ఉత్తమ పార్లమెంటేరియన్ - మాడభూషి అనంత శయనము అయ్యంగార్ - ambadipudi syamasundar rao

ఉత్తమ పార్లమెంటేరియన్ - మాడభూషి అనంత శయనము అయ్యంగార్

అనంత శయనం అయ్యంగార్ ఖద్దరు దుస్తులతో నెత్తిమీద గాంధీ టోపీతో నుదుటిమీద శ్రీ వైష్ణవ చిహ్నము తిరునామముతో లోక్ సభ లో అధ్యక్ష స్థానములో కూర్చుంటే సాక్షాత్తు మహావిష్ణువే పార్లమెంటును నడిపిస్తున్నట్లు ఉంటుంది అని చూసినవారు అనేవారు తెలుగు వైష్ణవులైన ఆనంత శయనం గారి పేరు చివర అయ్యంగార్ ఉండటంతో ఈయనను తమిళుడు అని అందరు భావించేవారు చిత్తూర్ జిల్లాలో జన్మించిన ప్రముఖులు సర్వేపల్లి రాధాకృష్ణ తో సహా అందరు ఈ విధమైన ఇబ్బందికి లోనయినవారే.తిరుపతికి సమీపాన గల తిరుచానూరు లో వెంకట వరదన్ , కనకమ్మ దంపతులకు 1891,ఫిబ్రవరి 4 న అనంత శయనం జన్మించారు తిరుచానూరు రాకమునుపు సంస్కృతములో పండితుడైన వరదన్ తిరువాన్కూర్ రాజావారి ఆస్థానంలో ఉండేవాడు అందుచేత త్రివేండ్రము లోని దేవునిపేరు అనంత శయనముగా రెండవ పిల్ల వాడికి పెట్టారు.
అనంత శయనం పదేళ్ల వయస్సులో ఉండగా తండ్రిని కోల్పోయినాడు బంధువుల సహాయముతో తిరుపతిలో ఉపకార వేతనంతో ప్రభుత్వ పాఠశాలలో విద్య కొనసాగించి మెట్రిక్యులేషన్ పాస్ అయి మద్రాస్ పచ్చయప్ప కాలేజీలో డిగ్రీ చదివి 1913లో లా కాలేజీ నుండి లా డిగ్రీ పొందాడు. అదే సంవత్సరంలోనే మేనమామ కూతురుతో వివాహము అయింది దేవస్థానము స్కూలులో లెక్కల టీచర్ గా చేరాడు పొట్టిగా బొద్దుగా ఉండటంవలన పిల్లలు ఆయనను పొట్టి అయ్యవారు అని పిలిచేసివారు అయన క్లాసుకు తీసుకువచ్చే జామెట్రీ బాక్స్ ను పిల్లలు మంగలి పొది అనేవారుట .1915నుండి చిత్తూర్ లో దొరస్వామి అయ్యంగారు వద్ద జూనియర్ గా న్యాయవాద వృత్తిలో ప్రవేశించాడు అనతికాలంలోనే లాయర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.ఒకానొక సందర్భములో మహంత్ కేసు విషయములో అయ్యంగార్ తన గురువైన దొరస్వామి అయ్యంగార్ తోనే తలపడవలసి వచ్చింది ఆ విధముగా గురువును మించిన శిష్యుడు అయినాడు.
అనంత శయనం అభిరుచులు విలాసవంతమైనవి కావు నిరాడంబరతకు ప్రాధాన్యత ఇచ్చేవాడు భార్యకు కూడా మహాత్మాగాంధీ ఆదర్శలైన స్వరాజ్య సముపార్జన హరిజన దేవాలయ ప్రవేశము వంటి కార్యక్రమాలలో శిక్షణ ఇచ్చేవాడు భార్య బిడ్డలకు స్వేచ్ఛ నిచ్చేవాడు ఏ నాడు తన ఇష్టాలను అభిప్రాయాలను వారి మీద రుద్దే ప్రయత్నము చేసేవాడు కాదు. మిత్రులు సన్నిహితులు ఆయనను అజాత శత్రువుగా పిలిచేవారు సీనియర్ ఆడ్వొకేట్ దొరస్వామి గారి ఆదర్శాలు అయ్యంగార్ గారిని ఆకట్టుకున్నాయి 1918 లో అయన సూచనల మేరకు "వేంకటేశ్వర పత్రిక" అనే వార పత్రికను స్థాపించి అందులో గాంధీజీ భావజాలాన్ని తెలిపే వ్యాసాలను ప్రచురించేవాడు గాంధీజీ పిలుపు మేరకు 1921లో న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర పోరాటంలో చురుకుగాపాల్గొన్నాడు. 1940 లో సత్యాగ్రహములో పాల్గొని 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొని డిటెన్యూ గా 28 నెలలు తిరుచ్చిజైలు లో ఉన్నాడు అప్పుడు ఈయనతో పాటు రాజాజీ, ఆంధ్ర కేసరి ప్రకాశము గారు, వరదాచారి వంటి ప్రముఖులు ఉండేవారు. వీరు జైలులో ప్రతి రోజు ఉదయము భాగవతము, వాల్మీకి రామాయణము చదివే వారు జైలులో ఉన్నంతకాలము భార్యకు ఇచ్చే పెన్షన్ సరిపోక అనంతశయనము కుటుంబము ఇబ్బంది పడేది చివరకు తల్లి అనారోగ్యము కారణముగా ఈయనను 1946లో జైలు నుండి విడుదల చేశారు.
మొదటిసారిగా 1934లో చిత్తూరు నుండి పోటీచేసి పార్లమెంట్ కు ఎన్నిక అయి 28 సంవత్సరాలు పార్లమెంట్ లో వివిధ పదవులు నిర్వహించారు కేంద్ర శాసన సభకు ఎన్నిక అయిన అనంతశయనము గణాంకాలను గుప్పెట పెట్టుకొని తన వాదన పటిమతో ప్రభుత్వ సభ్యులను ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. పాశ్చాత్య పత్రిక విలేఖరి అనంత శయనమును "ఎండన్ పార్లమెంటేరియన్ "గా ఆసియాటిక్ రివ్యూ పత్రికలో ప్రశంసించాడు. ఎండన్ అంటే రెండవ ప్రపంచయుద్ధములో శత్రువులను చీల్చి చెండాడిన బ్రిటిష్ యుద్ధ నౌక.శాసన సభా కార్యక్రమాలే కాకుండా అంటరాని తన నిర్మూలన వంటి సాంఘిక కార్యక్రమాలలో ముందు ఉండేవాడు. 1946-47 లో అయన పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కారదర్శిగా పనిచేసాడు. రాజ్యాంగ నిర్మాణములో స్టీరింగ్ కమిటీ లో సభ్యుడిగా ఉండి న్యాయశాస్త్ర విధానములో మార్పుల గురించి కృషి చేసాడు . న్యాయ వ్వవస్థ సర్వ స్వతంత్రముగా ఉండాలని భారతదేశములోని ఫెడరల్ కోర్ట్ ను సుప్రీం కోర్ట్ గా మార్చాలని గట్టిగా కోరిన వ్యక్తి అనంత శయనము.
స్వాతంత్రము వచ్చినాక 1950 లో తాత్కాలిక పార్లమెంట్ ఏర్పడినాక స్పీకర్ గా జి.వి మౌలంకర్ , డిప్యూటీ స్పీకర్ గా అనంత శయనము ఎన్నిక అయినారు. ఆ విధముగా ఆ పదవి అధిష్టించిన మొదటి తెలుగు వాడు అనంత శయనం.అయ్యంగార్ స్పీకర్ మౌలంకర్ మరణానంతరము 1956 ఫిబ్రవరి 27న అనంత శయనం స్పీకర్ గాఎన్నుకోబడ్డాడు ఆ విధముగా లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకోబడ్డ మొదటి తెలుగువ్యక్తి అనంత శయనం అయ్యంగార్ గారు పదవికి పండిట్ గోవింద వల్లభ్ పంత్ అయన పేరును ప్రతిపాదిస్తే అప్పటి ప్రతి పక్షనేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలపరిచారు 1957లో రెండవ లోక్ సభ ఏర్పాటు అయినప్పుడు అనంత శయనం మరోసారి స్పీకర్ గా ఏకగ్రీవం ఎన్నుకోబడ్డాడు 1962 లో మూడోసారి లోక్ సభకు ఎన్నుకోబడ్డప్పటికీ బీహార్ గవర్నర్ పదవి చేపట్టటానికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజనీమా చేయవలసి వచ్చింది. ఈయన స్పీకర్ గాఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉద్దండులైన ఢాంగే ,గోపాలం, కృపాలాని మొదలైన వారు ఉండేవారు.అనంత శయనం తన హాస్య చతురోక్తులతో సభను సజావుగా నడిపించేవాడు.నెహ్రూకు సన్నిహితుడైన ఆర్ధిక శాఖ మంత్రి టి.టి .కృష్ణమాచారి పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు స్పీకర్ గా ఈయన నిష్పక్షపాతముగా ఇచ్చిన రూలింగ్ వల్ల కృష్ణమాచారి పదవినుండి తప్పుకోవలసివచ్చింది స్నేహితుడైన హెచ్ వి కామత్ సభ నుండి 2 రోజుల పాటు బహిష్కరించవలసి వచ్చిన వెనకడుగు వేయలేదు ఆ విధముగా నిష్పక్ష పాత ధోరణిలో సభను నిర్వహించేవారు చట్టము దృష్టిలో ప్రధాని అయినా చిరుద్యోగి అయినా ఒకటే అని అయ్యంగార్ వ్యాఖ్యానించాడు . విదేశాలలో జరిగే పార్లమెంటేరియన్ సమావేశాలకు భారత దేశము తరుఫున హాజరు అయ్యేవాడు.తన పార్లమెంట్ అనుభవాలతో "మన పార్లమెంట్"అనే ఆంగ్ల గ్రంధాన్ని రచించాడు ఇది పార్లమెంట్ సభ్యులకు రాజకీయ శాస్త్ర విద్యార్థులకు కరదీపికగా ఉండేది.
రష్యా ప్రధాని కృశ్చెప్ అయ్యంగారు గారు సభా నిర్వహణ తీరును ప్రశంసిస్తూ "మీరు నియంత లాగా సభను నిర్వహిస్తున్నారు" ఆని అంటే దానికి జవాబుగా అయ్యంగార్ "మాది ప్రజాస్వామ్యము"అని అంటే అయితే మీరు ప్రజాస్వామ్య నియంత అని వ్యాఖ్యానించారు. లోక్ సభ స్పీకర్ గా అయ్యంగార్ ఉన్నప్పుడు రాజ్యసభకు అధ్యక్షుడుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉండేవారు ఇద్దరు ఒకే ప్రాంతమువారు మంచి మిత్రులు రాధాకృష్ణన్
అనంత శయనముతో హాస్యముగా,"నీకు అనంత శమనము(ఎక్కువగా నిద్రపోవటం) పేరు సరికాదయ్య అనంత వచనము (ఎక్కువగా మాట్లాడట ము) అయితే సరిపోతుంది " అనేవారట.
బీహార్ గవర్నర్ గా అయ్యంగార్ ముఖ్యమంత్రికి చక్కని సలహాలు ఇస్తూ పాలన సక్రమముగా జరిగేటట్లు చూసేవాడు. ఆ విధముగా బీహార్ ప్రజలకు సన్నిహితుడై వారి అభిమానాన్ని చూరగొన్నాడు.ఒకసారి కుటుంబనియంత్రణ ఆవశ్యకతను వివరించే సభలో ,"నాకు పన్నెండు మంది సంతానము మీరెవరు నన్ను అనుసరించకండి:" అని నిర్మొహమాటముగా చెప్పిన వ్యక్తి అయ్యంగార్. ఈయన మీద గౌరవముతో పాట్నాలో ఒక పార్క్ కు అయ్యంగార్ ఉద్యానవనము అని పేరు పెట్టారు.1967లో తన గవర్నరు పదవినుండి వైదొలగి సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు.
అయ్యంగార్ తన వైష్ణవ సాంప్రదాయాన్ని ఖచ్చితముగా విదేశాలకు వెళ్ళినప్పుడూ కూడా సంధ్యావందనము లాంటివి పాటించేవాడు అలాగే తన కూతురుకు ఒకసారి తెలు కుడితే నారాయణ మంత్రము జపించి ఉపశమనము కలుగజేసాడు కొడుకులలో ఒకడు బెంగాలీ యువతిని ఇంకో కొడుకు పంజాబి యువతిని వివాహమాడిన మనసు పూర్తిగా వారిని తన కుటుంబములోకి ఆహ్యానించిన సంస్కారి అయ్యంగార్ 1938లోనే అయ్యంగార్ చిత్తూర్ తిరుపతి పట్టణాలలో కుష్టు నివారణ సంఘము శాఖను నెలకొల్పి కుష్టు రోగులకు సేవచేసేవారు. అయ్యంగార్ దృష్టిలో ఇతరులకోసము జీవించేవారు ధన్యులు. అయ్యంగార్ చివరి ఘడియ వరకు చురుగ్గా పనిచేస్తూ , 19,మార్చి 1978 సాయంత్రము తుదిశ్వాస విడిచారు. తిరుపతిలో సంస్కృత విద్యాపీఠానికి వెళ్లే దారిలో అయ్యంగార్ గారి కాంస్య విగ్రహ ప్రతిష్ట జరిగింది.ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్ ఈశ్వర్ రెడ్డిగారు "మాడభూషి అనంత శయనము ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ "అనే సంస్థను తిరుపతిలో స్థాపించారు