జీవితానికి మరోవైపు ...... - జీడిగుంట నరసింహ మూర్తి

Jeevitaniki maro vaipu

"మధూ గంటనుండి చూస్తున్నాను. గిన్నెల చప్పుడే తప్ప టిఫిన్ మాత్రం బయటకు రావడం లేదు ?" ఇంతకీ ఈ రోజు చేస్తున్న ఆ అల్పాహారం ఏమిటో ? అంటూ వంటింట్లోకి వచ్చి మూత తెరిచి చూడబోయాడు రాజేష్ . అప్పటికే కడుపులో పేగులు అల్లరిచేస్తున్నాయి.

"అబ్బా. అన్నిటికీ తొందరే మహానుభావా . . ఈ రోజు మీరు వూహించని టిఫిన్ తినబోతున్నారు. అంతా సస్పెన్స్ ".

'" సరేలేవొయ్ . నాకు తెలియని టిఫిన్లు ఈ ఇంట్లో ఏముంటాయి కాని. ఏదో మన పెళ్ళైన కొత్తల్లో నీకు ఏ వంటలూ రావని తెలుసుకుని దగ్గరుండి నేర్పించాను. అప్పటినుండి ఏ వంటైనా పూర్తిగా నీమీద వదిలేయ్యాలంటే కొద్దిగా భయంగా ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో డిస్ట్రబ్ చేస్తూ ఉంటాన్లే" అన్నాడు ఆమెను ఉడికిస్తూ రాజేష్.

రాజేష్ కు వంటలు బాగా రావడం వల్ల ఇతరులు చేసిన వాటిలో అతనికి రుచుల్లో ఎంతో కొంత తేడా కనిపిస్తూ ఉంటుంది . ఆ క్రమంలోనే ఆఖరికి మాధవి చేసి వంటలపై కూడా చాలా సార్లు వంకలు పెట్టేవాడు. అలా అంటున్నప్పుడు తన మనోభావాలు దెబ్బ తింటాయని కూడా ఆలోచించడు. ఏదో అప్పుడప్పుడు అలా టంగ్ స్లిప్ అవుతూ ఉంటాడు కానీ చాలా విషయాలలో తనను ప్రేమగానే చూసుకుంటాడని సరిపెట్టుకుంటూ ఉంటుంది మాధవి.

"ఇంతకీ నువ్వు చేస్తున్నది వూహించగలను. బొగ్గుల పులిహారేగా ?" అన్నాడు కవ్విస్తూ చేతిలో వున్న గరిట విసిరేస్తుందేమో అన్న భయంతో దూరంగా జరుగుతూ.

" మహాశయా అది బొగ్గుల పులిహార కాదండీ బాబూ ! బొరుగుల పులిహార .అయినా ఆ టిఫిన్ మన ఇంట్లో పునరావృతం కావాలంటే మీరు ఇంకో నెల ఆగాల్సిందే. ఇప్పుడు నేను చెయ్యబోయ్ పదార్ధం మీకు నచ్చినా నచ్చకపోయినా బలవంతాన తినాల్సిందే "

"అమ్మో అదొకటా ? చిన్న పిల్లలకు ఆముదం పట్టేటప్పుడు రెండు కాళ్ళు ఒకళ్లు, చేతులు ఒకళ్లు పట్టుకుని నానా తిప్పలు పడేవాళ్లు. ఇప్పుడు నా పరిస్తితి కూడా అంతేనంటావా ?" అతని కళ్ళు కొంటిదనంతో మెరిసాయి .

"చాల్లెండి ఎవరైనా వింటే నవ్విపోతారు . సరసాలకు కూడా హద్దుండాలి "

" ఓహో ఇది సరసమా దేవీ ? పోనీలే అలా ఆనందపడితే మంచిదే. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ప్రత్యేకంగా నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఏ ట్రిక్కులు ఉపయోగించనవసరం లేదు "

అతని కళ్ళల్లోని స్వచ్ఛత , అనురాగం ఆమెను కట్టి పడేస్తూ ఉంటాయి. . చాలా కుటుంబాలకు రాజేష్ కుటుంబం భిన్నంగా అనిపిస్తుంది చూసే వాళ్ళకు . .

" చాలా సంతోషం కానీ శ్రీవారూ నేను చేసిపెట్టే టిఫిన్లు గురించి నా దగ్గరైతే వ్యంగ్యంగా అంటే అన్నారు కానీ బయట వాళ్ళ దగ్గర కూడా అంటున్నారేమోనని నా అనుమానం ". మాధవి గొంతులో రవ్వంత హేళన తొంగిచూసింది.

" అప్పుడే కోపమా ? ఊరికే అన్నాను లేవొయ్. భార్యా భర్తలు అన్నాక ఆ మాత్రం విసుర్లు వేసుకోక పోతే జీవితం నిరుచప్పిడిగా వుంటుంది. . సరే విషయానికొస్తున్నాను. వంటలు గురించి పనిగట్టుకుని బయట పొగుడుతూ వుంటే ఎప్పుడు మనింటికి భోజనానికి పిలుస్తామా అని అందరూ ఎదురు చూస్తూ వుంటారు. అసలు ఇంట్లో విషయాలు సామాన్యంగా నేను ఎవరితోనూ బయట చర్చించను . . అయినా మనల్ని మనం తక్కువ చేసుకుంటామా నీ పిచ్చి కాకపోతే ? అప్పుడప్పుడు మా స్టెనోగ్రాఫర్ ఆసక్తితో అడుగుతూ వుంటుంది అనుకో. అటువంటప్పుడు నీ గురించి కొంచం ఎక్కువ వేసే చెప్తూ వుంటాను . ఆ అమ్మాయి ఒకటే అసూయ పడిపోతూ వుంటుంది పాపం . ఈమధ్యనే అంటే ఒక ఆరునెలల క్రితం ఆమె పెళ్లయ్యింది. మొగుడూ పెళ్ళాలమధ్య ఒక సరదా కానీ సరసం కానీ లేదంటూ ఎప్పుడూ కళ్ల నీళ్ళు పెట్టుకుంటుంది. ఆమెపై భర్తకు ఎప్పుడూ అనుమానమేనట . వక్ర బుద్దితో చూస్తూంటాడుట. .

"మీ బాసుతో పక్కన కూర్చుని పకపకలు, వికవికలు బాగానే సాగుతున్నాయిటగా.?" అంటూ అన్యాయంగా ఆ అమ్మాయిని మానసికంగా హింసిస్తూ వుంటాడుట ... లోకం తీరు ఒక రకంగా ఉండదు. వాళ్లేవో చెప్తూ వున్నా నేను నాకు తోచిన సలహాలు ఇస్తూ నా పెద్దరికం కాపాడుకుంటూ ఉంటానులే. అయినా ఆ గొడవలన్నీ మనకెందుకుగాని . ముందు నువ్వు చేసిన ఆ కొత్త పదార్ధం ఏమిటో వడ్డించు. వూరించడంతోనే నీకు సరిపోతోంది " అంటూ తనే వెళ్ళి రెండు ఖాళీ ప్లేట్లు ఆమె పక్కన ఉంచాడు. .

తనకు తెలియకుండానే తన స్టెనోగ్రాఫర్ గురించి ఉప్పు అందించేశాడు రాజేష్.

"నేను తర్వాత తింటాను కానీ ముందు ఈ విషయం చెప్పండి మీ స్టెనోగ్రాఫర్ మీతో తన వ్యక్తిగత విషయాలు చెప్పే అంత చనువుగా వుంటుందా ? ?" ఆమెలో ఉక్రోషం , కోపం, అసూయ ఒక్కటొక్కటిగా ఆవరించాయి. .

"ఎహే. ప్రతిదానికీ అనుమానమే అయితే ఎలాగోయ్ . . . ఏదో మాట వరసకు చెప్పాను. మనలాగా అన్ని జీవితాలు రసవత్తరంగా, ఆనందమయంగా వుండవుగా. మనకంటూ ఇప్పటివరకు పిల్లలు లేరు. అలా పిల్లలు లేని కుటుంబాలలో భార్యా భర్తలలో ఒకరిమీద ఒకరికి విపరీతమైన ప్రేమ వుంటుందని చాలా ఉదంతాలు వున్నాయి. ఈ వయసులో కూడా మేమెంతో చలాకీగా, ఒకరినొకరు విడవలేనంత అంటిపెట్టుకుని వుంటామని ఏదో ఫ్లోలో ఆమెతో చెప్పేశాను. ఆ అనుభవాలు, అవకాశాలు లేని అవతలవాళ్లు సహజంగా వాళ్ళ గురించి తమకు దగ్గరగా మసులుతున్న వాళ్ళకు వాపోతూ చెప్పుకుంటారు. అంతేగా జరిగింది. నేను కూడా ఆవిడలా నా భార్య దేనికీ సహకరించదు. మొహంలో నవ్వనేదే కనిపించదు అంటూ ఏమీ చెప్పలేదుగా. ఆహ .. నువ్వు అలా వుంటావని కాదు. ఆవిడ సానుభూతి కొట్టేయ్యాలని చెప్పడానికి కలిపించి చెప్పొచ్చుగా. .. కానీ నీ గురించి అంతా నిజాలే చెప్పాను. ఇక శాంతించు. రా ! నువ్వు ఎంతో రుచిగా చేసుకున్న టిఫిన్ చల్లారిపోతోంది " అంటూ రెండు స్పూన్లు ఆమె నోటికి అందించాడు. " భగవంతుడా ఎరక్కపోయి చెప్పాను " అనుకుంటూ . ."

" అదే సరే కానీ మేడమ్ . మన పెళ్ళయి ఎనిమిదేళ్లు అయినా నీలో అందం రోజు రోజుకు పెరుగుతోందే కానీ వీసమెత్తు కూడా తగ్గలేదు. ఏం వాడుతున్నావు ? నిజం . నాకు తెలియక అడుగుతున్నాను ఆ రహస్యం ఏమిటో చెప్పవూ ?" అడిగాడు రాజేష్ టాపిక్ మళ్లించాలనే ఉద్దేశ్యంతో .

"ఏ మీ స్టెనోగ్రాఫర్కు చెప్పేద్దామనా ? " హఠాత్తుగా ఆమె మొహం సీరియస్ అయ్యింది.

" అబ్బా. నిన్ను ఎలా నమ్మించాలి ? నేను నీతో ఎంతో సరదాగా మాట్లాడాలని ప్రయత్నం చేసినా నా ఉత్సాహాన్ని సగం చంపేస్తున్నావు " అతని ముఖం జేవురించినయ్యింది

* * * *

గత ఐదారు నెలలుగా రాజేష్లో కొట్టొచ్చినట్టు మార్పు కనిపిస్తోంది.

ఇంట్లో చక్కగా ప్రేమగా అపురూపంగా చూసుకునే రాజేష్ తనను బయట ప్రపంచంలోకి తీసుకెళ్ళగానే విచిత్రంగా మారిపోవడం మాధవి గమనిస్తోంది. తనంటే ఎందుకో ముభావంగా వుంటున్నాడు. . తనకు దూరం దూరంగా నడుస్తున్నాడు . తను అడిగిన ప్రశ్నలకు విననట్టుగా పొందిక లేకుండా మాట్లాడుతూ వుంటాడు . చాలా సార్లు అతని మొహం అప్రసన్నంగా మారిపోతూ గొంతు కర్కశంగా, కటువుగా అనిపించేది. . అప్పుడప్పుడు అతని మాటలు ములుకుల్లాగా, శూలాల్లాగా గుచ్చుకుంటూ వుంటాయి. బయట వాళ్ళు తమని గమనిస్తున్నారని కూడా గమనించక గట్టిగా అరుస్తూ వుంటాడు. అటువంటి పరిస్తితిలో తనలో ఎప్పుడూ కలగని అవ్యక్తమైన బెదురూ, నీరసం ఆవరిస్తాయి. . ఇంటికొచ్చే వరకు దారిలో నిర్లిప్తంగానూ, ఏదో పోగొట్టుకున్నట్టుగా నడుస్తుంది. . అతని ద్వంద్వ ప్రవృత్తి అర్ధం చేసుకోవడం ఆమెకు చాలా కష్టంగా వుంటోంది. .

ఇంటికి రాజేష్ మిత్రులు ఎవరైనా వస్తే తనని ప్రత్యేకంగా పరిచయం చేసి తనని పక్కనే కూర్చోపెట్టుకుంటాడు. వాళ్ళతో తన గురించి నా భార్య నా నా యింట్లో కొలువున్న దేవత అని అభివర్ణిస్తూ వుంటాడు. . అంత బాగా చూసుకునే వాడు బయటకు తీసుకెళ్తే అతని రూపం, స్వభావం అన్నీ పూర్తి విరుద్దంగా వుంటాయి. అతనిలో ఒక కోణం అత్యంత ప్రేమ స్వరూపం. మరో కోణం దానికి ఏ మాత్రం పొంతన లేని అదో రకపు పూర్తి భిన్నమైన మనస్తత్వం .

అదే విషయాన్ని చాలా సార్లు అతన్ని అడిగింది. "ఇంట్లో అంత ప్రేమను నామీద కురిపిస్తారు కదా మరి బయటకు వెళ్ళగానే నాతో ఎందుకు శత్రువులాగా చూస్తారు ? ఆ పొంగి పొరలే ప్రేమ ఒక్కసారిగా మీలో ఎందుకు ఆవిరి అయిపోతుంది ?" అని.

మాధవికి అతని సమాధానం చాలా ఆశ్చర్యంగా అనిపించేది . .

" భార్యా భర్తలైనంతమాత్రాన బయట ప్రపంచంలో పదిమంది మధ్య అంటిపెట్టుకుని వుండాలని లేదు. మన సంస్కారాన్ని మనం కాపాడుకోవాలి. మన చర్యలు అవతల వారికి ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా వుండకూడదు . ఇదే నా ఉద్దేశ్యం "

" నా వరకు నా ప్రేమను నీ సాహచర్యంలో సంపూర్ణంగా పంచుకుంటున్నాను. . . ఇది నాలోని ఒక కోణం. ఇంకో కోణం ఏమిటంటే నేను కొన్ని పరిస్తితులకు , బలహీనతలకు బానిసను. వాటి ప్రభావం నాపై , నావారి పై వుండకుండా వుండటానికి ఒక్కొక్కసారి నా చేష్టల ద్వారా బాధపెట్టక తప్ప లేదు. . ఇప్పుడు నీకో నిజం చెప్పాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా ఆఫీసులో ఒకాయన నేను నీ పైన చూపించే ప్రేమకు వంద రెట్లుగా వాళ్ళావిడతో పంచుకుంటాడు. వాళ్ళను చూసి కుళ్లుకోని వాళ్లంటూ లేరు. అలాంటి జంట ఒకరోజు వూహించని రీతిలో ఆక్సిడెంట్కు గురయ్యి ఘోర మరణం పొందారు. అప్పటినుండి నాలో ఎందుకో అభద్రతా భావం ఏర్పడింది. సాధ్యమైనంతవరకు బయట ప్రపంచంలో మనం అతిగా వుండక ఒద్దికగా వుంటేనే మంచిది అనిపించింది. విధి బలీయం వల్ల మన మధ్య ఎడబాటు వస్తే నేను భరించలేను. ఈ క్రమంలో నా ప్రవర్తన నీకు విచిత్రంగా అనిపిస్తూ వుండొచ్చు . . నాలోని భయం వల్ల నేను చాలా సార్లు నీ పట్ల అనుచితంగా ప్రవర్తించి నీ మనోభావాలను కించపరిచి వుండవచ్చు. . అలా అని నిన్ను బయటకు తీసుకెళ్లకుండా వుండలేను . ఈ విషయంలో నువ్వు నన్ను పూర్తిగా అర్ధం చేసుకుని సహకరిస్తావని అనుకుంటున్నాను " అన్నాడు మాధవి చేతులు పట్టుకుని .

రాత్రి నిద్రపోయిందే కానీ అర్ధం లేని ఆలోచనలతో మాధవి బుర్రంతా వేడెక్కిపోయింది. ఐదు సంవత్సరాల క్రితం పెళ్ళైన తన మిత్రురాలు క్రాంతి పరిస్తితి తనకు పూర్తి భిన్నం. మోహన్ తనని ఇంట్లో ప్రతి క్షణం ఎన్నో ఇబ్బందులు పెడుతూ ప్రతి విషయానికీ కించపరుస్తూ వుంటాడు. బంధువుల మధ్య ఆ రకపు అవమానాల్ని తట్టుకోలేక పోతోందిట . "మీ ఆయన ఇంట్లో లేనప్పుడు చెప్పు వస్తాం . నీతో పాటు మాకు కూడా సూటీ పోటీ మాటలు పడాల్సిన అవసరం లేదు " అంటూ ఆమె మిత్రురాళ్ళు ఎన్నో సార్లు క్రాంతిని హెచ్చరించే వారుట.

నలుగురి నోళ్లల్లోనూ పడిపోయినందుకు క్రాంతికి ఎంతో బాధగా వుండేది. కానీ ఆమెను బయటకు తీసుకెళ్లినప్పుడు, వేడుకలలోనూ అతని ప్రవర్తన అవతలి వాళ్ళను అసూయ పడేటట్టుగా చేస్తుంది. ఎంతో ప్రేమగా అవతలవాళ్ళకు పరిచయం చేస్తాడు. బంధువుల మధ్య, స్నేహితుల దగ్గర భార్యకు ఎంతో విలువనిస్తూ నవ్వుతూ మాట్లాడుతాడు . ఇదే ఆమెకు చెప్పలేనంత సాంత్వన .. క్రాంతి ఎన్నో సార్లు ఈ విషయం చెపుతూ " పోనీలేవే ఇంట్లో ఎలాగైనా వుండనీ బయట ప్రపంచంలో నన్ను ఆయన చూసే తీరును బట్టి అందరూ నాకు ఎంతో గౌరవాన్నిస్తున్నారు. నాకు నేను ఈ విషయంలో పూర్తిగా కన్విన్స్ అయిపోయాను" అని గర్వంగా చెప్పుకునేది .కానీ తనవిషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా జరుగుతోంది. ఎంత చెప్పుకున్నా ఇంట్లో తనని ప్రేమగా చూసుకునే విషయం ఎవరికి తెలుస్తుంది ? ఆ విషయం పక్కనపెడితే మాత్రం ఇప్పుడు తన జీవితంలో పిల్లలు లేరనే బాధ తప్ప భర్త నుండి అందాల్సిన ప్రేమ ఏదోరకంగా పుష్కలంగా పొందుతూనే వుంది. కానీ మనుషుల ప్రవర్తనలో ఈ వింత ధోరణులు అంటిపెట్టుకోవడానికి ఇదేమేనా మానసిక రోగమా ? జీవితాంతం ఎలా సరిపెట్టుకోవడం ? ఇలాంటి అనారోగ్య పరిస్తితులనుండి బయటపడే మార్గం లేదా ?అని మాధవి తనలో తనే ప్రశ్నించుకుంది. అప్పుడు గుర్తుకు వచ్చింది తన మిత్రురాలు ఒకావిడ ప్రముఖ సైకియాట్రిస్ట్ గా ఆ వూళ్లోనే వుంటోందని . .

" అవును . నువ్వు చెప్పింది వింటే అలాగే అనిపిస్తోంది. దీనినే మా పరిభాషలో స్కిజోఫ్రీనియా అంటాం. ఈ వ్యాధి వున్న వాళ్ళు వింతగా ప్రవర్తిస్తూ భ్రమల్లో జీవిస్తూ వుంటారు. వీరికి భావోద్వేగాలు ఎక్కువుంటాయి కానీ వాటిని వ్యక్తీకరించడం విషయంలో మానసిక అనారోగ్య లక్షణాలు డామినేట్ చెయ్యడం వల్ల వాళ్ళ ఆలోచనల్లో ఎప్పటికప్పుడు ఉదాసీనత కోల్పోతారు . ఒక్కోసారి చాలా తెలివిగా అవతలి వారిని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ వుంటారు. ఈ రోగులమీద ఇంకా పరిశోధన జరగాల్సి వుంది. . ఇటువంటి లక్షణాలు కలిగిన వారి మానసిక పరిస్తితిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వీరికనుగుణంగా ఇంట్లో వారు ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ విషయం గురించి నువ్వేమీ తీవ్రంగా ఆలోచించి నీ మనసు పాడుచేసుకోకు. ఈ సారి వీలున్నప్పుడు నా దగ్గరకు తీసుకురా. ఇటువంటి మానసిక రుగ్మతలకు తెరఫీలు కొంతవరకు పనిచేస్తాయి. ..."

ఇదే విషయాన్ని మాధవి ఒకరోజు మిత్రురాలు క్రాంతికి సుధీర్ఘంగా వివరించింది. కొన్నాళ్ళ తర్వాత కలిసిన మాధవి, క్రాంతి ద్వయంలో అదివరకటి కన్నా కొంత ఉత్సాహం కనిపిస్తోంది.కారణం ఇప్పుడు వాళ్ళ భర్తల పరిస్తితులు వారికి పూర్తిగా అవగాహన కావడంతో సైకియాట్రిస్ట్ మిత్రురాలి సలహా మేరకు వారి భర్తలకనుగుణంగా నడుచుకుంటూ వారి ప్రతి మాట , ప్రతి చర్య గమనిస్తూ వారిని అనుక్షణం కాపాడుకుంటూ జీవితంలో రాజీ పడిపోవడానికి సమాయత్తమైపోయారు . . ***

సమాప్తం

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి