'అపూర్వ' సంగమం !!! - కొత్తపల్లి ఉదయబాబు

Apoorva sangamam

పూలదండలతో అందంగా అలంకరించబడిన పాఠశాల గేట్ దాటి ఎర్రటివాచీ మీద అడుగు పెట్టగానే తెలియని ఆనందంతో ప్రకాశం మాష్టారి మనసు కువ కువలాడే గువ్వ పిల్లయిపోయింది.

ఆయనను చూస్తూనే వేదిక ముందు కూర్చున్న విద్యార్థులంతా ఒక్కసారిగా లేచి కరతాళధ్వనులతో స్వాగతం పలికారు.ఇంటికి వచ్చి ఆహ్వానించిన కార్యక్రమ నిర్వాహక నాయకులు ప్రకాష్, రజని, సుధాకర్,ప్రత్యూష..ఎదురుగా వచ్చి మాష్టారి పాదాలకు నమస్కరించి ఇరువైపులా నడుస్తూ వేదిక ముందుకు తీసుకు వెళ్లారు.

ప్రత్యేక అతిథులకోసం అక్కడ వేసిన సోఫాలో కూర్చుండబెట్టారు. అంతలో "సార్..బాగున్నారా...బాదంగీర్ తీసుకోండి..."అంటూ అనంత్ ప్రకాశంగారికి నమస్కరించి బాదంగీర్ అందించారు.

"థాంక్స్ రా నాన్న.ఎంత ఎదిగిపోయారయ్యా?...నెమ్మదిగా ఒక్కొక్కరిని గుర్తుచేసుకుంటాను.పెద్దవాడినయాను కదా. " అని చుట్టు పరికించి "అందరికన్నా నేనె ముందు వచ్చేసినట్టున్నాను."అంటూ బాటిల్ అందుకున్నారు ప్రకాశంగారు.

"మీరు మా ఎవర్ గ్రీన్ హీరో సర్.పంక్యువాలిటీకీ మారు పేరు.మీరంత క్రమశిక్షణగా మాకు లెక్కలు బోధించారు కాబట్టే లెక్కల్లో మనుషులుగా బతుకుతున్నాం సర్.అప్పటికి ఇప్పటికి మీరు ఏమీ మారలేదు సర్. కొంచెం చెంపలు నెరిసాయంతే." అనేసి ఎవరో పిలవడం తో అటు వెళ్ళాడు అనంత్.

అంతే... ఒక్కసారిగా మిగతా అమ్మాయిలు, అబ్బాయిలు ఆయన చుట్టూ చేరిపోయారు.

"సార్ బాగున్నారా...ఎంతకాలమైందో సర్ మిమ్మల్ని చూసి. ఆరోగ్యం బాగుంటోందా సర్...పిల్లలు ఏంచేస్తున్నారు సర్. ..మేడం ఎలా ఉన్నారు?" ప్రశ్నలతో ముంచెత్తారు ఆయనని.

అన్నింటికీ ఓపికగా సమాధానమిస్తూ, తనని పలకరించిన ప్రతీ విద్యార్థిని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారాయన.

ఇంతలో తనతో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తెలుగు మాస్టారూ శ్రీనివాసులు,సోషల్ మాస్టారూ చక్రధరం,సైన్సు మాస్టారూ శివరామయ్యా, డ్రిల్ టీచర్ ప్రసాదరెడ్డి, ఆంగ్లం బోధించిన శాంతకుమారి, ఇంకా సర్వీసులో ఉన్న అప్పటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ లలిత,కవిత ఒక పడినిముషాల తేడాలో అందరూ వచ్చారు.పిల్లల ఆనందానికి హద్దులు లేవు. ప్రకాశం గారిని వచ్చిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరూ పలకరించారు ఆప్యాయతగా.

అనంతరం అక్కడి వాతావరణాన్ని పరిశీలించారు ప్రకాశంగారు.

తాను పాఠశాల సహాయకుడిగా ఉన్నప్పటి ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ మూర్తి గారు ఇటీవలే గుండెపోటుతో మరణించారట. వారి గౌరవార్థం వేదిక కు స్వర్గీయ సూర్యనారాయణ మూర్తి ప్రాంగణం అన్న పేరును ఐరన్ ఫ్రేమ్ తో రాయించి స్పష్టంగా కనపడేలా రంగులు వేయించారు.

పాఠశాల లో కార్యక్రమాలు నిర్వహించడానికి తాను తల్లిదండ్రుల వితరణతో ఏర్పాటు చేసిన స్టేజి ఆకతాయి మూకల వికృత చేష్టలతో గోతులు పడి వాడుకోవడానికి నానా ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో.దానిని శుభ్రమైన నాపరాళ్లతో పటిష్టంగా నిర్మించారు.స్టేజి మూడుపక్కల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.

స్టేజి వెనుక తాను క్లాస్ టీచర్ గా ఉండి, పిల్లలందరూ టెన్త్ ఫేర్ వెల్ పార్టీనాడు తీయించుకున్న గ్రూప్ ఫోటోని స్టేజి వెనుకవైపు గోడ అంత సైజులో ఫ్లెక్సీ వేయించడంతో తామంతా అక్కడ సజీవంగా కూర్చున్నట్టే ఉంది.ఆ ఆలోచన ప్రకాశంగారికి చాలా నచ్చింది.

పది వరుస రూంల కారిడార్ కి అమర్చిన మెష్ కు ఆహ్వానించిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు స్వాగతం చెబుతూ వ్యక్తిగత ఫ్లెక్సీలు క్యాడర్ వైజ్ కట్టి ఉన్నాయి.

ఈ బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి పాఠశాల లో ప్రస్తుత విద్యార్థుల సౌకర్యం కోసం విరాళాలు వేసుకుని సైకిల్ స్టాండ్ నిర్మించినట్టు ఇందాక మాటల్లో ప్రకాష్ చెప్పడం ఆయనకు గుర్తొచ్చింది.

రెండు ఎకరాల విశాల ప్రాంగణంలో ఎల్ ఆకారంలో నిర్మించబడిన ఆ పాఠశాల లో తన సర్వీస్ 'గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం'అనిపించిందాయనకు. అలా పరిశీలిస్తున్న ఆయనకు స్టేజి కు కుడిపక్క మూలగా ఎవరో ఒక స్త్రీ తనని నిశితంగా పరిశీలిస్తున్నట్టనిపించింది. తన చూపు ఆమె మీద పడగానే ఆమె పిల్లర్ వెనుకకు తప్పుకుంది.

ఈసారి కళ్ళజోడు సవరించుకుని చూసారాయన.

ఆమె విమల అని టక్కున గుర్తొచ్చిందాయనకు.

కానీ విమల తెల్ల చీరలో కళావిహీనంగా చిన్నవయసులొనే అకాల వృద్ధాప్యం తో బాధపడుతున్నట్టుగా నిస్తేజంగా చూస్తోంది.ఈసారి ఆమె పిల్లర్ చాటుకు తప్పుకోలేదు.రెండు చేతులతో మెష్ పట్టుకుని జాలిగా చూస్తున్న ఆచూపు "నా జీవితం ఇలా కావడానికి కారణం మీరే మాస్టారూ.."అని ప్రశ్నిస్తున్నట్టనిపించిందాయనకు.

ఆయనకు వెంటనే సీతారాముడు గుర్తుకొచ్చాడు.

అప్రయత్నంగా ఆయన కళ్ళు అక్కడున్న ప్రతీ విద్యార్థినీ పరికించాయి వాళ్ళల్లో సీతారాముడు ఉన్నాడేమో అని.

ఇక ఉద్వేగం భరించలేక స్టేజీకి దగ్గరలో ఉన్న పూర్వ విద్యార్థి సాగర్ ని పిలిచి "సీతారాముడు రాలేదా నాన్నా"అని! అడిగారు.

"వచ్చాడు సర్. కేటరింగ్ వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాడు. వాడు క్రితం నెలలోనే ఆర్మీ లో ఇరవై ఏళ్ళ పనిచేసి రిటైర్ అయి వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు సర్. మగపిల్లలిద్దరు ఒకడు అమెరికా, ఒకడు దుబాయ్ లో ఉంటున్నారు సర్.కూతురు పట్టించుకోదు. కాన్సర్ తో నాలుగేళ్లక్రితం భార్య పొయింది. సర్వీసులో ఉండగా బానే గడిచిపోయింది.భార్య కాన్సర్ చికిత్సకోసం చాలా ఖర్చు పెట్టాడు గాని ఫలితం లేకపోయింది సర్. ఒక ఐదు నిముషాల్లో వస్తాను సర్." అని స్టేజి వైపు వెళ్ళిపోయాడు.

"ఒక ప్రేమజంటను విడదీసి తప్పు చేసానా ?"అని ఒక్కసారి ఆయన మనసు బాధగా మూల్గింది.

ఆ బాధను దూరంచేస్తూ స్టేజి మీద విద్యార్థుల పిల్లలు మైక్ లో వస్తున్న పాటలకనుగుణంగా స్టెప్పులెయ్యడం మొదలెట్టారు.

మరో పది నిముషాలలో సభాకార్యక్రమం ప్రారంభం అయింది.

ఏ ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారో కార్యక్రమం లో ప్రధాన పాత్ర వహిస్తున్న సుధాకర్, ప్రత్యూష యాంకర్స్ గా వ్యవహరిస్తూ ప్రార్ధనాగీతం ఆలపించారు.

తరువాత ప్రతీ విద్యార్థి స్టేజి పైకి ఫామిలీ తో వచ్చి పరిచయం చేసుకోవాలి అని అనౌన్స్ చేయడంతో ఆ కార్యక్రమం మొదలైంది.

అంతలో సాగర్ ఒకతన్ని తీసుకువచ్చి "సార్.సీతారాముడు"అని పరిచయం చేసే లోపే అతను ప్రకాశం గారి పాదాలకు నమస్కరించి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.

"పాపం వాడు మూడాఫ్ లో ఉన్నాడు సర్.ఏమీ అనుకోకండి." అనేసి సాగర్ తన పరిచయం కోసం స్టేజి ఎక్కాడు.

స్టేజి ఎక్కి పరిచయం చేసుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే ఆయన ఆశ్చర్యం లో మునిగిపోయారు.పిట్టల్లా ఉండే పిల్లలు పరిపూర్ణ పౌరుల్లా గా పెరిగి, కొంత మంది అయితే ఆజానుబాహువుల్లా ఎదిగి మంచి మంచి పోసిషన్స్ లో ఉద్యోగాలు చేస్తున్నవారు కొంతమంది అయితే, కొందరు సొంత వ్యాపారాలలో రాణిస్తున్నారు. వ్యాపారస్తులు భార్యలు పట్టుచీరల గరగరలతో, ఆధునిక బంగారు ఆభరణాలతో...మెఱిసిపోతున్నారు.
వాళ్ళ పిల్లలు కూడా టి.వి.ప్రకటనల్లో బేబీస్ లా చూడముచ్చటగా ఉన్నారు.ఉద్యోగస్తుల భార్యలు తమ స్థాయిని చాటుతూ ఆకర్షణీయంగా హుందాగా ఉన్నారు.

ఆ ఆనందంలో ఉండగా షుగర్ వ్యాధి గుర్తు చేయడంతో నెమ్మదిగా లేచి కారిడార్లో అడుగుపెట్టారాయన.

" బాగున్నారా సార్ ?ఏంకావాలి?" అటెండర్ సీతమ్మ పలకరించింది.

"బాగున్నాను సీతమ్మ.ఇంకా పనిచేస్తూనే ఉన్నావా...ఆరోగ్యం బాగుందా...బాత్రూం కి వెల్దామని." అన్నారాయన.

"మళ్లీ సంవత్సరం రిటైర్మెంట్ సారు.ఇటు వెళ్లి ఎడమవైపుకు తిరగండి.స్టేజి వెనకాల ఆ మూలకు.మీరున్నప్పుడు కట్టించినియ్యే... జాగ్రత్త బాబు." అని దారి చూపింది సీతమ్మ.

నెమ్మదిగా అటువైపు నడిచారాయన.తాను పాఠాలు బోధించిన ఒక్కక్క గది చూసుకుంటూ దాటుతూ బాత్ రూమ్ కి వెళ్లి తిరిగి వస్తూండగా మూలగదిలోంచి వస్తున్న మాటలు విని ఒక్క క్షణం ఆగారాయన.ఖాళీ గది కావడం తో మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

"సార్. వచ్చారు చూసావా.పలకరించావా?"అడిగింది పురుష కంఠం.

"పలకరించాలనిపించలేదు..ఏమనుకున్నారో ఏమో.?" అంది స్త్రీ కంఠం.

"అసలు గుర్తు పెట్టారంటావా... ఇరవై నాలుగేళ్లయ్యింది. అది సరే...ఎలా ఉన్నావ్? ఆరోగ్యం ఎలా ఉంటోంది?"

"ఎం చెప్పను రాము.ఈయన పుణ్యమా అని మన విషయం మన ఇళ్లల్లో తెలిసిపోయిందా!మగాడివి నువ్ పరీక్ష పాసయ్యావ్.నేను ఫెయిల్ ఆయాను. నువ్ విజయవాడలో ఇంటర్ లో చేరావ్.నాకు మా పేటలో లారీ వాడికిచ్చి చేశారు. వాడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి.ఏడాదికే అమ్మాయి పుట్టింది. వాడి తాగుడితో ఒక్కపూట తిని ఒక్కపూట తినక ఆడపిల్లను పెంచుకొచ్చాను.పదవ తరగతి చదివిన వెంటనే పెళ్లి చేసేసాను. దానికో పిల్లాడు.ఐదో సంవత్సరం.
పిల్లకి పెళ్ళైన ఏడాదికి రాజస్థాన్ సరుకు లేసుకుని ఎల్లాడు.తిరిగి రాలేదు.ఆ పాకిస్థానీ సైనికులెవరో గ్రామం మీదపడి కాల్చేశారంట. శవాన్ని పంపారు.
కూతురు అల్లుడు వైజాగ్ లో ఉంటున్నారు.
ఆడు బతికున్నప్పుడు ఏసిన చీటీలడబ్బు ఫిక్స్డ్ ఏసుకుని ఆ వడ్డీ,వితంతు పించినీ తో బతుకుతున్నాను. ఆనాడే నేను చెప్పినట్టు మనం పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏమో ఎలా ఉండేదో...ఇంతకీ నువ్వెలా ఉన్నావ్ రామూ?"
ఆ కంఠంలో మార్థవం లాలన ఉన్నాయి.

"ముగ్గురు పిల్లలు.ఒకడు అమెరికా.ఒకడు దుబాయ్. రారు.వాళ్లకి నేను అక్కర్లేదు . నాకు వాళ్ళు అక్కర్లేదు.
ఇక ఒక కూతురు.రాజమండ్రి లో వుంటోంది. వాళ్ళ ఆయనది బార్ షాపు.ఇంకా పిల్లలు లేరు.నన్నొచ్చి
షాపులో కూసోమంటాడు.ఈవిడ కేన్సర్ తో పోయింది.పెన్షన్ పెట్టుకుని వృద్ధాశ్రమంలో ఉంటున్నా. కాలక్షేపం లేదు.బాధ చెప్పుకుందామంటే మనిషి లేడు. ఎ పుడో విసుగొస్తే ఏ పురుగుల మందో తాగేస్తా."

"అంత మాట అనకు రాము.నాకు బాధగా ఉంటుంది. పోనీ నాదగ్గరకొచ్చేయ్. ఉన్నదాంట్లో నే కలిసి తిని కాలక్షేపం చేద్దాం."

అతని నవ్వు.

"సమాజం ఒప్పుకుంటుందేంటి.దానికి భయపడాలిగా.అపుడు అలా భయపడేగా లైఫ్ పాడుచేసుకున్నాం."

ఇపుడు ఆమె నవ్వు...విరక్తిగా.

"తల్లికి బిడ్డ,బిడ్డలకు తండ్రి అక్కర్లేని రోజుల్లోకొచ్చేసాం రాము.ఇంకా సమాజం ఎక్కడుంది?అమాయకుడా..పోనీ నన్నొచెయ్యమంటావా?నాకోసం ఏడ్చేవాడేవాడూ లేడు .ఆలోచించుకుని ఎల్లెలోపు చెప్పు.ఏమంటావ్?"

అతను అవాక్కయ్యినట్టున్నాడు. మౌనం చీలుస్తూ ఆమె మళ్లీ అంది.

"రాము.ఇదివరకు చెప్పాను.ఇప్పుడూ సిగ్గువిడిచి చెబుతున్నాను. ఆరోజు రజని,నేను నీకు రాసిన ఉత్తరం ఉన్న నా లెక్కల టెక్స్ట్ బుక్ మాష్టారి ఇచ్చి ఉండకపోతే మనస్పూర్తిగా ప్రేమించుకున్న మనం నిజంగా ఒక్కటయ్యేవాళ్ళం. నిజానికి దాని తప్పు ఏమీలేదు.విధి రాత. ఆరోజు దాని టెక్స్ట్ బుక్ తేకపోవడంతో పక్కనున్న నా బుక్ చటుక్కున పట్టుకెళ్లి ఇచ్చేసింది. ఆ ఉత్తరం ప్రకాశం సార్ చదివి డైరెక్ట్ గా హెడ్ మాస్టర్ గారికి చెప్పడం, ఆయన మన పేరెంట్స్ ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం,స్కూల్లో అందరికి మనం ప్రేమికులమని తెలిసిపోవడం జరిగింది. ఎంతకాలం బతికి ఉంటామో తెలీదు. ఉన్నంతకాలం ఒకరికొకరం తోడు నీడగా ఉందాం. నాకైతే ఏ కొరికలు లేవు.ఎప్పటికైనా నీతో బతకాలన్న ఆశతప్ప.
సిగ్గు విడిచి చెప్పాను.నిర్ణయం మాత్రం నీదే."ఎందుకో విమల ఒక్కసారిగా దుఃఖిస్తున్నట్టుగా ఏడుపు.

"మాలా.మగవాడినై ఉండి నేనె అపుడు తెగించలేకపోయాను. ఎలాగూ మన ఇద్దరి గురించి స్కూల్లో తెలిసిపోయింది ఆనాడు.కొంచెం తెగించి ఉంటే అపుడే నువ్ నాకు దక్కేదానివి. ఇపుడు కూడా ఈ అవకాశాన్ని కోల్పోతే నీ పట్ల నా ప్రేమ అబద్ధమౌతుంది. ఇకనైనా మనం కొత్త జీవితాన్ని గడుపుదాం. ఫంక్షన్ పూర్తి అయ్యాక నేను నీతో వస్తాను.సరేనా?"

"రామూ"అంటూ ఆమె ఒక్కసారిగా వాటేసుకున్న ఒక చిన్న శబ్దం.

ప్రకాశంగారు గుండెలో ఎదో మూల బాధగా అనిపించడంతో మెల్లగా బయటకు వచ్చేసారు.

తన ప్లేస్ లోకి వచ్చి కూర్చోగానే "అంతా మీకోసమే వెయిటింగ్ సర్.ప్లీజ్ వెల్కమ్ అవర్ మోస్ట్ బిలవుడ్ ఓల్డ్ హీరో ఆఫ్ మాథెమాటిక్స్ , ఆనాటి మన క్లాస్ టీచర్ శ్రీ ప్రకాశం మాష్టారిని సగౌరవంగా వేదిక మీదకు తీసుకు రావాల్సిందిగా మన వెల్ కం కమిటీ సభ్యులు కోరుతున్నాను."అని అనౌన్స్ చేసాడు ప్రకాష్.

ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వచ్చి సాదరంగా ప్రకాశం మాష్టారిని వేదిక మీదకు తీసుకువెళ్లారు.

ఆయన వేదిక మీదకు వెళ్లి పుష్పగుచ్చమ్ అందుకునేంతవరకూ ఆ ప్రదేశమంతా కరతాళధ్వనులతో ప్రతిధ్వనించింది. ఒక విధంగా చెప్పాలంటే మిగతా ఉపాధ్యాయులంతా అసూయపడేలా.

అందరిని విష్ చేసి, సభకు నమస్కరించి తనకు కేటాయించిన కుర్చీ లో కూర్చున్నారాయన.

అలాగే ప్రతీ టీచర్ ని వేదికమీద కు ఆహ్వానించి, వేదిక మీద ఆసీనులను చేసిన అనంతరం ఒక్కొక్క టీచర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ...ఏ టీచర్ పాఠం చెబుతూనే ఎలా నవ్వించేవారో, ఏ టీచర్ తాము చదవకపోతే ఎలా దండించేవారో , ప్లానింగ్ ప్రకారం విద్యార్ధులు వివరించిన విధానానికి ఉపాధ్యాయులే కాదు ఆహూతులందరూ. ముఖ్యంగా విద్యార్ధుల కుటుంబ సభ్యులందరూ 'అమ్మో ఆరోజుల్లో విద్యావిధానం ఇలా ఉండేదా? ' అని ఆశ్చర్యపోయారు.

అందరిలోనూ సీనియర్ అయిన ప్రకాశం గారిని ముందుగా సన్మానించారు. ఆయన తన ఆసీస్సులందిస్తూ , ఆ సన్మానాల అనంతరం ఒక్క అయిదు నిముషాలు మళ్ళీ తానూ మాట్లాడే టందుకు అవకాశం ఇవ్వవలసినదిగా కోరారు.

ఉపాధ్యాయులందరినీ దుశ్సాలువా, నిలువెత్తు చామంతిపూలదండ.సన్మాన పత్రం, నూతన వస్త్రాలు, తమ టెన్త్ బాచ్ గ్రూప్ ఫోటో మరియు పాఠశాల చిత్రాలు ఉన్న పెద్ద మెమెంటో తో ఇటువంటి సన్మానం ఇక మీదట జరగబోదు అన్న రీతిలో జరిగిన విధానానికి ఉపాధ్యాయుల మనసులు సంతోషాతిరేకంతో నిండిపోయాయి.అలా ప్రతీ టీచర్ కు తమదైన శైలిలో ఘనంగా సన్మానం చేసి సాదరంగా ప్రణమిల్లి ఫోటోస్ తీయించుకున్నారు. ప్రతీ టీచర్ స్పందన ఆశీస్సుల రూపం లో తీసుకున్నారు.

"ఈ కార్యక్రమం పూర్తయ్యాకా మనమందరం కలిసి మళ్ళీ మన ఉపాధ్యాయులతో గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఆతరువాత అందరం కలిసి ఆనందంగా విందు భోజనం చేద్దాం. మన ప్రకాశం మాస్టారు మరల తానూ మాట్లాడేటందుకు అయిదు నిముషాలు సమయం కోరారు. ఆ సందేశం అనంతరం నేను చెప్పిన కార్యక్రమాలు కొనసాగుతాయి. రండి సర్." అంటూ ఆహ్వానించింది రజని.

ప్రకాశం గారు లేచి మైక్ అందుకున్నారు.

" ప్రియమైన విద్యార్దులారా.మీరు తప్పు చేస్తే ఆ రోజుల్లో నిర్దాక్షిణ్యంగా పనిష్మెంట్ ఇచ్చేవాడిని.అది మీలో నేను ఆశించిన మార్పు కోసమే అని మనసా వాచా నమ్మేవాడిని తప్ప మీ మీద కోపం ఉండి మాత్రం కాదు. అటువంటి నేనూ ఆరోజుల్లోనే ఒక తప్పు చేసాను." అంతే! ఆ ప్రాంగణమంతా చీమ చిటుక్కుమన్నంత నిశ్శబ్దం. వింటున్న సీతారాముడు , విమల ఉలిక్కి పడ్డారు.

"అవును బాబు. నేను తప్పు చేసాను. విద్యార్ది దశలో విద్యార్ధులు తమ దృష్టిని మరో వైపు మళ్లించుకోకుండా తాను నిర్దేశించుకున్న లక్ష్యం వైపు సరళరేఖలా సాగిపోవాలని, వక్ర రేఖలో ప్రయాణించకూడదని నా ప్రగాఢ నమ్మకం. కానీ వయసు వల్ల వచ్చే మార్పులవల్ల శారీరక ఆకర్షణ వైపు మళ్ళి దానినే ప్రేమ అనుకుని చదువును నిర్లక్ష్యం చేసి జీవితాలను చేసేతులారా నాశనం చేసుకునే వయసు టీనేజ్ వయసు. మీ అందరకూ అర్ధం అయ్యే ఉంటుంది నేను ఎవరిగురించి మాట్లాడుతున్నానో.ఆరోజు విమల రాసిన ఉత్తరం నా వద్ద భద్రంగా ఉంది. ఇదుగో ఆ ఉత్తరం. " దానిని ఆయన రజనిచేతికి అందించారు.
ఆమె దానిని అపురూప వస్తువులా అందుకుంది సంభ్రమాశ్చర్యాలతో. ఇరవై నాలుగేళ్ల క్రితం వ్రాసిన ఉత్తరం ఈవాళ తన చేతుల్లో....

" ఆనాడు వారిద్దరి మధ్య ఉన్నది వయసు ఆకర్షణ అనుకున్నాను.దాని వల్ల వాళ్ళ తల్లితండ్రుల పరువు ప్రతిష్ట ల కంటే వీరిద్దరినీ చదివించి గొప్పవాళ్ళుగా చూడాలనుకున్న వారి ఆశలు అడియాసలు అవుతాయని భావించి ఆ విషయాన్ని ప్రధానోపాధ్యాయుల ముందు వుంచి వారి పవిత్ర ప్రేమను అవమానించాను. ఆడపిల్ల అయినా అందులో విమల అభిప్రాయాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

" రామూ.ప్రేమకి ఇంత శక్తి ఉంటుందని నాకు తెలీదు.సినిమాలలో డబ్బున్న వాళ్ళ ప్రేమనే చూపిస్తారు.అమ్మ నాన్న ఇటుకల పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారని నీకు తెలుసు. సీజను కాకపోవడం తో మూడు నెలలుగా పనిలేదు. దాంతో మూడు రోజులకోసారి భోజనం, అదీ ఒక పూట చేస్తున్నాము.చిన్న పిల్లవాడు కాబట్టి తమ్ముడికి మూడు సార్లు పెట్టి మేము పస్తు ఉంటున్నాము. నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాకా ఆకలి అన్నదే నేను మర్చిపోయాను.కల్మషం లేని నిశ్చల ప్రేమకి ఇంత శక్తి ఉంటుందని నాకు ఇపుడే అర్ధం అయింది. నా పవిత్ర ప్రేమను నువ్ అంగీకరిస్తే మనం బయటపడకుండా టెన్త్ అయ్యాక వివాహం చేసుకుందాం.నువ్ ఇచ్చే సమాధానాన్ని బట్టి నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది." అని రాసింది.ఆ ఉత్తరం లో ప్రతీ వాక్యం నాకు గుర్తే.

మీరుతప్పు చేస్తే దండించాను.మరి నేను తప్పు చేస్తే పెద్దరికం మీద వేసుకుని అహం భావంతో సరి దిద్దుకోవాలి అంతేగా.
నో. ఆ తప్పు సరిదిద్దు కోవడం తో పాటు చేసిన తప్పుకు క్షమాపణ అడగడానికి కూడా సిగ్గుపడను.మీరు మాస్టారు కదా అనవచ్చు.ఈవేళ మీరుకూడా నా సహా గృహస్తులు.మీ విద్యార్ధి దశ ఆనాడు టెన్త్ తోనే అయిపొయింది.

వారిద్దరి ప్రేమ గురించి మీలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఈనాటికీ వాళ్ళ ఇద్దరి మధ్య ఆ పరిపక్వమైన ప్రేమ అలాగే ఉందని ఇందాకా వాళ్ళ మాటల వాళ్ళ అర్ధమైంది. ఎస్. సీతారాముడూ...అనుకోకుండా మీ ఇద్దరూ మీ పదవతరగతి గదిలో మాట్లాడుకున్న మాటలు అన్నీ నేను విన్నాను. వారిద్దరూ ఇప్పుడు ఎవరికీ వారు ఒంటరి వారు. మీ అందరి అనుమతి తో వారిని ఇపుడైనా జంటగా చేసి నా తప్పును సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను.మీ అందరికీ ఓకే నా? "
ఆయన మాట పూర్తీ కాకుండానే హర్షధ్వానాలతో, ' వావ్' ' వండర్ ఫుల్ ' అన్న పి ల్లల అరుపులు కేకలతో ప్రతిధ్వనించింది.

నా మీద గౌరవం ఉంచి వేదిక మీదకు రావలసిందిగా సీతారాముడుని, విమలను కోరుతున్నాను. వాళ్ళు రావడానికి భయపడితే దయచేసి మీరు వాళ్ళని తీసుకురావలసిందిగా కోరుతున్నాను.ప్లీజ్." విజ్ఞప్తిగా అన్నారాయన.

అప్పటికే అయిదుగురు అబ్బాయిలు, అయిదుగురు అమ్మాయిలు బలవంతంగా వారిద్దరినీ వేదిక మీదకు తీస్కువచ్చారు.

వస్తూనే వారిద్దరూ ప్రకాశంగారి కాళ్ళకు నమస్కరించి కూలబడి పోయారు. ఆయన ఇద్దరినీ చెరో చేతితో పైకి లేపారు.
వారిద్దరి కళ్ళల్లోనూ తనను పలకరించలేదన్న అపరాధభావం కన్నీళ్ళుగా కారిపోతున్నాయి.

"తప్పయ్యా...కళ్ళు తుడుచుకోండి ఇద్దరూ..."ఆజ్ఞాపించారాయన.

వారిద్దరూ కళ్ళూ తుడుచుకున్నారు. ఇంతలో రజని రెండు చామంతి మాలలను తీసుకువచ్చి మాస్టారికందించింది. "కొత్త బట్టలు కూడా తీసుకురామ్మా" చెప్పారాయన

స్నేహితులందరి ఆనందోత్సాహాలమధ్య వారిద్దరూ దండలు మార్చుకున్నారు. ప్రకాశంగారి పాదాలకు నమస్కరించారు.ఆయన సీతారామున్ని కౌగలించుకుని 'ఇకనైనా సుఖంగా ఉండండయ్యా. నీకు తోడుగా విమల ఉంది.సంతోషంగా జీవించండి.'అన్నారు ప్రకాశం గారు. ఉపాధ్యాయులందరూ వారిని మనస్పూర్తిగా ఆశీర్వదించారు.

పూర్వ విద్యార్ధుల ఆ అ 'పూర్వ' సంగమం అక్కడున్న ప్రతీ హృదయంలో మరపురాని మనోహర దృశ్య కావ్యమై మిగలడం చూసిన ప్రకాశం మాస్టారు నిర్మలమైన మనసుతో ప్రకాశిస్తున్నారు.!!!

సమాప్తం

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి