కె.ఎల్.వి.ప్రసాద్ - శ్రీ అనీల్ ప్రసాద్ (ఆకాశవాణి, వరంగల్)

కె.ఎల్.వి.ప్రసాద్

డా// కే.ఎల్.వి. ప్రసాద్ గారి ‘అస్త్రం’ .. (కథలు) సమీక్షకులు: అనిల్ ప్రసాద్(ఆకాశవాణి,వరంగల్) ------------------------------------------------------------------- ఈ సృష్టిలో కోటానుకోట్ల ప్రాణులు ఉన్నాయి. వాటి అన్నింటిలో బుద్ధి జీవి మాత్రం మనిషే. ఆరు వందల కోట్ల మనిషి జనాభా లో సృజన ఆత్మ గా కలిగిన వాళ్ళు కొందరే. అందునా సృజన ఆత్మగా కలిగి .. ఆ సృజనాత్మకు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేసే వాళ్ళు అంటే కవిత ... కథ ఇంకా ఏదైనా కళారూపంగా మలిచే ప్రయత్నం చేసే వాళ్ళు బహు కొద్దిమందే ఉంటారు. ఈ విషయం అట్లా ఉంచితే ... మనిషికి ఒత్తిడి మంచిది కాదు అనే చర్చ సర్వత్రా వినవస్తోంది. కానీ మనిషికి కొంత ఒత్తిడి అవసరం అని ఒత్తిడిని ఆస్వాదిస్తే ... చాలెంజ్ గా స్వీకరిస్తే ... ప్రేరణగా మలచుకుంటే సృజన అలువుగా పారుతుందని కవితగానీ కథగానీ వికసిస్తుందని మనో విశ్లేషకుల భావన.ఈనేపథ్యంలో- డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి శస్త్రాల సంకలనంగా వెలువడిన ‘అస్త్రం’ కథానికా సంకలనం పరిశీలిద్దాం ... ఈ సంకలనంలో రెండు కథలు ‘కుంటి మనస్సు’ ‘లోచూపు’ బస్సు ప్రయాణం నేపథ్యంలో రూపుదిద్దుకున్నాయి. ఇవి వృత్తిరీత్యా డాక్టర్ గారి బస్సు ప్రయాణాలలో ఎదురైన అనుభవాలు అయి ఉండవచ్చు. ఈ 13 కథల్లో “అతడు-ఆమె” “లోచూపు” “బతుకు తెరువు” ఈ మూడు కథలు ప్రథమ పురుషలో వ్రాయబడ్డాయి. ఈ మూడింటిలో “అతడు-ఆమె” “లో చూపు” ఈ రెండు కథలు రచయిత అంతర్ముఖ వీక్షణానికి అద్దం పడతాయి. మరో రెండు కథలు జ్యోతిష్యుడు ప్రస్తావనతో రాసినవి. అస్త్రం కథ మినహా మిగిలిన నాలుగు కథలు అందరికీ అనుభవంలోకి వచ్చే సంఘటనలే. సాధారణంగా ఇలాంటి అనుభవాలని డైరీలలో భావుకంగా రాసుకుంటారు. కానీ కథకులైన డాక్టర్ కె.ఎల్.వి ఆ భావనలను కథానికలుగా మలిచారు. ఇక ఒక్కొక్క కథని పరిశీలిస్తే స్పర్శిస్తే ... “అతడు-ఆమె” అనే కథ కాలేజీ నేపథ్యంలో సాగుతుంది. యవ్వన దశలో ఆకర్షణలనీ ... ఎవరికైనా తన దాకా వస్తే ఎలా ఉంటుందో ఎత్తి చూపినట్లు ఉంటుంది ఈ కథ. ఫ్లాష్ బాక్ లో జరిగిన కథ విషయాన్ని చెబితే.... ప్రస్తుతం లో సాగే వర్ణన విశ్రాంత జీవితం ఎలా గడపాలి అన్న విషయాన్ని విశదపరుస్తుంది. అభిరుచులకు అవకాశం దొరకక సాగే ఉద్యోగ జీవితం ముగిశాక ... ప్రకృతిని ఆస్వాదిస్తూ.. యవ్వన స్మృతులను అప్పుడప్పుడు తలుచుకుంటూ ... అభిరుచులను ఆస్వాదిస్తూ వయోభారాన్ని ఎలా మరచిపోవచ్చు తెలిపే ప్రయత్నం గా కనిపిస్తుంది. దీనికి సీక్వెల్ గా “లోచూపు” కథలో అంశం. తలలు బోడులైనా తలపులు బోడులు కాక చాలామంది పురుషుల్లో కనిపించే గిల్టీ కాంక్షియస్ నెస్ కి అద్దం పడుతుంది. ఇక “అబ్బాయి చదువు” “నేరం నాది కాదు” ... ఈ రెండు కథలూ ఈ రోజుల్లో చదువుల విషయంలో పిల్లల కన్నా పిల్లల్ని కన్న వాళ్ళ ఆరాటం పోరాటం కనిపిస్తాయి. “అబ్బాయి చదువు” కథలో అబ్బాయికి స్టేట్ ర్యాంక్ రావటం ... అనంతరం పిల్లాడి ఇష్టా ఇష్టాలను అడగకుండా తమ తమ ఇష్టాలనే వాడి పై రుద్దటం కోసం తల్లి తండ్రి పోట్లాడుకోవడం. ఇట్లాంటిదే మరో కథ “నేరం నాది కాదు” ఈ కథ అమ్మాయి పరీక్ష ఫలితాన్ని మొదటగా స్టేట్ ర్యాంక్ నుంచి మొదలు పెట్టి చూసే తీరు ... తల్లిదండ్రుల ఆరాటాన్ని నేల విడిచిన సామునీ ప్రతిఫలిస్తుంది. ముడి కథలో నరేష్ అనే వికలాంగుడి పాత్ర ఒక రోల్ మోడల్ పాత్ర. వైకల్యాన్ని జయించిన విల్మా రుడాల్ఫ్ అనే క్రీడాకారిణి జీవితాన్ని గుర్తుకు తెస్తుంది. ఇక ‘నందిని’ లాంటి సామాజిక స్పృహ ఉన్న పాత్రలనెన్నింటినో చూస్తూ ఉంటాం. కానీ.. నందిని, నరేష్ వివాహం చేసుకోవటం మామూలు సినిమా కథల్లో కనిపిస్తుంది. కానీ చందన అనే మరో పాత్రతో వివాహం ముడివేయడం కొత్త ఒరవడి. అంతే కాదు ప్రతి విషయంతో పెనవేసుకుంటున్న రాజకీయ ముడికీ అసలు విషయాన్ని తప్పుదోవపట్టించే మీడియా హడావిడికీ... శస్త్రం లా తగిలేలా సంధించిన ఒక అస్త్రం ఈ కథ. మొదటి కథ “అతడు-ఆమె” తో పాటు ఫ్లాష్ బ్యాక్ తో సాగే మరో కథ ఈ పుస్తకంలో నాలుగవ కథ “తప్పటడుగులు” తోట కూడా తోటకూర నాడీ చెప్పాలి అనేది లోకోక్తి కి కథా రూపాన్నిచ్చే రచయిత ప్రయత్నం ఈ కథలో కనిపిస్తుంది. పిల్లలు తప్పు చేసినా వెనకేసుకు రావడం ఓ తప్పటడుగు. తప్పు చేసినా పరవాలేదు నా బిడ్డ విజేతగా నిలవాలి అనే పెద్దల తాపత్రయం మరో తప్పటడుగు. ఏకుల్లాంటి పిల్లల్ని మేకులుగా మారుస్తున్నామనే స్పృహ లేకపోవడం మూడో తప్పటడుగు. ఈ మూడు తప్పటడుగుల ఫలితం వృధ్ధాప్యం లో కనిపిస్తుంది అని వివరించే కథ ఇది. ఈ సంపుటంలోని కథలు అన్నింటిలోకి కాస్త పెద్ద కథ “అంకితం”. సత్కారాలు, పురస్కారాలు ... చీత్కారాలకి ఎలా ఆస్కారం ఇస్తాయో ఎరుక పరిచే కథ ఇది. “ఆమె గెలిచింది” అన్న కథ మహిళా సాధికారత కి ఓ మంచుతునక. స్త్రీ అబల కాదు అని నినదించే కంటే ... విద్య నేర్చి సబల కావచ్చు అని అన్యాపదేశంగా చెప్పడం.. స్త్రీ-పురుషులు ఆధిపత్య పోరులో మనసులు వికలం చేసుకునే కంటే ... పరస్పర ప్రేమ గౌరవాలతోనే బలమైన బంధం సాధ్యమవుతుందని చెప్పటం ఈ కథ ప్రత్యేకత. ఈ సంపుటిలో కథలన్నీ ఉత్తమమైనవే.... అయితే .. వ్యవస్థలను మార్చే సంస్కర్తలు అందరూ ఉండరు.. . లోపం లేని వ్యవస్థ ఒకటి వస్తుంది అని అనుకోవటం కాకుండా ... ఉన్న వ్యవస్థలో ఉన్నతంగా ఉదాత్తంగా ఉనికిని కోల్పోకుండా ఎలా జీవించాలో నేర్పే “ఆటోవాలా” .. నవసమాజ నిర్మాతను నేను కాను.. దీన జనోధ్ధరణకు నడుం బిగించే దేవదూతను నేనేఅనుకోను .. సాటి మనిషి తెగిన పాదుకని కాసులు ఆశించక ఒక కుట్టువేసి ఇస్తా అనే “మనీషి” ... ఉత్తమోత్తమమైన సందేశాన్ని ఇచ్చే కథలు. ***** ***** ***** ***** ***** *****

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్