యువత-- నేటి సమాజం తీరు - కందర్ప మూర్తి

యువత-- నేటి సమాజం తీరు

తరాలు మారుతున్నాయి. సమాజంలో మనుషుల మనస్తత్వాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత తరం పెద్దలు ఏ కట్టుబాట్లు అమలు పరచినా ముందు చూపుతో చేసేవారు. అవి పురుషులకైనా స్త్రీల కైనా ఏ ప్రాంతం వారైనా క్రమశిక్షణతో కూడిన నడవడిక ఉండాలన్నదే వారి ఉద్దేశ్యం. అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా కుటుంబ సబ్యుల మద్య ఆప్యాయతలు అనురాగాలు కష్ట సుఖాల్లో ఆదుకోడం నాది అనేది కాకుండా మనది అనే మానవ సంబంధాల నేపద్యంలో నిశ్వార్థంగా ఉండేది. కుటుంబ పెద్ద ఏది చెబితే దానికి కట్టుబడి ఉండేవారు. సమాజంలో పెద్దలను గౌరవించేవారు. వారి మాటకు విలువ ఉండేది. నైతిక విలువలు ఉండేవి. అప్పట్లో నగదు చలామణి కన్న వస్తురూపేణా ఇచ్చి పుచ్చు కోవడం కాగితం మీద రాతల కన్న నోటి మాటలతో వ్యవహారాలు సాగేవి.భూ వ్యవహారాలు మాత్రమే రాతలు జరిగేవి. కులవృత్తుల వారికి సేవలు చేసేవారికీ వస్తురూపేణా ప్రతిఫలం దక్కేది. అన్ని వర్గాల్లో ఉన్నదానితో తృప్తి పడేవారు. పరాయి సొమ్ము ఆశించేవారు కాదు. కట్టబాట్లు ఆచారాలతో నియమ బద్దమైన జీవన విధానం కొనసాగేది.నిమ్న జాతుల్లో కూడా క్రమశిక్షణ జీవనం నడిచేది. అక్షర జ్ఞానం లోకజ్ఞానం లేకపోయినా సంఘ పెద్దల తీర్పులకు కట్టుబడి ఉండే వారు. తప్పు చేసిన వ్యక్తికి ఏ శిక్ష వేసినా అమలు జరిగేది. ఉన్నత జాతి వర్గాలైనా అట్టడుగు వర్గాలైనా వేష భాష ఆహార వ్యవహారాల్లో క్రమశిక్షణ కనబడేది. అరాచకాలు అన్యాయం చెయ్యాలంటే భయపడేవారు. పాపభీతి ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు మద్య అనురాగ ఆప్యాయతలు పెరిగి బాల్యం నుంచి యవ్వన దశ వరకు అన్యోన్యంగా నైతిక విలువల జీవితం సాగేది. బాలిక రజస్వల అయినప్పటి నుంచి కట్టుబొట్టు సంప్రదాయ పద్దతిలో వారి జీవన విధానం కుటుంబ పెద్దల అదుపు ఆజ్ఞల్లో సాగేది.వారికి నియమిత జీవితం వివాహమై అత్తవారింటికెళ్లే వరకు కొనసాగేది. విద్యాలయాల్లో ఉమ్మడి చదువు సాగినా బాలబాలికల మద్య సోదరసోదరి భావం కనబడేది.మరే ఇతర దురాలోచన ఉండేది కాదు. కుటుంబ బాంధవ్యాలు మానవ విలువలతో కూడిన పౌరాణిక జానపద సమాజిక కధలతో కూడిన చలన చిత్రాలు హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాటలు నాటకాలు కుటుంబ సబ్యుల నీతికధలు బాల్యావస్థలో వారికి నైతిక విలువలు నేర్పేవి.యవ్వనంలో కొచ్చినా వారు నియమబద్ద జీవితం గడిపేవారు. నేటి ఆధునిక యుగంలో ప్రపంచీకరణ కారణంగా సమాజం లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. నాదీ నాకు అనే స్వార్థం పెరిగిపోయింది. పెద్దలు వయోవృద్దుల పట్ల గౌరవభావం నశించింది.వారి మాటకు విలువ లేకుండా పోయింది. ఏదైనా చెప్పినా పాత చింతకాయ పచ్చడి మాటల మాదిరి కొట్టి పారేస్తారు.మానవ సంబంధాలు నశించి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఉన్నత చదువులు అందుబాటులో కొచ్చి స్త్రీ పురుషులు ఆధునిక జీవన విధానంలో వేష భాష ఆహార వ్యవహారాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాల ప్రభావంతో విదేశీ సంస్కృతి అశ్లీల చిత్రాలు అశ్లీల సాహిత్యం ఆధునిక వేషధారణ అందుబాటులో ఉన్న మాదక ద్రవ్యాల మత్తు యవ్వన దశలో అడుగు పెడుతున్న బాల బాలికల యువతీ యువకుల్లో శృంగార భావాలు రేకెత్తి యుక్త వయసులో పెడదారులు తొక్కి అంతర్గత రోగాలతో భావి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వావి వరుసలు మరిచి అనుచిత ప్రవర్తనతో సమాజానికి చీడపురుగుల్లా తయారవు తున్నారు. మానవ నిర్మిత మనీ (డబ్బు) దేశాల మద్య క్రయ విక్రయాలు మానవ సంబంధాలను శాసిస్తోంది. కుటుంబాలను కలుపుతోంది కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. మనిషి జీవితాన్ని నాశనం చేస్తోంది అలాగే మనిషి జీవితాన్ని రక్షిస్తోంది.రక్త సంబంధీకుల మద్య చిచ్చు పెడుతోంది. మానవ మృగాలుగా హంతకులు లైంగిక వేధింపులు అత్యాచారాలకు గురిచేస్తోంది. నిర్భయ అత్యాచార కాండ జరిగి దేశమంతా అట్టుడికి కఠిన చట్టాలు వచ్చినా దిశ లాంటి అనేక అత్యాచార హత్యలు జరిగాయి. జరుగుతున్నాయి. ప్రసార మాధ్యమాలకు అందని రాజకీయ ప్రముఖులు సమాజంలో పలుకబడి కలిగిన వ్యక్తుల చీకటి కోణాలు బయటకు రావడం లేదు. మనుషుల్లో నైతిక విలువలు లేనప్పుడు ఎన్ని చట్టాలు తెచ్చినా అవి న్యాయస్థానాల వరకే పరిమితం.చిన్నతనం నుంచే పిల్లల్లో సంబంధ బాంధవ్యాలు పాఠశాలల్లో లైంగిక విద్యపై అవగాహన పెంచాల్సి ఉంది. మానవ శరీర నిర్మాణం వయసుతో పాటు శరీర మార్పులు ఆత్యీయులు దగ్గరి బంధువులు శరీర స్పర్సపై బాలికలకు తెలియచేయాలి. . మాదక ద్రవ్యాలుఅశ్లీల మాద్యమాలపై కట్టడి చెయ్యాలి. అన్నిటికీ పోలీస్ వ్యవస్థనే దోషిని చెయ్యడం భావ్యం కాదు. సమాజంలో ప్రతి వ్యక్తికీ భాద్యతలున్నాయి.వాటిని సక్రమంగా వినియోగించి చట్టాలకు సహకరించాలి. లైంగిక వేధింపులు అత్యాచారం హత్యలు జరిగినప్పుడు చట్టంలో కఠిన శిక్షలు ఉండాలి. వాటిని జాప్యం లేకుండా వెంటనే అమలు చేసి దోషుల్లో భయం కలిగించాలి.ఇటువంటి నేరాలు జరిగినప్పుడు వేసే కఠిన శిక్షల పట్ల ప్రసార మాద్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి. * * *