చందమామ రావే: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

chandamama raave book review
రచన: గీతాచార్య, శతఘ్ని
వెల: 125/-

ఒక ఆదివారం నాకో ఫోన్ పిలుపు వచ్చింది. నన్ను ఫేస్ బుక్ లో ఫాలో అవుతున్న యువ సాహితీ మిత్రులంతా ఒక చోట కలుస్తున్నామని, నన్ను కూడా రమ్మని ఆ ఫోన్ కాల్ సారాంశం. సరదాగా వెళ్దామనిపించింది. జలగం వెంగళరావు పార్కులో కలుసుకున్నాం. కాసేపు వర్తమాన సినిమా రంగం గురించి ఈ వర్ధమాన కవి రచయితలంతా తలో మాట మాట్లాడారు. వారిలో చాలా మంది సినిమాల్లో ఒకటి రెండు పాటలు రాసినవారున్నారు. అందరిలోను మంచి సాహిత్యం రాయాలనే తపన, తపస్సు కనపడ్డాయి. వారిలో కొందరికి సంస్కృతం మీద అవగాహన కూడా ఉంది. ఇంతకీ అంతా పాతికేళ్ళ లోపువాళ్ళే. ఒకరు శివుడిపై పాటలు పాడుతుంటే వింటూ, మరొకరు సాహిత్య మర్మాలు చర్చిస్తుంటే తన్మయంతో మందహాసం చేస్తూ తమలో తాము రమించుకున్నారు.

రెండు గంటల సమయం తెలీకుండా గడిచిపోయింది. చివర్లో ఇద్దరు రచయిలు (గీతాచార్య, శతఘ్ని) నాకో పుస్తకం ఇచ్చారు. "చందమామ రావే" అనుంది.

"దేని గురించి"? అనడిగాను.

"అన్నీను..కవితలు, కథలు, వ్యాసాలు...", అన్నాడు గీతాచార్య.

కాసేపు పేజీలు తిరగేసాను. రాయాలనిపించిందంతా రాసేసి, అచ్చేయ్యాలనిపించినవన్నీ వేసేసారన్నమాట అనిపించింది.స్థాలీపులాకంగా చూస్తే విషయం ఉందనిపించింది. తీరుబడిగా చదవాలనిపించింది.

ఎవరో అవకాశం ఇచ్చి నాలుగు నోట్లు పరేసాదాక పెన్ను తీయమని కూర్చోకుండా మనసులో ఉన్న రచనా పిపాసను ఇలా తీర్చుకున్నారు ఈ కవిద్వయం.

శతఘ్ని రాసిన "ఊరి చివర దేవత" కవిత చదివితే గుండె కరిగి కళ్ళళ్ళో పొంగుతుంది. వేశ్యలు ఎక్కడుంటారో తెలుసుకుని మరీ పాదాభివందనం చేయాలనిపిస్తుంది.

"చీకటి పడితే కానీ
మా బతుకుల్లో వెలుగు రాదు...!
రెండు పగళ్ళ మధ్యన చితికితే కానీ...
మా వంటిళ్ళలో పొయ్యంటుకోదు...
.......నా కోసం నేను పొడుకుని
అసలెన్నాళ్ళయ్యిందో.."

ఈ స్థాయిలో సాగుతుంది ఆ కవిత.

అలాగే మరో కవితలో "పద ముందుకు పడకుండ...పడినా నీ కల చెడకుండా" అని సినీగీత పంక్తిలా ధ్వనించే ముక్తాయింపుతో పెన్నుపట్టి వెన్నుతట్టే కవిత కూడా రాసాడు.

ఇక గీతాచార్య రచనల్లో "ఒక ఓటరు ఆత్మలేని కథ" ఆకట్టుకుంటుంది. ఆలోచించి రాసే పనిపెట్టుకోకుండా అనిపించింది రాసేస్తూ ఉంటే ఎంత స్వచ్చంగా ఉంటుందో అనిపించే రచనలితనివి. కొన్ని ఇంగ్లీషు కవితలు కూడా అక్కడక్కడ రాసాడు.

ఇది చదివే వారికి రచనాశక్తి పెరుగుతుందని చెప్పలేనుకానీ, రచనాసక్తి కచ్చితంగా కలుగుతుంది. నేటి యువతలో తెలుగు పట్ల మమకారం లేదు, తెలుగు పుస్తకం అంటే గౌరవం లేదు, అసలు తెలుగు రాసే లక్షణమే లేదు అనుకునే వారికి ఈ గీతాచార్య-శతఘ్ని ద్వయం జెల్ల పీకి కళ్ళు తెరిపిస్తారు.