జరీ జాతకం - శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ

Jaree Jatakam

"అరగంట నుంచి ఈ ముక్క కోసమే చూస్తున్ననోయ్ ", అంటూ బాబి వేసిన ఇస్పేట్ ఆసుని తీసుకొని ‘షో’ చూపించాడు దీక్షితులు.

" అబ్బా! గురువు గారు, మీరు రాజు, మదం కొట్టాకే ఆసొదిలాను " అని సనుక్కుంటూ "కౌంటు" అంటూ చేతిలొనున్న ముక్కలని చాప మీద పడేసాడు బాబి. ఇంచుమించు అదే లెక్కల్లో సమర్పించుకున్నారు శర్మ, కిష్టప్ప మరియు రాంబాబు.

వచ్చిన డబ్బుని జేబులో వేసుకొని, ఒక్కసారి వ్రేళ్ళమధ్య నొక్కిపెట్టి ఉంచిన ముక్కుపొడాన్ని గట్టిగా పీల్చి, "ఇక లేస్తానోయ్, ఆవుకి గడ్డి వేయాలి", అని ఉత్తరీయం పైన వేసుకొని లేచాడు దీక్షితులు.

దీక్షితులు వయస్సు సుమారు డబ్భై ఉంటుంది. వంశపార పర్యంగా వచ్చిన వైదిక వృత్తితో పాటు, దానంగా వచ్చిన రెండు ఆవుల ఆలనా పాలనా స్వయంగా చేసుకుంటాడు. మరియూ జ్యోతిష్యంలో “మంచి దిట్ట” అనే పేరు సంపాదించాడు. ఆ వూరివాళ్ళే గాకుండా చుట్టుప్రక్కల జనాలు కూడా దీక్షితుల దగ్గరికి ప్రశ్నకోసం వస్తూంటారు. కానీ దర్శనం మాత్రం ఒక పట్టాన దొరకదు. తద్దినాలు, వ్రతాలు, పెళ్ళిళ్ళతో పాటు పేకాట కూడా ఒక వృత్తిలా భావించే దీక్షితులు, ఎవరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండడు. ఎవరికైనా దొరికాడంటే అది వాళ్ళ అదృష్టమన్నట్లే లెక్క.

బాబి ఊళ్ళో ఒక పేరుమోసిన చిన్న సైజు జమిందారు. తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిని ఒబ్బిడిగా కాపాడుకుంటూ, అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ, చాలా గౌరవంగా బ్రతుకుతున్నాడు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళైపొయాయి. దీక్షితుల్లాగే బాబికి కూడా పేకాట పిచ్చి, తన ఇంట్లోనే ఒక గదిని పేకాట అడ్డాగా మార్చడంతో, ఆ జాతి పక్షులన్నీ అక్కడికే చేరి కాలక్షేపం చేస్తూంటాయి.

****************************************************

"అయ్యగారున్నారండి అమ్మగారు? " అంటూ పాల చెంబుని బాబి భార్యకి అందించి అరుగుపై చతికిలపడ్డాడు వరదయ్య.

వరదయ్య సుమారు పాతిక ముప్ఫై ఏళ్ళుగా బాబి తండ్రి హయాం నుంచీ పొలంపనులూ, ఇంటిపనులూ చేస్తూ ఒక ఇంట్లో మనిషిగా ఉంటున్నాడు. ప్రొద్దుటే పాలు పట్టుకు వచ్చి, బాబికి చుట్టలు చుట్టివ్వడం వరదయ్య దినచర్యలో ఒక భాగం.

బాబి వచ్చి అరుగు మీదున్న చెక్కసోఫాలో కూర్చున్నాడు.

"అయ్యగారూ! మా వోడిది అదేదో టయింగంటండి, ఇంకో నెల్లో అయిపోతాదంటండి, అంతా మీ దయేండి బాబు", అంటూ చుట్టిన చుట్టొకటి బాబి చేతికిచ్చాడు వరదయ్య.

"ఓ ట్రైనింగా! నా దయేంటిరా! అంతా ఆ దేవుడి దయ. కిట్టిగాడు కష్టపడి చదువుకున్నాడు, పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నాడు", అన్నాడు బాబి.

"అలాగనకండి బాబు, మీరే కనక పూనుకోబోతే మా బతుకులకీ సదువులు ఉజ్జోగాలు ఎట్టాగండి? మీరే మా దేవుడండయ్యా" అంటూ చేతులు జోడించాడు వరదయ్య.

వరదయ్యకి ఇద్దరు కొడుకులు. పెద్దాడు నారాయుడు తాగుడికి బానిస. తనకి కళ కుదిరినప్పుడు కూలిపనులకెళుతూంటాడు. లేని రోజున తాగుడు డబ్బులకోసం తండ్రితో గొడవ పడుతూంటాడు. రెండోవాడు కృష్ణ. అందరూ కిట్టిగాడంటారు. అన్నలాకాకుండా బుద్ధిమంతుడు. వాడి చురుకుతనం, ఉత్సాహం చూసి బాబి చిన్నప్పటినుంచీ బాగా ప్రొత్సహిస్తూ ఉండేవాడు. కిట్టిగాడిని డిగ్రీ దాకా చదువు చెప్పించి, పోలీసు ఉద్యోగానికి కావలసిన కోచింగుకి కూడా పంపించాడు. దానికి వాడి యొక్క కష్టం, పట్టుదల తోడవటంతో మొదటి ప్రయత్నంలోనే పోలీసు ఉద్యోగం సాధించి, ప్రస్తుతం ట్రైనింగులో ఉన్నాడు.

మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది.మధ్యాదిన మార్తాండుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాబి ఇంటిముందు సైకిలు స్టాండు వేసి ఉత్తరీయాన్ని తలపాగా చుట్టుకొని "భోజనం అయిందోయ్" అంటూ లోపలికి వచ్చాడు దీక్షితులు.

"ఆ ఇప్పుడే! పదినిమిషాలైంది, రండి కూర్చొండి" అంటూ సోఫా చూపిస్తూ చుట్ట వెలిగించాడు బాబి.

కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాకా, బాబీ అన్నాడు " గురువుగారు! ఎప్పటినుంచో అడుగుతున్నాను నా జాతకం రాయమని, మీరసలు కనికరించట్లేదు. అదిగో ఇదిగో అంటూ దాటేస్తున్నారు ".

" నీకేమిటోయ్ "జరీ జాతకం"! భేషుగ్గా కనపడుతుంటేను, భార్య గుణవతి, ముత్యాల్లంటి పిల్లలు, మనవలు, కన్నుల పండగలాంటి కుటుంబం, జాతకం చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు", అంటూ ఒక్క పట్టు పొడుం పీల్చాడు దీక్షితులు .

“అదేం కుదరదు, ఈసారి ఎలాగైనా చక్రం వేయాల్సిందే” అంటూ, బాబి పుట్టినపుడు ఆయన తండ్రి డైరీలో వ్రాసుకున్న వివరాలను ఒక కాగితంపై వ్రాసిచ్చాడు బాబి.

సరేలే చూద్దాం అని తల పంకిస్తూ , ఆ కాగితాన్ని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు దీక్షితులు .

రెండుమూడు రోజుల తరవాత, చాకలకి బట్టలు వేస్తూ జేబులు వెతుకుతుంటే, ఒక చీటి కనబడింది దీక్షితులు భార్య సుబ్బమ్మకి. భర్తకి భోజనం వడ్డిస్తుంటే ఆ చీటి సంగతి గుర్తొచ్చి,

“మీ చొక్కాలో ఇదేదో కాగితం ఉంది చూడండి” అంటూ గూట్లోంచి తీసి భర్తకిచ్చింది ఆమె. అది బాబి జాతకం గురించి ఇచ్చిన వివరాల తాలూకుది.

"అవును కదూ! మరిచేపోయాను, ఈరోజు దీనిమీద కూర్చోవాలి" అనుకుంటూ భోజనం ముగించాడు దీక్షితులు.

మధ్యాహ్నం ఒక కునుకులాగి, పాత పంచాంగాల కట్టనుంచి కావలసినది తీసుకొని, బాబి జాతకం వ్రాయడానికి ఉపక్రమించాడు దీక్షితులు. సుమారు నాలుగైదు గంటలు పాటు ఒక అరడజను దాకా జ్యోతిషశాస్త్రానికి సంబంధించిన గ్రంధాలను తిరగేస్తూ చక్రం వేసి, రాశులను గణిస్తూ లెక్కలను వ్రాసుకున్నాడు. ఇప్పటివరకూ ఎన్నో జాతకచక్రాలు వేసిన దీక్షితులు ఇంతగా శ్రమ పడిన సందర్భాలు లేవు. ఒకటికి పదిసార్లు చూసుకున్నాడు.ఎక్కడా పొరపడలేదే? ఏమిటి ఈ జాతకం ఇలా చూపిస్తోంది? నేనూహించిన జరీ జాతకంలా లేదే? ఇచ్చిన వివరాలలో ఎమైనా తేడా ఉందా? ఆస్కారం లేదు, బాబి తండ్రి తన డైరీలో స్వదస్తూరీతో వ్రాసుకున్నదది అనుకుంటూ, దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయాడు.

బాబి జాతకాన్ని సుబ్బయ్యశాస్త్రికి చూపించి ఇంకొకసారి నిర్ధారణ చేసుకుందామని, మరునాడుదయమే సైకిలుపై పొడగట్లపల్లి బయలుదేరాడు. అది దీక్షితులు గురువు నరసింహశాస్త్రి ఊరు . ఆయన కాలం చేసి చాలా కాలమైంది. సుబ్బయ్యశాస్త్రి - నరసింహశాస్త్రి కుమారుడు. దీక్షితులు, సుబ్బయ్యశాస్త్రి కలిసే నరసింహశాస్త్రి వద్ద జ్యోతిషశాస్త్రం నేర్చుకున్నారు.

ఇద్దరూ కూర్చుని చర్చించుకుంటూ మళ్ళీ తిరిగి వ్రాశారు. అదే ఫలితం చూపిస్తోంది. దీక్షితులు చేసిన గణాంకాలు నూటికి నూరు శాతం ఒప్పే అని సుబ్బయ్యశాస్త్రి నిర్ధారించాడు. బాబికి ఎలా చెప్పాలా అని తర్జనభర్జన పడుతూ మెల్లిగా సాయింత్రానికి ఇల్లు చేరుకున్న్నడు దీక్షితులు, రాత్రంతా ఆలోచించి జాతక వివరాలు బాబికి చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు.

"అమ్మగారూ పాలు", అంటూ వీధి అరుగు పై చతికిలపడ్డాడు వరదయ్య.

"ఎనిమిదైంది, ఇప్పుడా పాలు పట్టుకు రావడం? ఈరోజు ఇంత ఆలస్యం అయిందే?", అంటూ కొంచెం కోపంగా అడిగింది సుగుణమ్మ.

"పొద్దున్నించి నారాయుడు ఒకడే గొడవండి" అంటూ నిట్టూర్చాడు వరదయ్య.

"మీకిద్దరికీ ఎప్పుడూ ఉండేదేగా వీధుల్లో పడి కొట్టుకోవడం! ఇందులో క్రొత్తేముంది", అంటూ పాల చెంబట్టుకొని లోపలికి వెళ్ళింది ఆమె.

కాసేపటికి బయటికి వచ్చిన సుగుణమ్మ, ఇంకా వరదయ్య అక్కడే కూర్చుని ఉండటం చూసి,"అయ్యగారితో పనేమైనా ఉందా" అని అడిగింది.

"మరేంలేదండి, దీపావలొత్తోంది కదండి, నారాయుడు టపాకాయలు, జువ్వలు చేసి అమ్ముతాడంటండి", అన్నాడు వరదయ్య.

"అవునా, మంచిదేకదా! నాలుగు డబ్బులొస్తాయి", అంది సుగుణమ్మ.

" కానండీ!" అంటూ నసుగుతున్నాడు వరదయ్య.

"తాటాకు కొట్టి ఆరెట్టుకోవాలి కదండి! మా ఇంటికాడ అసలు కాలీ తలం లేదండి. మన తోటలో షెడ్డుకాడ మెరకలో తాటాకు ఆరెట్టుకొని, షెడ్డులో సరకు సేత్తాడంటండి. అయ్యగారిని అడగమని పొద్దున్నించి సతాయించేత్తన్నాడండి"అని అసలు విషయం బయటపెట్టాడు వరదయ్య.

"అయ్యగారు బయటికెళ్ళారు, ఎప్పుడొస్తారో ఏమో!" అని సుగుణమ్మ లోపలికి వెళ్ళిపోయింది.

ఆ మర్నాడు బాబిని షెడ్డు విషయమై కదిపాడు వరదయ్య.

"వాడి సంగతి తెలుసుండి కూడా నువ్వెలా అడుగుతున్నావురా? అసలు వాడికి నిలకడెక్కడేడిసింది? నువ్విచ్చే డబ్బుతో తాగి తందనాలాడతాడు" అంటూ ఓక్కసారి కస్సుమన్నాడు బాబి.

"అట్టా అనమాకండయ్యగారు! ఆడు సతాయించేత్తన్నాడండి" అంటున్న వరదయ్య మాటని వినిపించుకోకుండా లోపలికెళ్ళిపోయాడు బాబి.

తరవాత రెండుమూడు సార్లు వరదయ్య ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా బాబి కోపం ప్రదర్శిస్తూనే ఉన్నాడు.

ఇక లాభం లేదనుకొని ఒక రోజు నారాయుడిని తీసుకొని సుగుణమ్మ దగ్గరకి వచ్చాడు వరదయ్య.

"అమ్మగారు! అయ్యాగారసలు ఇనిపించుకోట్లేదండి. ఓ…! సికాకు పడిపోతున్నారు. ఈడేమో నేనడగట్లేదనుకొని ఏపుకు తింటున్నాడండి. తవరే అయ్యగారికి సెప్పి ఒప్పించండమ్మా!" అని తండ్రీకొడుకులిద్దరూ సుగుణమ్మ కాళ్ళపై పడ్డారు.

సుగుణమ్మ హృదయం ఒక్కసారి కరిగి పోయింది. "సర్లే! లేవండి నేను అయ్యగారికి చెప్పి ఒప్పిస్తాలే. రేపో ఎల్లుండో కనబడండి" అంటూ వాళ్ళకి అభయం ఇచ్చింది.

మర్నాడు మధ్యాహ్నం బాబికి భోజనం పెడుతూ, "ఏవండీ!వరదయ్య మన తోటలో షెడ్డు గురించి అడిగాట్ట కదా?" అంది సుగుణమ్మ.

"అవును, వాడడిగింది నారాయుడి కోసం. దీపావళికి మందుగుండు సామాను చేస్తాట్ట. వాడి సంగతి తెలుసుండీ ఎలా ఇస్తాం? కుదరదని కరాఖండీగా చెప్పాను" అన్నాడు బాబి.

"కాదండి, ఒక్కసారి అలోచించండి. నెల రోజులే కదా! కాస్త ఎదో నాలుగు డబ్బులొస్తాయని ఆశ పడుతున్నాడు. నేను మీతో చెప్పి ఒప్పిస్తానని మాటిచ్చాను. ఈ ఒక్కసారికి ఒప్పుకొండి" అని బ్రతిమాలే ధోరణిలో సుగుణమ్మ అడిగేసరికి, బాబికి ఒప్పుకోక తప్పలేదు చివరికి.

****************************************************************

మర్నాడు ఉదయం వరదయ్య కిట్టిగాడిని కూడా తనతోబాటు తీసుకు వచ్చాడు బాబి ఇంటికి.

"అయ్యగారూ! ఈడు రాత్రొచ్చాడండి", కిట్టిగాడికేసి "చెప్పరా" అంటూ చూశాడు వరదయ్య.

కిట్టిగాడు వంగి బాబి కాళ్ళకి దండం పెట్టి "ట్రైనింగు పూర్తి అయిందయ్యగారు, మనూళ్ళోనే కానిస్టేబుల్ గా పోస్టింగిచ్చారండి" అని చెప్పగానే, ఒక్కసారి బాబి ముఖం వెలిగిపోయింది.

"సుగుణా, ఇలారా ఒకసారి" అంటూ ఇంట్లోఉన్న భార్యని పిలిచి, తను విన్న విషయం చెప్పగానే,

"ఉదయాన్నే మంచి విషయం చెప్పావురా! ఉండు" అంటూ సుగుణమ్మ లోపలికి వెళ్ళి ఒక బెల్లం ముక్క పట్టుకొచ్చి కిట్టిగాడి చేతిలో పెట్టింది “నొట్లో వేసుకోమంటూ”.

సరిగ్గా అదే సమయానికి దీక్షితులు ప్రవేశించాడు.

విషయం తెలుసుకొని "శుభం రా కిట్టిగా, ఇంక నీ జీవితం గట్టెక్కేసింది, ఎన్ని జన్మలెత్తినా బాబిగారి ఋణం తీర్చుకోలేవు", అంటూ సోఫాలో కూర్చున్నాడు దీక్షితులు.

"అంత పెద్దమాటలెందుకు గురువుగారు! ఎదో చేతనైన సాయం చేసానంతే", “సరే గానీ నా జాతకం చూడ్డం మొదలెట్టారా?” అంటూ బాబి చుట్ట వెలిగించాడు.

"చూడు బాబి! వితరణ అన్నది ఒక వరమయ్యా. నీకన్నా డబ్బున్నవాళ్ళెంతమందిలేరీవూళ్ళో! ఆ అదృష్టం అందరికీ దక్కదు. నువ్వు చెయ్యి విదలించని వాళ్ళు బహు తక్కువ. తెలిసినవి కొన్నే అయితే,మరో చేతికి కూడా తెలియకుండా చేసినవి ఎన్నో. మా సత్యవతమ్మ వివాహం నేను చేయగలిగేవాడినా నీ అండ లేకుండా?" అని అంటుంటే ఒక్కసారి బాబి జాతకం గుర్తొచ్చి గొంతు జీరబోతూండగా, అతని భుజంపై చెయ్యివేసి "వస్తానయ్యా" అంటూ లేచి బయటికి వచ్చేశాడు దీక్షితులు.

ఆరోజు నరకచతుర్దశి. బాబి ఉదయాన్నే సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. కాసేపటికి, వీధిలో కోలాహలం కనపడింది. కొందరు సైకిళ్ళపైన, కొందరు పరిగెడుతూ వెళ్ళడం కనిపించింది. ఎమై ఉంటుందబ్బా అనుకుంటూ వీధి గేటువైపు అదుగులు వేసాడు. ఒక పదినిమిషాల తరువాత ఇద్దరు వచ్చి బాబితో చెబుతున్నారు. మందుగుండు పేలి బాబి తోటలో షెడ్డు కాలిపోతోందని, పక్క వూరినుంచి ఫైరింజన్ వస్తోందని, ఈలోపులో జనం మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారని, షెడ్డులో ఎంతమందున్నారో ఇంకా తెలియదని.

తరవాత మాటలేవీ బాబికి వినపడటంలేదు. ఒక్కసారి కొయ్యబారిపోయాడు. “అసలేం జరిగుంటుంది? ఎలా జరిగుంటుంది?” అనుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు.

కాసేపటికి వగరుస్తూ వరదయ్య వచ్చాడు. వస్తూనే పెద్ద పెద్ద ఏడుపులతో, "అయ్యగారూ! శానా గోరం జరిగిపోనాదండి, నారాయుడు ఇంక లేడండయ్యా!” అంటూ బాబి కాళ్ళదగ్గర కుప్పకూలిపోయాడు.

ఆ ఏడుపులకి సుగుణమ్మ బయిటకొచ్చింది. చుట్టుపక్కల జనం పోగయ్యారు. వరదయ్యని ప్రక్కకు తీసుకెళ్ళిపోయారు. దీక్షితులు కూడా అక్కడికి చేరుకున్నాడు. బాబీ నువ్వేమీ కంగారుపడకు అన్నట్లుగా భుజంపై చెయ్యి వేసి దగ్గరకి తీసుకున్నాడు.

నారాయుడి మృతదేహాన్ని పొస్టుమార్టంకి తరలించారు.ఒక గంట పోయేసరికి బాబి ఇంటిముందు కానిస్టేబులు కిట్టిగాడు, వాళ్ళ ఎస్సై జీపులో దిగారు.

ఊళ్ళో ఎన్నో కేసులని పోలీసుస్టేషన్ కి వెళ్ళకుండా సెటిల్ చేసిన బాబి అంటే ఆ ఎస్సైకి అపారమైన గౌరవం. చుట్టూఉన్న జనానికి ఎదో సినిమా చూస్తున్నట్లుగా ఉంది.

పోలీసులు ఊళ్ళోకి వచ్చారంటేనే అవమానంగా భావించే పల్లెటూరి సంస్కృతిలో, ఏకంగా తమ ఇంటికే రావడం , అందులోనూ బాబి కోసం కావడం. ఆ దంపతులిద్దరూ చిగురుటాకుల్లా వణికిపోతున్నారు.

ఎస్సై దీక్షితులు దగ్గరగా వచ్చి "ఒక్కసారి నాతో రండి" అంటూ బయటికి నడిచాడు.

" చూడండి! జరిగిన ఘోరంతో బాబిగారికి సంబంధం లేదని మీ అందరిలాగే నాకు తెలుసు. కానీ అనుమతి లేకుండా ఇటువంటి పనులు చేయడం చట్టరీత్యా నేరం. ప్రమాదం జరిగిన ప్రదేశం బాబిగారిది. పోలీసు రిపోర్టు ప్రకారం ఒక తోటలోని షెడ్డులో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా చేస్తున్న మందుగుండు సామాగ్రి పేలి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ షెడ్డు యజమానిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచవలెను అని ఉంది.

వ్యక్తి ప్రాణం పోయింది గాబట్టి నాన్ బెయిలబుల్ వారంట్ ఇవ్వబడింది. తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలి. ఆ విషయం ఆయనతో చెప్పడానికి నాకు మనసొప్పటంలేదు. మీరే కాస్త సాయపడాలి" అంటూ దీక్షితులు చేతులు పట్టుకున్నాడు ఎస్సై.

త్రుళ్ళిపడ్డాడు దీక్షితులు. ఏమిటి బాబి జైలుకా? అంటూ రెండు చేతులతో కళ్ళుమూసుకున్నాడు.

"తప్పదుసార్! ఇది నా ఉద్యోగ బాధ్యత, సహకరించాలి మీరు" అంటూ దీక్షితులతో కలసి లోపలికి నడిచాదు ఎస్సై.

ఇప్పుడు కిట్టిగాడు పాలేరు కొడుకు కాదు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి. వచ్చిన పని – “తనకి బిక్ష పెట్టిన దేవుడు చేతికి సంకెళ్ళు వేయడానికి”. కిట్టిగాడి కళ్ళంట కన్నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి.

బాబికి సంగతంతా అర్ధమైపోయింది.లోపలికి వచ్చిన ఎస్సైతో " ఎస్సై గారు, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. నా పూర్తి సహకారం నేను అందిస్తాను" అనేసరికి ఎస్సైతో బాటు దీక్షితులు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.

కిట్టిగాడు ఒకచేత్తో కళ్ళు తుడుచుకుంటూ, మరొకచేతిని బాబికి అందించి జీపులోకి ఎక్కించాడు.

ఊరు ఊరంతా కదలి వచ్చింది. ప్రతి ఒక్క కన్ను తడిసింది.

సుగుణమ్మ ఒక్కసారి కుప్పకూలిపోయింది.

"నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా! ఇప్పుడే లాయరు దగ్గరికి వెళతాను, బాబికి ఎమీ కాదు" అని దీక్షితులు అంటుంటే, "నేనే ఆ పాపం చేసాను గురువుగారు. ఆయన ఇవ్వనని చెబుతున్నా, నేనే పట్టుపట్టి ఆ షెడ్డు నారాయుడికి ఇప్పించాను. నా మూలంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలసిపొయింది. నిష్కారణంగా దేవుడిలాంటి ఆయనికి ఈ దుస్థితి" అని సుగుణమ్మ కొంగు నోట్లో కుక్కుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది.

ఆ మాటలు విని ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు దీక్షితులు. జీవితంలో మొట్టమొదటిసారి తన జోష్యం తప్పవ్వాలని బాబి జాతకం చూశాకా కోరుకున్నాడు, ఒకరకంగా మ్రొక్కుకున్నాడు.

తన కోరిక తీరలేదు కాని, బాబి జాతకం నిజమైంది - "భార్య మూలంగా కారాగార జీవితం".

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు