" బుద్ధి జ్ఞానం లేని మనిషి" - నల్లబాటి రాఘవేంద్రరావు

Buddhi gnanam leni manishi

బుజ్జిబాబు సెల్ ఆన్ చేసాడు.. ఆతృతగా తన పెదనాన్న చెన్నకేశవులు కి ఫోన్ చేశాడు. " పెదనాన్న.. నేను బుజ్జిబాబు ని." " ఏరా బుజ్జి..." " పెదనాన్న.. నాన్నకి.. ఒంట్లో బాగోలేదు. నాకు భయం వేస్తుంది. హాస్పిటల్కి తీసుకువెళ దాం పెదనాన్న.. నువ్వు ..రాము..అన్నయ్య ఇద్దరూ త్వరగా రండి పెదనాన్న..." " ఏరా ఏమైంది ..మొన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చాము." "ఆయాసం అంటున్నారు.. ఊపిరి అందడం లేదు అంటున్నారు... త్వరగా రండి పెదనాన్న.." "ఇది నాలుగోసారి.... ఇక జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి రా అన్ని విషయాలు... ఎందు కంటే నాకు ఏవేవో పనులు ఉంటాయి... మీ అన్నయ్య రాముకి... ఇలా అస్తమానం తిరు గుతూ ఉంటే చదువు పాడవుతుంది.... నువ్వు పెద్ద వాడివి అయ్యావు కదా.... కాస్త నువ్వే ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి." " అది కాదు పెదనాన్న నాకు భయం వేస్తుంది." "ఇందులో భయపడేది ఏముందిరా బుజ్జి బాబు ....ఇప్పుడు నువ్వే ఆలోచించు ఈ సంవత్సరంలో మీ నాన్న గురించి నాలుగు సార్లు హాస్పిటల్ చుట్టూ తిరిగాను.నువ్వే అర్థం చేసుకోర..నాకు మీ నాన్న సొంత తమ్ముడు... అందుకనే..... హైదరాబాద్ వెళ్ళాం అందరం... అక్కడ పెద్ద డాక్టర్కు చూపించి నెలరోజులు హాస్పటల్లో ఉన్నాము.... తిరిగి వచ్చాక మళ్లీ అదే పొజిషన్. ... హెల్త్ కుదుట పడలేదు... మళ్లీ వైజాగ్ వెళ్ళా మాలేదా .... నువ్వే ఆలోచించరా.... డబ్బు నువ్వే పెట్టుకున్నావ్ అనుకో... కొంచెం నేను ఖర్చు పెట్టాను.. అది కాదు అసలు విషయం.... ఎన్నిసార్లు.... మేము రాగలం చెప్పు.... " "ఆ తర్వాత....మన ఊర్లో వెంకటసిద్ధార్థ హాస్పిటల్ లో 15 రోజులు ఉన్నాం..... ఇంటికి వచ్చిన మర్నాడే గాంధీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పది రోజుల ఉన్నాం." "పోనీ రాము అన్నయ్య ని పంపించు పెదనాన్న." బుజ్జిబాబు బ్రతిమాలాడుతూ అడిగాడు. "ఇద్దరం వస్తున్నాం... తప్పుతుందా? ఇదిగో మీ అన్న రాము ఇక్కడే ఉన్నాడు... అంతా వింటున్నాడు... వాడితో మాట్లాడి.... కాసేపట్లో ఇద్దరం వస్తాం." సెల్ ఆఫ్ చేశాడు బుజ్జిబాబు పెదనాన్న చెన్నకేశవులు. **** ********* **** అందరూ కలిసి బుజ్జిబాబు తండ్రి.....సత్య కేశవులు ని ఊర్లోని హాస్పటల్ కి తీసుకువెళ్లి జాయిన్ చేయించారు. "ఇలా కూర్చోరా బల్లమీద బుజ్జిబాబు... డాక్టర్ గారు 20 రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటున్నారు కదా... ఒరేయ్ రాము నువ్వు కూడా ఈ పక్కన కూర్చోరా. బుజ్జిబాబు.... మీ నాన్నకి గుండెకు సంబం ధించి ఎవరికీ అర్థంకాని జబ్బు వచ్చిపడింది. ఆయనతోపాటు మనందరం నలిగిపోతు న్నాము. చూస్తున్నావు కదా.... నువ్వు పిలి చావు కదా.. రాకపోతే... ఏమైనా అనుకుంటావ్ అని వచ్చాము రా... నాకు ఆ ధాన్యం బస్తాలు తూకం దగ్గర ఈ రోజంతా పని సరిపోతుంది.. ఇడుగో మీఅన్న రాము గాడికి....ఏవో ప్రైవేటు క్లాసులు ఉన్నా యట. అయినా వచ్చాము.... తప్పదు కదరా ..నాకు తమ్ముడు.. కానీ బుజ్జి బాబు.... నేను అంటున్నాను అని కాదు కానీ.... నువ్వు కొంచెం ఆలోచించాలి కదా... ఈసారి జబ్బు తగ్గితే పర్వాలేదు.... లేకుంటే నేను చెప్పినట్టు చేయరా...." ఏదో చెప్పబోయాడు చెన్నకేశవులు. చెన్నకేశవులు కొడుకు రాము... బుజ్జి బాబు... ఇద్దరూ..చెన్నకేశవులు ముఖం వైపు శ్రద్ధగా వింటున్నట్టు చూస్తూ ఉండిపోయారు. " మీ నాన్న తెగులు గురించి ఇప్పటివరకు అవి ఇవి అమ్ముకొని... రెండు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టావు. నువ్వు మాత్రం ఇంకా ఎంత ఖర్చు పెట్టగలవు.... మీ అమ్మకు నీకు కొంచెం మిగలాలి కదా.... లేకపోతే ఎలా బ్రతి కేది. అందుకని ఈసారి ఏం చేస్తావంటే.... ఇంటి దగ్గరే ఉంచి ... మన రాజన్న ఉన్నాడు కదా.... అదేరా ఆర్ఎంపీ డాక్టర్..... వాడిని.. రోజు వచ్చిచూడమను..... మనం అనుకుంటాం కానీ..... ఎవరు ఇచ్చినా ఒకే రకం టాబ్లెట్లు రా....నెమ్మదిగా కోలుకుంటాడు.బాగా సీరియస్ అయితే అప్పుడు హాస్పిటల్ కి తీసుకొద్దాం... ఎలాగూ తప్పదు కదా. అలా చేయరా".... అన్నాడు చెన్నకేశవులు తన తమ్ముడు కొడుకు బుజ్జిబాబుకి.... తన కొడుకురాముకి బాగా వినబడేటట్లు... " అదేమిటి పెదనాన్న... మన ఇరుగు పొరుగు ...బంధువులు ఎవరైనా చూసినా బాగుండదు కదా. తండ్రిని హాస్పటల్లో చూపిం చటంలేదని... నానా మాటలు.. అంటారు కదా." " ప్రజలు రకరకాలుగా కూతలు కూస్తారు రా . అన్ని పట్టించుకుంటే బ్రతక లేము.. ఎవరైనా అడిగితే... 'ఇంటి దగ్గరే మంచి డాక్టర్ ను పెట్టి వైద్యం చేయిస్తున్నాం.'... అని చెప్పు ....." అంటూ బాగా హితబోధ చేశాడు చెన్న కేశవులు... కాస్త నేర్పుగా ఆలోచించే బుద్ధి... ఇంకాస్త ప్రపంచ జ్ఞానం.... మరికాస్త సమయ సందర్భ ఆలోచన...ఇవన్నీ నేర్చుకోవాలి రా... లేదంటే ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం!!! పెదనాన్న హితబోధ శ్రద్ధగా విన్నాడు.. బుజ్జి బాబు.... ....... అతనితో పాటు అతని పక్కనే కూర్చున్న...చెన్నకేశవులు కొడుకు రాము కూడా అంతే శ్రద్ధగా విన్నాడు. 20 రోజులు పోయాక కొంచెం కుదుట పడడంతో సత్యకేశవులు ని ఇంటికి తీసుకు వచ్చేశారు. ***** ****** ***** సత్యకేశవులు ఇంటికి వచ్చాక... కొంచెం కొంచెం రికవరీ అయ్యాడు.... బుజ్జిబాబు కొంచెం ప్రశాంతపడి.... తన పనులు చూసుకునే ప్రయ త్నం లో పడ్డాడు.... సత్యకేశవులు....నెమ్మదిగా తన ఫ్యాన్సీషాపు తెరుచుకోవడం మొదలు పెట్టాడు. ఆరోజు ఆదివారం..... అమావాస్య... చెన్నకేశవులు కళ్ళు తిరిగి ఇంటిదగ్గర గడప మీద పడిపోయాడు. అతని కొడుకు రాము.. భయపడి తన చిన్నాన్న సత్యకేశవులు కి.. విషయం చెప్పి త్వరగా రమ్మని ఫోన్ చేశాడు.... అంతే హుటాహుటిన.... సత్యకేశవులు.. బుజ్జిబాబు.. మోపెడ్ మీద.... స్పీడ్ గా వెళ్లి... చెన్నకేశవులు ని సిటీ లోనే పెద్ద ప్రైవేటు హాస్పటల్ కి తీసుకువెళ్లి... జాయిన్ చేశారు. డాక్టర్గారు మొత్తం పరీక్షలన్నీ చేసి... కాలేయా నికి సంబంధించి ఏదో వ్యాధి వచ్చిందని చెప్పి... పది రోజులు హాస్పిటల్లో ఉంచారు...... కొంచెం రికవరీ అయ్యింది..... ఇకమీదట వాడవలసిన పూర్తి మందుల కోర్సు రాసి ఇచ్చి.... ఈ సారి ఇలా జరిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రావలసిందిగా మరీ మరీ చెప్పి........ హాస్పటల్ నుండి పంపించేశారు. అంతా బాగానే ఉంది. చెన్నకేశవులు ఇంటి దగ్గర నెమ్మదిగా.... కుదుట పడుతున్నాడు. నెల గడిచింది..... ఆరోజు... చెన్నకేశవులు... మళ్లీ కళ్ళు తిరిగి.. దొడ్లో పడిపోయాడు. రాము.. తండ్రి దగ్గరికి వచ్చి చూసి జాగ్ర త్తగా లోపలకు తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. వెంటనే...... ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ రాజన్నకు ఫోన్ చేశాడు కంగారుగా.... అతను వచ్చాడు.. అర్ధగంటలో... కండిషన్ చూసితను ఏవో నాలుగురకాల మందులు రాసి ఇచ్చి వాడమని చెప్పి వెళ్ళిపోయాడు... అతను వెళుతున్నప్పుడు ప్రతిరోజు వచ్చి జాగ్రత్తగా చూడవలసిందిగా... చెప్పాడు రాము. " సరే" అంటూ వెళ్లిపోయాడు.. ఆర్.ఎం.పి డాక్టర్ రాజన్న. చెన్నకేశవులు కి కొంచెం తెలివి వచ్చింది. కొడుకుని దగ్గరకు పిలిచాడు. " ఏరా.. ఏం చేస్తున్నావు.. నావిషయం ఏం ఆలోచించావు?." అంటూ అడిగాడు. " నాన్న నువ్వు ప్రశాంతంగా పడుకో. వైద్యం చేయిస్తున్నాను కదా... ఇదిగో నాలుగు రకాల మందులు రాజన్నగారు రాసిచ్చారు ..తెచ్చాను. ఇవి శ్రద్ధగా వేసుకో... ఒక వారం పోయిన తర్వాత ఆలోచిద్దాం లే.." అంటూ బయటకు వెళ్ళి పోయాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. చెన్నకేశవులు..కొడుకుని దగ్గరకు పిలిచాడు. "ఏంట్రా.... నాకు ఇలా జరిగితే వెంటనే హాస్పి టల్కు తీసుకురమ్మన్నారుకదా డాక్టర్ గారు... నువ్వు..ఏమీమాట్లాడకుండా ...ఊరుకున్నావేమిటి?"...కొడుకుని ప్రశ్నించినట్టు అడిగాడు... చెన్నకేశవులు. "డాక్టర్ గారు ఇంటికొచ్చి చూస్తున్నారు కదా.. ఎందుకు కంగారు?..."...అంటూ తండ్రి చెప్పేది వినకుండా బయటకు వెళ్ళిపోయాడు రాము. నాలుగు రోజులు గడిచింది తన ఆరో గ్యంలో పెద్దగా మార్పు రాలేదని గ్రహించాడు చెన్న కేశవులు........ ఇప్పుడు ఏం చేయాలి?? బాగా ఆలోచించాడు చెన్నకేశవులు. తను ఒక్కడే హాస్పటల్ కు వెళ్ళే స్థితిలో లేడు... తన తమ్ముడు సత్యకేశవులకి.... విషయం చెప్పి ఉండడు... రాము....! ఈ విషయం తెలిస్తే ఈపాటికే తన తమ్ముడు సత్యకేశవులు... అతని కొడుకు బుజ్జి బాబు..... పరుగు పెట్టుకొని వచ్చి ఉండేవారు.తన తమ్ముడికి ఆరోగ్యం బాగోలేనప్పుడు తను వెళ్లి... చూసే వాడు కదా.... మరి తన ఆరోగ్యం బాగా లేన ప్పుడు తనతమ్ముడు ఎందుకు రాడు..వస్తాడు. .. ఎటొచ్చీ ఈ విషయం తెలిసి ఉండక పోవచ్చు .... ఇప్పుడు ఏం చేసేది??? ... ఫోన్ చేద్దామంటే తన ఫోన్ వర్కింగ్ లో లేదు... బాగా ఆలోచించాడు.. చెన్నకేశవులు. తన ఇంటి పక్కనే ఉన్న.. స్నేహితుడు.. మూర్తి గారుని పిలిపించాడు తన భార్య సహాయంతో ..మూర్తిగారు వచ్చాడు.... బయట కూర్చున్న రాము తో చాలాసేపు మాట్లాడాడు...మూర్తి గారు. " నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అంట కదా..నన్ను కబురు పెట్టారు.... ఏం జరిగింది అసలు? అంటూ ప్రశ్నించాడు మూర్తిగారు... రాముని. " ఆయనది అంతా కంగారు మూర్తిగారు." చెప్పాడు రాము. " మరిప్పుడు ఏం చేద్దాం.. హాస్పిటల్కు తీసుకువెళ్దామా. ... ఊర్లోనే ఉన్న మీ చిన్నాన్న కు కబురుపెట్టావా??" ప్రశ్నించాడు మూర్తి గారు. ఇద్దరూ కలిసి నడుస్తూ పక్క గదిలో మంచం మీద పడుకున్న చెన్నకేశవులు దగ్గరికి వెళ్లారు. " అక్కర్లేదు మూర్తిగారు... వాళ్ళు అన వసరంగా కంగారు పడతారు. నేను ""ఇంటి దగ్గరే మంచి డాక్టర్ ను పెట్టి వైద్యం చేయిస్తు న్నాను"" కదా...అంతగా అవసరమైతే...... అప్పుడు..... చూద్దాం..." చెవులారా విన్నాడు తన కొడుకు అన్న ఆ మాటలు... చెన్నకేశవులు.!! అతనికి ఎక్కడో కాలినట్టు అనిపించింది.! ఎవరో తన గూబ మీద గట్టిగా చరిచి నట్లు అనిపించింది.! ఇంకెవరో తన వీపు మీద కొరడాతో కసక్ కసక్ అని కొట్టినట్లు అయింది! చెన్నకేశవులు మత్తుగా మగతగా ఒక పక్కకు ఒరిగిపోయాడు.! కొంచెం తెలివి వచ్చి చూసుకునే సరికి... తను పెద్దహాస్పటల్ లో బెడ్ మీద ఉన్నట్టు గ్రహించాడు.! ఇద్దరు నర్సులు....సెలైన్ ఎక్కించే ప్రయ త్నంలో ఉన్నారు.! ఓ స్పెషల్ డాక్టర్ తన కేసుషీటు ని పరిశీలి స్తున్నాడు. మరో డాక్టర్......తన బీపీ....షుగర్ చెక్ చేస్తున్నాడు.. కొంచెం దూరంలో తన స్నేహితుడు మూర్తి గారు పర్వాలేదు అన్నట్టు ధైర్యం చెబు తున్నాడు! ఇటుపక్క.....తన తమ్ముడు సత్యకేశ వులు...అతని కొడుకు బుజ్జిబాబు.. తన భార్య ... భయం లేదు...అన్నట్టు చేతులు ఊపు తున్నారు...!! మరో వ్యక్తి గురించి పరిశీలనగా చుట్టూ పరికించాడు...చెన్నకేశవులు....చాలాదూరంలో... మసకగా కనిపిస్తున్న వ్యక్తి....... తను అను కున్న వాడేనా...... ఏమో.... ఏమో???? ***** ****** ******

మరిన్ని కథలు

Taram maarindi
తరంమారింది
- శింగరాజు శ్రీనివాసరావు
Rest rooms
రెస్ట్ రూమ్స్
- చెన్నూరి సుదర్శన్
Anumanam
అనుమానం
- తటవర్తి భద్రిరాజు
Kottalludu
క్రొత్తల్లుడు
- మద్దూరి నరసింహమూర్తి
Prakruthi malachina shilpalu
ప్రక్రుతి మలిచిన శిల్పాలు
- వెంకట రమణ శర్మ పోడూరి
Manasuke manchi toste
మనసుకే మంచి తోస్తే
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu