మల్లాది రామకృష్ణ శాస్త్రి (జూన్ 16 జయంతి సందర్బముగా) - ambadipudi syamasundar rao

మల్లాది రామకృష్ణ శాస్త్రి (జూన్ 16 జయంతి సందర్బముగా)
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పేరు చెప్పగానే తెలుగు సినిమా మాటలు పాటల రచయితగా,తెలుగు సినిమా పాటలకు అజ్ఞాత రచయితగా గుర్తిస్తారు నిజానికి అయన అసమాన ప్రతిభావంతుడు బహుబాషా పండితుడు.గత శతాబ్దిలో ఆధునిక ఆంధ్ర వాజ్ఞ్మయాన్ని అనేక రీతుల,పలు ప్రక్రియలలో సుసంపన్నము చేసిన మహనీయుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఇంచుమించు సుమారు 50 దేశీయ, విదేశీయ భాషలు నేర్చినవాడు. అంతేకాదు ఖగోళ జ్యోతిష్య చిత్రలేఖన, తర్క, న్యాయ ,వేదాంత, వ్యాకరణ శాస్త్రము అధ్యయనము చేసిన మేధావి. ఇంకా విశేషము ఏమిటి అంటే బందరులో చదువుకొనే రోజుల్లో ఒక ముస్లిం పండితుడి దగ్గర ఉర్దూ నేర్చుకొని ఖురాన్ ఆమూలాగ్రము చదివాడుట అలాగే బైబిల్ ను సంపూర్ణముగా చదివి అందుకు సంబంధించిన పీటర్ -కేటీఆర్ పరీక్షలు పాస్ అయ్యాడు.అలా భాషలు నేర్చుకోవటానికి పాండిత్య పరిశోధనలకు వర్గ, మత భేదము లేదని ఆనాడే నిరూపించిన మేధావి రామకృష్ణ శాస్త్రిగారు.ఆయనకేవలం ఒక పండితుడిగా మిగిలిపోలేదు. సరళమైన రచనలు చేసి తెలుగులో అమృతాన్ని ఒలికించి సామాన్య పాఠకులకు దగ్గర అయినవాడు మల్లాది.
మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు 1905, జూన్ 16 కృష్ణా జిల్లా,చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించాడు.ఈయన మచిలీపట్నంలో బి.. వరకు చదివాడు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం..పట్టా పుచ్చుకున్నాడు. అనేక శాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించాడు. ఈయన వేద విద్యను యడవల్లి సుబ్బావధాన్లు వద్ద, మహాభాష్యాన్ని నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద,, బ్రహ్మ సూత్రాలను శిష్ట్లా నరసింహశాస్త్రి వద్ద నేర్చుకున్నాడు. నాట్యం, చిత్రలేఖనం, సంగీతంలో కూడా ప్రవేశం ఉంది.వీటితో ఆగకుండా వ్యాయమ శాలకు వెళ్లి కుస్తీ పట్లు నేర్పు సాధించి బందరు లడాయిలలో పాల్గొనేవాడు.
ఆస్తి లావాదేవీ లలో సంపదను అంతా పోగొట్టుకుని బందరు వదిలి కొంతకాలం గుంటూరులో ఉన్నాడు. ఇతనికి 15 యేట పురాణం సూరిశాస్త్రి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
ఉన్నారు. ఈయన గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్య చౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఈయన సినిమాలలో మాటలు, పాటలు రాయడానికి ముందు, పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు వ్రాశాడు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మంపల్నాటియుద్ధంచిత్ర రచన విషయంలో సలహాల కోసం 1945లో ఈయనను మద్రాసుకు ఆహ్వానించాడు. విధంగా ఇతడు 1945, మార్చి 24 మద్రాసులో అడుగుపెట్టాడు. మద్రాసు లోని పానగల్ పార్కులో పగలంతా ఒక చెట్టు క్రింద ఉండే రాతి బల్లపై కూర్చుని వచ్చిన వారికి మదనశాస్త్రం నుండి మంత్రశాస్త్రం వరకు బోధించేవాడు.
ఎంతో మంది వర్ధమాన కవులకు సందేహ నివృత్తి చేసేవాడు. మద్రాసులో సముద్రాల రాఘవాచార్యకు అత్యంత ఆప్తుడయ్యాడు. అతడికి చాలా కాలం "ఘోస్ట్ రైటర్"గా ఉన్నాడు. 1952 వరకు ఇతడు చేసిన సినిమా రచనలలో ఇతని పేరు లేకపోవడం
గమనార్హం. చిన్న కోడలు చిత్రంతో ఇతడు అజ్ఞాత వాసం వదిలి బహిరంగంగా సినీజీవితం కొనసాగించాడు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రచించాడు సువర్ణ సుందరి, చివరకి మిగిలేది,చిరంజీవులు, రేచుక్క, విప్రనారాయణ, రాజనందిని జయభేరి లాంటి విజయవంతమైన అనేక సినిమాలకు అబ్దుతమైన మాటలు పాటలు వ్రాసి తెలుగు సగటు సినీ ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నాడు.సినిమాలకు వ్రాసిన మాటలు, పాటలలో కూడా సాహిత్య ప్రమాణాలను,విలువలను పాటించేవాడు. అందువాళ్ళు తెలుగు సినిమాలకు మల్లాది సృష్టించిన సాహిత్యములో గులాబీల సౌరభాలు,మల్లెపూల పరిమళాలు గుబాళించేవి.
ఈయన కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం వ్రాశాడు. కృష్ణాపత్రికలో చలువ మిరియాలు పేరుతో వ్యంగ్య వ్యాసాలను వ్రాశాడు.అలాగే "నా కవి మిత్రులు" అనే శీర్షికన తన సమకాలీన కవి పండితులపై అయన వ్రాసిన వ్యాసాలు నేటికీ అనన్య సామాన్యముగా దర్శనమిస్తాయి.19యేట నుండే కథారచన ప్రారంభించి సుమారు 125 కథలను వ్రాశాడు. ఈయన వ్రాసిన "డుమువులు" కథ 14 భారతీయ భాషలలోకి అనువదించబడింది. అహల్యా సంక్రందనం, హంస వింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశాడు.ఛందోబద్ధమైన కవిత్వముతో పాటు యక్షగానాలు, ద్విపదలు, నవలలు, వ్యాసాలు, నాటకాలు, మరెన్నో గ్రంధాలకు పీఠీకలు అనువాదాలు మల్లాది రచించారు. మల్లాది గారి 120 కధా రచనలను ఇటీవలే నాలుగు సంపుటాలుగా ఒక ప్రముఖ సాహితి సంస్థ ప్రచురించింది స్వల్ప అస్వస్థతకు గురియైన శాస్త్రిగారు తన సాహితి వ్యాసంగాన్ని చాలించి 12 సెప్టెంబర్ 1965 తనువు చాలించారు ఆ విధముగా అయన సాహితి సేవకు అంతరాయము ఏర్పడింది కానీ తెలుగు సాహితి రంగములో నేటికీ ధ్రువ తారగా వెలుగుతున్నారు