గొప్ప శిల్ప విహంగమే ‘I’ కవిత్వ సంపుటి - అఖిలాశ

గొప్ప శిల్ప విహంగమే ‘I’ కవిత్వ సంపుటి

పోరాటాలు, మూఢనమ్మకాలు, అణచివేత, వివక్ష, దోపిడీ, హింస, అన్యాయం, అరాచకం, కుల పోరాటాలు, మత అల జడులు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోరాటాలు, అంటరానితనం, బాల్య హింస, స్త్రీల వెనుకబాటుతనం, పురుష అహంకారం ఇలా అనేక సమస్యలపై తనదైన గొంతుకను వినిపించి ప్రజలను సంఘటితం చేసింది కవిత్వం. పోరాటాన్ని, ప్రశ్నించే తనాన్ని నేర్పిందీ కవిత్వమే. ప్రజల జీవితాల్లో ఎంతగానో ఇమిడిపోయిన కవిత్వం నేడు చిన్నచూపు గురి అవుతుందా? అంటే నిజమనే చెప్పాలి. కవిత్వంపై ఆదరణ తగ్గిపోడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అందులో ముఖ్యమైనవి :

1.కవిత్వం కేవలం వచనమై తేలిపోవడం.

2.సాధారణ ప్రజలకు అర్థం కాకుండా రాయడం.

చాలామంది తేలిపోయే కవిత్వం రాయడం వల్ల మంచి కవిత్వం ఎవరు రాస్తున్నారు? ఎక్కడ ఉన్నదని కనుక్కునే అవకాశం లేకుండా పోయింది. కాని మంచి కవిత్వం ఎక్కడున్నా రీడర్ కనుక్కోవాలంటే విమర్శకులు ఆ కవితా సంపుటిని పరిచయం చేయాలి. సరిగా లేని కవిత్వాన్ని విమర్శకుడు విమర్శ చేసినట్టే మంచి కవిత్వాన్ని ఆదరించాలి. అభినందాత్మక విమర్శ రాసి ఆ కవిత్వాన్ని మరింత వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అది విమర్శకుల బాధ్యత. ప్రముఖ కవి శివారెడ్డి గారు నేటి ఆధునిక కవిత్వానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని నడిపిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి కుమారులే శ్రీకాంత్ గారు. ఇటీవల “I” (ఐ) అనే కవితా సంపుటిని తెలుగు సాహిత్య లోకానికి అందించారు. 312 పుటలు ఉన్న పుస్తకంలో 211 కవితలు ఉన్నాయి.

కవులు మూడు రకాలుగా విభజిస్తే :

1.భావవాదులు

2.అభ్యుదయవాదులు

3.భావభ్యుదయ వాదులు

భావ వాదులు దేవుడు, దెయ్యం, పూజలు లాంటి వాటిని సమర్థిస్తూ కవిత్వం రాస్తూ ఉంటారు. అభ్యుదయ వాదులు వీటిని వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భావ వాదులు దేవుడే సకాలానికి కారణమని, అందరూ దేవుడు బిడ్డలేనని, కర్మ ఫలితాలే జీవితాన్ని నిర్దేశిస్తుందని చెప్తే వాటిని వ్యతిరేకించి శ్రమ, కష్టమే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లుతుందని అభ్యుదయ వాదులు అంటారు. వీటి మధ్యలో ఉన్నవారే భావ అభ్యుదయ వాదులు. వీరు దేవుణ్ణి నమ్ముతారు కాని అందులో ఉన్న లోపాలను నిర్మొహమాటంగా చెప్తారు. 

శ్రీకాంత్ గారు భావభ్యుదయ వాది.

  • నా జీవితానికి స్వర్గలోకం ఇచ్చిన అనుమతి నీవు (పుట 13)
  • పార్వతి చేతుల్లో పిండి ముద్దలో రూపు దిద్దుకున్న ఓ పిల్లవాడి కథ నిజమే అనిపిస్తుంది. (పుట 15)
  • ఎందుకో గత జన్మలయ్యీ, పునర్ జన్మలయ్యీ అనంతంగా గుర్తుకువచ్చి- ఎందుకో (పుట 25)
  • ఒక మహా తాంత్రిక వశీకరణ విద్యా అబ్బుతుంది నీకు. (పుట 35)
  • ఎవరైనా దేవతలు తిరుగుతున్నారేమో ఇక్కడ ఎవరైనా గంధర్వులు తమ గానంతో సమస్తాన్ని మంత్రిస్తున్నారేమో ఇక్కడ. (పుట 71)
  • అది హిమవనాల సుమానిదా లేక పూర్వ జన్మ సుకృతో తెలియదు (పుట 72)
  • పురాజన్మల పాపములు, కర్మములు తీరునట్లు (పుట 92)
  • ఎవరిదో శ్వాస నా ఆత్మ చుట్టూ (పుట 199)

పై వాక్యాలు రాసిన శ్రీకాంత్ గారు అచ్చమైన భావభ్యుదయ వాదే. శ్రీకాంత్ గారు ఈ పుస్తకంలో ఎక్కువగా స్త్రీ, తల్లి, ఫీల్ గుడ్ పోయెట్రీ రాశారు. తల్లి కష్టాన్ని, భార్య ప్రేమపై ఎక్కువగా కవిత్వం ఉన్నది.

మన అమ్మలు అనే శీర్షికతో ముసలి తల్లుల స్థితిని వర్ణిస్తే, వంట చేసిన అర చేతులు అనే శీర్షికతో రాసిన కవితలో వంట చేసి కమిలిపోయిన ఆమె అర చేతులను ఎప్పుడైనా చూశారా? ఒక్కసారైనా ముట్టుకున్నారా అని ఆవేదన చెందుతారు. వారు రాసిన కవిత్వం చదివితే తల్లుల కష్టం కన్నుల ముందు కదలాడుతుంది.

రొమాంటిక్, ప్రేమ కవిత్వం ఎక్కువగా పుస్తకంలో కనపడుతుంది.

‘అయోమయం’ అనే కవితలో “మీ మనవాళ్లకెందుకు ఎప్పుడూ అదే యావ కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా” స్త్రీలకు భర్తే సర్వస్వం అంటే వారికి వేరే వ్యాపకం ఉండదు. భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలను చెప్పాలని, ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటారు. చాలామంది మగవారు ఆఫీస్ లో అలసిపోయి ఇంట్లో ఉన్న భార్యతో ఏమాత్రం ప్రేమగా మాట్లాడకుండా తనకు కావాల్సింది చేసుకొని ఆమెను విస్మరించినప్పుడు భార్య ఒంటరితనంగా ఫీల్ అవుతుంది. భార్యను శారీరకంగా మాత్రమే కాకుండా మనసుతో కూడా ప్రేమించాలి.

నేటి పిల్లలు తల్లిదండ్రులను కొడుతున్నారు, తిడుతున్నారు, వారికి అడ్డంగా ఉన్నారని నడి రోడ్డులో వదిలేస్తున్నారు. సమాజం వికృతంగా మారిపోయింది. మనిషి బంధాలను రెప్పపాటులో మరచిపోతున్నాడు. తాను సుఖంగా ఉండాలి, తాను మాత్రమే సుఖంగా ఉండాలి. తాను సుఖం అనుకుంటున్నా దానికి ఎవరైనా అడ్డుపడితే వారిని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నాడు. అది తల్లి అయిన తండ్రి అయిన ఎవరైనా సరే.

“బాల్యంలో తను నిన్ను కొట్టినప్పుడు, ఇప్పుడు నువ్వు తనని చరచినప్పుడు

అప్పుడూ, ఇప్పుడూ

తనే ఎందుకో గుండె ఉగ్గపట్టుకొని ఏడ్చిందో”

పై వాక్యాల్లో ఎంతోమంది తల్లుల వ్యధ కనపడుతుంది. శ్రీకాంత్ గారు కవితా వస్తువుల కోసం ఎక్కడికి పరుగులు పెట్టలేదు. అన్ని వారు చూసిన, పరిశీలించిన, లోకంలో జరిగే వాస్తవ సంఘటనల నుండి కవిత్వాన్ని రాశారు. ఒకే వస్తువును అనేక సార్లు కవిత్వం చేసినప్పటికీ ఎక్కడ పొంతన లేకుండా కవిత్వం రాయడం శ్రీకాంత్ గారి విజయమే. తీసుకున్న వస్తువును గొప్ప శిల్పంతో రీడర్ కి అందివ్వడంలో శ్రీకాంత్ గారు ఆధునిక యువ కవుల్లో ముందు ఉంటారు. శ్రీకాంత్ గారి కవిత్వంలో జంకు, బొంకు ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా రాయడం వారి నైజం. రెండు, మూడు కవితల్లో తిట్లు వాడారు. ఆ వస్తువుకు ఎంత అవసరమో అంతే రాశారు కాని అలాంటివి పంటి కింద రాయిలా అనిపిస్తుంది. 

తీసుకున్న వస్తువును బట్టి శ్రీకాంత్ గారి కంఠస్వరం మారుతూ వచ్చింది. ప్రేమ, విరహం, శృంగారం అంశాలపై కవిత్వం రాసినప్పుడు మృదువైన కంఠస్వరాన్ని వాడితే, భాధ, హింస, లాంటి వస్తువులపై కవిత్వం రాసినప్పుడు చైతన్యవంతమైన కంఠస్వరాన్ని వాడారు. స్వేచ్ఛ, వివక్ష లాంటి వస్తువులపై స్పందించినప్పుడు తేజోవంతమైన కంఠస్వరాన్ని వాడారు. ఇలా తీసుకున్న వస్తువుకు అనుగుణంగా శిల్పాన్ని, కంఠస్వరాన్ని మార్చిన తీరు పుస్తకంలో కనపడుతుంది.

మంచి కవిత్వం కనుమరుగు అవుతున్న తరుణంలో శ్రీకాంత్ గారి కవిత్వం ఒకే ప్రామిస్ లాంటిది. నలభై పలుచనైన కవితలు రాసి పుస్తకంగా వేసుకొని మేము గొప్ప కవులమని చెప్పుకునే వారు, కవిత్వం కాకుండా కేవలం వచనం రాసేవారు, వాసిని వదిలేసి కేవలం రాసిని మాత్రమే చూసుకునే వారు ఈ కవిత్వాన్ని చదవాలి. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న తెలుగు కవిత్వంలో ఈ పుస్తకం “ఐ” పుస్తకం కవిత్వ రత్నం. అయితే జన్మాలు, ఆత్మలు, పూర్వ జన్మాలు లాంటివి రాసేటప్పుడు కవులు మరొక సారి ఆలోచించలేమో!

శిల్ప గాఢత కోసం మరీ కష్టమైన ప్రతీకలు వాడితే సాధారణ రీడర్స్ కి మన కవిత్వం చేరుతుందో లేదో చూసుకోవాల్సిన అవసరం కవులకు తప్పనిసరి. రాసే కవిత్వం ఎక్కువ మందికి చేరకపోతే అది నిష్ప్రయోజనమే అవుతుంది. రీడర్స్ కి కవిత్వం అర్థం కావడం లేదంటే అది కవి రాసిన కవిత్వ లోపమే. సినిమా పాటల్లో అనేక ఇతర భాష పదాలు వచ్చి లిరిక్స్ ని నాశనం చేశాయి. అందులో కేవలం ధ్వని తప్ప లిరిక్స్ ఎవరికీ అర్థం కావడం లేదు. అలాగే కవిత్వంలో ఆంగ్ల, ఇతర భాష పదాలు వాడి తెలుగు ప్రజలను దూరం చేసుకోవడం గురించి కవులు ఆలోచించాలి. తప్పనిసరి సందర్భాల్లో వాడితే ఒకే కాని కొత్తదనం కోసమో, మేమే ఇలా రాయగలమని చెప్పుకోడానికో అలా రాస్తున్నట్టు అయితే కవులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. శ్రీకాంత్ గారి కవిత్వం ఎక్కువ మందికి చేరాలని కోరుతూ….

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్
Gorantha Anubhavam - Kondantha Samacharam
గోరంత అనుభవం - కొండంత సమాచారం
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్