వంశీకి నచ్చిన కథ - ప్రాప్తం - మాలతి నిడదవోలు

praptam telugu story

నూకాలుకు ఉత్తరం వచ్చింది. అదెక్కడి నుంచో దానికి తెలుసు, కానీ అందులో ఏముందో తెలుసుకోవాలి. మేడమీద గదిలో అమ్మాయి ఒక్కత్తే ఉంటే సమయం చూసుకుని నూకాలు చీపురు తీసుకుని అక్కడికి వెళ్ళింది.

"నీకో వందమార్లు చెప్పేను అలా చీపురు కట్ట పుచ్చుకుని నా మీదకి దండెత్తొద్దని. నేను లేనప్పుడొచ్చి తుడిచి వెళ్లిపోలేవూ?" కసురుకుందా అమ్మాయి.

నూకాలుకు అమ్మాయిగారి కసుర్లూ, విసుర్లూ అలవాటే. అందుకే అది "పోన్లెండమ్మా. రేపట్నుంచి అలాగే మీర్లేనప్పుడు తుడిసేసెల్లిపోతాను" అంది కుర్చీ, బెంచీ, మంచం అటూ ఇటూ లాగేస్తూ, పనిమంతురాలైన ఇల్లాలి ఒడుపుతో.

"నీ మొహం కాదూ, రోజూ యలాగే అంటావు" అంది అమ్మాయి కోపంగా. "ఆ కుర్చీ యిటువేపు వెయ్యి. ఎక్కడి వక్కడ ఉండవు కదా!"

అమ్మాయికి అందుకే కోపం. నూకాలు గది తుడవడాని కొచ్చిందంటే అది వెళ్ళే వేళకు దక్షయజ్ఞ వాటికలా చేసిపెడుతుంది.

"అమ్మాయ్ గోరూ!" - మొహం అంతా నిండుగా నవ్వుతూ "ఇది సదివి సెప్పరూ?" అంది కొంగు ముడి విప్పుతూ.

"ఏవిటిది?"

ఉసిరికాయంత కొంగుముడి జాగ్రత్తగా విప్పి ఉండగా అయిపోయిన కార్డు అమ్మాయి చేతిలో పెట్టింది.

"అఘోరించినట్టే ఉంది. దీనికేవైనా ఆకారపూ, అర్ధపూ ఉంచేవా?" అందాఅమ్మాయి ఆ కార్డు ఉండ విప్పి సాపు చెయ్యడానికి ప్రయత్నిస్తూ.

నూకాలు నాలుక్కొరుక్కుంది.

"తొమ్మిదో తారీఖు సింహాద్రి యింటికొస్తున్నాడుట. రెండు రోజులుంటాడట."

"తొమ్మిదా?" అంది నూకాలు ఒక నిమిషం ఆలోచించి.

"ఊ."

"ఏవోరవైందండీ?"

"సోమవారం."

"సోంవారవా? ఇయాల సుక్కురోరం గదండీ. సుక్కురోరం, శనివోరం, ఆదోరం. మూడ్రోలులున్నాయన్నమాట మధ్షిని" అంది నూకాలు లెక్క పెట్టుకుంటూ, బుగ్గన చూపుడు వేలుంచి.

చెక్కిన రాతిబొమ్మలా ఉంటుంది అనుకుంది అమ్మాయి దాన్ని చూసి.

"రెండేళ్ళయింది వాడు మిలిటరీలో చేరిపోయి. రెండేళ్ళు ఉన్నదానిని మూడు రోజులు ఉండలేవుటే?" అంది అమ్మాయి నవ్వి.

ఆ అమ్మాయి నవ్వితే బాగుంటుంది, రాణీలా గుంటుంది అనుకుంది నూకాలు. "ఎన్ని గంటలకి వస్తారండీ?" అంది మాట మార్చి.

"సాయంత్రం మెయిల్లో. స్టేషన్ కి వెళ్తావా?"

"ఎందుకండీ అడికేటి యిల్లు తెల్దనా? నేకపోతే టేపిసుకాడికొచ్చినోడు యింటికి రాడనా?" అంది నూకాలు మొహం పక్కకు తిప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ. అబ్బాయిగారు అదెక్కడుందో విమానంలో వచ్చినప్పుడు స్నేహితురాళ్ళకు కాఫీ ఇప్పించడం, అమ్మాయి గారు బొంబాయి వెళ్ళడం దానికి తెలుసు.

అమ్మాయిక్కోపం వచ్చింది. "కబుర్లు కట్టిపెట్టి పని చూసుకో. వేగిరం వెళ్ళు, ఫో" అంది.

నూకాలు నిప్పులమీద నడుస్తున్నట్టు పరుగెడుతూ ఇల్లు చేరింది, వీధి కొననుంచే "అత్తా!... అత్తా!..." అని కేకలేస్తూ.

ఎల్లమ్మ నులక మంచమ్మీద పడుకుని కునుకుతూంది. ఎల్లమ్మ పని చెయ్యదు. అది పెద్ద మేస్త్రీ భార్య. మిలిట్రీలో ఉద్యోగం కొడుక్కు. "నా నెందుకు పని సెయ్యాలా?" అంటుంది దర్జాగా.

"అత్తా! నీ కొడుకొస్తాడట" అంది నూకాలు పొంగిపోతూ.

"నిజవే? ఎప్పుడు ఎప్పుడొస్తాడు? ఎప్పు..." ముసలిదాని ఆనందానికి హద్దుల్లేవు.

"సోవారం. సోవారం వొస్తాడంట. ఇంకా మూడ్రోజులుంది.."

ఎల్లమ్మ గబా గబా అవతలికి వెళ్ళిపోయింది ఎమర్జెన్సీ న్యూస్ బులిటెన్ లో ప్రసారం చెయ్యడానికీ వార్త. నూకా లొక్కర్తీ మిగిలిపోయింది ఆ చుట్టు గుడిసెలో.

"రెండేళ్ళమట్టీ నా నొక్కదాన్నే గందా!' అనుకుంది ఆలోచనగా. సోంవారం వస్తాడట, అమ్మగారు పండుక్కిచ్చిన చిలకాకు పచ్చ కోకున్నాది. అమ్మాయిగారు కుట్టు సరిగ్గా లేదని యిచ్చేసిన ఎర్ర జాకట్టున్నాది. పచ్చకొక కట్టుకుని ఎర్ర జాకిట్టు యేసుకుంటే "సిలకనాగున్నావే" అన్నా డోపాలి. ఆడి మనసుకి నచ్చినట్టు సెయ్యాల. రెండు రోజులే ఉంటాడంట. ఆ రెండ్రోజులు సేసినయి మల్లీ సెలవొచ్చీ వరకూ గేపకం ఉండాల. అమ్మగార్ని జీతంలో యిరగ్గోసుకోమని బతివలాడితే ఓ రూపాయిత్తారు. సెజ్జ బూర్లోండుడా. సెజ్జ బూర్లంటే పడిసత్తాడు. రావుడు గోరి అప్పమ్మ నడగాల ఓ పోటేసి పెట్టమని. రొండు రోకర్లాడితే గాని నలిగి సావవ్...

"అట్టా సూత్తుండిపోయినావేటి? నీ ల్లొట్రా" అని ఎల్లమ్మ అరిచేవరకు నూకాలు ఈ లోకంలో లేదు. ఉలిక్కిపడి బిందె తీసుకుని వీధి కొళాయివేపు నడిచింది. ఎల్లమ్మ చేసిన ప్రసారం అందరికీ అందిందేమో దారి పొడుగునా అందరూ అడుగుతూనే ఉన్నారు. "సివాద్రి వొస్తాడంట?" అని. నూకాలు గంగ డోలులా తలూపుతూనే ఉంది. దానికి నోట మాట రావడంలేదు!

వస్తుం దొస్తుందనుకున్న సోమవారం రానే వచ్చింది. నూకాలు, ఎల్లమ్మా నూర్పిళ్ళప్పుడు చేసేంత హడావిడి చేస్తున్నారు. ఆదివారం సంతలో సజ్జలూ, బెల్లం కొనుక్కొచ్చింది నూకాలు అమ్మగారి దగ్గర అప్పు పుచ్చుకుని.

"ముంతలో మూడు రూపాయలు దాచినాను. సన్నబియ్యంవొట్రా. నా కొడుకు ఆ దబ్బనాల్లాటి బియ్యం తిన్నేడు" అంది ఎల్లమ్మ.

"మరే! మిలట్రీలో ఆడికి సన్నబియ్యం కూడూ ఆవుపాలు యేసి యెడతారు?" అంది నూకాలు ఎత్తిపొడుపుగా.

"నీ పెడసంర బుద్ధి ఆడొచ్చే అణచాల" అంది ఎల్లమ్మ కసిగా.

"రానీ" అంది నూకాలు. అంతలోనే ఎదలో ముల్లయి తగిలింది. ఏదో. "రానీ... రానీ..." అంది మెల్లిగా తనలో తాను గొణుక్కుంటున్నట్టు.

"సువ్వీ సువ్వీ పోటెత్తే ఏనాటికి నలిగేను! యెయ్ దబదబ నాలుగు పోట్లు" కసురుకుంది. అప్పమ్మ, వీదివేపు దృష్టి ఉంచి రోకలాడిస్తున్న నూకాల్ని.

"అదిగాదే ఆడొచ్చినట్టుంటేనూ..." అంది నూకాలు క్షమార్పణ చెప్పుకుంటూ.

"తోటకూరగాదూ! సాయంతరేల బండికి మజ్జానవే వచ్చేసినట్టుందా?" అరిచింది అప్పమ్మ.

నూకాలు ఊపిరి తెచ్చుకుని "ఊస్... ఉస్" అంటూ పోటెయ్య సాగింది, ఒక్కొక్క పోటూ సోల్జర్ బూటులా వినిపిస్తుంటే. లోపల ఎల్లమ్మ పొయ్యిరాజేసి మూకుడు పొయ్యిమీద పెట్టింది. నూకాలికి జ్ఞానం తెలిసేక అత్తని పొయ్యిదగ్గర చూడడం దానికిదే మొదలు 'మరి కొడుకు...' అనుకుంది. ఈ పాటి అదృష్టానికి మావెప్పుడూ నోచుకోలేదు మరి. దానికి సన్నగా నవ్వొచ్చింది.

"నువ్వలా ముసి ముసి నవ్లు నవ్ కుంటూ కూసో. నే పోతా" అంది అప్పమ్మ అస్త్ర సన్యాసం చేస్తూ.

"నేదులే. రా, రా. రెండు పోట్లేస్తే అయి పోతది" అంది వెనక్కుంచిన బెల్లపుముక్క కూడా పడేస్తూ. మూరెలపిండి అత్త కిచ్చేసి మళ్లీ చిటపట లాడేరు - "ఇంకా ఒంటిగంటేనా కాలేదు. అంట్లు తోమేసి వెళ్ళిపోతే మళ్ళీ కాఫీ గిన్నెలుండిపోవూ? అవి నేను కూచుని కడుక్కోనా?" అంటూ.

నూకాలు వరిదీన వదినయై నిలుచుండి పోయింది. "కాదమ్మగోరూ! ఇంటికాడ సిన్న పనుంది యియాల" అంది.

"ఇవాళ సింహాద్రి వస్తాడమ్మా" అంది వాళ్లమ్మాయి, ఆ ఒక్క ముక్కతోనూ పూర్వాపరాలు విశదం చేస్తూ,

"సరేలే. ఏదో వేళప్పుడొచ్చి ఆ కాఫీ గిన్నెలు కడిగేసి పో" అందావిడ దయదలిచి.

నూకాలు సంతోషంగా "సరేనండి" అనేసి మళ్లీ పావుగంటలో ఇంటిదారి పట్టింది. సగం దారి వెళ్లేసరికి దానికి జ్ఞాపకం వచ్చిందేమో మళ్లీ వెనక్కొచ్చింది.

"అమ్మాయ్ గారూ!" అంది తలుపు చాటు నుంచి.

చదువుకుంటున్న అమ్మాయిగారు తలెత్తి చూశారు, "ఏం?" అని.

"రొండు సంపెంగ పూలు కోస్కుంటానండి" అంది ఆశగా. అమ్మాయి చిరాకు ప్రదర్శించింది. "నీ కెప్పుడూ నా సంపెంగ చెట్టుమీదే కళ్ళు. కావలిస్తే కొనుక్కోకూడదూ?"

"ఒక్కరోజేనండి. బజార్లో ఐతే వోడిపోయుంటాయండి" అంది దీనంగా.

"సరేలే" అంటూ తను పొద్దున్నే కోసి సాయంత్రం పెట్టుకోడానికని దాచుకున్న దండ దీని మీదికి విసిరింది. నూకాలు మురిసిపోతూ ఆ దండ అందుకుని మళ్ళీ ఇంటివేపు పరుగు పెట్టింది. దాని మనసు ఇవాళ దాట్ల గుర్రంలా ఉరకలు పెడుతూంది.

ఇంటిదగ్గర చాలామటుకు ఎల్లమ్మ వంట పూర్తి చేసింది. కాని నూకాలుకు సంతృప్తి కలగలేదు. మళ్ళీ మళ్ళీ చూడసాగింది, ఒక్కొక్కటే, అరకోడి కూర చేసింది. చేపలపులుసు చేసింది. అమ్మగారు రెండు రోజుల క్రిందట ఇచ్చిన ఊరగాయ ముక్క జాగ్రత్తగా దాచిపెట్టింది. సన్నబియ్యం అన్నం మల్లెపూవ్వులా వార్చింది.

'మూడు రోజులు రెయిల్లోనే అవుతాదంట. ఎప్పుడు తిని ఉంటాడో? రెయిల్లో ఏటి దొరుకుతాది. సాంబారు అన్నం పొట్లాలు అల్లే కలిపి కడతారంట. శి. నేకపోతే కారేజీ పుచ్చుకుంటే రూపాయీ ముఫ్ఫైయైదు పైసలు పుచ్చుకుని రొండు మెతుకులెడతారట' అని బాధ పడింది. 'పోనీ, ఇంకేదేనా చేదునా?' అని మనసు పీకింది. దండు బజారులో ఓ బేడ బంగాళాదుంపలు తీసుకొచ్చి వేపుడు చేస్తేనో? అని మనసు ఉవ్విళ్ళూరింది. చూరులో పెట్టిన డబ్బీలోంచి ఓ బేడ తీసుకుని, "నే నిప్పుడే వొస్తా. వొంట సూత్తుండు" అంటూ అత్తకు పురమాయించి నూకాలు దండు బజారువేపు మాయమైంది.

"ఎక్కడికే యిప్పుడు?" అంటున్న ఎల్లమ్మ మాటకు అది జవాబు చెప్పనేలేదు.

పది నిమిషాల్లో నూకాలు బజార్నుంచి బంగాళాదుంపలు తేవడం, కూర చెయ్యడం అన్నీ ముగించింది. పెద్దాసుపత్రి గంట స్తంభంలో మూడు చూపించేవేళకు కనీసం ఆరు మార్లైనా వీధి చివరిదాకా వెళ్లి వచ్చి వుంటుంది. రైళ్ళు రోజూ ఆలస్యంగా వస్తాయిగదా, ఒక్కరోజు ఓ గంటముందు రాకూడదూ అనిపించింది. కాలు కాలిన పిల్లిలా అది రంగులరాట్నం తిరుగుతుంటే ఎల్లమ్మ నవ్వుకుంది. "యీది సివర్దాకా వొచ్చినోడు యింటికి రాడంటే? అట్టా తిరుగుతున్నావ్?" అంది.

నూకాలు కోపోద... తంచేత మాటాడలేదు. మళ్ళీ వీధి చివరిదాకా వెళ్లి అక్కడున్న రిక్షావాణ్ణి అడిగింది - "అన్నా, మేలుబండి యింకా రానేదా?" అని.

"నేదప్పా! గంటన్నర నేనంట" అన్నాడు రిక్షావాడు దిక్కులు చూస్తూ.

"శి. ఎదవ బల్లు"లని తిట్టుకుంది కసిగా. గంటన్నర తరవాత అదే చోట మరో రిక్షావాడు మేలుబండి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పాడు నూకాలికి. సింహాద్రి వచ్చిన జాడ మటుకు లేదు.

మేనకోడల్ని వేళా కోళం చేసిన ఎల్లమ్మ కూడా కొడుక్కోసం వీధి చివరిదాకా వెళ్లి చూసి రాకుండా ఉండలేకపోయింది. ఉస్సురనుకుంటూ ఎందుకు రాలేదో ఊహించడానికి ప్రయత్నిస్తూ గుడిసె ప్రవేశించిన వాళ్ళిద్దరికీ ఓర ఒంపుగా ఉన్న తడిక తోసుకుని లోపలికి వెళ్లి సుష్టుగా విందు ఆరగించి వస్తున్న ఓ గ్రామసింహం ఎదురైంది. నూకాలికి గానీ, ఎల్లమ్మకి గానీ ఆ ఊర కుక్కను కొట్టాలనిపించలేదు. తడిగుడ్డలో చుట్టిన సంపెంగపూవులు వాడిపోయి మొహం నేలవేసేయి. నూకాలు కొత్త చీరె నలిగిపోయింది.

మర్నాడు దాని మొహం చూసి, "రాలే దేమిటే?" అంది ఇంటి వాళ్ళమ్మాయి.

"నేదండీ" అంది నూకాలు నిరాషయంగా. ఆ రోజు కూడా మధ్యాహనం ఊరకుక్క విందు కొచ్చింది గుడిసెకు. తన కోసం కాచుకొన్న గంజి దానికి పోసి చూస్తూ కూచుండిపోయింది నూకాలు.

ఆ రాత్రి ఎవరో పిలిచినట్టయి ఉలిక్కిపడి లేచింది. నూకాలు. "ఎవరే?" అంది ఆ పిలుపుకే మేల్కొన్న ఎల్లమ్మ.

"ఎవురది?" అంది నూకాలు అత్తమాట యాత్రికంగా ప్రతిధ్వనిస్తూ.

"నే నేనే" అన్నాడు సింహాద్రి లోపలికొస్తూ.

"వుప్పుడేడ్నుంచి? ఇంత రేత్తిరి?" అంది నూకాలు ప్రమత్తురాలై. అప్పుడు రాత్రి రెండున్నర అయింది.

సింహాద్రి ఎల్లమ్మ మంచం దండె మీద చూచుని బూట్లు విప్పుతూ, "పాసింజర్లో వొచ్చినా. లేటయింది. ఎదవ బండి. నాటుబండి నయం దానికన్నా" అన్నాడు.

"అవ్ తే నిన్న నెందు కొచ్చినావు కావు?" అనడిగింది ఎల్లమ్మ, అంతవరకు ఆనందాతిరేకం చేత మూగవోయిన మనసు మెల్లిగా తేరుకోగా.

"నిన్నే వచ్చినా. అనకాపల్లికాడ మావోడే ఓడు దిగాడు. ఆడితో నన్నూ దింపాడు. 'ఒద్దురా! తరువాత వొస్తా' అంటే యింటేనా?" అన్నాడు తనకు అంతటి ఉదాత్తుడైన స్నేహితుడు దొరికినందుకు కించిత్ గర్వం వెలిబుచ్చుతూ.

మర్నాడు పొద్దున్న పనిలోకి వెళ్ళబోతున్న నూకాల్ని ఆపి "మా సెడ్డ ఆకలేసేస్తుంది. తినడానికిటేనా పెట్టెల్లు. ఏ మజ్జాన్నం వొస్తావో?" అన్నాడు సింహాద్రి.

నూకాలు నిస్సహాయంగా చూసి పొయ్యి వెలిగించింది. నూకాలు గంజి కాచి ఉప్పేసి సింహాద్రి కందిస్తుంటే దాని కళ్ళ నీళ్లు తిరిగేయి.

"నిన్న నువ్వొస్తావని ఏటేటో సేసింది. నువ్ రానేలేదు" అంది ఎల్లమ్మ.

"ఏటిస్తే ఎటుండే, అంతా నీ సేతిలో ఉందిగానీ" అన్నాడు నూకాల్తో మెల్లిగా.

"నీ మొకంలే" అన్న నూకాలు మాటలో తీవ్రతకు సింహాద్రి త్రుళ్ళిపడ్డాడు. వాడిది మిలిటరీ డిసిప్లిన్.

'కమనీయ భూమి భాగములు లేవెపడి యుండుటకు దూది పరుపులేల' అని పోతన్నగారు చెప్పారని వాడికి తెలీదు. కాని వాడి అభిప్రాయం అదే!

***

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ