పుస్తక సమీక్ష - శిరంశెట్టి కాంతారావు

book review

మూలాల తడుములాటే ‘మొదటి తరం రాయలసీమ కథలు’

పుస్తకం పేరు: మొదటితరం రాయలసీమ కథలు,
సంపాదకుడు:డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
పేజీలు:240
వెల:రూ.200/-
ప్రతులకు: కె.మురళీమోహన్,
ఫ్లాట్ నెం.9111,
బ్లాక్ నెం.9ఏ,
జనప్రియ మహానగర్,
మీర్‌పేట్,
హైదరాబాదు 500 097


ఒక పురాతత్త్వ శాస్త్రవేత్త ఒక్కో భూమిపొరను సున్నితంగా తవ్వుకుంటూ లోలోపలికి వెళ్ళి శతాబ్దాలుగా ఆ మట్టిపొరల మధ్య నిక్షిప్తమైవున్న చరిత్రను స్వయంగా దర్శించి ఆ చరిత్రతో తాదాత్మ్యం చెందుతాడు. అటుతరువాత తన మూలాల ఉనికిని సంక్షిప్తంగానూ, సమగ్రంగానూ వర్తమాన సమాజానికి అందిస్తాడు. దాని ఫలితంగా తమ గత వైభవాల ఉన్నతిని తెలుసుకున్న వర్తమాన జనులు స్పూర్తిని పొంది తమ వారసత్వాన్ని ముందు తరాలకు అందించాలనే సంకల్పాన్ని స్వీకరిస్తారు.

 ఆ విధంగానే భాషోద్యమకారులు కూడా తమ తమ ప్రాంతాలకు సంబంధించిన విస్మృత సాహిత్య గుప్తనిధులను కాలం పొరలనుండి వెలికితీసి ‘‘ఇదీ మన గత వైభవ సాహిత్య సంపద హృదయంతో చూడండీ!’’ అంటూ తమ జాతిజనులకు ఎత్తి చూపిస్తారు. వారిని తమ గత చరిత్ర మూలాల పట్ల దృష్టిని సారించేటట్టుగా తయారు చేసుకుంటారు. ఆవిధంగా సాహితీ దీపధారులై ముందుతరాలకు దారి చూపుతారు. ఒక మార్గ నిర్ధేశనం చేస్తారు.

అయితే, ఈ మొత్తం కార్యక్రమ నిర్వాహణకై ఒక భాషావేత్త ఎంతో సహనాన్ని, పట్టుదలను పూనిక వహించాల్సి ఉంటుంది. మనిషికి ఏదీ ఉత్తపుణ్యానికి  లభించదన్న ప్రాధమిక జీవన మూలాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ తన కర్తవ్య సాధనలో ముందుకు సాగాల్సి ఉంటుంది. అప్పుడే అతను పదుగురికి అనుసరణీయుడవుతాడు.

అటువంటి పనిని అనంతపురం జిల్లా, గాండ్లపెంట మండలం, తాళ్ళకాల్వ గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించిన డా.అప్పిరెడ్డి హరినాధరెడ్డి చేసి చూపించారు. ఆయన తను పుట్టిన నేల అయిన రాయలసీమ కక్షల కథలపై పరిశోధన చేసి కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి.పట్టాపొందారు.

డా.రెడ్డి ‘మొదటితరం రాయలసీమకథలు’ (1882 – 1944) అనే కథాసంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకొచ్చారు. ఆదర్శప్రాయమైన పాత్ర నిర్వహించారు.

డా.రెడ్డి ఒక పక్క వృత్తిపరంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే మరొకపక్క ప్రవృత్తిపరంగా తనకత్యంత ఇష్టమైన సాహితీ వ్యాసంగాన్నీ నిరంతరాయంగా కొన సాగిస్తున్నారు. అందులో భాగంగానే అనేక సాహిత్య, సామాజిక వ్యాసాలు వ్రాశారు. అనేక సాహిత్య సభలలో పత్రసమర్పణలు కావించారు. ఇంకా ఇప్పటి వరకు వెలుగు చూడని అనేక శాసనాలను, తాళపత్ర గ్రంధాలను, పురాతన లిపులను, రేఖాచిత్రలను వెలికితెచ్చే కృషిలో తలమునకలై యున్నారు. అనేక పుస్తకాలకు సంపాదకత్వ భాద్యతలు నిర్వహించారు.

డా. రెడ్డి ‘సీమసాహితీ స్వరం – శ్రీసాధన పత్రిక’ అనే తన పరిశోధక పుస్తకానికి గాను 2014 కేంద్రసాహిత్య  అకాడెమీ వారి యువపురస్కార అవార్డును అందుకున్నారు.

అయితే, హరినాధరెడ్డి చేసిన అన్ని సాహిత్య కార్యక్రమాల్లోకి ఈ ‘మొదటి తరం రాయలసీమ కథలు’ అనే కథాసంకలనమే నా దృష్టిలో అత్యుత్తమమైన సాహిత్యకృషిగా పేర్కొంటాను. ఎందుకంటే ఆయన ఎన్ని పత్రసమర్పణలు చేసినా, ఎన్ని శాసలనాలను, ఎన్ని తాళపత్ర గ్రంధాలను పరిష్కరించినా ఆ పనులన్నీ ఉన్నతశ్రేణి కార్యకలాపాలక్రిందకొస్తాయి. ఆయన శ్రమ, దాని విలువ, ఔన్నత్యం కొంతమంది విశేష వ్యక్తుల పరిధికే పరిమితమవుతుంది. కానీ, ఈ సంకలనం మాత్రం ఖచ్చితంగా తన ప్రాంతంలోని సామాన్యులకు చేరువౌతుంది. దీన్ని చదువుకున్న ప్రతిసాధారణ పాఠకుడు కూడా తన చరిత్రమూలాలను అవగాహన చేసుకుంటాడు. కనీసం ఆ దిశగా ఆలోచించనైనా ఆలోచిస్తాడు. కాబట్టి ఆరకంగా సామాన్యుణ్ణి కదిలించగలిగే కృషి ఈ పుస్తకంనిండా గంపల కొద్దీ దొరుకుతుంది. అందుకే ఇప్పటి వరకు ఆయన సాగించిన సాహితీ వ్యవసాయంలో ఇది అత్యంత విలువైన ఫలసాయంగా భావిస్తున్నాను.

ఇక సంకలనంలోని విషయంలోకొస్తే.. ఇది నలభైరెండు కథానికలతో (అనుబంధం కాక) రెండువందల నలభైపేజీలతో, కేతు విశ్వనాధరెడ్డి, సింగమనేని నారాయణగారి వంటి సాహితీ దిగ్గజాల ముందు మాటల ఆశీర్వచనాలతో చూడగానే చేతిలోకి తీసుకోవాలనిపించేంత చక్కని కూర్పుతో వెలువడిన మంచి పుస్తకము.

 సహజంగా తెలుగువారిలో ముఖ్యంగా కథాసాహిత్యానికి సంబంధించి ఒక బలమైన అభిప్రాయం గూడుకట్టుకొనివుంది.

అదేమిటంటే? 

గురజాడకు ముందు అంటే 1910 మొట్టమొదటి ఆధునిక కథానికగా చెప్పుకుంటున్న ‘దిద్దుబాటు’కు ముందు తెలుగు కథానికల్లో కేవలం గతమేవుండేది. గురజాడ ‘దిద్దుబాటు’ నుండి మాత్రమే తెలుగు కథానికల్లో వర్తమాన సంఘటనలు కథానికా వస్తువులయ్యాయన్న ఒక బలమైన నమ్మిక వుండేది. కానీ, ఈ సంకలనంలోని మొదటి కథానిక అయిన ‘రుతుచర్య’ ను పరిశీలించినట్టయితే ఒక్కభాషను తప్పించి పరికించినట్టయితే ఆ భావన తప్పు అన్న విషయం మనకు అర్ధమవుతుంది. ఆవిధంగా తెలుగునాట గురజాడకన్నా ముందు నుండే వర్తమానం కథానికగా కొనసాగబడుతూ వచ్చిందని చెప్పడానికి మనకొక దృష్టాంతం కనబడుతుంది.

ఇకపోతే 1930 ప్రాంతాల్లో రచయిత ఎవరో తెలియని ‘‘ఒక చిన్న కథ’’ అనే కథానిక ద్వారా ప్రాంతాలకు అతీతంగా ఇప్పటికీ  కొనసాగుతున్న కొన్ని పదాల కారణంగా మన భాషామూలాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం మనం గమనించవచ్చు.

కథానికలో రామాపురం అన్న గ్రామం పినాకిని నది ఒడ్డున వుంటుంది. అది అన్నిరకాలుగానూ స్వయం సమృద్ధమైన గ్రామం. ఆఁ గ్రామపురోహితుని పేరు వెంకటరామ శాస్త్రులు. కథకుడు అతని స్థితిగతులను వివరిస్తూ.. ‘‘అతనికి ఇరవై ఎకరాల తరి, యాభై ఎకరాల ఖుష్కి భూమి వుంది’’ అంటూ పేర్కొంటాడు.  

సాధారణంగా ఈ పదాలు నిజామ్ రాజ్యమైన నైజామ్ (తెలంగాణ)లో జనబాహుళ్యంలో వాడుకలో వుంటాయి. మరి అక్కడి పదాలు ఇక్కడెట్లా వాడుకలో వున్నాయని ఒక్కసారి ఆలోచిస్తే మనకు అనేక విషయాలు అవగతమవుతాయి.

నిజామ్ రాజ్యంలో ఉర్దూ అధికార భాష. దాంతో పరిపాలనకు సంబంధించిన కార్యకలాపాలు మొత్తం ఉర్దూలోనే కొనసాగేటివి. భూవివరాలు తెలియజేసే పహణీలన్నీ ఉర్దూలోనే వుండేవి. ఇప్పటికీ పహణీల్లో అవేపదాలు కొనసాగుతూ వస్తున్నాయి. దాంతో సాధారణప్రజలు కూడా ఉర్దూను అనివార్యంగా మాట్లాడుతుండేవారు.

అయితే రాయలసీమ ప్రాంతంలోని పహణీల్లో కూడా ఇప్పటికీ నిజామ్ ప్రాంతపు ఆ ఉర్దూ పదాలే వాడుతుండడం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యంతోపాటు మనకాప్రాంతపు చరిత్రక, రాజకీయ పరిణామాలూ అవగాహనకొస్తాయి. 

1799లో ఆగ్లేయులచేతిలో టిప్పు సుల్తాన్ పరాజయం తరువాత అప్పటిదాకా తన పాలన కింద వున్న బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను యుద్దపు ఖర్చులు కింద నిజామ్ బ్రిటీష్ వారికి దత్తం చేశాడు. అందుకే అవి అప్పటి నుండి దత్తమండలాలుగా చరిత్రలో పేరు పొందాయి. ఆ తరువాత బ్రిటీష్ వాళ్ళు వాటిని తీసుకుపోయి మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశారు.

స్వాతంత్య్రం తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ ఏర్పాట్లలో భాగంగా బళ్ళారి కర్నాటకకు వెళ్ళిపోగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విడిపోయిన తరువాత అవి తిరిగి సీమాంధ్రలో భాగమయ్యాయి. ఈ విధంగా రాజకీయకారణాలతో ప్రాంతాల సమీకరణలు ఎన్నిరకాలుగా మారిపోయినా, భౌతికంగా సరిహద్దులు చెదిరపోతూ వస్తున్నా భాషాపరమైన మూలాలు మాత్రం వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా అలా కొనసాగుతూ వస్తున్నాయి. సార్వజనీనమైన ఈ సత్యం మనకు అవగతమవుతుంది. సాహిత్యం చరిత్రను అర్ధం చేసుకోవడానికి ఏవిధంగా ఉపయోగ పడుతుందో మనకు తెలిసివస్తుంది. ఆవిధంగా ఈ కథానిక ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరినట్టుగా మనం భావించుకోవచ్చు.

‘‘ఇరువురు యాత్రికులు’’ అన్న మరొక కథానికలో ఒక పల్లెనుండి తిరుపతి కొండకు బయలుదేరిన ఇద్దరు వృద్ధరైతుల్లో ఒక రైతు మార్గమధ్యంలో ఒక గ్రామంలో క్షామానికి గురై చనిపోతున్న కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో అక్కడే ఆగిపోయి వాళ్ళను కాపాడిన తరువాత చేతిలో పైసలు అయిపోవడంతో అక్కన్నుండే దేవునికి దండం పెట్టుకుని వెనుదిరుగుతాడు. మరొక రైతుమాత్రం దారిలో దేన్నీ పట్టించుకోకుండా నేరుగా కొండకు వెళ్ళి దైవదర్శనం చేసుకుని వస్తాడు. కాలాంతరంలో దైవదర్శనాన్నికూడా వదులుకుని పరోపకారాన్ని తలపెట్టిన రైతుకు అన్నీ అనుకూలంగా జరిగితే దేవునిపేరుతో తోటివారిని పట్టించుకోని రైతుకు అన్నీ నష్టాలే జరుగుతాయి. అట్లా ఈ కథానిక సమాజసేవే దైవసేవకన్నా గొప్పదన్న సత్యాన్ని తెలియజేస్తుంది.

‘‘భగీరథ ప్రయత్నం’’ అన్న కథానికలో విషయం కన్నా శిల్పం ఎంతో విలక్షణమైనది. ఆ కథకుడు ఆనాడే ఎంతో నేర్పుతో కథనాన్ని కొనసాగించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

అట్లాగే ఇందులో వున్న ప్రతి కథానికా ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న కథానికగా పేర్కొన వచ్చు. పేరు తెలియని కథకుల నుండి మహా విధ్వాంసుడైన విధ్వాన్ విశ్వంగారిదాకా ఎంతో మంది పూర్వకాలం కథకుల కథానికలను ఎంతో ప్రయత్నంతో సేకరించిన డా. అప్పిరెడ్డి హరినాధరెడ్డిని, వాటిని పుస్తకంగా వెలువరించిన అబ్జక్రియేషన్స్ (హైదరాబాద్)వారిని ఆపనిలో సహకరించిన ప్రతి ఒక్కరి కృషిని మనమంతా మనస్పూర్తిగా అభినందించాల్సివుంది. వట్టి అభినందనలతో సరిపుచ్చక  కథానికా ప్రేమికులంతా ఈ పుస్తకాన్ని కొని చదవాల్సిందిగా పాఠకులందరికీ మనవి చేసుకుంటున్నాను. అట్లా చేసినట్టయితే డా. రెడ్డిగారి బృందం నుండి మనం మరిన్ని మంచి పుస్తకాలను ఆశించవచ్చు.                                                 

మరిన్ని సమీక్షలు

సున్నితం చంద్రికలు
సున్నితం చంద్రికలు
- రాము కోలా.దెందుకూరు.
మహాభావాలు కవితా సంకలనం
మహాభావాలు కవితా సంకలనం
- రాము కోలా.దెందుకూరు
పరిగె నుండి తమి  వరకు
పరిగె నుండి తమి వరకు
- బి.కృష్ణారెడ్డి
ఆలోచింపజేసేకథలు
ఆలోచింపజేసేకథలు
- అనీల్ ప్రసాద్, ఆకాశవాణి, వరంగల్
కె.ఎల్.వి.ప్రసాద్
కె.ఎల్.వి.ప్రసాద్
- శ్రీ అనీల్ ప్రసాద్ (ఆకాశవాణి, వరంగల్)