
హరి, గిరి ఆరవ తరగతి విద్యార్థులు. వీధిలో వారి ఇండ్లు ప్రక్క, ప్రక్కనే ఉన్నాయి.. అలాగే తరగతి గదిలోనూ ఇద్దరూ ప్రక్క, ప్రక్కనే కూర్చుంటారు. గిరికి కాస్త తొందరపాటు ఎక్కువ. దాన్ని వెన్నంటి సరిదిద్దే వాడు హరి. అందుకే హరి అంటే గిరికి ప్రాణం.
పాఠశాల నుండి ఇంటికి రాగానే వారి కాలనీలో ఉన్న మైదానంలో కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటారు. ఆటల్లోనూ గిరికి తొందరపాటు చూపిస్తాడు. ఆటలు ఆడుతున్న పిల్లల మధ్య తలదూర్చి సలహాలు ఇస్తుంటాడు. ఆటగాళ్ళంతా ఫక్కున నవ్వే సరికి బిక్క ముఖం వేసుకొని హరి వద్దకు వచ్చే వాడు.
“గిరీ.. మనకు తెలియని విషయాలలో కలుగ జేసుకోవద్దు. ముందుగా మనం వారు ఆడే ఆట నియమాలు తెలుసుకోవాలి. ఆటను మనం కూడా సాధన చెయ్యాలి. దాని లోటు పాట్లు తెలుస్తాయి. అప్పుడే మనం సలహాలివ్వగలం. తొందర పడకూడదు. మన హద్దుల్లో మనం ఉండాలి. తొందర పడి హద్దు మీరొద్దు” అని సముదాయించాడు హరి.
ఒకరోజు లెక్కల మాష్టారు నల్ల బోర్డు మీద ఒక లెక్క వ్రాస్తుంటే.. చటుక్కున లేచి నిలబడ్డాడు గిరి. అలా లెక్క వ్రాసి ఎవరినైన చేయమనడం మాష్టారుకు అలవాటని గిరికి తెలుసు. అందరికంటే ముందే తను చెయ్యాలనే ఉబాలాటం. ఆశ్చర్య పోయాడు మాష్టారు.
“ఏంటి గిరీ.. లేచి నిలబడ్డావు. లెక్క పూర్తిగా వ్రాయకముందే చేస్తావా? ఎలా చేస్తావు? చేద్దువు గాని రా..!” అంటూ పిలిచి సుద్దముక్క గిరి చేతికిచ్చాడు మాష్టారు.
గిరి బోర్డు మీద లెక్కను చదువుతూ.. అందులోని రెండు వివరాలు మాత్రమే రాసాడు, ఆతరువాత ఏం చెయ్యాలో తెలియక తెల్లముఖం వేసాడు. పిల్లలంతా ఘొల్లున నవ్వే సరికి తలదించుకున్నాడు గిరి. మాష్టారు పిల్లను అలా నవ్వొద్దు అన్నట్టుగా చెయ్యి ఊపాడు.
“చూడు గిరీ.. ఆ లెక్క నేను చెప్పబోయే కొత్త పాఠం లోనిది. మీరు ఆ పాఠాన్ని గుర్తుపట్టేలా చేద్దామని లెక్క రాస్తుంటే.. తొందరపడి వచ్చావు. అలా తొందర పడకూడదు గిరీ.. ఏదైనా తెలుసుకొని నేర్చుకొని సాధన చేసి ప్రయత్నించాలి. లేదంటే ఇలా అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఒక్కో సారి ప్రమాదం కూడానూ..!” అంటూ చిరునవ్వుతో గిరి దగ్గరకు వెళ్లి కూర్చోమన్నట్టుగా వీపు తట్టాడు మాష్టారు.
పాఠశాల సమయం పూర్తికాగానే ఇంటికి దారి తీసారు మిత్రులు. గిరి ఇంకా ముభావంగా ఉండడం గమనించాడు హరి. దారి వెంట వెళ్తున్న ఒక కుక్కను చూపిస్తూ..
“దాన్ని ఒక ఆట అడిద్దామా గిరీ.. కుక్క తోక వంకర” అంటూ నవ్వాడు. అది తన గురించే అన్నట్టు అన్వయించుకొని మూతి మరింత ముడుచుకున్నాడు గిరి.
అది గమనించిన హరి “ చూడు గిరీ.. మాష్టారు కూడా తొందర పడకూడదని.. ఒక్కోసారి ప్రమాదానికి దారి తీస్తుందని చెప్పాడు. విన్నావు కదా!.. ఇప్పటికైనా కాస్త అలవాటు మార్చుకో..” అంటూ ఎంతో ఆప్యాయంగా చెప్పాడు.
“సరే.. హరీ!. ఎందుకో నాకు అలా ఆవేశం వచ్చేస్తుంది.. ఇకముందు జాగ్రత్తగా ఉంటాను” అని హరి వంక చిన్నగా నవ్వుతూ చూశాడు గిరి. హరి మనసు నెమ్మదించింది. ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని ఇంటికి దారి తీసారు.
ఆరోజు ఆదివారం. కాలనీ పిల్లలు నలుగురు దగ్గరలో ఉన్న చెరువులో ఈత కొడదామని బయలుదేరారు. గిరి తను గూడా వస్తానన్నాడు. అంతా ఆశ్చర్య పోయారు. గిరి ఏనాడూ వారిని అనుసరించలేదు. గిరికి నీళ్ళలో ఈదడం రాదని అందరికీ తెలుసు.. వద్దన్నారు. నేను ఒడ్డున కూర్చొని స్నానం చేస్తానన్నాడు గిరి. హరి లేకుండా వస్తావా? అంటూ అంతా ఎగతాళిగా నవ్వారు. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండరని తెలుసు. హరికి చెప్పొద్దని బతిమాలుకున్నాడు గిరి.
పిల్లలంతా చెరువులో ఈదడం చూస్తుంటే.. గిరి మనసు తబ్బిబ్బు కాసాగింది. ఈదే వారిని చూస్తూ.. అదేమంత కష్టమైన పనేం కాదు. కాళ్ళూ, చేతులు ఆడించడమే కదా! అని మనసులో అనుకుంటూ మరింత పరిశీలనగా చూసాడు. ఒడ్డున కూర్చున్నవాడల్లా గభాల్న చెరువులో దూకాడు గిరి. ఆ దృశ్యం చూడగానే వణకి పోయారు ఆ నలుగురు. గబ, గబా ఒడ్డుకు వచ్చి బట్టలు తీసుకున్నారు. గిరి ఛస్తే.. మన మీదకే వస్తుందనే భయంతో పరుగు అందుకున్నారు. హరి ఎదురయ్యాడు. గిరి ఏడని అడిగితే చెరువు వంక చూపించారు. గిరితోబాటు హరి కూడా హరీమంటాడని నవ్వుకుంటూ.. పరుగు వేగం పెంచారు.
హరి చెరువు ఒడ్డుకు చేరే సరికి గిరి చేతులు నీటి పైన కొట్టుకుంటున్నాయి.. రక్షించమన్నట్టు. హరి ఉన్నఫళంగా చెరువులో దూకాడు. ఈదుతూ వెళ్లి ధైర్యంగాగిరిని బయటకు లాక్కు వచ్చాడు. ఉక్కిరి బిక్కిరి అవుతున్న గిరికి ప్రథమ చికిత్స చేసి కాపాడాడు.
గిరి కాస్త తేరుకొని హరి వంక చూస్తూ.. దీనంగా ఏడువసాగాడు. గిరిని తన హృదయానికి హత్తుకున్నాడు హరి.
“హరీ.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దురా.. ప్లీజ్” అంటూ హరి గదుమ పట్టుకున్నాడు. “ అవునూ హరీ.. నీకు ఈత వచ్చా.. నాకు తెలియకుండా ఎప్పుడు నేర్చుకున్నావు. నువ్వు కాపాడకుంటే.. ఈరోజు చచ్చే వాణ్ణి..” అంటూండగా చటుక్కున గిరి నోటిని తన అరచేత్తో మూసాడు హరి.
“అలా అనకురా.. నువ్వు లేకుండా నేనూ బతకను” అనగానే హరి గొంతు పూడుకు పోయింది. కళ్ళు జలపాతాలయ్యాయి.
“నీలాంటి స్నేహితుడు ఉండగా నాకు చావు రాదురా.. అవునూ.. నన్ను ఎలా కాపాడావు?” ప్రశ్నించాడు గిరి.
“నీళ్ళలో మునిగిన వారికి చేయాల్సిన ప్రథమ చికిత్స పాఠం జ్ఞప్తికి వచ్చిందిరా.. ఈరోజు ఉపయోగ పడింది. నేను గత వేసవి సెలవుల్లో మా అమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఈత నేర్చుకోవడం మంచిదయ్యింది. ఈమధ్య మనం వార్తల్లో చదువలేదా! ధర్మపురి వద్ద గోదావరిలో నలుగురు నీట మునిగి చనిపోయారని.. నీకు ఎన్నో సార్లు చెబుతూ వస్తున్నాను. మనకు తెలియని విషయాలలో అత్యుత్సాహం చూపొద్దని. హద్దు మీరొద్దని.. ఈరోజు ఏమయ్యేది?.. ఈత గీత దాటావు. సమయానికి నేను రాకుంటే.. కన్నతల్లి కడుపు కోతగా మిగిలి పోయేది. ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయితే సంతోషిస్తాను” అంటూ గిరి వంక చూస్తుంటే హరి కళ్ళు మరో మారు వర్షించసాగాయి.
“నాకు బుద్ధి వచ్చిందిరా హరీ.. తొందర వద్దు. సాధన ముద్దు.” అంటూ హరి తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేసాడు గిరి. ఇద్దరూ చిరునవ్వులు కురిపిస్తూ.. ఇంటికి దారి తీసారు.*