మానవత్వం - యు.విజయశేఖర రెడ్డి

Maanavatwam

సీతాపురంలో ధర్మయ్య పేరు మోసిన వడ్డీ వ్యాపారి. ఆ గ్రామంలోని వారే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి కూడా ధర్మయ్య వద్దకు వచ్చి ధనం తీసుకుని వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అతని వద్ద వడ్డీ ఎక్కువ అని నసిగే వాళ్లూ ఉన్నారు. కానీ చేసేది లేక ఎక్కడా అప్పు పుట్టక అతని వద్దే అప్పు చేసేవారు.

అలాంటి ధర్మయ్యకు కరోనా సోకింది. ఆసుపత్రిలో చేర్పించారు.వారం రోజులకు కోలుకున్నట్టే కోలుకుని చనిపోయాడు.ఆయన కుటుంబలోని వారు ఏ ఒక్కరూ ఆసుపత్రికి వెళ్ళి శవాన్ని తీసుకు రావడానికి సాహసించ లేదు.. పైగా గ్రామాధికారి కూడా శవాన్ని ఏకంగా శ్మశానానికి తీసుకు వెళ్ళి అక్కడే కర్మకాండలు చేయాలని ధర్మయ్య కుటుంబానికి చెప్పాడు.

ధర్మయ్య కుటుంబం వారికి చెప్పి చర్మకారుడు రామయ్య పి.పి. కిట్టు,మాస్కు మొదలైనవి ధరించి ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రి వారి సాయంతో ధర్మయ్య శవాన్ని తన ఎడ్ల బండిలో తీసుకుని నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి కాటి కాపరి సాయంతో శవదహనం చేశాడు.

కరోనా కారణంగా రెండు వారాల తరువాత రామయ్యకు గ్రామంలోకి రావడానికి అనుమతి లభించింది.

“ధర్మయ్యను ప్రతి ఒక్కరూ ఈసడించుకుంటారు కదా? కరోనాతో చనిపోయాడని ఆయన కుటుంబం వారే పట్టించుకోలేదు,అలాంటిది నీకు ఆ ధర్మయ్య కర్మకాండలు ఎలా చేయాలనిపించింది?” అని గ్రామాధికారి అడిగాడు.

“అయ్యా! నా కూతురు పెళ్లి కోసం తెలిసిన ప్రతి వారినీ అప్పు ఇవ్వమన్నాను ఎవ్వరూ ఇవ్వ లేదు..తాకట్టు పెట్టడానికి నా వద్ద చిన్న ఇల్లు ఉంది...అయినా ఫలితం లేకపోయింది...పైగా నాది చెప్పులు కుట్టే వృత్తి, ఆ సమయంలో ధర్మయ్య గారు నాకు సాయం చేశారు నా కూతురు పెళ్లి జరిగింది.. మంచి అల్లుడు దొరికాడు.ఎవరైనా సాయం చేస్తే నా చర్మంతో చెప్పులు కుట్టి రుణం తీర్చుకుంటాను అని అంటారు.నేను మరో రూపంలో ఆయన రుణం తీర్చుకున్నాను” అన్నాడు రామయ్య.

“రుణం ఎలా అవుతుంది!వడ్డీ తీసుకున్నాడు కదా?” అన్నాడు గ్రామాధికారి.

“అది ఆయన వ్యాపారం. అప్పుడు డబ్బు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు... ఇప్పుడు అతని శవాన్ని తీసుకు వెళ్లడాని ఎవ్వరూ రాలేదు.అప్పుడు ఆయన నన్ను ఆదుకుంటే..ఇప్పుడు నేను ఆదుకున్నాను” అన్నాడు రామయ్య.

ధర్మయ్య కుటుంబం నుండి ఏ మాత్రం ధనం ఆశించకుండా కర్మకాండలు నిర్వహించి,మానవత్వం మిగిలుందని రామయ్య నిరూపించుకున్నాడు. ***

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి