దోషి! - Boga Purushotham

Doshi

కారు డోరు తెరవడానికి ప్రయత్నించాడు మంత్రి మల్లన్న.
‘‘ సార్‌! సార్‌ ! వద్దు..మీరు బయట దిగడం అంత క్షేమకరం కాదు! ముప్పు ముంచుకొస్తోంది..’’ వారిస్తూ డోర్‌ వేయబోయాడు సెక్యూరిటీ.
‘‘ నువ్వుండవయ్యా! అసలు జరిగిందేమిటో ఆ మూర్ఖులకు చెప్పాల..’’ విసురుగా దిగబోయాడు మల్లన్న.
మంత్రి మాటలు పూర్తికాకముందే గూడెం వాసుల ఆగ్రహజ్వాలకి కారు అద్దాలు తుత్తునియలయ్యాయి. మంత్రి తలకి స్వల్పగాయం. పోలీసుల తూపాకీ మొతలు మిన్నంటాయి. లాఠీలు విజృంభించాయి. ఒకరిద్దరు నేలకొరిగారు. అనేకమంది గాయపడ్డారు. జనం గుంపు హాహాకారాలు చేసింది. వెంటనే అక్కడ మిలిటరీ దళం మోహరించింది.
ఇప్పుడక్కడ కదలికల్లేవు..అరుపుల్లేవు.. నిర్మానుష్యం, నిశ్శబ్దం..సూది కిందపడినా వినిపిస్తోందక్కడ!
మల్లన్నపై జరిగిన దాడికి సానుభూతి తెలిపి అక్కడికి వచ్చిన హోం మినిష్టరు ‘‘ దాడికి పాల్పడ్డ వారిని గుర్తించడానికి ఎంత సేపయ్యా?’’ పోలీసులను ప్రశ్నించాడు.
‘‘ అవున్సార్‌..దీన్ని దాడి అనడానికి వీల్లేదు !’’ఎస్‌ఐ సమాధానం.
‘‘ ఏం! ఎందుకు?’’ మంత్రి ఎదురు ప్రశ్న.
‘‘ తిరుగుబాటు సార్‌! అన్యాయం, అక్రమాలపై ప్రజాగ్రహం’’
‘‘ అయితే దాడి కాదంటావా?’’
‘‘ ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు కోరాల్సిన వ్యక్తే ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రజలు సహించరు సార్‌!’’
‘‘ దౌర్జన్యమేందయ్యా! మా డబ్బు, సారా తాగేసి మాకు ఓట్లేయ్యక అన్యాయం చేస్తుంటే ఊర్కోమంటావా.. ఎలా?’’
‘‘ ఊర్కోవటం కాద్సార్‌! ఇది ప్రజాప్రభుత్వం..ప్రజలు ఎలా తీర్పిస్తే దాన్ని అలాగే గౌరవించాలి..’’
‘‘ గౌరవమేందయ్యా! పాలనాధిపతులం..న్యాయం, చట్టం అన్నీ మా చేతుల్లోనే వుంటాయి! మేం ఎట్టా చెబితే మీరు అట్టా చెయ్యాల.. అంతే’’ ముఖం చిట్లించుకున్నాడు హోం మినిష్టరు.
ఎస్‌ఐ ఒప్పుకోలేదు.
‘‘ అన్యాయం అన్యాయమే కద్సార్‌?’’
‘‘ ఏందయ్యా! అంతమంది ప్రజలు నాయకుడిపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్‌ కదయ్యా?’’
ఈ సారి ఎస్‌ఐ మాట్లాడలేదు.
మరో జీప్‌లో డిఎస్‌పి అక్కడికి వచ్చాడు.
‘‘ ఏందా వాగుడు! ఇందాకా దోషులెవరనేది గుర్తించకపోతే మనం కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నట్టా? లేనట్టా?’’ డిఎస్‌పి ఎదురు ప్రశ్న.
‘‘ అదే నేనూ అడుగుతున్నా! అసలౌన దోషులెవరన్నది గుర్తించమంటున్నా..’’ ఎస్‌ఐ ఎదురు ప్రశ్న.
‘‘ అదే నేనూ చెబుతున్నానయ్యా! రేపటిలోగా దోషుల్ని గుర్తించి చట్టానికి పట్టీయ్‌’’ ఆజ్ఞాపించి వెళ్లాడు డిఎస్‌పి.
అయిష్టంగా తలూపాడు ఎస్‌ఐ.
ఆగ్రహావేశంతో మంత్రి కారెక్కాడు. పొగలు చిమ్ముకుంటూ వెళ్లింది మంత్రి కారు. అందరూ కళ్లు నులుముకున్నారు.
‘‘ చూడండి సార్‌! వాయు కాలుష్యాన్ని నిరోధించమని చెప్పే నాయకులే ఆచరణకు తిలోదకాలిస్తుంటే ఇక సామాన్యు ప్రజలం మేమెక్కడ ఆచరిస్తాం సార్‌?’’ అంటూ అక్కడికి రాబోయారు గూడెం నాయకుడు.
‘‘ వద్దు! రావద్దు..పరిస్థితులు బాగోలేవు’’ హెచ్చరించాడు ఎస్‌ఐ. అయినా ఖాతరు చెయ్యకుండా వచ్చి చద్దన్నం మెతుకుల్ని ఇచ్చి ‘‘తినండి..అన్నం తిని ఎన్నాళ్లయిందో ఏమో!’’ అంటూ అందించి వెళ్లిపోయాడు గూడెం నాయకుడు.
ప్రజాభిమానానికి ఎస్‌ఐ కళ్లు చెమర్చాయి. రెండ్రోజుల్నించి అన్నం లేదు. తెల్లారి మాత్రం దూరంగా వున్న టౌను నుంచి ఇడ్లీలు తెప్పించి తిన్నాడు. అయినా ఆకలి బాధ తీరలేదు. ఎవరికి చెప్పుకుంటాడు. చెప్పినా వినగలిగే మానవత్వ మెవరికుందీ? ఆలోచిస్తూనే అన్నం తిని నీళ్లు తాగాడు ఎస్‌ఐ.
ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో వుంది గిరిజనుల గూడెం. దోషుల్ని పట్టుకోవడానికి అక్కడికెళ్లాడు ఎస్‌ఐ. అది రాత్రి సమయం. కరెంటు లేదు. అయినా పోలీసుల బూట్ల చప్పుడికి గూడెమంతా మేల్కొంది. ఊరి బయటే వున్న పోలీసోళ్లని ‘‘ అన్యాయానికీ.. అక్రమాలకీ కొమ్ముకాసే మీరు ఊళ్లోకి ప్రవేశిస్తే సహించం..చట్టంతో శాసించాలనుకునే మీ నాయకుల నాయకత్వాలు మా కొద్దు..సర్వమానవ సమానత్వం, స్వేచ్ఛ స్వాతంత్య్రాలే మా హద్దులు..’’ అంటూ తరిమారు గూడెం ప్రజలు.
పౌరుషంతో పోలీసొకడు లాఠీ రaుళిపించబోయాడ. ప్రజలు ప్రతిఘటించి బాదారు.
ఎస్‌ఐ వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విజృంభణతో ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది.
అప్పుడే అక్కడికి వచ్చాడు డిఎస్‌పి. చేతికి చిక్కిన నల్గురు పౌరుల్ని జీప్‌లోకి తోసి ముందుకు దూసుకుపోయాడు.
అక్కడ ఘర్షణ సర్దుమణగలేదు.
మరుసటి రోజు నల్గురు పౌరులూ శిక్ష కోసం కోర్టు బోనులో నిలబడ్డారు.
మంత్రి ‘‘ పాలకుడిపై ప్రజలే ఇలా దౌర్జన్యం చేయటం సమాజానికి సిగ్గుచేటు..హేయమైన చర్య!’’ అని తనపై జరిగిన దాడిని అభివర్ణించాడు.
జడ్జి మౌనంగా ఆలకించారు.
ప్రజల తరపున వాదించడానికి న్యాయవాదులెవరూ లేరు.. న్యాయమూర్తే తమ వాదనలు వినిపించమని కోరాడు.
‘‘ సార్‌! సార్‌! ఆ రోజు పోలింగ్‌ బూత్‌లో మమ్మల్ని రానివ్వకుండా రిగ్గింగ్‌కు పాల్పడ్డాడు మంత్రి. ఏమని ప్రశ్నిస్తే చాటుగా లాక్కెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బు ఇచ్చి పొమ్మన్నాడు. కాదంటే మాపై దాడిచేసి భయపెట్టి తరిమాడు. అక్కడ జరిగిన అక్రమం, అప్రజాస్వామికం.. అని నిలదీస్తే దాడి.. దౌర్జన్యం.. అనిఆరోపిస్తున్నాడు...’’ అంటూ చెప్పుకుపోతున్న గూడెం వాసుల మాటల్ని ఎవరూ ఆలకించలేదు.
‘మంత్రి రిగ్గింగ్‌కు పాల్పడినట్లు సాక్ష్యాలు లేని కారణంగా ఆరోపణ నిరాధారమైందిగా పరిగణించి, నాయకునిపై ప్రజలు జరిపిన దాడిని అనాగరికం..హేయమైన చర్య..’ అని చిత్రీకరిస్తూ భారీ మొత్తంలో జరిమానా, యావజ్జీవ శిక్ష అనుభవించాలి..’’ అంటూ చెప్పుకుపోతున్న జడ్జి మాటలకు సమాజం సోకిస్తుంటే, దోషిని నిర్దోషిగా వదిలేసినందుకు వెనుక నిల్చొన్న న్యాయదేవత కళ్లకు కట్టిన గంతల వెంట కన్నీటి సుడులు తిరుగుతున్నాయి.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ