మనిషి - మనస్సు - బుద్ధి - కందుల నాగేశ్వరరావు

Manishi-manssu-buddhi

మనిషి మనస్సులో ఎప్పుడూ ఏవో ఆలోచనలు ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా కదలాడుతూ ఉంటాయి ఎందుకు? ఆకాశంలోని తెల్లటి నీరులేని మేఘాల్లా, తుఫాను సమయంలో సముద్రతీరంలోని కెరటాల్లా ఎందుకు మనస్సు చంచలమవుతూ ఉంటుంది? మిగతా జీవకోటికి లేని ఈ ఆలోచనా ప్రవాహం మనిషికి మాత్రమే ఎందుకు? మనిషికి ఇది భగవంతుడిచ్చిన వరమా? లేక శాపమా? మనం మన మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడం సాధ్యం కాదా? మనిషి అంటే దేహము, మనస్సు, ఆత్మల కలయిక. ఆత్మయే చైతన్యవంతమైన శక్తి. దాని నుండే పుట్టిన మనస్సు జడమైన దేహంతో కలిసి ఇది నేను, ఇది నాది అంటుంది. ఆత్మ లేకుండా మనస్సు నిలువ లేదు. మనస్సు ప్రాణం సహాయంతో దేహానికి కదలికనిచ్చి తను చక్రవర్తిలా దేహేంద్రియాలతో ఇష్టం వచ్చినట్లు పనులు చేయించుకుంటుంది. మనస్సు ఆత్మకు అనుభవాలను కలిగించే పనిముట్టులాంటిది. ఆత్మ మనస్సు ద్వారా బాహ్యవిషయాలను అనుభవంలోనికి తెచ్చుకొని, తిరిగి కర్మేంద్రియముల ద్వారా పనులను చేయిస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మనస్సును నిగ్రహించి జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవచ్చు. మనస్సును నిగ్రహించుకొని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో వున్న ఇంద్రియాలవల్ల విషయ సుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతిని పొందుతాడు. మనోనిగ్రహం లేనివాడికి మనశ్శాంతి గాని సుఖంగాని ఉండదు. ఎంత అనుభవించినా తనివితీరని కామమూ (కోరికలు) , మహాపాతకాలకు దారితీసే క్రోధము మానవుడికి మహా శత్రువులు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి ఆశ్రయాలు. అందువలన మనిషి ఇంద్రియాలను చెప్పుచేతల్లో వుంచుకొని కామమనే పాపిని పారద్రోలాలి. దేహం కంటె ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటె మనస్సు శ్రేష్ఠమైనది. మనస్సు కంటె బుద్ధి అధికం. అయితే ఈ బుద్ధిని అధిగమించేదే ఆత్మ. అందువలన ఆత్మ గొప్పదనము గుర్తించి, బుద్ధితోనే మనస్సును నిలకడ చేసుకొని, కామరూపంలో వున్న శత్రువును రూపుమాపాలి. మనస్సు అనేది మనలో అనవసరమైన కోరికలతో ప్రేరేపించి, అవి తీరితే సంతోషాన్ని, తీరకపోతే దుఃఖాన్ని కలుగజేస్తాయి. ఒక కోరిక తీరిన వెనువెంటనే ఇంకొక కోరిక దాని తరువాత మరొక కోరికా నదీ ప్రవాహంలాగా వస్తూనే వుండేటట్టు చేస్తుంది. ఒకవేళ ఏదైనా కోరిక తీరకపోయినా, మనం అనుకొన్నట్లు జరగకపోయినా మనలో దుఃఖాన్ని, తరువాత కోపాన్ని ఆపైన దానికి కారణమనుకున్నవారిపైన పగ, ద్వేషం కలిగేటట్లు చేస్తుంది. మనం మన బుద్ధిని ఉపయోగించి మనస్సును నియంత్రించుకుని రాగద్వేషాలకు దూరంగా ఉంటూ మన కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. మరొక ప్రశ్న – బుద్ధి అనేది ఎలా కలుగుతుంది? చిన్నప్పటి నుండి మన తల్లితండ్రులనుండి, పెద్దల నుండి, గురువుల నుండి నేర్చుకున్న సంస్కారం, వివేకం; మనం చదివిన చదువులు, సంపాదించుతున్నజ్ఞానం, విజ్ఞానం; మన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలు నేర్పిన పాఠాలు; మనం నివసిస్తున్న సమాజంలో జరుగుతున్న సంఘటనలు మన బుద్ధిపై ప్రభావం చూపుతాయి. అందువలన బుద్ధి చదువు, సంస్కారం, జ్ఞానం, నీతి, మంచి-చెడు విచక్షణా, సామాజిక స్పృహ లాంటి ఎన్నో లక్షణాలతో పెనవేసుకొని ఉంటుంది. అటువంటి బుద్ధిని మనస్సు తన ఆధీనంలోకి తీసుకొని వివేకశూన్యుడిగా చేస్తుంది. అందుకనే ‘బుద్ధి పూర్వజన్మ కర్మఫలము’ ; ‘బుద్ధి కర్మానుసారినీ’ అని మన శాస్త్రాలు చెబుతాయి. మనస్సును నియంత్రించినప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జనుడికి బోధించాడు. సహజంగా బుద్ధిమంతులే అయినప్పటికీ ఏ యోగమార్గం వల్ల తమ మనస్సును మరింత పరిశుద్ధం చేసుకొని భగవంతుని సన్నిధిని చేరుకుంటారో ఆ యోగ ధర్మాలు కపిల మహర్షి తన తల్లికి ఇలా ఉపదేశించాడు:- తన శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తను ఆచరించడం, శాస్త్రాలలో నిషేధింపబడిన కర్మలను మానడం, తన కష్టానికి దైవికంగా లభించిన ధనంతో సంతోషించడం, ఇతరులకు ఏవగింపు కలిగించే పనులను మానుకోవడం, హింసచేయకుండా ఉండడం, సత్యమార్గాన్ని తప్పకుండా ఉండడం, సర్వేశ్వరుణ్ణి పూజించడం, మనస్సును ఏకాగ్రతగా ఉంచుకోవడం, సర్వేశ్వరుడు అయిన పరమాత్మ అంతటా నిండి ఉన్నాడని విశ్వసించడం ఇత్యాదులైన యోగధర్మాలు. నేను నాది’ అనే అహంకార మమకార రూపమైన అభిమానం వల్ల కామం క్రోధం లోభం మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వాటికి లోను గాకుండా వాని నుండి విడివడినప్పుడు పరిశుద్ధమవుతుంది. చిత్తము పరిశుద్ధమయినప్పుడు సుఖమూ దుఃఖమూ అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. *****

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.