కొంతదూరం వచ్చాక - మంజు యనమదల

కొంతదూరం వచ్చాక " సహజత్వానికి సున్నితత్వానికి మధ్యన.. " "శూన్యంలో నిలిచిన నిశ్శబ్ద శిలలు గత చరిత్ర సాక్ష్యాలు.." నిజమే ఈ మాట. గతం లేని చరిత్రా లేదు, వర్తమానం వెంటబడుతూ, భవిష్యత్తు పై ఆశతోనే మనిషి మనుగడ, జీవనం ముడిబడి ఉన్నాయన్నది అక్షర సత్యం. చాలా సందర్భాల్లో ఆ సందిగ్ధాల నుండి జనించినదే కవిత్వం కావచ్చు. అక్షరాలను పేర్చుకుంటూ పోతే అది రచన అవుతుందేమెా కాని నలుగురిని చదివించే రచన అవదు. రాయడం ఏముంది చాలా తేలిక అనుకుంటారందరు. కాని ఆ రాతల వెనుక ఎంత అంతర్మధనం ఉంటుందో రచయితకు మాత్రమే తెలుస్తుంది. గుండె భారాన్ని దింపుకోవడానికో, మనసును మరలించే ప్రయత్నంలోనో మంచి రచనలు వెలువడతాయన్నది మన పెద్దలు చెప్పిన సత్యవాక్కులు. అది అక్షరాల నిజమని లక్ష్మీ కందిమళ్ళ నిరూపించారు తన రెండు కవిత్వ సంపుటాల ద్వారా. రెప్పచాటు రాగంలో పలికించిన సున్నితత్వాన్ని దాటి పోనివ్వకుండా, అదే శైలిని కొంతదూరం వచ్చాక కవిత్వ సంపుటిలోనూ అనుసరించారు. ఏదో అలా నాలుగు కవితలు చదివి తర్వాత తీరికగా చదువుదామనుకున్న నా చేత ఆపకుండా చదివించడమే కాకుండా, మరో రెండు మూడు సార్లు తిరగవేసేలా చేసింది. అందుకు లక్ష్మికి హృదయపూర్వక అభినందనలు. తనలోని అక్షర తృష్ణను అద్యంతమూ అద్భుతంగా "" కొంతదూరం వచ్చాక " వెనక్కి తిరిగి వెళ్ళలేక ఊపిరాడని అలజడిని అంతా శూన్యాకాశంలోకి బట్వాడా చేసినట్లుగా మనసు ఘర్షణలను, సంఘర్షణలను అక్షరాల్లోనికి అతి లాఘవంగా చేయి తిరిగిన రచయిత్రిలా ఒంపేసారు. బాధలను, వేదనలను, సంవేదనలను, నిరీక్షణలను, సహజ దృశ్యాలను, తన దృక్పథాలను, కోరికలను, కలలను, కల'వరాలను, రహస్యాలను,మసుగులను ఇలా ప్రతి చిన్న అనుభూతిని తన మనసు స్పందించినట్లుగా అక్షరీకరించారు. ఖాళీ అవుతున్న వర్తమానాన్ని తన అక్షర భావాలతో పూరించాలన్న ప్రయత్నంలో " ఒక కొత్త వాక్యం కావాలిప్పుడు" అంటూ " కాలం మనిషిని మింగేస్తూ ఉంటుంది... ... అయినా శతాబ్దాల నిరీక్షణ ఆ నీలి సముద్రంది నీ కోసం..!! " నీలి సముద్రం కవితలో ఈ పాదాలు ఎంత బాగా ఉన్నాయెా చూడండి. ఇలాంటి ఎన్నో పద బంధాలు, చిన్న చిన్న వాక్యాలు బోలెడు ఈ కవితా సంపుటిలో ఉన్నాయి. ఆమె/ఆమే " ఆమె పిచ్చిదే మరి వసంతంకై వంటి చూస్తూనే ఉంటుంది ఎండిన మాను కూడా చిగురిస్తుందన్న ఆశతో సహజమైన పరిమళంకై పాదు తీసి నీరు పోస్తూనే ఉంటుంది ప్రతిరోజూ... " ఈ చిన్న కవితలో వివరించి చెప్పడానికి ఏమి లేకుండా తేటతెల్లంగా సరళమైన భాషలోనే స్పష్టంగా చెప్పేసారు. ఎక్కువగా నదులతోనే తన భావాలన్ని పలికించారు. రైతుబిడ్డ మూలాలను మరిచిపోకుండా ఆ భావాలను పలికించారు. అమ్మ దూరమైన క్షణాలను బోసిబోయిన వాకిట్లో ముగ్గు లేదని చెప్పడం, నాన్న, నాన్నమ్మ ప్రేమలను, స్నేహాన్ని, అనుబంధాలను, అభిమానాలను, ఆరాధనా, నిరీక్షలను చూపడమే కాకుండా మరణాన్ని, బూడిదకు, విభూదికి తేడా ఏంటని ప్రశ్నించడం వంటి తాత్వికతను కూడా తన కవితల్లో స్పృశించారు. " కాలం విశ్రాంతి తీసుకోదట, మనల్నే విశ్రాంతి గదికి పంపుతుందట.. "ఎంత బాగా చెప్పారో చూసారా. ముగింపు తెలియని కథలకి ముగింపు వాక్యాలుండవన్నట్లుగా, " వాక్యం వవలసబుుతువైంది మబ్బులనెత్తుకుని పోతూ.. " అంటారో చోట. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు భావాలున్నాయి ఈ పుస్తకం నిండా. రచనకు క్లిష్టమైన పదాలు, అర్థం కాని సమాసాలు, అలంకారాలు అవసరం లేదని లక్ష్మీ కందిమళ్ళ రెండు కవిత్వ సంపుటులు నిరూపించాయి. వాడుక పదాలతో, సరళమైన భావాలను సున్నితంగా చెప్పడం, తనదైన ప్రత్యేక శైలితో చిన్న చిన్న కవితల్లోనే శూన్యాన్ని, ఆకాశాన్ని మనకందించే ప్రయత్నం చేయడం అభినందించదగ్గ విషయం. మనసుని చదివే ప్రయత్నం మనమందరం తప్పకుండా చేయాలి. చక్కని కవిత్వాన్ని "కొంతదూరం వచ్చాక.. " ద్వారా అందించిన లక్ష్మీ కందిమళ్ళ కు హృదయపూర్వక శుభాభినందనలు. మంజు యనమదల విజయవాడ.

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- Madhunapantula chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అగస్త్యుడు .
అగస్త్యుడు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు