తనకు మాలిన ధర్మం - సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు

Tanku malina dhatrmam

తనకు మాలిన ధర్మం… “ఏమైనా.. ప్చ్..నచ్చలేదురా మూర్తీ!” అన్నాడు శ్రీనివాస్ ఆవేదనగా . “నాకు మాత్రం, నచ్చే చేస్తున్నానురా శ్రీను!” అన్నాడు మూర్తి బాధగా. “నిన్న బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదుగాని, తనకు మాలిన ధర్మం…” అన్నాడు శ్రీనివాస్ సాలోచనగా. “మొదలు చెడ్డ బేరం అంటావు. ఈ సామెత కన్నకూతురి విషయంలో కూడానా…?” దీర్ఘాలు తీసాడు మూర్తి. “అనుబంధాలను బట్టి ధర్మం మారదురా.”అన్నాడు శ్రీనివాస్ స్థిరంగా. కొంతసేపు నిశ్శబ్దం ఇద్దరి మధ్యా. “సరే, మన సంగతి పక్కన పెట్టు. ఇంతకూ లక్ష్మి అభిప్రాయం ఏమిటో చెప్పావు కాదు.” అన్నాడు శ్రీనివాస్ కుతూహలంగా స్నేహితుడి కేసి చూస్తూ.

💐💐💐💐💐💐 “అమ్మా! వచ్చే నెలకి ఏడు నెలలు పూర్తవుతాయి. కష్టం మీద ఇప్పటి దాకా ఆఫీస్, ఇల్లు లాక్కొని వచ్చా. ఇక నా వల్ల కాదు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకో. పుట్టబోయే మీ అమెరికా మనవరాలుకి బంగారు గొలుసు, గాజులు, బుల్లి వడ్డాణం సిద్ధం చేసుకో….” మంచం మీద కూర్చొన్న లక్ష్మికి, పెద్ద కూతురు సురుచి మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి. “లక్ష్మీ! నీ మోకాళ్ళకు తైలం మర్దనా చేస్తా. ఇదిగో ఈ బీపీ మాత్ర వేసుకో…”అంటూ టాబ్లెట్ భార్యకి అందించాడు మూర్తి. ఆలోచనల నుండి తేరుకుని,“మీ కెందుకు శ్రమ? నా తిప్పలు నాకు తప్పవు కదా!” అంది లక్ష్మి భారంగా నిట్టూరుస్తూ. మూర్తికి భార్య లక్ష్మి మనసు తెలియంది కాదు. “నాకు కాకపోతే ఇంకెవ్వరికి కావాలి? రక్తపోటు, షుగరు ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. ఆందోళన పడితే ఎలా చెప్పు?” అన్నాడు అనునయంగా. లక్ష్మి కళ్ళల్లోంచి కన్నీరు ఉబికింది. భార్యకి దగ్గరగా కూర్చుని,”నీ గారాల చిన్న కూతురుతో మాట్లాడవా? ఏమంది? అన్నాడు ఆమెను నవ్వించడానికి ప్రయత్నిస్తూ. “ఆ..సునీతతో మాట్లాడా.”అంది ముభావంగా. “అలాగా! ఏమంటోంది?” అడిగాడు భార్యని. “అది కూతురా! ఛీ… పరాయి పిల్ల కూడా అలా మాట్లాడదు. దానితో ఈ జన్మలో మాట్లాడితే ఒట్టు.” అంది ఉక్రోషంగా చీరకొంగుతో కళ్లు తుడుచుకుంటూ. “మీ ఇంటి ఖర్చులు నాన్న చూసుకుంటారు. అమెరికా నుండి నేను తిరిగి వచ్చేదాకా, మీ ఇంట్లో పెట్టుకుని, కాస్త కనిపెట్టుకొని ఉండవే.. అని అడగలేదు, బ్రతిమాలాడాను. నా మాట పూర్తిగా వింటేగా! ఒళ్లు మండి తిట్టాను.” తడారిపోయిన గొంతు తడుపుకోవడానికి ఆగింది లక్ష్మీ. భార్య హావభావాలు పరికిస్తూ అంతా విన్నాడు మూర్తి. “అంత కష్టం ఏమి వచ్చిందట? మొగుడికి ఇష్టం లేదా? దాని అత్తామావలు వస్తున్నారా? లేక చాకిరి చేయలేదా?” అసహనంగా అడిగాడు మూర్తి. “దాని బొంద. దాని సంస్కారానికి సత్కారాలకి భయపడి, అత్తామావలు గడప తొక్కడం మానేసారు. దాని ఇల్లు. దాని ఇష్టం. ఆ రంభ క అంటే క, కి అంటే కి అనాలి దాని మొగుడు. కాదంటే, ఇల్లు పీకి పందిరేసి, తైతక్కలాడుతుంది.” అంది లక్ష్మి కోపంగా. “సంస్కారాల సంగతి ఇప్పుడెందుకులే. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇంతకీ దాని ఏడ్పు ఏమిటిట?” అడిగాడు మూర్తి, కూతురి మొండివైఖరిని తలచుకొంటూ. “ఏం చెప్పను! ఖర్మ!...మీరే… దానికి సమస్యట.” ఠక్కున అంది భర్త ముఖకవళికలు గమనిస్తూ. “హా! నేనా? ఏమిటి నేనా!” రెట్టించాడు మూర్తి ఆశ్చర్యంగా. “అవును. దాని పిల్లల మీద గట్టిగా అరుస్తారట. ప్రపంచం తలక్రిందలైనా, భోజనఫలహారాలు మీకు ఠంచనుగా టైమ్ కి అందించాలిట. ఎప్పుడూ టీవీకి అతుక్కుపోయి ఉంటారని అల్లుడు గారి ఫిర్యాదట. అందుకే …”అంటూ నసిగింది లక్ష్మి. “పిల్లలకి తప్పొప్పులు చెప్పడమూ నేరమా! నోరు మూసుకుని, ప్రేక్షక పాత్ర పోషించాలా? వద్దులే లక్ష్మీ! బంధం ఏదైనా, గౌరవ మర్యాదలు లేని కొంపలో అడుగు మోపకూడదు.” వేదనా భరితమయ్యింది మూర్తి మనసు. నిర్వేదంగా హాల్లోకి నడిచాడు. హృదయభారంతో మంచం మీదకు ఒరిగిందామె.

💐💐💐💐💐💐 “అమ్మా! బట్టలు, స్వీట్లు, ఫ్రూట్స్ కాకుండా కొన్ని ముఖ్యమైన వస్తువుల జాబితా కూడా వాట్సాప్ లో పెట్టా. మరచి పోకుండా తీసుకురా. అవన్నీ మీ ఇండియాలో కారుచౌక! అదే మా అమెరికాలో చాలా ఖరీదు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తే, ఫోన్ చేసి చెబుతా.” అమెరికా కూతురు పెట్టిన ఆడియో సందేశం విని భారంగా నిట్టూర్చింది లక్ష్మి. ఆమె ఆలోచనలు గతంలోకి తొంగిచూసాయి. భర్త సంపాదన తప్పా, వేరే ఆదాయ మార్గం లేని కుటుంబం తమది. పిల్లల చదువులు, ఆడ పడచుల పెళ్లిళ్లు, అత్తమామల అనారోగ్యాలు,…. ఐనా ఎప్పుడూ బాధ పడలేదు తను. అధైర్య పడలేదు తన భర్త. కనుల ముందు కాలచక్రం గిర్రున తిరిగింది. పెద్దమ్మాయి సురుచి చదువు, అందం గురించి విని, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తమ అబ్బాయి కిచ్చి పెళ్ళి చేయమని వెంటపడ్డారు వియ్యాల వారు. రెండో అమ్మాయిది ప్రేమ వివాహం. ఉద్యోగ విరమణ సమయానికి, బాధ్యతలు తీరి అద్దెఇంటిలో గుట్టుగా కాలక్షేపం చేస్తున్నారు. 💐💐💐💐💐💐 “ఏమండీ! నేను అమెరికా వెళ్ళితే, మీరొక్కరు ఉండగలరా? హోటల్స్ లో తింటూ, ఆరోగ్యం పాడు చేసుకొంటే …” మాటలు రాక మూగదయ్యింది లక్ష్మి. “నీ బాధ అర్థమయ్యింది. వంట చేసుకొని, నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొంటా. ధైర్యంగా ఉండు. ప్రాణమిత్రుడు శ్రీనివాస్, ఉండగా నేను ఒంటరి వాడ్ని కాదు.” ధృఢంగా చెప్పాడు మూర్తి. అలా గట్టిగా చెప్పకపోతే ఆమె అమెరికా వెళ్లలేదు. అది ఆమె బలహీనత. “నేను టైం కి షుగర్, బిపి మాత్రలు ఇస్తాను. నాకు తెలుసు మీకు మందులు వేసుకోవడం బద్దకం, కొంత నిర్లక్ష్యం. అందుకే, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించనని మాట ఇవ్వండి” పట్టుపట్టింది లక్ష్మి. భార్య భావోద్వేగం గ్రహించాడు మూర్తి. చిరునవ్వు నవ్వి, “ఏమిటా మాటలు! నా మాట మీద నమ్మకం లేదా? ఐనా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తానా చెప్పు?” అన్నాడు సున్నితంగా. భర్త మాటల్లో నిజాయితీ ఆమెలో భరోసా నింపింది. “ఒక వేళ అమెరికాలో నాకు మోకాళ్ల వాపులు ఎక్కువగా వస్తే, అక్కడ ఆసుపత్రిలో చూపించుకోవచ్చా? ఇక్కడ లాగానే అన్ని మందులు దొరుకుతాయా?” సందేహం వెలిబుచ్చింది లక్ష్మి. “ఆరోగ్యంగా ఉన్నామని తెలియచేయడానికి ముందుగా ఇక్కడ కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అక్కడ వైద్యం చాలా ఖరీదు. అందుకే ముందుగా ఇక్కడే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఇవన్నీ సురుచి చెప్పలేదా?” అడిగాడు మూర్తి. ఆతని మాటలు పూర్తి కాకుండానే, “అమ్మో! వీసాకి, ఆరోగ్యపరీక్షలకి, ఇన్సూరెన్స్ పాలసీకి డబ్బులు ఎక్కడి నుంచి తేగలం…? ఇదెక్కడి గొడవ. అవసరాల కోసం దాచుకున్న సొమ్మంతా ఖర్చు పెట్టేస్తే, మన రోజులు గడిచేదెలా? మన అవసరాలకి, ఎవర్ని అడుగుతాం? ఎవరిస్తారు?” అడిగింది ఆదుర్దాగా. ”గాబరా పడకు. ఆ దేశ నియమాలు అలా దాపురించాయి. దాచుకున్నది ఖర్చు చేయడం, నాకూ బాధగానే ఉంది. తప్పదు ఏం చేస్తాం!” అన్నాడు మూర్తి వేదనగా. “రెక్కలు ముక్కలు చేసుకుని బాధ్యతలు నెరవేర్చడమే కాకుండా, మన వృద్దాప్య అవసరాల కోసం దాచింది కూడా పిల్లలు, మనవలంటూ కరిగించేస్తే …” ఆగి భర్త స్పందన కోసం చూసింది లక్ష్మీ. “చూద్దాం. స్కూటర్ నా లాగే ముసల్ది అయ్యింది. అందుకే బేరం పెట్టా. బ్యాంక్ కి కూడా వెళ్లి వస్తా …” అంటూ ఇంటి మెట్టు దిగాడు మూర్తి.

💐💐💐💐💐💐 “లక్ష్మీ! మూర్తిని చూసి రెండు రోజులయ్యింది. ఫోన్ చేస్తే, ఎత్తడు. ఏమయ్యిందమ్మా?” వీధిగుమ్మం లోంచే ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చి, హాల్లో సోఫాలో కూలబడ్డాడు శ్రీనివాస్. “రా అన్నయ్యా! అమెరికా ప్రయాణం గురించే మధన పడుతున్నాం. డబ్బులు సర్దుబాటు చేసుకోవాలి. ఆయన ఒంటరిగా ఉండాలి. మా ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు. నీకు తెలియందేముంది చెప్పు?” అంది బాధగా. “చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు గానీ, లక్ష్మీ! మీ నిర్ణయం ఏంటో తెలుసుకుందామనే వచ్చాను. అటు కన్నకూతురి మీద ప్రేమ, ఇటు తాహతుకు మించిన ఖర్చులు…” అంటూ విశ్లేషణ మొదలెట్టాడు శ్రీనివాస్. మజ్జిగ గ్లాస్ చేతికిచ్చి,”అవును అన్నయ్యా! నువ్వు చెప్పినవన్నీ సత్యమే. చెప్పద్దు. అడకత్తెరలో పోకచక్కాలా ఉంది మా పరిస్థితి. ఏమి పాలుపోవడం లేదు. తోడబుట్టిన వాడిలా మమ్మల్ని ఎన్నో సార్లు ఆదుకున్నావ్…” భావోద్వేగంతో కూడిన మాటలు ఆమె మానసిక సంఘర్షణకి అద్దం పడుతున్నాయి. మజ్జిగ తాగుతూ ఓపికగా వింటున్నాడు శ్రీనివాస్. “నిన్న రాత్రి సురుచి ఫోన్ చేసింది. మాట వరసకు టికెట్, ఇన్సూరెన్స్ పాలసీ, బట్టలు వగైరాలకి అయ్యే ఖర్చులు గురించి చెప్పాను. దాంతో నిష్టూరంగా మాట్లాడింది.” అంది నొచ్చుకుంటూ. “ఏమంటుంది?” అడిగాడు శ్రీనివాస్. “కూతురుకు పురుడు పోయడం సమాజ సేవ కాదు. తల్లిగా నీ బాధ్యత. మా అత్త గారికి తెలిసిందంటే ఇంటి పరువు ప్రతిష్ట పోతుంది. మీ అల్లుడు గారు మన గడప జన్మలో తొక్కరు. జాగ్రత్త.” అంటూ చెప్పింది లక్ష్మి ఆవేదనగా. కూతురు, తల్లిని హెచ్చరించిన వైనం శ్రీనివాస్ ని కలచి వేసింది “తల్లిదండ్రుల్ని కన్నీళ్లు పెట్టించే కొడుకుల్ని చూసాం. ఇప్పుడు కూతుళ్ళనీ చూస్తున్నాం. ఈ దౌర్భాగ్యం, అనుబంధాలు, ఆత్మీయతలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, సర్దుబాటులు ఎరుగని, తరాలని తయారు చేస్తున్నందుకు ఫలితం కావచ్చు. మొత్తం మీద మానవతా విలువలు లుప్తమవుతున్న సమాజంలో జీవిస్తున్నాం.” శ్రీనివాస్ కంఠం వణికింది. కానీ మాట తడబడ లేదు. “శ్రీను! నీ ఆవేదన అక్షర సత్యం. లోపలికి వస్తూ నీ మాటలన్నీ విన్నా” అన్నాడు మూర్తి “ఇంతకూ నువ్వెళ్ళిన పని ఏమయ్యింది?” అడిగాడు శ్రీనివాస్ ఆసక్తిగా. భర్త జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది లక్ష్మి. “బ్యాంక్ కి వెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేస్తుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కు కొన్నానేమోనని అనుమానం వచ్చింది. బ్యాంకు సిబ్బందికి. సంగతి గ్రహించి, ఆలోచించుకొని రేపు రమ్మనమని చెప్పాడు బ్యాంక్ మేనేజర్.” జరిగిన సంగతిని వివరించాడు మూర్తి. “సరే, బాగా ఆలోచించుకొని, మీ నిర్ణయాన్ని నాకూ చెప్పండి” స్నేహితుడి భుజం తట్టి వెళ్ళాడు శ్రీనివాస్.

💐💐💐💐💐💐 “ఏం మాట్లాడుతున్నావ్. అసలు నువ్వు కన్న తల్లివేనా? ఛీ.. ఛీ…నిన్ను నమ్ముకొన్నoదుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. ఇప్పుడు నెలలు నిండుతుంటే మా అత్తగారికి సంజాయిషీ ఇచ్చుకుని, పురుడు పోయడానికి అమెరికా రమ్మనమని కోరితే, నన్ను ప్రశ్నలతో కుళ్ళబొడిచి,..” తల్లిని ఫోన్లో చాకిరేవు పెడుతోంది సురుచి. ధారాపాతంగా కురుస్తున్న కన్నీటిని, తుడుచుకుంటూ వింటోంది లక్ష్మి. ఓపికగా వింటూ, మధ్య మధ్యలో కూతుర్ని శాంత పరిచే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఫోన్ స్పీకర్ లోంచి కూతురి మాటలన్నీ గట్టిగా స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి మూర్తికి కూడా. కళ్లు మూసుకుని వింటున్నాడు. భావోద్వేగానికి లోనుకాకుండా, ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.. ఒక దశలో అతని ఉద్రేకం గట్టు తెగింది. కానీ మమతలు గట్టిగా అడ్డుకట్ట వేసాయి. దీర్ఘ శ్వాస తీసాడు. చల్లని నీళ్లు, గుక్కెడు గొంతులో పోసాడు. భార్య చేతిలో ఉన్న చరవాణిని తీసుకుని, గొంతు సవరించుకొని, ”చూడు సురుచి! నాన్నని మాట్లాడుతున్నా” అన్నాడు గంభీరంగా. “ఓహో! తమరు రంగంలోకి దిగారా! పాపం మీ శ్రీమతి గారికి శోష వచ్చి…” అంది వ్యంగ్యంగా. “మాది ఇండియా కదమ్మా, అంత సులభంగా పడిపోం. పడినా దులుపుకొని లేవడం అలవాటే. మా గురించి ఎక్కువ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. కదా!” అని సురుచి స్పందన కోసం ఆగాడు మూర్తి. ఆ వెటకారానికి, పుండు మీద కారం రాసినట్లయ్యింది సురుచికి. “అర్థమయ్యిందిలే నాన్నా నీ కుళ్ళు ఆలోచన. కూతురికి పురుడు పోయడానికి కూడా లెక్కలు వేస్తున్నావు. అంత దరిద్రంలో కొట్టుకుని పోతున్నారా? మూటలు కట్టి మోసుకుపోతారా? పురుడు పోయడం మీ బాధ్యతని తెలీదా?” అంది ఆక్రోశంగా. “సురుచి మంచి ప్రశ్న సంధించావు. వింటానంటే జవాబు చెప్తా.” అన్నాడు మూర్తి సౌమ్యంగా. ఆందోళనతో భర్త కేసి చూస్తూ, వారి మాటలు వింటోంది లక్ష్మి. ఒక్క క్షణం గడిచింది. “మీ జవాబు ఊహించలేనా? ఐనా మీ నోటి నుండి వస్తే వినాలని ఉంది.” స్థిరంగా ఉంది సురుచి స్వరం. “ఐతే విను. కూతుర్ని పురిటికి పుట్టింటికి తీసుకొని రావడం మా ఇంటి ఆచారం. పురుడు పోయడానికి అల్లుడింటికి అత్తగారు వెళ్ళడం అనాచారం. పుట్టింటికి రానని నువ్వే ప్రతిజ్ఞ చేసావు. కారణం పుట్టబోయే నీ కూతుర్ని అమెరికా పౌరురాలు చేయాలనే మీ ధృఢసంకల్పం” అన్నాడు మూర్తి నిబ్బరంగా. “అబద్ధం. పచ్చి అబద్ధం. డబ్బు మీకు ప్రాణం. కూతురు కాదు. మీ మాటలు నమ్మను.” అరిచింది సురుచి. “మా ఆరోగ్యం ఎలా ఉన్నా నీకు సాయం చేయాలనే అనుకున్నాం. అది వాస్తవం. ఏం చేస్తాం! మీ అమ్మ వీసా రిజెక్ట్ అవుతుందని అనుకున్నామా? ఏం చేయగలం?” అన్నాడు బాధగా. ఆ వైపు నుండి మౌనమే సమాధానం. ఫోన్ కట్ అయ్యింది. రెండు రోజుల తర్వాత ఫోన్ అమెరికా నుండి. “ఏం చేయాలో తెలియడం లేదు నాన్నా!” అంది సురుచి. మారిన స్వరం తెలుస్తోంది లక్ష్మికి. “నీకు ఈ సమయంలో ఎవరో ఒకరి ఆసరా అవసరం. ఆలస్యం చేయకుండా అల్లుడుగార్ని వాళ్ల అమ్మతో మాట్లాడి, అమెరికా ప్రయాణానికి ఏర్పాటు చేయించు. ఆవిడకి వీసా సిద్ధంగా ఉంది కదా! ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటే …” మూర్తి మాటలు పూర్తి కాలేదు. ఫోన్ కట్ అయ్యింది. గుండెల మీద బరువు దించినట్లయ్యింది లక్ష్మికి

💐💐💐💐💐💐 వారం రోజులు తరువాత సురుచి నుండి ఫోన్. “బిసినెస్ క్లాస్ లో టికెట్ బుక్ చేసాడు మా ఆయన వాళ్ళ అమ్మకు. ఆవిడ ఒక తెల్లఏనుగు. ఏ పని సవ్యంగా చేయదు. ఆ మహా తల్లి పుణ్యమా అని మేం దాచుకున్న సొమ్మంతా…” సురుచి తన కష్టాలు ఏకరువు పెట్టింది తల్లితో “సరే కానీ, బట్టలు, స్వీట్లు ఫ్రూట్స్, మందులు, బంగారు గొలుసు, గాజులు, వడ్డాణం మీ అత్తయ్య గార్ని మరచి పోకుండా తీసుకు రమ్మనమని చెప్పు.” అంటూ ఫోన్ పెట్టేసింది లక్ష్మి. 💐💐💐💐💐💐💐💐 “పెద్ద గండం నుండి తప్పించుకొనే తరుణోపాయం సెలవిచ్చాడు బ్యాంకు మేనేజర్ గోపాల కృష్ణ. వీసా పొందడానికి డబ్బులు అవసరమే కానీ, డబ్బులు కట్టిన ప్రతి వారికీ వీసా లభించదనే సూక్మం నాకు తెలియదు. వీసా నిరాకరించే విధంగా అప్లికేషన్ ఫారం ఎలా భర్తీ చేయాలో, ఇంటర్వ్యూలో సమాధానాలు ఎలా చెప్పాలో మార్గదర్శనం చేసావురా నువ్వు . రహస్యాలు మన ఇద్దరి మధ్యలోనే ఎప్పటికీ ఉంటాయని నా నమ్మకం. థాంక్స్ శ్రీను.” మూర్తి నుండి వచ్చిన చరవాణి సందేశం చూసి, సంతోషించాడు శ్రీనివాస్. 💐💐💐💐💐💐💐💐

మరిన్ని కథలు

Pedda bottaame katha
పెద్ద బొట్టామె కథ
- హేమావతి బొబ్బు
Guruvu viluva
గురువు విలువ
- తాత మోహనకృష్ణ
సంకల్పం
సంకల్పం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manchini bratakanivvaru
మంచిని బ్రతకనివ్వరు
- మద్దూరి నరసింహమూర్తి
Padavi - Badhyatha
పదవి -బాధ్యత
- చలసాని పునీత్ సాయి
Paripoornatha
పరిపూర్ణత
- డా:సి.హెచ్.ప్రతాప్
Manikarnika Ghat
మణికర్ణిక ఘాట్
- రాము కోలా.దెందుకూరు