శ్రీ సురవరం ప్రతాప రెడ్డి - ambadipudi syamasundar rao

శ్రీ సురవరం ప్రతాప రెడ్డి

తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యానికి ప్రతీక సురవరం ప్రతాప రెడ్డి గారు. .నైజాము కాలము నాటి తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడిగా,పరిశోధకుడిగా రచయితగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి గా కొనసాగిన అయన కృషి అనన్యమైనది. తెలంగాణా సాంస్కృతిక చరిత్రలో అయన ఒక అధ్యయము అయన రచనలలో ప్రతి అక్షరము స్థానిక ప్రజల కడగండ్లకు ప్రత్యక్ష సాక్షాలు.నైజాము నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రాంతములో తెలుగువారి అణిచివేతను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ,తెలుగు భాష సంస్కృతులను వికసింప చేయటానికి ఎనలేని కృషి చేసినవాడు సురవరం ప్రతాప రెడ్డి. నిజాము పాలనలో ఉర్దూ రాజభాషగా చెలామణి అవుతుండటం వలన తెలుగు పాఠశాలలు చాలా తక్కువగా ఉండేవి. తెలుగు మాట్లాడేవారు అవహేళనకు గురి అయ్యేవారు అటువంటి పరిస్తుతులలో తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేయటానికి ప్రజలను జాగృతము చేయటానికి వీలుగా సురవరం గోల్కొండ పత్రికను 1926లో స్థాపించారు. ఈ పత్రిక స్థాపనకు అయన రాజా బహుద్దూర్ వెంకట్రామీ రెడ్డి గారి సహాయాన్ని తీసుకున్నారు.గోల్కొండ పత్రికకు అనుభందముగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి, పత్రికలను ప్రారంభించి సంపాదకుడిగా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఈయన తెలుగులో మాత్రమే కాకుండా హిందీ,ఉర్దూ సంస్కృతము, పార్సీ, ఇంగ్లిష్ బాషలలో కూడా నిష్ణాతులు.

సురవరం ప్రతాపరెడ్డి గారు 1896,మే,28 న రంగమ్మ , నారాయణ రెడ్డి దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామములో జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి మరణించటంతో చిన్నాన్న రామకృష్ణారెడ్డి దగ్గర పెరిగి ఎబిఎమ్ మిషనరీ పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసుకొని హైదరాబాద్ నిజామ్ కళాశాలలో ఇంటర్మీడియట్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ పూర్తి చేసి 1916 లో మరదలు పద్మావతిని వివాహము చేసుకున్నాడు.వారికి పదిమంది సంతానము వారిలో నలుగురు కొడుకులు,నల్గురు కూతుళ్లు (ఇద్దరు విగత జీవులు) అప్పటి హైదరాబాద్ సంస్థానానికి కొత్వాల్ గా ఉన్నరాజ బహుదుర్ వెంకట్రామి రెడ్డి గారి కోరికపై హైదరాబాద్ వచ్చి అయన ఆధ్వర్యములో నడుస్తున్న రెడ్డి హాస్టల్ నిర్వహణ భాద్యతను చేపట్టాడు అయన పనిచేసిన పదేళ్లలో ఆ హాస్టల్ ను ఒక విద్యాలయముగా తీర్చి దిద్దాడు వెయ్యి గ్రంధాలు ఉన్న హాస్టల్ లైబ్రరిని 11 వేల గ్రంధాల వరకు పెంచి విద్యార్థుల లో భాషాభివృద్దికి కృషి చేసాడు..విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు.ఆ విధముగా హైదరాబాదులో రెడ్డి సాంఘిక సేవా జీవితానికి పునాదులు వేసాడు.

మద్రాసులో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావము అతనిపై పడింది. నిజాం దుస్థితి రూపు రేఖలను మార్చాలన్న తపన ఆనాడే ఏర్పడింది. మద్రాసు లో బిఎ తరువాత తిరువాన్కూర్ లో లా పూర్తి చేయటం వల్ల కొన్నాళ్ళు లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు 1926లో గోల్కొండ పత్రిక స్థాపన తెలంగాణా సాంస్కృతిక గమనంలో ఒక మైలు రాయి ఆ పత్రిక లోని సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని ప్రశ్నించేవిగా ఉండటం చేత నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిభందన పెట్టాడు. అయినప్పటికీ నైజాం నిరంకుశపాలనను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేయటానికి తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి సురవరం ఎనలేని కృషి చేసాడు

తెలంగాణలో గ్రంధాలయోద్యమము లో సురవరం ప్రముఖపాత్ర వహించి 1942లో జరిగిన ఆంధ్ర గ్రంధాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు అలాగే 1943లో ఖమ్మము లో జరిగిన గ్రంధాలయ మహాసభకు 1944 లో జరిగిన ఆంధ్ర సారసత్వ పరిషత్తుకు అధ్యక్షత వహించాడు.1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు 1952 లో రాజకీయాలలో ప్రవేశించి హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ తరుఫున వనపర్తి నియోజక వర్గము నుండి శాసనసభకు ఎన్నిక అయినాడు కానీ రాజకీయాలలో ఇమడలేకపోయినాడు తన స్నేహితులతో ముచ్చటించేటప్పుడు "ఈ రాజకీయపు చీకటి బజారులో నేను నాలాంటి వారు ఏమి యును పనికిరారు "అని స్పష్టముగా చెప్పాడు

ప్రతాప రెడ్డి భావుకుడైన రచయిత అయన ఆంధ్రుల సాన్ ఘిక చరిత్ర ,హైందవ ధర్మవీరుడు, హిందువుల పండుగలు, రామాయణ కాలము నాటి విశేషాలు వంటి గ్రంధాలు, భక్త తుకారాం, ఉచ్చ విషాదము అనే నారకాలు,మొగలాయి కధలు పేరుతొ రెండు భాగాలు ఇంకా అనేక కధలు కవితలు రచించాడు అయన వ్రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.వీరి ప్రత్యేకత ఏమిటి అంటే ఇతర తెలుగు కవులు పండితులను ప్రాంతాలతో సంబంధము లేకుండా తెలంగాణా ప్రాంతములోని జమీందార్లు,భూస్వాముల దగ్గరకు తీసుకొని వెళ్లి వారికి ఆర్ధిక సహాయము ఇప్పించేవారు " సురవరం ప్రతాప రెడ్డి జీవితం - సాహిత్యాము"పై ఎల్లూరి శివారెడ్డి, ముద్ధసాని రామిరెడ్డి గారలు రచించిన గ్రంథాలకు కూడా 1972 లో ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమలు పొందాయి. డా.ఇందుర్తి ప్రభాకర రావుగారు పరిశోధించి శ్రమించి, "శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం ,రచనలపై సమగ్ర పరిశీలన "అనే గ్రంధాన్ని రచించారు.రచయిత గా, కార్యకర్తగా,సంపాదకుడిగా జీవితమూ సాగించి తెలంగాణా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాడు.1953 ఆగస్టు 25 న దివంగతుడైనాడు. తెలుగు జాతికి అయన చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ ట్యాంక్ బ్యాండ్ పై అయన విగ్రహాన్ని స్థాపించారు