భాగవత కథలు-3 జయ విజయులు శాపగ్రస్తులగుట - కందుల నాగేశ్వరరావు

Jayavijayulu sapagrastulaguta

సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురూ బ్రహ్మ మానస పుత్రులు. ఆ మహాత్ములు బ్రహ్మచారులు, పరమపావనులు, గుణవంతులు మరియు పూజనీయులు. వారు సృష్టికార్యాన్ని చేయటానికి సుముఖత చూపించకుండా తమ ముక్తిమార్గాన్ని వెదుక్కుంటూ తపోవనానికి వెళ్ళిపోయారు. వారు సమస్త విషయాలలో సమగ్రమైన జ్ఞానంగల విద్వాంసులు.

ఒకనాడు వారు లోకాలన్నీ యదేక్షగా తిరుగుతూ, భక్తితో శ్రీమహావిష్ణువును కొలవాలని వైకుంఠానికి బయలుదేరి వెళ్ళారు. పాపములను హరించువాడూ, పరాత్పరుడూ, కేశవుడూ, అనంతుడూ అయిన వాసుదేవుని సేవించడానికి భక్తియే ప్రధానమార్గం. ఆయన అఖిల మునీశ్వరులు అభివర్ణించే మందహాస సుందరమైన ప్రసన్న ముఖారవిందంతో అలరారేవాడు. తన భక్తుల హృదయాలలో పవ్వళించేవాడు. విశాలమైన నల్లని వక్షస్థలం మీద వైజయంతీమాలతో విరాజిల్లేవాడు. తన భక్తులను చల్లని చూపులతో చూసే కమలాల వంటి కన్నులు కలవాడు. సకల యోగిపుంగవులకూ ఆరాధ్య దైవము. సాధు జనులను రక్షించగల సమర్థుడు. ఆయన ఆ మహిమాన్వితమైన వైకుంఠపురానికి కూడా అలంకారమైనవాడు. వైరాగ్య భావాన్ని పొందినవారూ, అహంకారాన్ని త్యజించిన వారూ పుణ్యాత్ములకు పుట్టినిల్లైన వైకుంఠపట్టణంలో ఉంటారు. పవిత్రమైన వైకుంఠపురం ఒక సరోవరం అనుకుంటే, దివ్యత్వంతో నిండిన ఆ బంగారు మందిరమే సరస్సు నడుమ ఉన్న పద్మం. ఆ మందిరం మధ్యభాగాన్న ప్రకాశించే ఆదిశేషుడే తామరదుద్దు. శేషతల్పంపై శయనించు మాధవుడే తుమ్మెద.

ఈ విధంగా శ్రీమహావిష్ణువు పాలించేదీ, వైభవోపేతమైన మహాప్రభావంతో ప్రకాశించేదీ అయిన ఆ వైకుంఠధామాన్ని లోకకల్యాణ స్వరూపులైన సనకసనందాదులు తమ యోగశక్తి వల్ల వడివడిగా సమీపించారు. అటువంటి అరవిందాక్షుని సందర్శించాలనే ఆనందంతో ఆ మహర్షులు అలంకృతమైన గోడలతో, రత్నమయాలైన కవాటాలతో, గడపలతో ఒప్పుతున్న ఆరు మహాద్వారాలను దాటి అనంతరం ఏడవ మహాద్వారాన్ని చేరారు. అక్కడ కావలి కాస్తున్న ఒకే వయస్సు గల ఇద్దరు ద్వారపాలకులను చూచారు. ఆ ద్వారపాలకులిద్దరూ నవరత్నాలు పొదిగిన కంకణాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాలి అందెలు ధరించి ఉన్నారు. వారిద్దరూ గదలు పట్టుకొని, రోషాగ్నితో ఎర్రబడిన కన్నులతో, గోవిందుని మందిరం ముందు నిలబడి కాపలా కాస్తూ ఉన్నారు. సనకసనందాదులు వృద్దులైనప్పటికీ బాలురవలె కనబడుతూ నిబ్బరంగా ఆ ద్వారపాలకులను సమీపించారు.

ఆ ద్వారపాలకులిద్దరూ దుర్భాషలాడుతూ వారిని అడ్డగించారు. ఆ ద్వారపాలకులు అడ్డగించగా మహర్షులకు తీవ్రమైన కోపం వచ్చింది. వారు ద్వారపాలకుల వైపు చూస్తూ మీరు మందబుద్ధులై, మేము ఎవరమో గ్రహించలేక పోయారు. విష్ణుభక్తులైన మమ్మల్ని అడ్డగించారు కనుక కామక్రోధలోభాది చెడుగుణాలకు పాత్రులై భూలోకంలో పుట్టండి అని శపించారు. విష్ణుదేవుని సేవకులు అప్పుడు వచ్చినవారిని మహర్షులుగా గ్రహించి, పరితాపం పొందినవారై చేతులు జోడించి మునీశ్వరుల పాదాలకు భక్తితో మ్రొక్కుతూ ఇట్లా విన్నవించుకున్నారు. “యోగసత్తములారా! మా పాపమే మీకు కోపం తెప్పించి మమ్మల్ని శాపం పాలు చేసింది. మమ్మల్ని కనికరించి మేము మోహలోభాలు చేపట్టి పుట్టినచోట శ్రీమన్నారాయణుని నామం వదిలిపెట్టకుండా ఉండేటట్టు అనుగ్రహించండి. అందువల్ల తర్వాత జన్మలలోనైనా మాకు శుభం కలుగుతుంది." జయవిజయులు ఇట్లా అంటున్న సమయంలో సర్వేశ్వరుడైన శ్రీమహావిష్ణువు లోపల నుంచి ఆ కలకలం విని అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

అప్పుడు లక్ష్మీదేవి కూడా విష్ణుదేవుని వెనుక వచ్చింది. ఆ విష్ణుమూర్తి నడుం చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెపై బంగారు మొలనూలు వెలుగులు వెదజల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కలిసిపోయాయి. మెరుపు తీగవలె మిరుమిట్లు గొల్పుతున్న మకరకుండలాల ధగధగలు చెక్కిళ్ళ నిగనిగలతో స్నేహం చేస్తున్నట్ట్లుగా ఉన్నాయి. నవరత్నాలు పొదిగిన కిరీటం వెలుగు వెల్లువలు నలుదెసలా ప్రసరిస్తున్నాయి. ఆయన గరుత్మంతుడి మూపుపై తన ఎడమ చేయి ఆనించాడు. ఆ చేతికి అలంకరించిన భుజకీర్తులు, కడియాలు, కంకణాలు ముచ్చటగా వెలుగొందుతున్నాయి. స్వామి తన కుడిచేతిలో అందమైన లీలారవిందాన్ని ధరించి దానిని విలాసంగా త్రిప్పుతున్నాడు.

ఆ మునీంద్రులు అచంచలమైన భక్తితో ఆ మహానీయుడి ముఖాన్ని చూస్తూ అతి కష్టం మీద తమ చూపులను త్రిప్పుకొని ఆ స్వామి పాదాలమీద కేంద్రీకరించారు. కన్నులు విందు కావించే పద్మనాభుని దివ్యమంగళ స్వరూపాన్ని సనకసనందాదులు భక్తితో స్తుతించారు. తాము కోపంతో జయవిజయులను శపించినందుకు పశ్చాత్తాపంతో తమని క్షమించమని స్వామిని వేడుకొన్నారు. అప్పుడు శ్రీహరి వారితో ఇలా అన్నాడు. “ నా ద్వారపాలకులు నా ఆజ్ఞను అతిక్రమించి చేసిన నేరానికి మీరు వారికి తగిన శిక్ష విధించారు. అది నాకు కూడా ఇష్టమే. భయంకరమైన కుష్ఠురోగం దేహంలో ప్రవేశించినప్పుడు చర్మం చెడిపోయి రంగు మారినట్లుగా, సేవకులు చేసే తప్పులవల్ల ప్రభువుల యశస్సు నశించి పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. లోకంలో అపకీర్తి వ్యాపిస్తుంది. వీరు మిక్కిలి మిడిసిపాటుతో మాయాజ్ఞ మీరి ప్రవర్తించినందులకు దానికి తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ధర్మమార్గంలో సంచరించే ఉత్తముడు పరమేశ్వరార్పణమని భక్షించే ఒక చిన్న అన్నంముద్ద వల్ల నా మనస్సుకు కలిగే సంతృప్తి యజ్ఞయాగాలలోని హవిస్సును అందుకొని ఆరగించేటప్పుడు కూడా నాకు కలుగదు. వారి సంకల్పం కూడా ఇదే. వీరు కూడా నా భక్తులు కావున భూమిపై పుట్టిన కొలదికాలంలోనే తిరిగి నా సమీపానికి వచ్చునట్లు ఆనతి ఇవ్వండి”.

అప్పుడు ఆ మునులు చేతులు జోడించి ఇలా అన్నారు. “దేవా! ఇప్పుడు మేము చేసిన పని నీకు సమ్మతమే అన్నావు. దానితో మా గుండెల్లోని బాధ మాయమైపోయింది. నీ లీలలు తెలుసు కోవడం ఎవరికి సాధ్యం? నీవు ధర్మమూర్తివి! ఈ వినయాలు నీ లీలా విశేషాలు, అంతే. మమ్ము నీ ఇష్టం వచ్చినట్లు శాసించు. నీ నుండి ఉద్భవించిన ధర్మం నీ అవతారాలవల్ల సురక్షితమై సుస్థిరమై విలసిల్లుతుంది. ఈశ్వరా! దయామయా! సత్యస్వరూపంలో ఉన్న నిన్ను గమనిస్తే నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమనీ, నీవే ఆధర్మంలోని ప్రధాన రహస్యమనీ పెద్దలు అంటుంటారు.”

ఆ మునులను దయా దృష్టితో చూచి శ్రీహరి ఇలా అన్నాడు. “ఓ మునులారా! ఈ జయవిజయు లిద్దరూ సంతోషంగా భూలోకానికి వెళ్తారు. అక్కడ లోభమోహములు కలవారై రాక్షసులుగా జన్మిస్తారు. ఆ లోకంలో నాపై విరోధభావం పూనినవారై దేవతలకు, మానవులకు ఆపదలు కల్గిస్తూ సర్వలోక కంఠకులై జీవిస్తారు. అత్యంత సాహసంతో నన్ను ఎదిరించి యుద్ధం చేస్తారు. నా సుదర్శన చక్రంచేత ప్రాణాలు కోల్పోయినవారై ఉత్సాహంతో నా దగ్గరకు వస్తారు. నా ముఖం చూస్తూ ప్రాణాలు విడిచినందువల్ల వీరు పాపరహితులై నా ఆస్థానంలో తమ స్థానాలు అలంకరిస్తారు. ఈ మూడు జన్మల అనంతరం వీరికి జన్మ లేదు.” అప్పుడు సనకసనందాదులు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని మరల స్తుతించి పరమేశ్వరుని అనుమతి పొంది తమ నివాసాలకు వెళ్లారు.

శ్రీహరి జయవిజయులను దాక్షిణ్యంతో వీక్షించి ఇలా పలికాడు. “మీరు తప్పనిసరిగా రాక్షసజాతిలో పుట్టవలసిన వచ్చింది. నేను ఎంతటి శక్తి సామర్థ్యాలు కలవాడినైనా తపోధనులైన మునీశ్వరుల వాక్కును నివారించలేను. అందువలన మీరు రాక్షసులై జన్మించి నాకు ప్రతిపక్షులై మీ మనస్సులలో సర్వదా నన్ను తలంచుకొంటూ, నా చేత మరణించి మరల ఇక్కడకు వస్తారు, ఇక వెళ్లండి” అని ఆజ్ఞాపించాడు. తర్వాత ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి వెంటరాగా, అతిశయానందంతో నిర్మల తేజోవిరాజితమైన నిజమందిరానికి విజయం చేశాడు. అనంతరం జయవిజయులు తమ తేజస్సు కోల్పోయి నిశ్చేష్టులై నేల కూలారు.

ఆ జయవిజయులే లోకకంటకులై కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల ధంతావక్త్రులగాను జన్మించి శ్రీహరి చేతిలో మరణించి, శాపవిమోచనం తరువాత మరల వైకుంఠము చేరి శ్రీమన్నారాయణుని కొలువులో శాశ్వత స్థానాన్ని పొందారు.

*****

మరిన్ని కథలు

Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు
Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి