కళ్యాణి (కళ్యాణ )రాగం - శ్యామకుమార్ చాగల్

Kalyana raagam
" నాకు మెడిసిన్ లో సీట్ వచ్చింది, సరే, కానీ నీ పరిస్థితి ఏంటి? " ప్రశ్నించాడు రమేష్

రమేష్ వైపు సాలోచనగా చూస్తూ " డిగ్రీ అయిందిగా, బ్యాంకు లో ఉద్యోగం వస్తుంది ... మా ఇంటి పరిస్థితిని బట్టి చూస్తే ఇంకా చదవటం కుదరదు " అన్నాడు రవి ఒకింత నిస్పృహతో .

" నీకూ మెడిసిన్ లో సీట్ వస్తే నా చెల్లెలు ని నీకివ్వటానికి మా తల్లిదండ్రులు ఏమీ అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే అప్పుడయితే ఈజీ గా ఒప్పించగలను." అన్నాడు రమేష్ కాస్త మెల్లిగా, రవి మనసు గాయపడకూడని విధంగా.

" మంచి ఉద్యోగమే తెచ్చుకుంటారా...నీ చెల్లెలు గురించి." అన్నాడు రవి సంతోషంగా . కళ్యాణి పేరు వినగానే అతని మొహం వెలిగిపోతూ వుంది.

" సరే .ఇక ఇంటికెళ్దాం పద..అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. " అని లేచాడు రమేష్.

ఇద్దరు స్నేహితులు పొలం గట్టు మీద నడుస్తూ ఇంటిదారి పట్టారు. ఇద్దరిది అరమరికలు లేని చిన్ననాటి స్నేహం. రమేష్ చెల్లెలు కళ్యాణి అంటే రవి కి చాలా ఇష్టం. వయసు తో బాటే పెరిగి పెద్దదయిన ఆ ఇష్టాన్ని , చాలా ముందే రమేష్ కు చెప్పకుండా ఉండలేకపోయాడు రవి.
"సరి అయిన సమయం వచ్చినప్పుడు చూద్దాంలే...ఇంకా చాలా సమయం ఉంది" అని సమాధానం చెప్పాడు రమేష్.

ఇంటికి వెళ్ళగానే రమేష్ అమ్మగారు జానకి వీరిద్దరినీ చూసి సంతోషంగా నవ్వుతూ " మీ ఇద్దరికి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తీరదు కానీ,ఇంక తినడానికి రండి " అంది.
" ఇదిగో కాళ్ళు కడుక్కుని వస్తాను అత్తయ్య " అన్నాడు రవి.
రవి అంటే రమేష్ ఇంట్లో అందరికీ ప్రత్యేక మైన ప్రేమాభిమానాలు. కొడుకుతో సమానంగా రవి కి ఆ ఇంట్లో ప్రేమను కల్పించారు రమేష్ తల్లిదండ్రులు .

" ఏం మాట్లాడుకుంటారో ఏమో అర్థం కాదు " అంది తల పట్టుకుని రమేష్ చెల్లెలు కళ్యాణి. చిన్నప్పటి నుండీ కలిసి ఆడుకోవడం తో రవి ని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటుంది కళ్యాణి.

" నీకెందుకు, ఇవన్నీ..నీ పని చూసుకో " అన్నాడు రమేష్ చెల్లెలిని చిరాకుగా చూసి.

" , .కాలేజ్ కి వచ్చా ఇప్పుడు .నేనూ పెద్దగా అయిపోయా.. .అందుకే అన్నీ కావాలి" అంది కళ్యాణి పొడవాటి ఒక జడను ముందుకు వేసి,రవి ని చూసి చిలిపిగా నవ్వుతూ.

ఎప్పుడూ గలగలా మాట్లాడే రవి కళ్యాణి కనపడగానే గుండె బరువెక్కి మౌనంగా వుండి పోతాడు . మనసులో మతాబులు వెలుగుతున్నప్పటికీ , మొహం లో ఎటువంటి భావాలు కనపడనీయకుండా, కళ్యాణి ని చూసాడు రవి.
కాలేజీ సెలవలు ఇవ్వగానే రమేష్ ఇంటికి రావడం , ఆ పల్లెటూరిలో , వాగులు,వంకలు,పొలాల మధ్య గడిపి వెళ్ళటం రవి కి ఎంతో ఇష్టం.

ఆ రోజు ఉదయం ఆకాశమంతా మబ్బు పట్టి ,వర్షం వచ్చే సూచనలు కనపడ సాగాయి. చుట్టూ పచ్చని పొలాల గాలి వీస్తూ వుంది. వాతావరణం అంతా చల్లగా చలి పుట్టిస్తూ వుంది. కొట్టం కింద ఆవు దూడ అరుస్తూ వుంది.

రవి ,రమేష్ ఇద్దరూ వరండాలో నులక మంచం మీద నిండా గొంగళి కప్పుకొని నిద్ర పోయారు.

"ఇంక నిద్ర చాలు ..బావా ,లేవండి గుడ్ మార్నింగ్ " అన్న కళ్యాణి పిలుపుతో ఉలిక్కి పడి నిద్ర లేచాడు రవి.

నిద్ర లేవగానే తల దువ్వుకుంటూ నవ్వుతూ నిలబడ్డ కళ్యాణి ని చూసి ' రోజు రోజుకీ అందం ఎక్కువ అవుతోంది.. ఎప్పుడు ఉద్యోగం వస్తుందో , ఎప్పుడు మా పెళ్లి అవుతుందో?' అని మనసులో అనుకుని నిట్టూర్చాడు రవి.

" ఇంద ..ఈ దువ్వెన తీసుకుని ,ముందా తల దువ్వుకో " ప్రేమగా అంది కళ్యాణి , తాను దువ్వుకుంటున్న దువ్వెన తుడిచి రవి చేతికందిస్తూ.

'ఇలాగే ఎప్పుడూ తన ప్రేమ ఉంటే జీవితం ఎంత బాగుంటుందో' అని మనసులో అనుకుంటూ
" అదే చేత్తో టూత్ బ్రష్ కూడా ఇవ్వొచ్చు గా " అన్నాడు.
" ఇస్తానులే, రేపటి నుండి, ఇప్పుడే ఆవు పాలు పిండి తెచ్చాను, మొహం కడుక్కుంటే మంచి కాఫీ ఇస్తాను " అని, తిరిగి రమేష్ వేపు చూసి " పాలేరు ఇంకా రాలేదు , ఆవులకు కాస్త ఆ గడ్డి ,కుడితి వేసి రా అన్నయ్య " అంది దూరంగా కొట్టం లో కట్టేసిన ఆవులను చూపిస్తూ .

" పదరా నేను వస్తాను "అంటూ లేచాడు రవి .

ఆ రోజు ఇద్దరు వేడి వేడి గా సజ్జ రొట్టెలు ,నువ్వుల పచ్చడి తో ,తిని పంచె పైకి దోపుకుని పొలం వైపు నడక మొదలు పెట్టారు.
"నేనూ వస్తున్నా , కూరలు కోసుకురావాలి " అంటూ వెనకాలే అడుగులు వేసింది కళ్యాణి.
అది విని రవి మనసులో సంతోషపు అలలు ఎగసి పడ్డాయి. రవి
ఉన్నన్ని రోజులు కళ్యాణి అతని వెంటే ఉండటం గమనించి తృప్తిగా నవ్వుకున్నాడు రమేష్.
మధ్యాన్నం భోజనాలు అయిన తర్వాత ఇంటి ముందు ఆవరణలో కట్టిన గడ్డి పుట్టి విప్పి అందులో నుండీ, వడ్లు సంచుల్లో నింపి , ఎడ్ల బండి లో వేసుకుని దగ్గరలో వున్న మార్కెట్ లో అమ్మి వచ్చారు .

రాత్రి భోజనాలయిన తర్వాత అందరూ వరండా లో నులక మంచాలు పరుచుకుని పడుకున్నారు. పక్కగా కట్టేసిన దూడల మెడలో చిరు గంటలు చిన్నగా మ్రోగుతున్నాయి. ఆవరణ లో కాస్త దూరంగా పడుకున్న రమేష్ చిన్నగా అడిగాడు పక్కన రవిని చూసి
" వూరికెళ్ళి మరేం చేస్తావిప్పుడు?"

" ముందుగా బ్యాంకు , గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నిస్తాను. కొన్ని వ్రాత పరీక్షలు రాసానుగా..చూడాలి ఏదైనా రావొచ్చు." అన్నాడు ఆత్మ విశ్వాసంతో .

" సరే , మరి రేపు బయలు దేరదామా ?"


"ఊ ..." సమాధానం చెప్పి , దిండు సరి చేసుకుని నిద్రకుపక్రమించాడు రవి. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న సమయం దగ్గరకు వస్తోందని అర్థం అయ్యింది రవి కి. కళ్యాణి తలితండ్రులను మాత్రమే కాకుండా తనింట్లో వాళ్ళను ఒప్పించటం కూడా తన మీదున్న ఇంకో పెద్ద భాధ్యత అనుకున్నాడు.

రవి విషయం అమ్మా ,నాన్నలకు ఎలా చెప్పాలి , ఏమని మొదలు పెట్టాలి అనే విషయం ఆలోచిస్తూ చాలా సేపు నిద్ర పోలేదు రమేష్.

వీరి సంభాషణ విన్న కళ్యాణి దిగులు తో నిట్టూర్చి , ఎన్ని రోజులకి వస్తాడో
మళ్ళీ? అనుకుంది. మనసంతా ఏదో తెలియని బాధ అనిపించి, బోర్లా పడుకుని ఆలోచించ సాగింది.
ఇవంతా తెలియని కళ్యాణి తల్లిదండ్రులు మాత్రం హాయిగా నిద్ర పోతున్నారు.

రమేష్ , గాంధీ మెడికల్ కాలేజీలో చేరి , చదువులో మునిగి పోయాడు .
రక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కోన సాగించాడు రవి.
అతని ధ్యేయమంతా కుటుంబాన్ని పైకి తేవటం, తమ్ముళ్లను బాగా చదివించటం, కళ్యాణి ని వివాహం చేసుకోవటమనే మూడింటి మీదే . ఒక సంవత్సర కాలం గిర్రున తిరిగి పోయింది. . మూడు బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగాల లో విజయం సాధించి చాలా ఉత్సాహంగా వున్నాడు రవి.

ఒక రోజు ఉదయాన్నే రవి ఇంట్లో ఫోన్ మ్రోగింది.
రవి చెల్లెలు రాణి ఫోన్ లేపి "అన్నయ్య నీకే ఫోన్ ,నీ రమేష్ లైన్ లో వున్నాడు "అని ఫోన్ పక్కన పెట్టి వెళ్ళింది.

రిసీవర్ చేతి లోకి తీసుకుని " హలో చెప్పరా రమేష్ " పలకరింపుగా నవ్వాడు రవి .

అవతల నుండీ రమేష్ మాట్లాడ లేదు.
" హలో రమేష్ ..ఏంటీ మాట్లాడు ..వినపడటం లేదా " అడిగాడు రవి

" నువ్వొక సారి హైదరాబాద్ వచ్చి నన్ను కలిస్తే బావుంటుంది " అని చెప్పి ఆగాడు. రమేష్ గొంతులో కాస్త ఆదుర్ధా కనిపించింది .
" ఏంటి..ఏదైనా సమస్యా? " ప్రశ్నించాడు కంగారుతో రవి.

" సమస్య కాదనుకో ,నువ్ వీలు చూసుకుని వెంటనే రా ..సరేనా? " అన్నాడు. వెంటనే లైన్ కట్ అయింది.
రిసీవర్ వైపు ఒక సారి చూసి పెట్టేసాడు రవి.
మరుసటి రోజు బస్సు దిగి సరాసరి మెడికల్ కాలేజీ హాస్టల్ కి వెళ్ళాడు రవి.
అక్కడికి వెళ్లేసరికి హాస్టల్ గదిలో రమేష్ చదూకుంటూ వున్నాడు.

" టిఫిన్ చేసావా? " అన్నాడు లేచి నిలబడి కుర్చీ ముందుకు జరుపుతూ.

" ఆఁ ..చేసే బయలుదేరా..ఏంటీ ప్రాబ్లెమ్ ..చెప్పు " అని కూర్చున్నాడు రవి .

" నువ్వు జాబ్ లో ఎప్పుడు చేరుతున్నావ్ ?" అడిగాడు రమేష్ .

" వచ్చే నెల పది లోపల రిపోర్ట్ చెయ్యాలి... నీకు తెలుసుగా? .ఎందుకలా అడిగావు?"

" కళ్యాణి కి సంబంధాల తాకిడి ఎక్కువగా ఉంది .. అమ్మ నాన్న తొందర పడుతున్నారు." అని చెప్పి రవి కేసి చూసాడు రమేష్.

కాసేపు అలోచించి అన్నాడు రవి " మరి..మన సంగతి ...అదే నా విషయం మాట్లాడి చూడు."

"రేపే వెళ్లి చెప్తాను "

" నేను కూడా రావాలా ?" అనుమానంగా చూసాడు రవి.

" ఉహూఁ ..ముందు నే వెళ్లి మాట్లాడతాను "అని తల పైకెత్తి శూన్యం లోకి చూసాడు రమేష్ .

---------------------------------------------------------------------------------------------------------------------
2


వారం తర్వాత స్నేహితులిద్దరూ హాస్టల్ గదిలో కూర్చున్నారు.
"అసలేమంటున్నారు అత్తయ్య , మామయ్య " సీరియస్ గా అడిగాడు రవి.

" నా వరకూ నేను పూర్తిగా చెప్పాను. నీ మనసు, ఆలోచన, ఉద్దేశ్యం ......నాకు నువ్వెప్పుడో చెప్పిన విషయాన్ని కూడా వివరించానురా." అన్నాడు రమేష్.

"మరి అయితే ..ఏమిటన్నారు?" ఆతృతగా అడిగాడు.

" నీతోటి ముఖాముఖీ మాట్లాడతామని చెప్పారురా" నింపాదిగా అని ,ఆందోళనగా వున్న రవి మొహం చూసి మళ్ళీ అన్నాడు " వర్రీ కావద్దు ..కూల్ గా వుండు. . "

" అయితే రేపే వెళతా.." అన్నాడు రవి గంభీరమైన వదనంతో.

" వెళ్ళు. . కానీ ఆ మొండి దాన్ని కట్టుకుంటున్నావు..నీ ఖర్మ " అన్నాడు చిరు నవ్వుతో.

" అలాంటి కష్టాలేమీ రావు నాకు..నీ చెల్లెలిని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు' అని నవ్వి మళ్ళీ అన్నాడు " ఈ రోజు మంచి వాచ్ కొనాలి ..షాప్ కు వెళదామా ?"

" ఎందుకు.. మళ్ళీ కొనటం ..మేమెలాగూ..కట్నం కింద ఇస్తాముగా !! " నవ్వుతూ అన్నాడు రమేష్.

ఆ రాత్రి రవి గదిలో పడుకొని ఉదయాన్నే లేచి ఉషారుగా మనసు నిండా కళ్యాణి ఆలోచనలతో సంతోషంగా బస్సు ఎక్కాడు రవి. ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు మొత్తానికి నిజం కాబోతున్నాయనే ఆనందం తనను ఉక్కిరి బిక్కిరి చేయ సాగింది.

అక్కడ వూరిలో కళ్యాణి కూడా రవి రాక కై ఎదురు చూడ సాగింది. రవి ఉద్దేశ్యం తెలిసినప్పటి నుండీ కళ్యాణి హృదయం పురి విప్పి నాట్యం చేయ సాగింది. రవి లో తనకి కావాల్సిన, ఇష్టమైన లక్షణాలన్నీ ఉన్నాయి అనుకుంది. అన్నయ్య వచ్చి అమ్మతో మాట్లాడిన విషయాలన్నీ విన్న తర్వాత జీవితంలో ఎప్పుడూ కలగనంత ఆనందం అనుభవించింది.
'
'దొంగ మొహం ఎప్పుడూ బయట పడకుండా ఇన్ని రోజులు ఎలా వున్నాడో' అనుకుంది.

" అత్తయ్య .." అని పిలుస్తూ రమేష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు రవి.
రవి గొంతు విని హాల్ లోకి వచ్చి , రవి ని చూసి '' అమ్మా! రవి బావొచ్చాడు!! ''అంటూ పెరట్లోకి పరుగు తీసింది కల్యాణి.
" రా రా రవి .." అని ఆప్యాయంగా పలకరించి , వెనక్కి చూసి " కళ్యాణి చెంబులో త్రాగటానికి నీళ్లివ్వు " అంది జానకి.

"కూర్చో రవి..అమ్మా , నాన్నా ,చెల్లెలు బావున్నారా?" అని నవ్వుతూ, కొంగుతో మొహం తుడుచుకుని బల్ల పీట మీద కూర్చుంది జానకి.
ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకుని రవి చేతికిచ్చింది . రవి ని పరికించి చూసింది కళ్యాణి . కొత్తగా, ఇంకా అందంగా కనపడ్డాడు రవి.
కల్యాణి వచ్చి సన్నిహితంగా నిలబడగానే కోటి వీణలు మ్రోగాయి రవి గుండెల్లో. దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుండీ మనసులో దాచుకున్న ప్రేమ, కట్టలు తెంచుకోవటానికి ఎగిసి పడుతూ వుంది .

" కళ్యాణి .!!.రంగమ్మత్త నిన్నొక మారు రమ్మంది వెళ్లి రా " అంది జానకి కూతురు ని చూసి నర్మగర్భంగా.

"సరే " అని ముభావంగా వెళ్ళిపోయింది కళ్యాణి .

"ఇంకా ఏంటి సంగతులు రవి చెప్పు " జానకి వెండి డబ్బా లో నుండీ తమలపాకు, వక్కలు తీసుకుని ,కాసు ,సున్నం దాని పైన పూస్తూ.

" అత్తా,, రమేష్ చెప్పాడు.. మీరు మాట్లాడతారని " అన్నాడు ఏం మాట్లాడాలో తెలీక.

"అవును రవి..మేమెప్పుడూ ..నీ మీద ఎలాంటి అభిప్రాయం పెట్టుకోలేదు..నీకు ఇష్టమని కూడా మేము అనుకోలేదు." అంది నిట్టూర్చి.

" నేనూ, రమేష్ ..చాలా చిన్నప్పుడే అనుకున్నాం అత్తయ్య ..నాకు కల్యాణి అంటే చాలా ఇష్టం" తల వంచుకుని కిందకి చూస్తూ చెప్పాడు రవి, మొదటి మారు తన మనసు విప్పుతూ.

" ఊఁ ...కానీ అదంత తేలిక కాదు రవి. మీరు .....ఉన్నత కులానికి చెందిన వారు.." అని ఆగి బాధగా చూసింది రవిని.

" ఇంకా ఈ రోజుల్లో అవన్నీ ఎక్కడున్నాయి అత్తా...ఆ విషయం వదిలేయండి " అన్నాడు గంభీరంగా.

" అవి ఎటూ పోవు బాబు, అయినా మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పు కుంటారు ?" అంది, రవిని ఆత్మ రక్షణ లో పడవేస్తూ.

" అది నేను చూసుకుంటాను అత్తయ్య..వాళ్లను ఒప్పించే బాధ్యత నాది '' అన్నాడు నిబ్బరంగా.

" మీ కుటుంబం లో కుల వివక్షత కు గురి కాకుండా ,అమ్మాయి జీవితాంతం సంతోషం గా ఉంటుందనీ, మీ బంధువులందరూ తనను కలుపుకుంటారని ఏంటి నమ్మకం, మీ తల్లీతండ్రి అంగీకరించినంత మాత్రాన మిగిలిన మీ వాళ్ళందరూ దగ్గర తీస్తారని ఏంటి నమ్మకం " అంది జానకి.

" మిగిలిన వారితో మనకెందుకు అత్తయ్య, వాళ్ళందరూ అంగీకరించకుంటే మనకేమిటి నష్టం?" అన్నాడు కోపం తో అసహనంగా.
" బంధువులతో సంబంధ బాంధవ్యాలు, కుటుంబాలకు చాలా అవసరం రవి.. అవి లేకుంటే ఎంత బాధాకరమే అనుభవించిన వాళ్ళం మాకు తెలుసు.' అంది.

ఈ విషయం చాలా బరువుగా బాధతో అంటున్నదని అర్థం అయ్యింది రవికి. కాసేపు అలోచించి అడిగాడు ' ఎందుకలా ,,మీకేంటి ప్రాబ్లెమ్?" అన్నాడు భృకుటి ముడిచి.

" మీ మామయ్య ..నన్ను ఇష్టపడి ,పెద్దల అంగీకారం లేకుండా వివాహం చేసుకున్నారు. ఈ మధ్య కొద్ది కాలం కింద నుండి మాత్రమే ఇంటికి చుట్టాలు రాక పోకలు మొదలు పెట్టారు..నా పిల్లలు ,నేను ఇన్ని సంవత్సరాలు ఎవరితో సంబంధాలు లేకుండా జీవించాము. అదెంత దుర్భరంగా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు పిల్లలు మంచి చదువులు...ఆర్థికంగా బాగుపడ్డాక అందరూ రావటం మొదలు అయ్యింది. పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి."
అని చెప్పి ఊపిరి పీల్చుకుంది జానకి.
కాసేపు మౌనం వహించింది జానకి . ఆవిడ గొంతులో బాధ తెలుస్తూ వుంది రవికి .

" ఇవన్నీ రమేష్ కు తెలుసా ?" ప్రశ్నించాడు రవి , ఏం మాట్లాడాలో తెలీక.

" తెలుసు ..ఇప్పుడిప్పుడే బాగు పడుతున్న కుటుంబ సంబంధాల ను కాదని..మేమెలా మళ్ళీ ఇలా చేయ గలం . ఎందుకిలా కులాంతర పెళ్లి అని అడిగితే యేమని చెప్పగలం?. ఎలా ఒప్పించగలం.? చూస్తూ చూస్తూ మేము చేసిన తప్పు మళ్ళీ ఎలా జరిపించాలి. ??
ఇప్పుడు మా కులం లో డబ్బులు పెట్టి, కట్నాలు ఇచ్చి, బాగా వున్న అబ్బాయిని తెచ్చుకోగలం.అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయికి ఇప్పుడు ఇలా వేరే కులం లో ఇచ్చి , దాని భవిష్యత్తు ను ఫణంగా ఎలా పెట్టగలం చెప్పు.? పైగా ఇది ప్రేమ వివాహం కాదుగా?" అన్న మాటలు విని నిరుత్తరుడైనాడు డు రవి.

రవి కాళ్ళ కింద భూమి కదలి పోసాగింది. కలల ఆశా సౌధాలన్నీ కూలిపోవటం మొదలయ్యింది .
రవి వేపు చూసి " ఒక వేళ ఇలాగే ఎవరైనా వేరే కులం వాళ్ళు వచ్చి..మీ చెల్లెలి తో
వివాహం జరిపించమంటే మీరు ఒప్పుకుంటారా?" అంది జానకి సూటిగా రవి కళ్ళ లోకి చూసి .

" ఒక సారి కళ్యాణి అభిప్రాయం అడిగితే బావుంటుందేమో అత్తా " అన్నాడు నిరాశగా .

"అడిగాను రవీ... మీ ఇష్టం అంది..దానికేమీ నీ మీద ప్రత్యేకమైన అభిప్రాయం లేదు మరి '' నిష్పాక్షిక మైన స్వరం తో అని, రవి మనో భావాలను గమనించ సాగింది.

రవి ఒంట్లో జవ జీవాలు లేనట్లుగా అయిపోయాడు. మనసంతా బరువెక్కి, లేచి నీరసంగా నిలబడ్డాడు.
" అర్థం చేసుకో రవి..ఇవి జీవితాలకు చెందిన చాలా ముఖ్యమైన విషయాలు.'' అంది జానకి అనునయింపుగా.
రెండు చేతులూ ఎత్తి నమస్కారం పెట్టి వెనక్కి తిరిగి, ఇంటి బయటకు నిస్సత్తువతో అడుగులు వేసాడు రవి. ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటి
తో పెనవేసుకున్న బంధం తెగిపోతుంటే నిస్సహాయంగా బయటకు నడిచాడు. భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపించసాగింది. బస్సు ఎక్కి పడుకున్నాడు రవి. కళ్ల నుండీ నీళ్లు ధారగా కారిపోతున్నాయి.

----------------------------------------------------------------------------------------------------

ఇంటికి వెళ్లి జరిగిందంతా తల్లి కి చెప్పాడు రవి. కొడుకు తల నిమిరి అంది నిర్మల " బాధ పడకు..ఏది జరిగినా మన మంచికే.. జానకమ్మ చెప్పింది కూడా సబబే కదా... కూతురు బాగోగులు , భవిష్యత్తు ,..తల్లి తండ్రుల కన్నా బాగా ఎవరూ ఆలోచించ లేరు. దీనికి సమాధానం సమయం చెప్తుంది..నువ్వేమీ బాధ పడకు ... నీకు భార్య గా ఎవరు రాసి పెట్టి ఉంటే వారితో వివాహం జరుగుతుంది."
అది విన్నాడు కానీ మనసు అంగీకరించలేదు.


ఆ నెలాఖరున హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం లో చేరాడు రవి . కొత్త ఉద్యోగం లో పని ఒత్తిడి తో కాస్త మనసు తేలిక పడింది. కానీ భగవంతుడుని ప్రతి నిమిషం తిట్టుకుంటూ వున్నాడు రవి.

రాత్రుళ్లు నిద్ర పట్టకుండా కళ్యాణి గుర్తుకు వచ్చేది . రమేష్ తనతో హాస్టల్ గది లో అన్న మాటలు పదే పదే గుర్తుకొచ్చేవి .
ఆదివారం రవి గదికి కి వచ్చాడు రమేష్.
ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడుకోలేదు.
కాసేపటి తర్వాత " నాన్న పాత్ర ఇప్పుడేమీ లేదురా ! అంతా అమ్మ నిర్ణయమే,నేనెంత చెప్పి చూసా కానీ వినటం లేదు...ఇప్పుడెందుకు ఈ లేని సమస్య కొని తెచ్చుకోవటం ..ఇప్పుడిప్పుడే కుటుంబం దారిన పడుతోంది ....అబ్బాయికి ఇష్టమని చెప్పి దాని జీవితాన్ని కష్టాల్లో నెట్టటం ఎందుకు ?అంటోంది రా " అన్నాడు రమేష్.
ఏమీ మాట్లాడ లేదు రవి. రవి కళ్ళలో నీరు తిరగడం చూసి భుజం మీద చేయి వేసి " ఒరేయ్ రవి ...నీకేం తక్కువ..మంచి అమ్మాయిలు నీ వెంట పడతారు..మంచి పిల్ల దొరుకుతుంది నీకు " అన్నాడు సముదాయిస్తూ.
చివుక్కున తలెత్తి రమేష్ వైపు చూశాడు రవి. ,

రవిని జాలిగా చూస్తూ "అసలు కళ్యాణి నిన్ను ప్రేమించనప్పుడూ, తనకు మనసు లేనప్పుడు, ఇన్ని రోజులుగా ప్రేమ పెంచుకోవటం ..నీది తప్పేరా..? కళ్యాణి కి కూడా నీ మీద ఉంటే బావుండేది. కానీ అలాంటిదేమీ లేదిక్కడ " అన్నాడు రమేష్ .

"లేదంటావా '' అపనమ్మకంతో చూసాడు రవి.

" జరుగుతున్నదంతా చూసింది గా..మరి ఇప్పుడు ఏమీ జరగనట్లుగా హాయిగా కాలేజీ కి వెళుతూ వుందే !!" అనుమానం వెలిబుచ్చాడు రమేష్.
మౌనం దాల్చాడు రవి.
మళ్ళీ అన్నాడు రమేష్" అసలు దానికేమీ భావాలు లేవురా...నువ్విక మనసులో నుండీ తీసెయ్యటం బెటర్. పైగా అమ్మ అడిగితే నీ ఇష్టం అందట " .చిరాకుగ మొహం పెట్టాడు రమేష్.

" సరే నాకు ఆఫీస్ టైం అవుతోంది ...వెళతా "అంటూ లేచి వెళ్తున్న రవిని బాధగా చూసాడు రమేష్.


ఆఫీస్ లో టేబుల్ ముందు కూర్చొని ఫైల్ చూసుకుంటున్నాడు రవి.

" సార్ మీకు ఉత్తరం " అంటూ ఒక పోస్టల్ కవర్ చేతికిచ్చాడు బంట్రోతు.

పైన దస్తూరి చూసాడు రవి. చిన్న పిల్లలు రాసినట్లుగా అడ్రస్ లో అన్నీ తప్పులున్నాయి.
కవర్ చింపి లోపలున్న ఉత్తరం మడతలు విప్పి చదవ సాగాడు..
' బావా,
శుక్ర వారం సాయంత్రం ఆంజనేయ గుడికి రాగలవు..
తప్పని సరిగా రావాలి. అన్నయ్య , అమ్మకు చెప్పవద్దు.
ఇట్లు
కళ్యాణి

చదివి ఆశ్చర్యానికి లోనయ్యాడు రవి. ఉత్తరం కవర్ లో పెట్టి జేబులో దూర్చుకున్నాడు .
ఏమై ఉంటుంది. దేనికి రమ్మంది . తనకేమిటీ కష్టం,ఏం జరిగి ఉంటుంది. ఇదేదో కొత్త సమస్య అని ఆలోచించసాగాడు.
ఆకస్మాత్తుగా గుర్తుకొచ్చింది ఈ రోజు శుక్రవారం అని. సమయం చూసాడు సరిగ్గా మూడు గంటలు. గుండె వేగం హెచ్చింది . ఈ సమయం లో ఎలా వెళ్ళటం అని లోచించాడు. బస్సులో వెళితే చేరుకోలేడు అని అర్థం అయ్యింది.
. ఆఫీస్ మొత్తానికి పైనున్న మేనేజర్ దగ్గర మాత్రమే స్కూటర్ వుంది. వెంటనే వెళ్లి మేనేజర్ స్కూటర్ తీసుకుని వేగంగా కళ్యాణి ఊరి వైపు సాగిపోయాడు.

చీకటి పడే సమయానికి గుడి ముందు స్కూటర్ ఆపి లోనికి పరిగెత్తాడు రవి.
భక్తులెవరూ లేరు. గుడి మెట్ల మీద కళ్యాణి కూర్చుని ఉండటం చూసాడు. మనసంతా నిర్వేదం తో నిండి పోయింది.

స్కూటర్ ఆపి వస్తున్న రవి ని చూసి గభాలున లేచి పరుగెత్తుకొచ్చి వాటేసుకుని ఏడవటం మొదలు పెట్టింది కళ్యాణి .
" ఏంటి ఏమయ్యింది..కంగారు పడకు..నువ్ ముందు ఏడుపు ఆపు " అని
కళ్యాణి చేతులు పట్టుకుని గుడి మెట్ల మీద కూర్చో పెట్టి ,తాను పక్కన కూర్చొని కళ్ళు తుడిచాడు .

" నాకేదో సంబంధం ఖాయం చేస్తున్నారు బావ ..నేనీ పెళ్లి చేసుకోను..నాకు నువ్వే కావాలి, లేదా నేను చచ్చి పోతా. " అంది వెక్కిళ్లు పెడుతూ.

కలో నిజమో అర్థం కాలేదు రవికి. తాను వింటున్నది నిజమేనా అని విస్తు పోయాడు.

"కళ్యాణి ..నువ్వనేది నిజమేనా..మరెప్పుడూ చెప్ప లేదే ?" అన్నాడు కంగారుగా .

" అసలు నన్నెవరూ అడిగారు బావా .. మీరు మీరు మాట్లాడుకోవటం తప్పితే, కనీసం నువ్వేనాడయినా అడిగావా?'' అంది ఏడుపు ఆపుకుంటూ.
నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రవికి.

"అదేంటి ....అత్తయ్య అడిగానని చెప్పిందిగా?" అన్నాడు మరింత ఆశ్చర్య పోయి.

" అమ్మ అన్నీ అబద్దాలు చెప్పింది..నీకు బాగా డబ్బులుంటే ఒప్పుకునే వారే..అయినా అవన్నీ వదిలెయ్యి..నే వచ్చేస్తా ..ఇప్పుడే నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకో" అంది .
ఆకాశం కేసి చూసాడు. 'దేవుడా నీ ఆటలు ఎవరికీ అర్థం కావు ' అని నవ్వుకున్నాడు.
రవికి ఇది తానే నాడూ ఎదురు చూడని , ఊహించని కొత్త పరిణామం .
రవి భుజం మీద తల వాల్చి అంది " నాకేమీ అక్కర లేదు బావా ..నువ్వు చాలు, నేనెవరికీ చెప్పకుండా వచ్చేస్తా, మనం పెళ్లి చేసుకుందాం !! ''

ఒక వేపు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా వుంది రవికి.
విజయం తో కలిగే తృప్తి తో మనసంతా నిండి పోయింది. ఇన్ని రోజులు అనుభవించిన వ్యధను మరచి పోయాడు. మనసంతా తేలిక పడింది. కళ్ళ ముందు కళ్యాణి తో పెళ్లి మంటపం కనపడసాగింది.

రిజిస్టర్ పెళ్లి చేసుకోవాలి అర్జెంటు గా ..లేదా ఏదైనా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించసాగాడు.
వెంటనే కళ్ళ ముందు తనను చిన్నప్పటినుండీ కొడుకుతో సమానంగా చూసిన అత్తయ్య ,మామయ్య కళ్ళ ముందు మెదిలారు ....కళ్ళ ముందు ..రమేష్ నవ్వు కదిలింది..
ఒక్క సారిగా తల విదిల్చాడు రవి. ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకుని ఆలోచించ సాగాడు.

రవి భుజం మీద నుండి కదిలి వొళ్ళో పడుకుంది కళ్యాణి . స్వర్గం దిగి కళ్ల ముందు కు వచ్చినట్టుంది రవికి. ప్రపంచం అంతా ప్రశాంతంగా కనిపించింది. మనసులో వున్న నిరాశ అంతా పారిపోయింది. ఆకాశం లో మబ్బుల మాటు నుండీ చంద్రుడు కనిపించాడు .చుట్టూ పిండి వెన్నెల పరుచుకుంది. చిన్నప్పటి నుండీ కన్న కలలు నిజమయ్యాయి.

ఆత్మ విశ్వాసంతో కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని పిలిచాడు '' కళ్యాణి, నే చెప్పేది జాగ్రత్తగా విను. నువ్ నాకు ఆరవ ప్రాణం. వయసు లో వున్న నన్ను అత్తయ్య ,మామయ్య.పూర్తిగా నమ్మి నన్ను మీ ఇంట్లో ఒకడిగా చూసుకున్నారు
రమేష్ కు నా ఉద్దేశ్యం చెప్పిన తర్వాత కూడా వాడెప్పుడూ నన్ను అనుమానించలేదు, మనిద్దరి మధ్య ఏనాడు కూడా ఆంక్షలు పెట్ట లేదు. నేను వారిని మోసం చేసి , నమ్మక ద్రోహం తల పెట్టలేను. వారికి తెలీకుండా నేను తీసుకెళ్లి పెళ్లి చేసుకోలేను. ఆలా చేసుకోవటం తేలిక ... కానీ జీవితమంతా ఆ మోసాన్ని మనసు మీద మోస్తూ జీవించ లేను. అసలు పెద్ద వారు ఒప్పుకోకుండా ఎవరూ లేకుండా నిన్ను చేసుకుంటే అందులో ఆనందం ఏముంది .'' ఆత్మ నిబ్బరం తో ,ధీమాగా అన్నాడు రవి.

" మరి ఎలా బావ ? ఇప్పుడెలా?" అంది ఏడుస్తూ.

" కళ్యాణి !! ముందా ఏడుపు ఆపు. అత్తయ్య ,మామయ్య కు నీ మనసు చెప్పు. . నువ్ నీ మనసు చెప్పకుండా ఉన్నందుకే ఇంత జరిగింది . ముందుగా వాళ్ల కు వేరే సంబంధం ఇష్టం లేదని ధైర్యం గా చెప్పు. ఇలా దొంగల్లాగా పారిపోయి పెళ్లి చేసుకోవటం వద్దు.వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి. పద ఇంటికి. బాగా చీకటి పడింది. అత్తయ్య చూస్తూ ఉంటుంది. వాళ్ళు నీతో మన పెళ్లి ఒప్పుకునేదాకా నేను ఎదురు చూస్తాను, నీతోనే నా పెళ్లి . సరేనా?" ధైర్యం చెప్పుతున్నట్టుగా భుజాలు తట్టి , నిలుచుని, కళ్యాణి ని గుండెలకు హత్తుకుని గుడి మెట్లు దిగాడు.
గుడిలో గంటలు మ్రోగసాగాయి.
స్కూటర్ వెనక కళ్యాణిని కూర్చోపెట్టుకుని వెళ్లి ఇంటి ముందు స్కూటర్ ఆపాడు రవి.


3

గేట్ ముందు స్కూటర్ చప్పుడు విని జానకి, రమేష్ బయటకు వచ్చి చూసి విస్తుపోయి నిలబడ్డారు.


' 'ఇంట్లోకి వెళ్ళు కళ్యాణి ' ' అన్నాడు రవి. కళ్యాణి తల దించుకుని లోనికి వెళ్ళింది.

" నువ్వూ లోనికి రా రవి " అంది జానకి. కూతురి ఎర్ర బారి, ఉబ్బిన కళ్ళను చూసి విషయం అర్తమయింది జానకి కి.

" నే వెళ్ళాలి అత్తయ్య, మళ్ళీ వస్తాను '' అని " రమేష్ ఒక సారి ఇటు రారా ''అని పిలిచాడు

'' రా భోజనం చేసి వెల్దువు గాని "అన్న రమేష్ ను సీరియస్ గా చూసి" నువ్వన్నావుగా అదేదో దానికి కూడా ఉంటే బావుండేది అని ..ఇదుగో ఈ వుత్తరం చదువు '' అని కళ్యాణి రాసిన వుత్తరం రమేష్ చేతిలో పెట్టాడు రవి నవ్వకుండా .

వెంటనే ఆదుర్ధాతో పేపర్ విప్పి వీది దీపం వెలుగు లో చదివి మనసు తేలిక పడేలా నవ్వి " దానికసలు ఏ మాత్రం బుద్ధి లేదు ఈ ఉత్తరమేదో ఆరు నెలల ముందు రాస్తే సరిపోయేదిగా , సరేరా ..ఇక్కడ ఇంక మిగిలిన పనులు నే చూస్తా కానీ నీ . తరఫున పెళ్లి ఏర్పాట్లు చేసుకో ....నే చెప్పానుగా నీ ఖర్మ .. ఐ పిటి యూ " అన్నాడు రమేష్ .
తానూ నవ్వి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని స్కూటర్ స్టార్ట్ చేసాడు రవి .

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల