుకున్నాను. దారిలోని స్టేషన్లలో రైలు ఆగుతూ బయలు దేరుతూ ఉంది. నా ఆలోచనలంతా యుద్ధం గురించి, ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. ప్రత్యక్ష యుద్దంలో మా బృందం అంతా  పాల్గొంటున్నట్లు, యింకా అలాంటి ఆలోచనల మధ్య  ఎప్పుడో నిద్ర పట్టేసింది.

 

తెల్లవారేటప్పటికి రాత్రి రైలు ప్రయాణం ఆలస్యమయ్యిందని, గమ్యం చేరడానికి ఇంకా 6 గంటలు ప్రయాణం చేయాల్సి ఉందని తెలిసింది.

 

బలరామ్ మరణం తర్వాత వాళ్ళ అమ్మ ఎక్కువ రోజులు బ్రతకలేదు. సంవత్సరం లోపలే ఆమె చనిపోయింది. ఒక్కడే కొడుకు. కాయ కష్టం చేసి చదివించింది. వృద్ధిలోకి వచ్చి తనను ఆదుకుంటాడని అనుకున్నా, బలరామ్ వాయుసేనలో చేరాడని విన్న ఆ తల్లి భాధ పడలేదు. ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూసింది.

 

పలకరించినప్పుడు “అయ్యా? యుద్ధం ఏమి లేదు కదా! బలరామ్ ఎప్పుడొస్తాడో అని అడిగేది. బలరామ్ అక్కడి నుంచి అమ్మకు డబ్బులు పంపేవాడు. ఆ డబ్బు కొడుకు వచ్చాక ఉండడానికి పాక కాకుండా యిల్లు కట్టుకోవాలని దాచి పెట్టేది. బలరామ్ మరణ వార్త ఆమెను పూర్తిగా క్రుంగదీసింది. ఇంట్లోనే ఉండి పోయింది. ఎప్పు డైనా యింటికి వెళితే“అయ్యా, అబ్బాయి వస్తాడు – ఎక్కడో ఉండే ఉంటాడు, నాకు నమ్మకం ఉంది. దేముడు - నా కెందుకు యింతశిక్ష వేశాడో – నేనేం పాపం చేశాను. అయ్యాపై వాళ్ళకి రాయండయ్యా “ ఇలా బాధపడేది.

 

బలరామ్ అమ్మ కోసం నేనే ఒకసారి రాసాను. “A.బలరామ్, కెప్టెన్ IAF యుద్ధం ముగిసిన తర్వాత ఏమైనా ఆచూకీ తెలిసిందా అని ఎప్పటిలాగే” కెప్టెన్ బలరామ్ మరణించినట్లుగానే భావిస్తున్నాము. ఆయన మృతదేహం లభ్యం కాలేదు. తదుపరి సమాచారం ఏమైనా తెలిస్తే తెలియజేయగలము. 

 

        కెప్టెన్ బలరామ్ మరణం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆ దిగులు తోనే బలరామ్ వాళ్ళ అమ్మ కన్ను మూసింది. ఆమె చనిపోయే ముందు ఒక రోజు వాళ్ళింటికి వెళ్ళాను. “బాబు అందరూ అబ్బాయి చచ్చిపోయాడని అంటున్నారు. నాకు మాత్రం వాడు ఎక్కడో బ్రతికే ఉన్నాడని నమ్మకంగా ఉంది. నేను చచ్చిపోయిన తరువాత మీ అమ్మ నువ్వు వస్తావని, ఇల్లు కడతావని డబ్బు దాచి పెట్టిందని చెప్పు నాయన. నా పెట్టెలో దాచి పెట్టిన డబ్బు, లక్ష రూపాయల పైనే ఉంటుంది. దానిని నీ దగ్గర ఉంచుకొని వాడికి చేర్చు. ఇది నేను నీకు ఇచ్చే బాధ్యతగా అనుకో” అన్నది.

 

బలరామ్ గురించి నేను తెలుసుకోవడానికి నాకు అవసరం ఏర్పడింది. నేను ఆర్మీలో చేరిన కొద్ది రోజుల తర్వాత ఈశాన్య ప్రాంతంలో విధులు నిర్వహించడానికి నన్ను ఎంపిక చేసారు.

 

బలరామ్ చివరిగా పనిచేసిన పటాలం కనుక్కొనిబయలుదేరాను. అక్కడి కమాండర్ ని కలిశాను. “కెప్టెన్ బలరామ్ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కదా అప్పటి వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. నేను కూడా పోయినసంవత్సరం ఈ రెజిమెంట్ లోకి వచ్చాను అని ఆయన అన్నాడు”. వాళ్ళ తల్లి గారు నాకు అప్పజెప్పిన ముఖ్యమైన కార్యం మీద వచ్చాను. ఆయన బ్రతికే ఉన్నారా లేకచనిపోయారా అనేది ఖచ్చితంగా తెలియాలి”.

 

“ఇక్కడి రికార్డుల ప్రకారం ఆ సంవత్సరం అక్టోబర్ 29 వ తేది 4 విమానాలు శత్రుదేశ సరిహద్దులోకి వెళ్ళాయి. అటు ప్రక్కనుంచి చేసిన శత్రువులకాల్పుల్లో 4 విమానాలు ధ్వంసమయ్యాయి. విమాన శకలాలన్ని మన భూభాగంలో పడ్డాయి. ముగ్గురు పైలెట్ల మృత దేహాలు మేము స్వాధీనం చేసుకున్నాము. కెప్టెన్ బలరామ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. యుద్ధం తర్వాత సరిహద్దు దేశాలనుకూడా అడిగినట్లు రికార్డుల్లో ఉత్తరాలు ఉన్నాయి. కానీ ఎటువంటి సమాచారం రాలేదు.

 

ఆ రాత్రికి రెజిమెంట్ లో ఉంటానని చెప్పి బలరామ్ ను ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మెస్ లో అడిగాడు. కాంటీన్ కి వస్తువులు తెచ్చే గుర్మిత్ సింగ్ గురించి తెలిసింది. మరుసటి రోజు ఉదయం గుర్మిత్ సింగ్ ని కలిసి బలరామ్ గురించి అడిగాను.

 

“అచ్ఛా బలరామ్ సాబ్, బహుత్ బడా ఆద్మీ, దేశ్ ప్రేమీ. ఆ సంవత్సరం అక్టోబర్ లో యుద్ధం తరువాత అక్కడ ఎవ్వరూ కనపడ లేదు సాబ్. బలరామ్ సాబ్ బ్రతికి ఉంటే నాకు తెలుస్తుంది. లేదు సాబ్ ఆయన చనిపోయే ఉంటాడు” అన్నాడు.

 

మరుసటి రోజు గుర్మిత్ తోడుగా విమాన శకలాలు పడిన ప్రాంతాల్లో తిరిగాను. అది దట్టమైన అడవి. జన సంచారం అసలు లేని ప్రాంతం. శత్రు సైనికుల పహారా కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం. సాయంత్రం కంటే ముందుగానే వెనక్కి వచ్చేశాము. కనపడిన గిరిజనులు, గ్రామస్తులు ఎవ్వరూ ఎటువంటి ఆచూకీ తెలుపలేక పోయారు.  కమాండర్ ని అడిగి అప్పటి యుద్ధం తాలూకు రేడియో ట్రాన్స్మిషన్ సంభాషణలు ఏమైనా ఉంటే  చూస్తానని అడిగాను. “మీరు చూసుకోవచ్చు” అని అనుమతి తీసుకొని యుద్ధం తాలూకు లాగ్ బుక్కులు, అప్పటి రేడియో సంభాషణలు అన్ని రికార్డు రూమ్ లో వెదకడం ప్రారంభించాను. అన్ని కాగితాల కట్టలు, ఫైళ్ల  దొంతర్లు, రేడియో మెసేజ్ కాగితాలు, అప్పటి ఉత్తర  ప్రత్యుత్తరాలు మధ్య, ఆనాడు జరిగిన విషాద సంఘటన వివరాల కోసం వెతికాను.

 

అప్పటి విమాన పటాలం బయల్దేరిన సమయం, అందులోని సభ్యులవివరాలు పొందుపరిచారు. కెప్టెన్ బలరామ్ నాలుగవ సభ్యుడుగా ఆ జాభితాలో ఉన్నాడు. రేఖకు అవతల వైపుకి వెళ్ళి కేంద్రీకరించబడిన కొన్ని యుద్ధ టాంకులు మరియు ఆయుధ కారాగారాలను ధ్వంసం చేయడం ఆ దాడి ప్రణాళికగా ఉన్న కాగితం కనబడింది. కానీ రేడియో సంభాషణల తాలూకు వివరాలేవీ ఆ ఫైలులో లేవు. మధ్యలో ఎవరో పేజీలు చించేసినట్లుగా అనిపించింది. చివరిగా ఉన్నతాధికారులకు కమాండర్ వ్రాసిన రిపోర్ట్ నకలు, దాడి విఫలమైనట్లు, అందులో పాల్గొన్న వారందరు మరణించినట్లు, మృత దేహాల్లో ఒకటి దొరకలేదన్నట్లుగా అందులో వ్రాసి ఉంది.

 

గుర్మిత్ సింగ్ కి వీడ్కోలు చెప్పి, కమాండర్ కి నా అడ్రస్ ఇచ్చి నేను తిరిగి వచ్చేశాను. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఈశాన్య భారతం నుంచి నాకు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి, రాడార్ ట్రైనింగ్ కోసం నన్ను హైదరాబాద్ పంపిస్తున్నట్లు తెలిసి సంతోషపడుతూ బయల్దేరాను.

 

కెప్టెన్ బలరామ్ స్మృతికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంతం నుంచి బయల్దేరుతున్నప్పుడు అతని ఆలోచనలు నాలో మెదిలాయి. కొద్ది నెలల తర్వాత నా విధి నిర్వహణలో కెప్టెన్ బలరామ్ గురించి మెల్లగా మర్చిపోవడం ప్రారంభించాను. ఒక రోజు from address లేకుండా నా పేరు మీద ఒక పోస్టల్ కవరు వచ్చింది.

 

డియర్,

కొద్ది నెలల క్రితం కెప్టెన్ బలరామ్ ను వెతుక్కుంటూ రెజిమెంట్ కు వచ్చినట్లు తెలిసింది. దేశం కోసం వీర మరణం పొందిన ఒక సైనికుని గౌరవాన్ని నిలబెట్టు. లోకం ఎప్పుడో అతన్ని మరచి పోయి ఉండవచ్చు. కానీ చరిత్ర లో అతనుయుద్ధ భూమిలో ప్రాణాలొడ్డిన వీరుడు. ఆ స్మృతి అతనికి దక్కడం న్యాయం. అమ్మ ఇచ్చిన మొత్తాన్ని ధార్మిక కార్య క్రమాలకు వినియోగించండి. నా జీవితం యుద్ధ రంగంలో ఆ రోజే అంతమయింది. బలరామ్ గురించి మళ్ళి శోధించకు. సమయం దొరికినప్పుడు కెప్టెన్ బలరామ్ ను ఎప్పుడైనా తలుచుకో. సెలవు.

  •  

ఆ ఉత్తరం జాగ్రత్తగా కాల్చి వేశాను. బలరామ్ మాత్రం నా హృదయం లో నిలిచిపోయాడు. గుర్మిత్ తో సంభాషణల్లో త్వరగా ఇంటికి వెళ్ళాలని, మరీ ఆలస్యమైతే కాలు, చెయ్యి లేని తన తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడని చెప్పిన విషయం ఎందుకో స్ఫురించింది.

 

ఇదంతా జరిగి చాలా రోజులయ్యింది. కెప్టెన్ బలరామ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో. రైలు నెమ్మదిగా వంతెన దాట సాగింది. ఒక సైనికుడి జీవితం గురించి ఆలోచిస్తూ నది వైపు చూడసాగాను.

         

 

కొన్ని సంఘటనలు ఈ కథకు స్పూర్తి. వీరులందరికీ వినమ్ర గౌరవ వందనాలతో...