సాగుబడి పుస్తక సమీక్ష...!! స్వచ్ఛమైన మనసు సేద్యమే ఈ అక్షర " సాగుబడి " ఇంటి బాధ్యతలనే సక్రమంగా నిర్వర్తించలేని మనుష్యులున్న ఈ రోజుల్లో సమాజ శ్రేయస్సు కోసం తన వంతుగా " ప్యూర్ " సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, సాహిత్యంలో సరికొత్త ప్రయెాగంతో మన ముందుకు తీసుకు వచ్చిన సంధ్య గోళ్ళమూడి గారి పుస్తకం " సాగుబడి ". ఆటవెలది పద్య రూపంలో మన నిత్య ఆహార పంటలను, అక్షర పంట రూపంలో మనకందించడం, అదీ రెండు భాషలలో ఏకకాలంలో ఒకే పుస్తకంలో తీసుకురావడమన్న విషయం నిజంగా అందరు అభినందించదగ్గ విషయం. ముందుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అందరం నమ్ముతాం కనుక వరిపంటను, అది పండించే ప్రదేశాలను, పంటకు అనువైన కాలాలను మెుదలైన విషయాలను చక్కని ఆటవెలదులుగా అందించారు. తరువాత కంది, మినుము, పెసర, మెుక్కజొన్న, పొద్దుతిరుగుడు, పసుపు, చెరకు, పత్తి వంటి నిత్యావసర వాడుక పంటలను వాటి వివరాలను అందించారు. పండ్ల తోటల సాగును వచనంలో వివరించి బత్తాయి, జామ, సీతాఫలం, బొప్పాయి, పనస, సపోటా, మామిడి వగైరా పండ్ల పంటల వివరాలను చక్కని ఆటవెలదుల పద్యాలుగా చెప్పారు. పూల పంటల సాగును వచనంలో వివరిస్తూ గులాబి, బంతి పూల సాగును అందమైన ఆటవెలదులుగా అక్షరాల్లో తీర్చి దిద్దారు. చివరిగా మనిషికి అత్యంత ఉపయెాగకరమైన ఒౌషద వృక్షం వేప గురించి వచనంగాను, పద్యంగాను వివరించి, అన్ని పంటలకు రక్షణ కవచమైన కంచెను గద్యంగా అందించి " సాగుబడి "ని సంపూర్ణం గావించారు. ఓ పక్క ఆంగ్లం, మరో పక్క తెలుగులో చక్కని తేలిక పదాలతో, అందరికి అర్థమయ్యే భాషలో సాధారణంగా అందరికి తెలిసిన పంటలను, వాటి మూలాలను, ఉపయెాగాలను వివరించడం ఇప్పటికి వరకు ఎవరు చేయని పని. నిరంతరం సేవా కార్యక్రమాలలో, ఓ క్షణం కూడా తీరిక లేకుండా, వయసు, ఆరోగ్యంతో కూడా సంబంధం లేకుండా కాలంతో పోటి పడే " అమ్మ " కు ఇంత అందంగా అక్షర సేద్యం చేయడానికి ఎలా తీరిక చిక్కిందో! నాకైతే పుస్తకం చదువుతున్నంతసేపూ ఆశ్చర్యమే అనిపించింది. ఈ అక్షర వ్యవసాయానికి పాదాభివందనం చెప్పడం తప్ప మరో మాట లేదు. " సాగుబడి "కి సంధ్య గోళ్ళమూడి గారికి హృదయపూర్వక శుభాభినందనలు.