నాన్నకో బహుమతి - పుస్తక సమీక్ష - మంకు శ్రీను

nannako bahumathi book review

కొత్తపల్లి ఉదయబాబు చేయితిరిగిన కధారచయిత . ఈ మధ్యనే విడుదల అయిన కొత్తపల్లి ఉదయబాబుగారి ‘’నాన్నకో బహుమతి’’ 16 కధల సమాహారం ఆయనను రచయితగామరో మెట్టు పైన కూర్చోబెట్టింది.

కధారచయితగా కొత్తపల్లి ఉదయబాబు పాఠకులకు సుపరిచితులే...మంచి ఇతివృత్తాలను తీసుకుని కధలు అల్లడం లో ఉదయబాబు గారిది అందేవేసిన చేయి.ఈ కధల సంపుటిలో షోడశ కళలు లాగా 16 కధలు ఉన్నాయి.

తల్లి ప్రేమకు దూరమైన కొడుకు వేదన వర్ణనా తీతం.అలాగే తండ్రి సుదీర్ఘకాలం భార్యావియోగాన్ని అనుభవించడం అంటే కష్టమే మరి.అటువంటి తరుణం లో కొడుకుకు పితృ రుణం తీర్చుకునే అవకాశం వస్తే వూరుకుంటాడా?తప్పకుండా తీరుస్తాడు. 'నాన్నకో బహుమతి' కధలో పరిస్థితుల ప్రభావం వల్ల భార్యాభర్తలు విడిపోయారు. తల్లి మీద ద్వేషం పెంచుకున్న కొడుకు చివరకు తల్లి మంచిదని గ్రహించి ఆమెను తన తండ్రి వద్దకు చేరుస్తాడు. మానవ సంబంధాలకు, ఆత్మీయానురాగాలకు ఈ కధ అద్దం పడుతుంది.

స్త్రీ అబల కాదు సబల అని పురాణకాలంలోనే నిరూపించుకుంది.ఆమె కత్తికి రెండువైపులా పదునుంటుంది.నిండైన వ్యక్త్విత్వంతో అలరారే స్త్రీ మూర్తులెందరో ఉన్నారు. ఆ కోవకు ‘’మహాలక్ష్మమ్మ’’ గొప్ప వ్యక్త్విత్వమ్ గల మహిళామణి.ఆమెలో పంచ్ కి పంచ్’ ‘ మంచికి మంచి ఉంటాయి .ఆమె చనిపోయాకా ఆమె ఎంత ఔదార్యం, ఔన్నత్యం గల స్త్రీ మూర్తో తెలుస్తుంది చెందినదే.''మహాలక్ష్మమ్మ'' . ఆమె ఆశ్రిత వరదాయిని . తేడా వస్తే ప్రళయ కాళి. ఆపన్నుల పాలిట కొంగు బంగారం. ఉత్తమ గుణాల కలబోత మహాలక్ష్మమ్మ.

ఒక వ్యక్తి అనాధలను చూసి, చాలించి అనాధలకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. అతని భార్య అనుకూలవతి.దురదృష్టవశాత్తూ బిడ్డను అనాధను చేసి మరణిస్తుంది. ఉదాత్త ఆశయాలతో అనాధాల పట్ల ప్రేమను, సానుభూతిని పెంచుకున్నా వ్యక్తి కూడా అనాధే. చివర్లో అనాధాశ్రమం ప్రారంభోత్సవానికి తన బిడ్డతో కార్లో వస్తూ ప్రమాదానికి గురై తన బిడ్డను అనాధను చేస్తాడు. ఈ ''అనాధ'' కధ గుండెల్ని పిండుతుంది.

'' సారపు ధర్మమున్ విమల సత్యము ...'' అనే పద్యం లో తిక్కన గారు పెద్దల ఎదుట పిల్లలు పాపకార్యాలకు ఒడికడుతుంటే పెద్దలు వారించాలి.అలా కాకుండా వూరుకుంటే ఆ పాపం పెద్దలకు దక్కుతుందని హెచ్చరించారు.

''తిలాపాపం'' కధలో జరిగింది అదే.అక్రమ మార్గం లో మార్కులు సంపాదించి ఒకడు ఏకంగా డాక్టర్ అవుతాడు.అతని దగ్గర వైద్యం చేయించుకుని ఒక స్కూల్ అటెండర్ శాశ్వతంగా కాంతి చూపును కోల్పోతాడు.ఈ పాపం లో తనకూ భాగం ఉందని ఒక స్కూలు మాస్టారు పశ్చాత్తాపం చెందడమే ఈ కధలో మౌలిక సూత్రం.

కొందరు సాహసించే, తెలిసి తప్పు చేయాలని భావిస్తారు.ఆ పని చేసేటప్పుడు పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆ ఆ తప్పును చేయకుండా ' కడిగిన ముత్యం ' లా బయటపడతాడు. ఆ కోవకు చెందిన కధ ''నిన్నటిదాకా శిలనైనా...'కధ. భార్య లేని సమయం లో కధానాయకుడు వేశ్య దగ్గరకు వెళతాడు. ఆమెను ముట్టుకోకుండా కొన్ని మంచి మాటలు చెప్పి వచ్చేస్తాడు. ఆ వేశ్య పడుపువృత్తి మాని సంస్కారవంతమైన జీవితం ప్రారంభిస్తుంది.చక్కటి అభివ్యక్తి తో ఈ కధ సాగింది.

అమ్మాయిల పరిస్తితి ప్రస్తుత కాలం లో దయనీయంగా తయారైంది. మొహాల వలలు వేసే ప్రబుద్ధులు ఎక్కడికక్కడ ఉన్నారు. వారినుండి అమ్మాయిలను రక్షించుకోవాలి. ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు అనే భావాన్ని పక్కన పెట్టి మన అమ్మాయే అనే భావంతో స్పందించాలి. ''కన్నంత మాత్రానా...'' అన్న కధలో ఒక అమ్మ తన కూతురి స్నేహితురాలిని ఒక ఆకతాయి గుప్పిట్లో పెట్టుకుంటే ఆ విషయాన్ని పసిగట్టి ఆమెను అతని కబంధ హస్తాలనుంచి రక్షిస్తుంది.ఈ కధ సందేసాత్మకంగా ఉండి ఆలోచింప చేస్తుంది.

కొందరు రచయితలు సాటి రచయితల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ అవమానాలకు గురి చేస్తూ ఉంటారు.అటువంటి వారికి గుణపాఠం నేర్పాల్సిందే.''ఆడదాని మనసు'' కధ అహంకారంతో ప్రవర్తించే రచయిత్రి అభిజాత్యానికి అద్దం పట్టింది.రచయిత భార్య రంగప్రవేశం చేసి తచయితకు రచయిత్రి కుటిల మనస్తత్వం తెలియచేస్తుంది. దాంతో రచయితలో మార్పు వస్తుంది. 'కావ్యావిష్కరణ', సుభాషిణి – స్వభాషాభిమానం’’ కధలు చక్కని హాస్యాన్ని పండించాయి.

బంధాలు, అనుబంధాలు, అనుభూతులు, ఆవేదనలు, సంకుచిత ధోరణులు, ముసుగుల్లో మనుషులు ఇలా అన్నీ కోణాలు కొత్తపల్లి వారి కధల్లో మనకు దర్శనమిస్తాయి.నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పుతాయి. ఈ పుస్తకం లో కధలన్నీ మన కళ్ళముందు జరిగే సంఘటనలే. మనం నిత్యం చూస్తున్న వ్యక్తులే ఇందులోని పాత్రలు. వర్తమాన సమాజ పరిస్థితుల్ని కధలుగా మలచడం ఉదయబాబుగారి ప్రత్యేకత.

pratulaku : కొత్తపల్లి ఉదయబాబు.
ఫ్లాట్ న౦.202, జి.కే.ఎస్. founaa నియర్ ఆంజనేయ టెంపుల్, భరణి కాలనీ, సైనిక పురి పోస్ట్, సికింద్రాబాద్...5౦౦౦94.

మరిన్ని వ్యాసాలు

జైనమతంలో శ్రీరాముడు .
జైనమతంలో శ్రీరాముడు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నైమిషారణ్యం .
నైమిషారణ్యం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అష్టాదశ పురాణాలు .
అష్టాదశ పురాణాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వాల్మీకి .
వాల్మీకి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు