సరైన ఎంపిక - కందర్ప మూర్తి

Saraina empika
తరాలు మారుతున్నాయి. మనుషుల మనస్తత్వాల్లో మార్పులు
వస్తున్నాయి. పాతతరం వ్యక్తులు కష్టించి నిజాయితీగా ఆస్థులు
కూడబెట్టి ఆచితూచి ఖర్చులు చేసేవారు. ఆడంబరాలకు, వృధా
ఖర్చులకు అవకాశం ఇచ్చేవారు కాదు. ముందు చూపుతో
వ్యవహరించేవారు.
నేటితరం యువత పెద్దలు కష్టించి సంపాదించి ఇచ్సిన సంపదను
వ్యర్థంగా జల్షాలకు ఆడంబర జీవితానికి ఖర్చు చేస్తు ఆనందిస్తున్నారు.
సబ్బవరంలో పేరున్న స్వీటు భండార్ ' అమృత్ భండార్ ' యజమాని
పొదుపుల పోలయ్య. ఆయన తాత ముత్తాతల నుంచి మిఠాయిల తయారి
దుకాణం నడుపుతున్నా ఎవరికీ మధుమేహం అంటలేదు. దానికి కారణం వారు వ్యాపారంలో తిండి విషయంలో పొదుపును పాటించడం వల్లనే
అంటారు తెలిసిన జనం.
మిఠాయిలు చేసేటప్పుడు వినియోగించే దినుసులకు తగ్గ దిగుబడి
రావాలని కృషి చేస్తుంటారు. తయారైన మిఠాయిలు రుచికైన ఎక్కువ
తింటె రాబడి తగ్గుతుందని ముందుచూపుతో పొదుపు పాటిస్తుంటారు
ఇతరుల దృష్టిలో పిసినారితనం అన్నా వారు మాత్రం పొదుపుగానె
భావిస్తారు. అలా మిఠాయిల వ్యాపారంలో జాగ్రత్తల కారణంగా వారు దినదినాభివృద్ధి సాధిస్తున్నారు.
' అమృత భండార్ ' స్వీటుభండార్ యజమాని పొదుపు పోలయ్య
వయసు పైన బడటంతో మిఠాయిల తయారీలో పనివాళ్ల మీద
ఆధారపడవల్సి వస్తోంది. తయారీ కిటుకులు తనవైనా పనివాళ్ల
సహాయం తప్పడం లేదు.
పనివాళ్లు అప్పుడప్పుడు షావుకారు కళ్లు కప్పి సరుకులు ఇటు
అటు మాయం చేసి పెట్టుబడికి తగ్గ లాభం రాక సతమతమవు
తున్నాడు. పనివాళ్లను ఎంతమందిని మార్చినా ఫలితం కనిపించడం
లేదు. కొందరు తయారీ సమయంలో రుచి పేరుతో కొంత తినేస్తే
ఇంకొందరు తయారైన సరుకులు కుడిఎడమ చేస్తున్నారు.
ఇలాగైతే మిఠాయిల వ్యాపారం దివాలా తీసేలాగుందని దిగులు
పట్టుకుంది యజమానికి. ఉన్న ఒక్క కొడుకు ఆడంబరరావు తాతల
నాటి వ్యాపారం మీద దృష్టి పెట్టకుండా ఆధునిక ఆలోచనలతో
తండ్రి తలపులకు అడ్డొస్తున్నాడు. కాలంతో పాటు మనము మారా
లంటాడు. అది పొదుపు పోలయ్యకు నచ్చదు.
ఇలా రోజులు గడుస్తుండగా వారి దుకాణంలో చాల కాలం నుంచి
నమ్మకంగా పనిచేస్తున్న పనివాడు ఆకస్మిక మరణంతో షావుకారు
మిఠాయిల పనివాళ్ల వేటలో పడ్డాడు.
మిఠాయిల తయారీలో ప్రావీణ్యం ఉన్న వారు ఇంటర్వ్యుకి
రావల్సిందిగా ప్రకటన ఇచ్చాడు పొదుపుల పోలయ్య
చాలామంది యువకులు, అనుభవం ఉన్న వృద్ధులు అమృత భండార్
మిఠాయి దుకాణం ముందు వరుసకట్టేరు.
యజమాని పోలయ్య ఒక్కొక్కరిని లోపలికి పిలిచి వారి పని
అనుభవం ఇంతకు ముందు ఎక్కడెక్కడ పనిచేసారని, వారి ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నాడు.
వెంట కొడుకు కూడా ఉండి తండ్రి పనిలోకి తీసుకోబోయెవారిని అడిగే ప్రశ్నలు, జీతభత్యాలు అందుకు వారిచ్చే సమాధానాలు
శ్రద్ధగా వింటున్నాడు.
చివరకు ఒక వయోవృద్ధుడిని పనిలోకి తీసుకున్నాడు పొదుపు
పోలయ్య. కొడుకు ఆశ్చర్యపోయి అదే శంసయాన్ని తండ్రి ముందు
ఉంచుతు " నాయనా, ఎంతోమంది కుర్రాళ్లు శరీర దారుడ్యంతో
చక్కగా ఉండగా వయసు మీరిన ఈ ముసలాయన్ని మిఠాయిల
తయారీ పనికి తీసుకున్నావేమిటి ? " అన్నాడు.
" బాబూ, వ్యాపార లౌక్యం ఇక్కడే ఉంది. ఈ ముసలాయనకు
మధుమేహం ఉంది. తీపి అసలు ముట్టడట. వెనకాముందు
ఎవరూ లేరట. ఊరికి వెళ్లి చాలరోజుల వరకు పనిలోకి రాలేదని
పెద్ద దుకాణం వారు ఇంకెవరినో పెట్టుకున్నారట. పనిస్తే ఇక్కడే
ఉండిపోతాడట. మన మిఠాయిల తయారీకి సరుకు భద్రత
ఉంటుందని " చెప్పేసరికి కొడుకు ఆశ్చర్యం కనబరిచాడు.
సమాప్తం.

మరిన్ని కథలు

Gharana mosam
ఘరానా మోసం
- డా:సి.హెచ్.ప్రతాప్
Tappu telisindi
తప్పు తెలిసింది
- కందర్ప మూర్తి
Aaru chintachetlu
ఆరు చింతచెట్లు
- డా. భీమ మోహన రావు
Manavatwam
మానవత్వం
- సి.హెచ్.ప్రతాప్
Naa asha aakanksha
నా ఆశ-ఆకాంక్ష
- రాపాక కామేశ్వర రావు
Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్
Manasika vaikalyam
మానసిక వైకల్యం
- సి.హెచ్.ప్రతాప్