కొత్త టిక్కెట్ - జి.ఆర్.భాస్కర బాబు

Kotta ticket

రామాంజనేయులు మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. అతనికి ఎడం పక్కకు తిరిగి పడుకునే అలవాటు. నిద్ర రావట్లేదు కదా అని కుడి పక్కకు తిరిగి పడుకోవాలని ప్రయత్నం చేశాడు. అయినా నిద్ర రాలేదు. లేచి వెళ్లి చెంబులో నీళ్లు కొద్దిగా తాగాడు, మంచం దగ్గరికి వచ్చి మళ్ళీ పడుకున్నాడు. అయినా నిద్ర రాలేదు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఒకటి నుంచి వంద వరకు అంకెలు లెక్క పెట్టాడు. అయినా నిద్ర రాలేదు. నాయినమ్మ చెప్పిన శ్రీ రామ ప్రార్ధన, హనుమత్ స్తోత్రం చదువుకున్నాడు. అయినా నిద్ర రాలేదు. అతను ఎన్నిరకాలుగా ప్రయత్నించినా నిద్రరావడం లేదు. పంకజం అటు పక్కన తిరిగి హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతోంది. ఆమెను లేపుదామా అని అనుకున్నాడు కానీ ఆమె నిద్రను భంగపరచటం ఇష్టం లేకపోయింది. అతని మెదడులో ఆలోచనలు రాయి తాకిన నీటి మీద అలల్లా గుండ్రంగా వ్యాపిస్తున్నాయి.

పొద్దున జరిగిన సంఘటన అతనికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూంది. నిజానికి అలాంటి సంఘటన జరగటం మొదటి సారి కాదు.అలాటి పరిస్థితి ఎదురయినప్పుడు తానే సర్దుకు పోవటం జరిగేది. కాని ఈ సారి అందరూ తనకు వ్యతిరేకంగా ఉండేసరికి అతను తట్టుకోలేక పోతున్నాడు.

అతని మనసులో గతం కదిలాడసాగింది. రామాంజనేయులు మంచి గుర్తింపు ఉన్న సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దపిల్ల రేవతి తరువాత ఇద్దరూ మగపిల్లలు వైష్ణవ్, శశాంక్. పిల్లలు ముగ్గురూ చదువులో బాగా రాణించారు.దీనికి అతని భార్య పంకజందే ముఖ్య భూమిక.ఆమె ఇంటి విషయాలు చాలా జాగ్రత్తగా, శ్రధ్ధగా నిభాయించింది. పిల్లలు ఏమి కావాల్సినా తండ్రికంటే ఎక్కువ తల్లి మీదే ఆధారపడే వాళ్ళు. పిల్లలకు చదువులకు తగిన ఉద్యోగాలు రావడం, ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడటం కూడా జరిగిపోయింది. పెద్దపిల్ల రేవతి ముంబైలో ఉంటుంది. పెద్దవాడు వైష్ణవ్ చెన్నైలో ఉంటాడు. చిన్నవాడు శశాంక్ తల్లి తండ్రుల తోనే ఉంటాడు. పిల్లలందరికీ సంతానం కూడా కలిగారు. శశాంక్ భార్య గుణవతి పిల్లవాడు నాలుగో తరగతి చదువుతూ ఉండటంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూంది. రామాంజనేయులు ఉద్యోగంనుండి ఈమధ్యే పదవీవిరమణ చేశాడు. ఉద్యోగం చేసినన్ని రోజులూ కాలం ఎలా గడుస్తున్నదో తెలిసేది కాదు. ఉద్యగ పరమైన బాధ్యతల వత్తిడి కూడా ఎక్కువే అవటంతో ఇంటిమీద పెద్దగా శ్రద్ధ పెట్టటానికి సమయం దొరికేది కాదు. “మెత్తటి వాడిని చూస్తే మొట్టబుద్ధి అయినట్లు”, యాజమాన్యం కూడా ఏ కష్టమైన పని అయినా అతనికే అప్పజెప్తూ ఉండేది యాజమాన్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందో అతనికి బాగా తెలుసు. అందువల్ల ఏ పని చెప్పినా భరిస్తూ ఇన్ని రోజులూ పనిచేశాడు. దీనివల్ల అతను నష్టపోయింది అతని సంఘజీవితం, కుటుంబ జీవితం. అతను ఉండే కాలనీలో అతని పేరు కంటే అతని శ్రీమతి పేరు ,వాళ్ళ పెద్దబ్బాయి పేరు ఎక్కువగా తెలుసు అందరికి. కాలనీ పెద్దలకు కూడా అతను వినాయక చవితి చందాలు ఇవ్వటానికి, కాలనీ సభ్యత్వం కట్టటానికి మాత్రమే గుర్తుకొస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు రామాంజనేయులకు కూడా ఇది కాస్త వెసులుబాటుగానే కనిపించేది ,ఎందుకంటే అతను ఇంట్లో ఉండే కొద్దిసేపూ ఎవరూ అతని సమయాన్ని భగ్నం చేసేవాళ్లు కాదు. ఉద్యోగ విరమణ సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ అతను సంతోషపడసాగాడు. ఎందుకంటే అతను చేయాలనుకున్న పనులు తనకు నచ్చినట్లుగా విశ్రాంతిగా చేసుకోవచ్చు అని అనుకున్నాడు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఒక వారం పాటు అతని రిటైర్మెంట్ కు వచ్చిన డబ్బులు బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్లలో వేయటం, ఇప్పటి వరకు తనతో పని చేసిన ఉద్యోగులకు విందు ఇవ్వడం, తనకు స్నేహితులు ఇచ్చే విందు కార్యక్రమాలకు హాజరవటం సరిపోయింది. అందరూ అతను ఏర్పాటుచేసిన విందు గురించి గొప్పగా మాట్లాడారు. అతను యాజమాన్యానికి చేసిన సేవల్ని , సాధించిన విజయాలను మెచ్చుకుంటూ ఉంటే చాలా ఆనందం కలిగింది.

వారం తర్వాత అసలు సమస్య మొదలైంది. రామాంజనేయులు కు ఉదయం ఐదు గంటలకే నిద్ర లేవటం అలవాటు. కాఫీ అతనే కలుపుకుని తాగుతాడు. కాఫీ తాగితేనే గాని అతని దిన చర్య మొదలు కాదు. కాఫీ సేవనం తర్వాత అతను నడవటానికి బయలుదేరుతాడు. పదవీ విరమణ తరువాత ఓ వారం పాటు అతను నడవటానికి వెళ్లలేదు. వారం తరువాత ఆరోజు అతను నడవటానికి ముందు కాఫీ కలుపుకుంటానికి వంటింట్లోకి వెళితే అక్కడ అతనికి డికాక్షన్ గాని పాలు గాని కనపడలేదు. మర్చిపోయారేమో అనుకొని అతనికి కూడా కాఫీ తాగకుండానే నడవడానికి వెళ్ళిపోయాడు. నడక తర్వాత ఇంటికి వచ్చి శ్రీమతిని అడిగితే “మీరు వాకింగ్ కి తరువాత వెళతారని అనుకున్నాను అండీ. అందుకనే పాలు పెట్టలేదు, నేను డికాక్షన్ కూడా ఇప్పుడే వేశాను .సరే మీరు కాఫీ తాగుతారా” అని అడిగింది. “అదేమిటి పంకజం నా అలవాటు ఎలా మానేస్తాను అనుకున్నావు” అన్నాడు రామాంజనేయులు.

“ఇప్పటినుండి మీరు తయారయి ఆఫీసుకు వెళ్లే అవసరం లేదు కదండి అందుకనే అలా అనుకున్నాను” అంది పంకజం. “సర్లే.. సర్లే.. రేపటినుండి మునుపటి లాగానే నేను నడవడాని వెళ్తాను..,నాకు కొద్దిగా పాలు, డికాక్షన్ అట్టి పెట్టు” అన్నాడు రామాంజనేయులు చిరాగ్గా. రామాంజనేయులు మనవడు ఒక మంచి బళ్ళో నాలుగో తరగతి చదువుతున్నాడు. వాడికి రోజు ఇస్త్రీ బట్టలు కావాలి. ఇంతవరకు అవి ఇస్త్రీ ఎవరు చేసే వాళ్ళో రామాంజనేయులు తెలియదు కానీ ఆ రోజున కోడలు “మామయ్య గారు కొద్దిగా చిన్నోడు బట్టలు ఇస్త్రీ చేసి పెడతారా వాడికి బడికి వేళవుతోంది” అంది. రామాంజనేయులు ఆమె వంక చురుగ్గా చూశాడు కానీ ఆమె ఏమి పట్టనట్టే వెళ్ళిపోయింది. చేసేదేమీ లేక రామాంజనేయులు మనవడి బట్టలు ఇస్త్రీ చేసి పక్కన పెట్టాడు. వాడు బడికి వెళ్ళటానికి స్కూల్ బస్సు ఎనిమిది గంటలకల్లా వాళ్ళ కాలనీ దగ్గరకు వస్తుంది. మామూలుగా అయితే కొడుకు కోడలు తీసుకెళ్లి వాడిని బస్సు ఎక్కించి వస్తారు. ఆ రోజున శ్రీమతి “చిన్నోడిని తీసుకెళ్లి బస్సు ఎక్కించి వస్తారా” అంది. మామూలుగా రోజూ అయితే రామాంజనేయులు ఆసరికి అల్పాహారం తింటూ ఉంటాడు. ఆ వెంటనే బయలుదేరి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. “ఇప్పుడు వెళ్లడానికి ఆఫీసు లేదు కదా అందుకని కొత్త కొత్త పనులన్నీ మీద పడుతున్నాయి” అనుకున్నాడు రామాంజనేయులు. చేసేదేమీ లేదు చిన్నోడిని తీసుకొని బస్సు ఎక్కించి రావటానికి వెళ్ళాడు. తిరిగి వచ్చి స్నానాదికాలు కానిచ్చి దేవుడికి గూడు దగ్గరికి వెళ్ళాడు రామాంజనేయులు. ఆసరికే దేవుడిగూడు అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించటం జరిగిపోయింది. “మీకు ఆలస్యం అవుతుందని నేనే పూజ చేశానండీ, వారం రోజుల నుండి నేనే చేస్తున్నాను కదా” అంది శ్రీమతి. “సరేలే దేవుడి పూజ ఎవరు చేస్తే ఏమైంది , అయినా రేపటినుండి యధావిధిగా నేనే పూజ చేస్తాను” అన్నాడు రామాంజనేయులు. “వద్దులేండి మీరు లేచి మీ నడక, చిన్నోడు బట్టలు ఇస్త్రీ, ఆ తరువాత వాడిని దింపి రావటం ఇవన్నీ అయ్యేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోతుంది. మీరు అల్పాహారం చేయటానికి కూడా వేళ దాటిపోతుంది”అంది పంకజం. ఏం చెప్పాలో అర్థం కాలేదు రామాంజనేయులు కు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పక్క మీద కాసేపు ఒరిగాడు రామాంజనేయులు. ఓ అరగంట తర్వాత కోడలు వచ్చి “మామయ్య గారు మామయ్య గారు” అంటూ పిలిచింది. “ఏంటమ్మా” అని అడిగాడు రామాంజనేయులు.

“ఏమీ లేదండి చిన్నోడు వచ్చే వేళయింది బస్సు దగ్గరికి వెళ్లి వాడిని తీసుకొని వస్తారా” అంది కోడలు. నిజానికి ఆ సమయంలో పడుకునే అలవాటు లేదు రామాంజనేయులు కి కానీ ఈ వారం రోజుల నుండి అతను మధ్యాహ్నం పూట ఓ గంటసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. “ఈరోజు విశ్రాంతి అరగంటే” అనుకుంటూ బయలుదేరాడు రామాంజనేయులు. మనవడు బడి నుండి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పెట్టిన అల్పాహారం తిని అల్లరి చేయటం మొదలుపెట్టాడు. “తప్పు నానీ అల్లరి చేయకు నానమ్మ పడుకుంది కదా” అంటూ కేకలేసింది కోడలు. “రోజు బడి నుండి మనవడిని ఎవరు తీసుకొస్తున్నారు అమ్మా” అని అడిగాడు రామాంజనేయులు. “నేనో.. అత్తయ్య గారో వెళ్తాం మావయ్య గారూ” అంది కోడలు ఎందుకు అలా అడిగారు అన్నట్లు. “ఆహా ఏమీ లేదులేమ్మా ఊరికినే తెలుసుకోవటానికి అడిగాను” అన్నాడు రామాంజనేయులు లోపల్లోపల ఉడుక్కుంటూ. సాయంకాలం ఐదు గంటలకి టీ తాగిన తర్వాత రామాంజనేయులు వాకింగ్ షూ వేసుకోవటం చూసి కోడలు అడిగింది “మామయ్య గారూ ఎందాక వెళ్తున్నారు” అని. “కాసేపు అలా పార్క్ దాకా వెళ్లి కాసేపు నడిచి వస్తానమ్మా” అన్నాడు రామాంజనేయులు. “సరే మామయ్య గారు నాని గాడు కూడా వస్తాడేమో అడుగుతాను ఉండండి వాడిని కూడా తీసుకువెళ్లి కాసేపు ఆడించుకు తీసుకురండి” అది కోడలు. చేసేదేమీ లేక మనవడు నానిని తీసుకుని వెళ్లాడు పార్కు దాకా రామాంజనేయులు. వాడు అక్కడ కూడా అల్లరి బాగానే చేశాడు. గంటన్నరసేపు పార్కులో ఉందామనుకుని వెళ్లిన రామాంజనేయులు గంటకే ఇంటికి తిరిగి వచ్చేసాడు వాటి అల్లరి భరించలేక. రాత్రి భోజనాలు అయిన తర్వాత కాసేపు టీవీ పెట్టుకుని చూడటం అలవాటు రామాంజనేయులు కి. అంతలోనే వచ్చిన చిన్న కొడుకు “ఇవాళ్ళ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంది” అని ఛానల్ మార్చి మ్యాచ్ పెట్టేసాడు. రామాంజనేయులు కి క్రికెట్ అండి బొత్తిగా ఇష్టం లేదు. రామాంజనేయులు కాలనీ కాసేపు కుర్చీలో కూర్చున్నాడు. అందరూ క్రికెట్ మ్యాచ్ ఆస్వాదించడంలో మునిగిపోయారు. ఇక చేసేది ఏమీ లేక రామాంజనేయులు పడకగదిలోకి వెళ్లి పడుకున్నాడు.

ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. అప్పటిదాకా రామాంజనేయులు గడిపిన జీవితానికి ఇప్పుడు గడుస్తున్న జీవితానికి చాలా తేడా వచ్చేటప్పటికి అతను తట్టుకోలేకపోతున్నాడు. పదవీ విరమణ తర్వాత నీ సహజం అని అతనికి తెలుసు.కానీ ఎందుకో అతనికి ఈ చట్రంలో ఇమడ లేక పోతున్నానేమో అనిపించింది. ఆరోజు పొద్దున రామాంజనేయులు రోజు లాగానే పొద్దున నడకకు వెళ్లి వచ్చి మిగిలిన పనులు చేసి అల్పాహారం తిందామని భోజనాల బల్ల దగ్గర కూర్చున్నాడు. శ్రీమతి పూజలో ఉంది. కోడలు కొడుకుకు మధ్యాహ్న భోజనానికి ఏర్పాటు చేస్తుంది. “అమ్మాయి,టిఫిన్ పెడతావా ఆకలేస్తుంది” అన్నాడు రామాంజనేయులు. “ఒక పావు గంట ఆగండి మామయ్య గారు ఆయనకి ఆలస్యం అయిపోతున్నదట.. ఇవాళ తొందరగా వెళ్ళాలి అని చెప్పారు . ఆఫీసులో ఏదో ఇన్స్పెక్షన్ ఉంది అని చెప్పారు. ఆయన బయలుదేరి వెళ్లిన తర్వాత మన ముగ్గురం టిఫిన్ తిందాం”అంది కోడలు. “నేను కూడా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అమ్మా నాకు కూడా త్వరగా టిఫిన్ పెడితే వెళ్ళిపోతాను” అన్నాడు రామాంజనేయులు.

ఆసరికి పూజ చేయడం ముగించుకున్న శ్రీమతి హాల్లోకి వచ్చి “కోడలు చెబుతున్నది కదండీ, మనం ఒక పావుగంట ఆగుదాం” అంది. “అదేంటోయ్ నాకు ఆకలి అవుతుందని చెప్తుంటే కూడా” అన్నాడు రామాంజనేయులు. అంతలోనే అక్కడికి వచ్చిన చిన్న కొడుకు శశాంక్ “అయితే ముందు ఆయనకి పెట్టేయండి అమ్మా నేను వెళ్లి వస్తాను” అని టిఫిన్ క్యారియర్ తీసుకొని వెళ్ళిపోబోయాడు. “అయ్యో అదేంటిరా మేమందరం ఆగుతాంలే..నువ్వు ముందు రా..కాస్త తిని వెళ్ళు ఆఫీస్ కి టైం అవుతుంది కదా”అంది పంకజం. “ఆయనకు ఆకలవుతుందంటున్నాడు కదా ఆయనకి పెట్టండి ముందు” అన్నాడు కాస్త చిరాగ్గా శశాంక్. “పర్వాలేదులే ముందు నువ్వు తిను” అంటూ అతనికి టిఫిన్ ప్లేట్ చేతికి అందించింది పంకజం. రామాంజనేయులు కి కోపం నాషాళానికి ఎక్కింది. విసురుగా అతను గదిలోకి వెళ్లిపోయాడు. ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడకుండా చాలా ముభావంగా ఉన్నాడు. ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించాడు ఆరోజు. రాత్రి భోజనం అయిన తర్వాత కూడా అతనికి నిద్ర రావడం లేదు. మనసు పది పది విధాలుగా ఆలోచిస్తుంది. అదే అతని ఇప్పటి మనస్థితికి కారణం.

తెల్లారి లేచిన తరువాత అలవాటుగా అతను పార్కుకి వెళ్ళాడు నడవడానికి. అక్కడ అతని స్నేహితుడు గోపి కనిపించాడు. పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత గోపి అడిగాడు “ఏరా రామూ జీవితం ఎలా గడుస్తోంది” “ఆ ఏదో లేరా గడుస్తోంది” అన్నాడు రామాంజనేయులు విరక్తిగా. “అదేంటి అలా మాట్లాడేసావ్ , అంత వైరాగ్యం ఇప్పటినుంచి ఎందుకురా మనకి” అన్నాడు గోపి. “ఎలా బతికిన వాళ్లం ఎలా బతుకుతున్నామని ఆలోచిస్తుంటే వైరాగ్యం కాక ఏమీ వస్తుంది రా” అన్నాడు రామాంజనేయులు. “అంత పెద్ద సమస్యలు ఏమున్నాయి రా నీకు? హాయిగా పిల్లలందరూ బాగా స్థిరపడ్డారు కదా. నీకు వేరే బాధ్యతలు కూడా ఏమీ లేవు కదా” అన్నాడు గోపి. “బాధ్యతలు అంటూ ఏమీ లేవు కానీ ఉద్యోగం మానేసిన తర్వాత నా విలువ తగ్గిపోయిందని అనిపిస్తుంది” అన్నాడు రామాంజనేయులు. “అదేంటి అలా అంటావు” అన్నాడు గోపి. రామాంజనేయులు కి మనసు విప్పి మాట్లాడాలి అని అనిపించింది. గోపి తో అన్ని విషయాలు ఏకరువు పెట్టాడు. అన్ని విన్న గోపి పకాలను నవ్వేశాడు. “అదేంట్రా నా బాధలన్నీ నీకు చెప్పుకుంటే నవ్వేస్తావు అన్నాడు నిష్టూరంగా రామాంజనేయులు. “వీటిని బాధలంటారా” అన్నాడు గోపి,”నీకు ఒక విషయం చెప్తాను. మనం మన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినంతకాలం మనం ఒక వెలుగు వెలుగుతాం. అది ఒక ప్రయాణం లాంటిది.

మన ఉద్యోగ విరమణ అంటే మన ఒక గమ్యస్థానం. అక్కడి వరకే ఆ టికెట్టు పని చేస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత మరో కొత్త టిక్కెట్టు తీసుకోవాల్సిందే, ఆ తర్వాత ప్రయాణమూ కొనసాగించాల్సిందే. ఇప్పటి ఈ ప్రయాణం కేవలం గా మన వ్యక్తిగతమైనదే. ఇందులో ఉద్యోగబాధ్యతలు లాంటివి ఏమీ ఉండవు. ఇది మన ప్రేమ అనురాగాలని పంచే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మన కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు మాత్రమే ఉంటారు. ఈ ప్రయాణాన్ని మన చివరి వరకు మనం అనుభూతించాలి అనుభవించాలి” అన్నాడు ఉద్వేగంగా. “అవును నిజమే,నన్ను బాగా చూడటం లేదు, నా విలువ తగ్గించేశారుఅనుకున్న వాళ్లు అందరూ నా కుటుంబ సభ్యులే కదా,”అన్నాడు రామాంజనేయులు “నిజంగానే ప్రస్తుతంలో నా సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది”. “అవునురా చాలా బాగా చెప్పావు.సరే నాకు నా మనవడిని తీసుకురావడానికి టైం అయింది నేను బయలుదేరుతాను.ఆల్ ది బెస్ట్” అంటూ గోపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తేలికపడ్డ మనసుతో రామాంజనేయులు కొత్త టికెట్టు తీసుకోవడానికి అక్కడి నుంచి బయలుదేరాడు.

మరిన్ని కథలు

Retairment
రిటైర్మెంట్
- డా:సి.హెచ్.ప్రతాప్
Maarpu
మార్పు
- మద్దూరి నరసింహమూర్తి
Sahajeevanam
సహజీవనం
- డా:సి.హెచ్.ప్రతాప్
Naa kosam rendu adugulu
నా కోసం రెండు అడుగులు
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Cyber Yodhudu
సైబర్ యోధుడు
- డా:సి.హెచ్.ప్రతాప్
Jeevana vedam
జీవన వేదం
- కందర్ప మూర్తి, అరిపిరాల దుర్గాప్రసాద్
Gunde lotullo
గుండె లోతుల్లో
- రాపాక కామేశ్వర రావు
Gruhayogam
గృహయోగం
- డా. హేమావతి బొబ్బు LLB, MSc, Ph.D