అల్లరి భామతో పెళ్ళి - డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు

Allari bhamatho pelli

ఉద్యోగంలో చేరిన నాటి నుండి, విశ్వాన్ని పెళ్ళిచేసుకోమని అతని తండ్రి రాజేంద్ర పోరు పెడుతున్నాడు. కొడుకు పెళ్ళి, తన స్నేహితురాలు శారద కూతురు ఆద్యతో జరిపించాలన్నది ఆయన అభిమతం. కొడుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తూండడంతో, కోపమొచ్చి రాజేంద్ర ఒక బెదిరింపు సందేశం పంపాడు.

"నీ బైక్ కి ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి చేసి. ఆ బైక్ పైనే అమ్మాయిని కాపురానికి పంపుతా. ఆ వీడియో యూ ట్యూబులో పెడతా."

తండ్రి పట్టుదల తెలిసిన విశ్వం ఆయన యెదుట వాలిపోయాడు.

“నేనూ, ఆద్య కలిసి యేడాది పైగా అయ్యింది. ఒక సారి యిద్దరం కలిసి మాట్లాడుకోవడానికి అనుమతినివ్వండి" అని తండ్రిని కోరాడు.

రాజేంద్ర ఆనందంతో శారదని పిలిచి, " పిల్లలిద్దర్ని మీ ఇంటి మేడ మీద ఏకాంతంగా మాట్లాడు కోమందాం?" అన్నాడు .

“ అలా కాదులే అన్నయ్యా! వాళ్ళకు నచ్చిన రెస్టారంటులోనో, పార్కులోనో కలుస్తారులే. ఈ కాలం పిల్లలకు ప్రతీదీ ఫోటో లో బిగించాల్సిందే, ఇన్స్టాలో మెరిసిపోవాల్సిందే." అంది శారద.

"నిజమే, సరిగ్గా చెప్పావు" అంటున్న భర్తను కొరకొరా చూసింది ఆయన భార్య కల్యాణి. ఇంతకు ముందు శారద చెప్పిన మాటే ఆమె భర్తకు చెబితే, " వాళ్ళని బరితెగించి వూరిమీద పడమందామా? " అని ఆయన ఆవిడ మీద విరుచుకు పడ్డాడు. అందుకు ప్రతీకారంగా ఆవిడ, ఆయనకు దగ్గరగా వచ్చి," వంటింట్లో పులి, నట్టింట్లో పిల్లి” అని వెక్కిరించింది.

తేలు కుట్టిన దొంగలా ఆయన మౌనంగా వుండిపోయాడు.

@@@

ఆద్య చెప్పిన రెస్టారంటుకు వచ్చాడు విశ్వం. ఒక ప్రక్కగా కూర్చుని ఆద్య రాకకోసం యెదురు చూడసాగాడు. అతనికి కొద్ది దూరంలో ఒక అందమైన అమ్మాయి కూర్చుని వుంది. నీలం రంగు చీరలో సాగర కన్యలా వుంది. కాటుక కన్నులు, లేత గులాబీ పెదవులు, మెరిసే బుగ్గలతో చూపరులను ఇట్టే ఆకర్షించేలా వున్న ఆమె ఒంటరిగా వుంది. ఒక అయిదు నిమిషాల తర్వాత, ఆమె విశ్వం దగ్గరికొచ్చి, మీరు, "రఘునందన్, కాదు కదా?" అని అడిగింది.

విశ్వం కొద్దిగా కంగారుపడి, "కాదండి. నా పేరు విశ్వం," అని బదులిచ్చాడు.

"సారీ! ఒక్కదాన్నే కూర్చోవాలంటే బోరుగా వుంది. మీ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ కూర్చోనా?" అంటూ ఆమె అతను అనుమతి ఇవ్వకముందే అతనికెదురుగా కూర్చుంది. ఆమె నుండి వచ్చే పెర్ఫ్యూం సువాసన విశ్వానికి ఆహ్లాదకరంగా వుంది. ఆమె ముందుగా మాట్లాడింది.

“ నా పేరు సునయన. విప్రోలో ప్రోగ్రామరుగా పనిచేస్తున్నాను. ఇంకా పెళ్ళికాలేదు. ఒకతను కలుద్దామంటే వచ్చాను."అని చెప్పి ఆమె విజిటింగ్ కార్దునిచ్చింది.

నా పేరు విశ్వం. నేను గూగులులో డేటా అనలిస్టుగా వుంటున్నాను." అని తన కార్డు యిచ్చాడు.

"చూడడానికి అందంగా, ఠీవిగా వున్నారు. ఎవరో మీ గాల్ ఫ్రెండ్? చాలా లక్కీ !"

“ఆద్య. నా చిననాటి స్నేహితురాలు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను."

"నాకా చాన్సు ఇవ్వకూడదూ? మీ లాంటి అబ్బాయికోసం ఎదురుచూసి విసిగిపోతున్నా. ఆస్థి, అందం, వుద్యోగం వుండీ యేం లాభం? నచ్చిన భర్త లేక పోయాక. ఇద్దరం ఐటి వాళ్ళం కూడా" "

"సారీ! నాకు వేరే ఆలోచన లేదు. ఇంతకు ముందు కొందరు అమ్మాయిలు ఇన్స్టాలో, ఫేసుబుక్ లో పరిచయం చేసుకుని, ప్రేమిస్తున్నామని చెప్పారు. నా ఆద్య కోసం వారిని కాదనుకున్నాను.”

“ నాకు సంగీతం వచ్చు, చాలా శ్రావ్యంగా పాడుతాను. ఊహించుకోండి. వెన్నెల రాత్రి, మన మేడ బాల్కనీలోవున్న వుయ్యాలలో నా ఒడిలో మీరు, పాట పాడుతూ నేను, నా పూల జడను సవరిస్తూ మీరు, మీ ముక్కు పిండుతూ జడవదలమని నేను. ఆహా ఎంత అందం! ఎంత హాయి!"

“ఎంత అందమైన దృశ్యం. అయితే, మిమ్మల్నీ ఆ సంతోషాన్ని నేను అంతగా మిస్ కాను. ఎందుకంటే అల్లరి చేసే ఆద్య వుంటుంది నా ప్రక్కన."

వారి సంభాషణ మరో పదిహేను నిమిషాలు సాగింది. ఆద్య రాలేదు, విశ్వం విసిగిపోయి, ఆమె దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.

@@@

ఇంటికి చేరిన విశ్వానికి శారద యెదురు వచ్చింది.

"ఇదేం పని విశ్వం! ఆద్యతో కాకుండా ఎవరితోనో మాట్లాడి, సంబంధం కుదుర్చుకున్నావుట?"

"ఎవరు చెప్పారు అత్తా? ఆద్య రానే లేదు. అక్కడ ఒక అమ్మాయి పెళ్ళి చేసుకుందామని అంది. కాదని వచ్చేసాను."

"మరి ఈ చేతులు కలుపుకున్న ఫోటో, కౌగిలించుకున్న ఫోటో, ఇవన్నీ మాయేనా?"

"వీటిలో యేముంది? ఆ అమ్మాయి మాట్లాడుతూ చేతులు పట్టుకుంది, ఇద్దరం విడిపోయేటప్పుడు స్నేహ పూర్వకంగా కౌగిలించుకుంది. అయినా అక్కడికి వచ్చిన ఆద్య, చాటుగా ఈ ఫోటోలు తీయడమెందుకు? మా దగ్గరికి వస్తే అంతా తెలిసిపోయేది కదా?" "

అంతలో విశ్వం తల్లి కల్యాణి వచ్చి, " ఈ వుత్తరం నా కిచ్చి వెళ్ళిపోయింది. పిచ్చిపిల్ల! మీ యిద్దరి మధ్య సమస్యలుంటే మేం లేమా?" అని ముక్కు చీదింది.

విశ్వం ఆ వుత్తరం చదివాడు. అందులో యిలా వుంది.

“అత్తా ! నా జీవితం వసంతం రాని యెడారిగా, చంద్రుడు లేని అమావాస్యగా, కురవని మేఘంగా, వికసించని కుసుమంగా, అయిపోయింది. ఎందుకు? బావకి నేను నచ్చలేదు. నాతో పెళ్ళి వద్దని పైకి చెప్పలేక కుమిలిపోతున్నాడు. రెస్టారంటులో ఒక అమ్మాయి బావకి నచ్చింది. అక్కడ బావ ముఖం చంద్రునిలా వెలిగిపోతూంటే చూసి, నాకా అదృష్టం లేదని వచ్చేసా! బావకి భారం కాకూడదని వెళ్ళిపోతున్నా!. నా స్నేహితుల సాయంతో ఒక వుద్యోగం సంపాదించుకుని నా వందేళ్ల బ్రతుకుని, భారంగా వెళ్ళదీస్తా. - ఆద్య.”

"భారంగా బ్రతికే అవసరం యేముంది? అన్నీ తనే వూహించుకుని, నింద నా మీద వేసి వెడుతుందా? " అని విశ్వం విసుక్కున్నాడు.

" నీ మీద తనకున్న ప్రేమని చెప్పడానికి ఈ వేషం వేసిందనుకుంటా. భయపడకు. దాని స్నేహితుల నంబర్లు యిస్తాను. దాన్ని చెవి మెలేసి ఇంటికి తీసుకునిరా!" అంది శారద.

"అవునత్తా! అలకలు, మాయమైపోవడాలు మనకి క్రొత్త కాదు కదా!" అని విశ్వం శారద నుంచి ఫోన్ నంబర్లు తీసుకున్నాడు.

"రారా అంటే వాయిదాలేసావు. వచ్చాక యేమన్నావో? ఆ పిల్ల మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోయింది" అని రాజేంద్ర పోపులో ఆవగింజలా ఎగిరెగిరిపడ్డాడు.

"మధ్యలో నా కొడుకేం చేసాడు? వయసొచ్చినా అల్లరిపోలేదు దానికి." అని చిటపటలాడింది కల్యాణి .

@@@

మొదట ఆద్య స్నేహితురాలు వినీతని కలిసాడు. వినీత యిలా చెప్పింది

"దానికి పెళ్ళి మీద చాలా ఆశలున్నాయి. నాకు బావ వున్నాడు. క్యూట్ గా వుంటాడు. నన్నెంతో ముద్దుగా చూసుకుంటాడని చెప్తూండేది. నిన్న నా దగ్గరికి వచ్చి బావకి నేనంటే యిష్టం లేదని చెప్పి వెక్కి వెక్కి యేడ్చింది.”

" మీరు తన మాట నమ్మారా? నేను గంభీరంగా వుంటాను. కానీ, తను వద్దని గానీ, తన అల్లరి పనులు నచ్చవని గానీ యేనాడూ చెప్పలేదు." అన్నాడు విశ్వం

" బాధపడకండి. ఇదిగో అడ్రెస్. గీతని కలవండి. ఆద్య అక్కడే వుండి వుండవచ్చు." అంది వినీత అనునయంగా.

@@@

"మీకు ఆద్య అంటే యిష్టమైతే, ఆమెతో మాటా మంతీ లేకుండా కొన్నేళ్ళు గడిపేసారేం?" అని గీత విశ్వాన్ని నిలదీసింది

" కొన్నేళ్ళు కాదు. ఒక్క యేడాదే. ఆమె నాది అన్న భావం వల్ల కావచ్చు. అదీగాక నేను మితభాషిని ."

“ఆడపిల్లలు మీలా కాదు. వారికి ఎప్పుడు మగవాడు మనసు మార్చుకుంటాడో అనే భయం వుంటుంది. అందుకే మీరు ఎన్ని సార్లు ఐ లవ్ యూ చెప్పినా అనుమానమిస్తూనే వుంటారు. మీకు ఫేసుబుక్ లో, ఇన్స్టాలో ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళెవరో కాదు. ఆద్య. వేర్వేరు పేర్లతో మిమ్మల్ని పరీక్షిస్తూనే వుంది. నా బావ నా వాడే అని పరుగున వచ్చిన ఆమె, మీరెవరి చేతులో పట్టుకుని మాట్లాడుతూంటే చూసి తట్టుకోలేక పోయింది"

ఆద్య ప్రేమ అర్ధమై విశ్వం మనసు ఆర్ధ్రమైంది.

"సారీ! స్త్రీ మనసు మీద మా మగవాళ్ళకి శిక్షణ వుండాలి. లేకపోతే, ఇలా బండగా వుండి వారి సున్నిత హృదయాలను గాయపరుస్తూంటాము." అని అన్నాడు

గీత అంగీకార సూచకంగా తలూపి ఇలా అంది, "ఆద్యని నాలుగేళ్ళుగా ప్రేమిస్తున్నరాజు వచ్చాడు. మనం ప్రేమించే వారిని కాకుండా, మనల్ని ప్రేమించే వారిని వివాహం చేసుకోవడం వుత్తమం అని అతడిని కలవడానికి వెళ్ళింది "

""నేను నమ్మను. నా ఆద్య నన్ను వదిలి వెళ్ళదు. దయచేసి ఆమెను కలిసే మార్గం చెప్పండి. ఆద్య నన్ను కాదనుకుంటే, నేనెలా బ్రతికేది?" అతని గొంతులో విషాదం ద్వనించింది.

"ఇలా" అంటూ ఆద్య అతని వెనుకగా నిలబడి అతని, మెడ చుట్టూ చేతులు వేసి అతడి శిరస్సుని ముద్దాడింది.

" ఇలా నన్ను బెదరగొట్టడం న్యాయమా? " అంటూ అతడు చప్పున లేచి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు.

"ఒక యేడాది పాటు, ఉలుకూ పలుకూ లేకుండా వున్నావు. నేరుగా పెళ్ళి అనకుండా, నాతో మాట్లాడాలన్నావు. రెస్టారంటులో ఆ అమ్మాయితో నవ్వుకుంటూ నన్ను మర్చిపోయావు. నాకోసం ఒక్క ఫోనైనా చేసావా? " అని గోముగా, అడిగింది ఆద్య.

“నాది తప్పే. కానీ ఆడపిల్లలు ఇలా శిక్షలు వేయకూడదు. చికాకు వస్తే చెక్కిలి ముద్దాడాలి , కోపం వస్తే కౌగలించుకోవాలి. అంతేగాని పారిపోకూడదు. తెలిసిందా అల్లరి భామా?" "అంటూ విశ్వం ఆమెను దగ్గరికి తీసుకున్నాడు.

విషయం విన్న ఆమె తలిదండ్రులు ముక్కున వేలేసుకున్నారు.

విశ్వం తండ్రి, ' వెధవ్వేషాలు, ఇవన్నీ ఈ పిదపకాల బుద్ధులు' అని విసుక్కున్నాడు. విశ్వం తల్లి మాత్రం, “నా కోడలు చిలిపి” అని ఆనందించింది.

ఏదైతేనేం! ఆద్య చేసిన పనికి బెదరిపోయిన పెద్దలు నిశ్చితార్ధం దండగని, నేరుగా వారిద్దరి పెళ్ళి జరిపించేసారు. పెళ్ళికి సునయన, తన భర్తతో కలిసి వచ్చింది. వారిని ఆద్య, “నా స్నేహితురాలు, ఆమె భర్త “అని విశ్వానికి పరిచయం చేసింది.

విశ్వానికి నవ్వు వచ్చింది."ఆద్యా! ఎంత అల్లరి చేసావు?” అంటూ సున్నితంగా ఆమె చెవి మెలిపెట్టాడు.

@@@

మరిన్ని కథలు

Saraina empika
సరైన ఎంపిక
- కందర్ప మూర్తి
Gharana mosam
ఘరానా మోసం
- డా:సి.హెచ్.ప్రతాప్
Tappu telisindi
తప్పు తెలిసింది
- కందర్ప మూర్తి
Aaru chintachetlu
ఆరు చింతచెట్లు
- డా. భీమ మోహన రావు
Manavatwam
మానవత్వం
- సి.హెచ్.ప్రతాప్
Naa asha aakanksha
నా ఆశ-ఆకాంక్ష
- రాపాక కామేశ్వర రావు
Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్